అప్పుడు....నెలకు......రెండువేలు.....అదీ భర్తకు తెలియకుండా.....
5
చలపతిరావు ఇంట్లో అడుగుపెడుతూనే నీరసంగా నవ్వాడు. తన బాధలో మునిగి వున్న కవిత ముందావిషయం గమనించలేదు.
"నీ భోజనం అయిందా?" అన్నాడతడు నీరసంగా.
"మీకోసం చూస్తున్నాను....." అంది కవిత.
"నేను అనుకోకుండా బయట భోంచేసి రావలసి వచ్చింది...."
కవిత అదోలా నవ్వింది.
"నువ్వు భోం చేయి కవితా...."
"లేదండీ-నాకాకలిలేదు...." అంది కవిత.
"కోపం వచ్చిందా?" అన్నాడతడు నీరసంగానే.
"లేదండీ-నిజంగానే ఆకలిగాలేదు. మీరు వచ్చినా మీకు భోజనంపెట్టి నేను సాయం కూర్చుందామనుకున్నాను...." అంది కవిత.
"అందుకే నువ్వంటే నాకెంతో యిష్టం. ఈ యింట్లో అన్నింటికీ నౌకర్లున్నారు. కానీ మనిద్దరి మధ్యా ఎవ్వరినీ వుండనివ్వవు నువ్వు...." అన్నాడు చలపతిరావు.
"అవునండీ- మనిద్దరిమధ్యా యెవ్వరూ వుండడం నాకిష్టముండదు....."
చలపతిరావు ఇంకా నీరసంగానే- "కవితా-నీ ఇష్టప్రకారమే ఎల్లకాలమూ జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం-" అన్నాడు.
"కవిత ఉలిక్కిపడి-"ఎందుకు?" అన్నది.
"ఏమో-ఈ అదృష్టం ఎల్లకాలమూ మనకుండదేమోనని నాకు భయంగా వుంది-" అన్నాడు చలపతిరావు.
"ఏమయిందండీ...."
"కవితా - నేను కొన్ని చిక్కుల్లో పడ్డాను. ఈ నెలకు నీకు రెండువేలూ ఇవ్వలేను. అయితే వచ్చే నెలలో మొత్తం నాలుగువేలూ ఇచ్చుకోగలను...." అన్నాడు చలపతిరావు నీరసంగా.
"ఏమిటండీ-అలా నీరసంగా మాట్లాడుతున్నారు!" అంది కవిత. అయితే అతడన్న మాటలకామెలో కలవరం ప్రారంభమైంది.
భర్త ఇచ్చిన డబ్బుతో ప్రతినెలా ఆమె ఎంతో కొంత బంగారం కొంటూనే వున్నది. డబ్బును డబ్బుగా కాక బంగారంగా మార్చుకొనడం శ్రేయస్కరమని ఆమె అభిప్రాయం.
భర్త డబ్బివ్వకపోతే బ్లాక్ మెయిలర్ కివ్వడానికి తన వద్ద డబ్బుండదు. బంగారం అమ్మాలి.....తనేం చేసినా భర్తకు తెలిసిపోతుంది. భర్తకు తెలియకుండా తాను ఖర్చుచేయగలిగింది ఆ రెండువేలూ మాత్రమే! తానెక్కడికి వెళ్ళినా-అందరూ భర్తకు పరిచయస్థులే! ఇంట్లో వున్న బంగారం గురించి భర్తకు తెలుసు. తన వంటిమీద బంగారంకాక మిగతా బంగారం కొంత బ్యాంకు లాకర్లోనూ, కొంత ఇంట్లో లాకర్లోనూ వున్నది. రెండు తాళంచెవులూ భర్తవద్దనే వుంటాయి.
బ్లాక్ మెయిలర్ తనకెంతో గడువివ్వలేదు.
"నాకు వంట్లో బాగా లేదు. మనసు కూడా బాగున్నట్లు లేదు...." అన్నాడు చలపతిరావు నీరసంగా.
కవిత స్వయంగా భర్తను పడక గదిలోకి చేయిపట్టుకొని తీసుకొని వెళ్ళింది. గదిలోకి చేరుకోగానే చలపతిరావు ఆమె చేయి విడిపించుకొని చటుక్కున తలుపులు మూశాడు,
"ఏమయిందండీ-..." అంది కవిత.
"నువ్వు నా చేయి పట్టుకోగానే నా నీరసం ఎగిరి పోయింది...." చిలిపిగా నవ్వుతూ అన్నాడు చలపతి రావు.
"ఊహూ...."
"ఈ ఆకుపచ్చ చీరలో నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. నాలో ఉద్రేకం రేగుతోంది-" అన్నాడు చలపతిరావు మళ్ళీ.
కొద్ది క్షణాల్లో ఆమె వంటిమీద ఆకుపచ్చ చీరలేదు.
కవిత భర్త చేష్టలకు పరవశించటంలేదు. ఆమెకు శామ్యూల్ గుర్తుకు వస్తున్నాడు. ఆకుపచ్చ రంగును తన వంటినుంచి వేరుచేయడం ఇష్టంలేక అతడు తననే వదులుకున్నాడు. అతడి సౌందర్యారాధన అటువంటిది.
