"మనకింకా నెలరోజులు టైముంది. ఈలోగా ఏదో ఉపాయం తోచకపోదు. డైవర్షన్ కోసం ఏదైనా పనిచేయాలి. ఓసారి మనం రక్షించిన యువతిని కలుసుకుని వద్దామా?" అన్నాడు శాస్త్రి.
ఇద్దరూ ఆ యువతి ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి ఆమె ఇంట్లోనే ఉంది. వీరిని చూస్తూనే ఆమె ఆప్యాయంగా ఆహ్వానించింది--"రండి-- రండి మీ దయ వల్ల మాకు బాగానే వుంది--" అన్నది.
'అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు--"అన్నాడు శాస్త్రి.
"మీరెవరో తెలుసుకోవాలనుంది. వివరాలు చెబుతారా?" అన్నదామె.
'చెప్పడానికే ముంది? ఎక్కడ ఆపద వుంటే అక్కడ ప్రత్యక్ష మవుతాం-- ఎలాంటి ప్రమాదకరమైన ధైర్యంగా ఎదుర్కుంటాం. ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుంటాం --" అన్నాడు శాస్త్రి.
ఆమె తన పేరు సంధ్య అని చెప్పింది. వాళ్ళిద్దరికీ కాఫీలు కలిపిచ్చి -- "నాకు హాస్పిటల్ కు వెళ్ళే టయమైంది. మీరు అన్యధా భావించవద్దు--" అన్నది.
"నీకు భూషణరావు నించి ఎటువంటి ఇబ్బంది కలగదు. కలిగితే మేము రక్షిస్తాం. అది చెప్పడానికే వచ్చాం. పెర్మనెంటు ఏర్పాటు జరిగేదాకా నిన్ను అప్పుడప్పుడు కలుసుకుని వెడుతుంటాం--" అన్నాడు శర్మ.
మిత్రులిద్దరూ బైటకు వచ్చేసరికి వారి ముందు కారొకటి ఆగింది. అందులోంచి ఇద్దరు యువకులు దిగి -- "మేమెవరం అని అడగొద్దు. మీ మిత్రుడొకడు మీకోసం ఈ కారు పంపించాడు--" అన్నాడు . శాస్త్రి, శర్మ తటపటాయించకుండా కారెక్కేసి-- "మీరెవరూ అని మేము అడగం--మా మిత్రుడి దగ్గరకు తీసుకు వెళ్ళండి --" అన్నారు.
కారు శరవేగంతో దూసుకుపోయి ఊరి చివర ఒక బంగళా ముందు ఆగింది. కారు లోంచి వారంతా ఆ బంగళా లో ప్రవేశించారు. అది విశాలమైన బంగళా - పది పన్నెండు దాకా గడులుండవచ్చు. దారి గజిబిజి గా వుంది. ఓ గది ముందు ఆగారు. యువకులిద్దరూ కాలింగ్ బెల్ నొక్కారు. వెంటనే గది తలుపులు తెరుచుకున్నాయి. వాళ్ళు చటుక్కున శాస్త్రి, శర్మ లను లోనికి తోశారు. తలుపులు మూసుకున్నాయి.
ఒక్క క్షణం పట్టింది మిత్రులిద్దరికీ - పరిస్థితి అర్ధం చేసుకోవడానికి . అప్పుడు వారు గదిలో చూశారు.
గది పెద్దదే! వారికి ఎదురుగా ఓ సింహాసనం లాంటి కుర్చీ వుంది. దాంట్లో భూషణరావు కూర్చుని ఉన్నావు. అతణ్ణి చూసి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"ఆరోజు నించీ మీకోసం చూస్తున్నాను. సంధ్య ఇంటి దగ్గర నా మనుషుల్ని కాపలా పెట్టాను. దానింటికి ఏదో ఒకరోజున మీరొస్తారని నాకు తెలుసు. ఇన్నాళ్ళూ తప్పించుకున్నారు. ఈరోజుతో మీకు మూడింది" అన్నాడు భూషణరావు.
"మేమిద్దరం కలిసి తిరగడం వల్ల ఎన్ని లాభాలు. అంతా మమ్మల్ని మీరు ....మీరు.... అని మన్నించేవాళ్ళే! ఆఖరికి మమ్మల్ని చంపాలనుకునే నవ్వు కూడా ..... అందుకు నాకెంతో ఆనందంగా వుంది-" అన్నాడు శాస్త్రి.
"చావంటే మాకు భయం లేదు. ఎటొచ్చీ మమ్మల్ని చంపడం అంత సులభం కాదను కుంటాను-" అన్నాడు శర్మ.
భూషణరావు చప్పట్లు కొట్టాడు. సింహాచలం వెనుక నుంచి నాలుగు వేట కుక్కలు పైకి లేచాయి. నాలుగు సింహన్నైనా చీల్చి చెండాడేలా వున్నాయి.
"సైన్సు ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంకా పాత పద్దతులు మానకపోవడం నాకెంతో విచారంగా వున్నది. ఇలా అయితే శత్రువులతో ఏం వేగగలవు? ఓ రెండు లక్షలు మాకిస్తే నెల్లాళ్ళ పాటు నీకు మంచి శిక్షణ ఇవ్వగలం. మాతో వస్తావా?" అన్నాడు.
భూషణరావు మళ్ళీ చప్పట్లు కొట్టాడు. నాలుగు కుక్కలూ సింహాసనం ముందుకు వచ్చాయి.
"భూషణరావు ....కుక్కలకు మామీడకు రావడానికి ధైర్యం చాలడం లేదు. అవి పూర్తిగా మా మీదకు రావాలంటే నువ్వు అప్పుడప్పుడు చప్పట్లు కొడితే లాభం లేదు. రోజంతా భజన చేయాలి. ఏదో ఓ పేరున భజన చేయడం నీకూ మంచిదే! చూడ్డానికి పాపాత్ముడిలాగున్నావు. అయితే భజన చేసిన నీకంటే భజన నీ చేత చేయించినందుకు మాకే ఎక్కువ పుణ్యం వస్తుంది అది మాత్రం గుర్తుంచుకో-" అని శాస్త్రి ఇంకా ఏ అనబోతుండగా భూషణరావు మళ్ళీ చప్పట్లు కొట్టాడు. కుక్కలు ఒక్కసారిగా గాలిలోకి లేచాయి. అవి అలా గాలిలోకి లేవగానే శర్మ "య్యా_ అంటూ గట్టిగా అరిచాడు. అతడి రెండు చేతులూ మెరుపు వేగంతో కదిలాయి గాలిలోకి. లేచిన కుక్కలు అలాగే క్రింద పడిపోయాయి.
భూషణరావు తెల్లబోయి కుర్చీలోంచి లేచాడు. అప్పటికి శాస్త్రి , శర్మ అతణ్ణి సమీపించారు.
"ఏం జరిగింది ?' అన్నాడు భూషణరావు నీరసంగా.
"నువ్వెప్పుడైనా బ్రూస్లీ సినిమాలు చూశావా? చూసి వుండవు. చూస్తె మామీడకు వేటకుక్కల్ని ఉసి గొల్పి వుండవు. బ్రూస్లీ సినిమాలో చేసిన ప్రతి పనీ మేము నిజజీవితం లో చేయగలం. ఆ సంగతి తెలియక నాలుగు వేటకుక్కల్ని నష్టపోయావు. విషం పూసిన సూదుల్ని గురు తప్పకుండా విసరగలగడం మా ప్రత్యేకత" అన్నాడు శర్మ.
భూషణరావు వాళ్ళిద్దరి వంకా భయంగా చూసి -- "మీరు మనుషులు కారు....." అన్నాడు.
"మేము మనుషులమే కానీ నువ్వు రాక్షసుడివి...." అన్నాడు శాస్త్రి.
"నా వేటకుక్కలు...." అన్నాడు భూషణరావు. ఏడ్పు గొంతుతో. తన శత్రువుల్ని క్రూరంగా శిక్షించి వినోదించడం భూషణరావు సరదా. ఈ వేటకుక్కల్ని ఇంతవరకూ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. వీటికి భయపడే ఎందరో ఆయనకు అణిగి మణిగి వుంటున్నారు. చాలా ఏళ్ళుగా అవాయన సేవలు చేస్తున్నాయి.
"వాటిని చూస్తుంటే అవే నీకు బలమనిపించింది.
సాధారణంగా జంతు హత్య మాకు కిట్టదు. కానీ ప్రజాక్షేమం కోరి వాటిని చంపాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు" అన్నాడు శాస్త్రి.
శర్మ ఆ గదిలో వేటకుక్కలతో సహా భూషణరావు ను ఫోటోలు తీశాడు. గదిలో అయిదారు రహస్య బీరువాలున్నాయి. అన్నింటినీ ఫోటోలు తీశాడు.