అసలైన ప్రేమ అదేనా?
భర్తకు తనపైన ఉన్నది కామం. కానీ శామ్యూల్ తనని ప్రేమించాడు. అయితే ఆ ప్రేమకు చివరికెలా పరిశీలించింది? తన ప్రియురాలినుంచి ప్రతినెలా రెండువేల రూపాయలాశింఛే స్థాయికి శామ్యూల్ దిగిపోయాడు.
రాత్రి పన్నెండు గంటలవరకూ చలపతిరావు ఆమెను మురిపించి అప్పుడు మళ్ళీ మరోసారి' నిట్టూర్చాడు.
"ఏమయిందండీ?" అంది కవిత.
"ఈ రోజు జరుగకూడని విశేషం జరిగిపోయింది....."
"ఏమిటండీ అది!"
"నీకు లక్ష్మి తెలియదు కదూ-..."
"తెలియదు...."
"ఆమె వెంకటేశ్వర్లు భార్య....."
"వెంకటేశ్వర్లూ నాకు తెలియదు....."
"ఆయన ఊళ్ళో చాలా పేరున్నవాడు. నాకు ముఖ పరిచయం వుంది. ఆ భార్యా భర్తల ఆదర్శ దాంపత్యం గురించి ఊళ్ళో పెద్ద విశేషంగా చెప్పుకుంటారు. మన గురించి కూడా అంతా అలా చెప్పుకోవాలని నాకుంటుందనుకో. కానీ మన గురించి బైటవాళ్ళకు తెలియదు. వాళ్ళు బయట కూడా తమ ఆదర్శ దాంపత్యాన్ని ప్రదర్శించేవారు. ఈ రోజు వాళ్ళు విడిపోయారు-...."
"విడిపోయారా?"
"అవును అందుకు కారణం తెలుసా నీకు?"
"నాకెలా తెలుస్తుంది?"
"పోనీ ఊహించగలవా?"
కవిత ఊహించడానికి కూడా ప్రయత్నించలేదు. అలా ప్రయత్నిస్తూంటే ఆమెకు శామ్యూల్ గుర్తుకు వస్తున్నాడు.
చలపతిరావు చెప్పాడు - "కొద్ది నెలల క్రితం ఆయన ఆఫీసులో తన లేడీ సెక్రటరీ చేయిపట్టుకుని దగ్గరకు లాక్కున్నాడని ఆమె అంటుంది-"
"అయితే?"
"ఆ ఒక్క సంఘటన వారి మధ్యన వున్న అన్నేళ్ళ అవగాహననూ జయించింది. ఆ రోజునుంచీ వారిమధ్య గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ కోర్టుకెక్కారు విడాకుల కోసం. అయితే నిజంగా విడాకులు పుచ్చుకుంటారని నేననుకోలేదు. రెండు వారాల క్రితం తెలిసింది-వాళ్ళు విడాకులు పుచ్చుకోబోతున్నారని....."
కవిత ఆశ్చర్యంగా-"వారిమద్య ఇంకా ఏమైనా జరిగివుంటుంది...." అంది.
"అలా ఎందుకనుకుంటున్నావు?" అన్నాడు చలపతి రావు.
"భార్యాభర్తల అనుబంధం తెగిపోవడానికి మరీ అంత చిన్న సంఘటన కారణమా?" అంది కవిత.
"జీవితమంతా ఒకరికోసం ఒకరు బ్రతకాలంటుంది లక్ష్మి ఎప్పుడైనా మనిషన్నాక బలహీనక్షణాల్లో మనసు చలిస్తే భార్యాభర్తలు పరస్పరం క్షమించుకోగలగాలంటాడు వెంకటేశ్వర్లు నువ్వేమంటావ్?" అన్నాడు చలపతిరావు.
కవిత భర్తవంక భయంగానూ, అనుమానంగానూ చూసింది. అతడీ ప్రశ్న ఎందుకడిగినట్లు? తన గురించి ఏమైనా తెలిసిందా?
"లక్ష్మి మాటే రైటు-"అన్నదామె.
చలపతిరావు నిట్టూర్చి-"ఆడవాళ్ళంతా అలాగే అంటారు. కానీ మగాడు తప్పుచేస్తే మళ్ళీ అందుకు ప్రోత్సాహమే కారణమవుతుంది-" అన్నాడు.
కవిత ఉలిక్కిపడింది. శామ్యూల్ ని తనే ప్రోత్సహించినట్లు లెక్క! కానీ అతడు నిగ్రహించుకున్నాడు. అది తనకు బలహీన క్షణం.....
"ఏది ఏమైనా పెళ్ళయినాక భార్యాభర్తల్లో ఎవ్వరూ బలహీన క్షణాలకు లొంగకూడదు-...." అంది కవిత.
"అంటే పెళ్ళికి ముందు లొంగవచ్చుననా నీ అభిప్రాయం?"