"నువ్వు చాలా పెద్ద స్మగ్లింగ్ కింగువి. ఈ రోజు మేమిక్కడికి రావడం వల్ల మంచిపని జరిగింది. నువ్వు మాకు మరింత గుప్పెట్లోకి వచ్చావు. ఇదీ మంచికే.... సంధ్య ను కన్నా కూతురిలా చూసుకోపోయావో-- నీ బ్రతుకు బైట పడుతుంది--" అన్నాడు శర్మ.
"ఇంతకీ మనం మంచి మిత్రులం కదా-- చెట్టపట్టాలు వేసుకొని వీధిలోకి పోదాం --" అన్నాడు శాస్త్రి.
ముగ్గురూ ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకున్నాక "నీపాలిట వేటకుక్కలం మేము. నీకూ నీ కుక్కల గతి పట్టకూడదంటే బుద్దిగా మమ్మల్ని వీధిలో దిగబెట్టు" అన్నాడు శర్మ.
భూషణరావు శాస్త్రి, శర్మ చెట్టపట్టాలు వేసుకుని వీధిలోకి వెడుతుంటే హల్లో వున్న యిద్దరు యువకులూ వారివంక ఆశ్చర్యంగా చూశారు.
8
"యాభయి వేల రూపాయలు బాకీ కింద అయిదు వేలు బాకీ వసూలు క్రింద వుంచుకున్నాం. ఇవిగో మీ నలభయి అయిదు వేలునూ. ఈ డబ్బు మేము పోతురాజు దగ్గర నుంచే తెచ్చాం. కానీ మీపేరు చెప్పలేదు. అతడి నుంచి మీకే ప్రమాదం లేదు"అన్నాడు శాస్త్రి.
నరసరాజు ఆశ్చర్యంగా డబ్బు లెక్కపెట్టి- "నిజంగా అన్నంతపనీ చేశారు. మీ ఋణం ఎలా తీర్చుకోను?" అన్నాడు.
"మీకూ పోతురాజూ మధ్యనున్న కధేమిటో చెప్పాలి-" అన్నాడు శాస్త్రి.-" అది మా చెవిన వేశారంటే రహస్యం భద్రంగా వుంటుంది...."
నరసరాజు నిట్టూర్చి - " యాభయి వేల రూపాయల్ని నాకు వసూలు చేసి పెట్టిన మీరేదడిగినా చెప్పాలి. నేను ఒకప్పుడు అందరిలాగే బ్రతికేవాడ్ని. కానీ ఒకరోజున పోతురాజు మాయలోపడి ఓ పిల్లదానితో కక్కుర్తి పడ్డాను. వాడది ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర్నుంచి అప్పుడూ అప్పుడూ చొప్పున అయిదేళ్ళలో యాభయి వేలు గుంజాడు. నేను వాడికి దణ్ణం పెట్టేశాను- ఇంక నాదగ్గర డబ్బు లేదని. అప్పుడు వాడు నా ఆస్తిపాస్తులు అవీ లెక్కవేసి -- ఆఖరికో సలహా యిచ్చాడు. వాడి సలహా ప్రకారం మా యింట్లో ఓ గదిలో - ఇదివరలో మిమ్మల్ని బంధించిన కుర్చీలూ, రహస్యపు తలుపులూ ఏర్పాటు జరిగింది. పోతురాజు తన శత్రువుల్నిక్కడికి పంపుతుంటాడు. వాళ్ళను నేను తెలివిగా ఆ గదిలోకి లాక్కుపోయి శిక్షించాలి. అదీ ఏర్పాటు, అయితే అగ్రిమెంటు అంతటితో అయిపోలేదు. పోతురాజు తన దగ్గరున్న కొన్ని బ్లాక్ మెయిలింగు కేసులు నాకు అప్పగించాడు. నా డ్యూటీ ఏమిటంటే డబ్బు వసూలు చేసి పోతురాజు కివ్వడం. అంటే నేనతడి ఏజెంటు నన్న మాట. అయితే నేను కమీషన్ లేని ఏజంటుని. చాలా కాలంగా నాకు నచ్చని పని చేస్తున్నాను. అప్పారావుని బ్లాక్ మెయిల్ చేసి యాభయి వేలు వసూలు చేసి పోతురాజుకిచ్చాను...."
'అప్పారావెం పాపం చేశాడు?"
"ఈ ప్రపంచంలో పట్టుబడని వాళ్ళే తప్ప పాపాలు చెయ్యని వాళ్ళు లేరు. అప్పారావు ఆస్తి కోసం వీలునామా ఫోర్జరీచేశాడు. అది పోతురాజు కనిపెట్టాడు...." అన్నాడు నరసరాజు.
