
13
నవల చదువుకుంటూ పడుకున్న కళ్యాణి కి టైము గడుస్తున్న సంగతే తెలియటం లేదు. అందులో లీనమై పోయి పేజీ తరువాత పేజీ తిప్పుతూ తన్మయత్వంతో చదువుకు పోతోంది. ఆఖరి దాకా చదివి చాలా బాగుంది అనుకుంటూ పుస్తకం మూసి తల తిప్పి టేబిలు మీది టైం పీసు వంక చూసింది. నాలుగున్నరవుతోంది.
'అబ్బ ఇంత టైమయిందా?' అనుకుంటూనే లేచి గబగబా స్టౌ అంటించి కాఫీ కి నీళ్ళు పడేసింది. ఇంక టిఫిన్ ఏ పకోడీ లో పూరీ లు కూరో చెయ్యాలంటే చాలా టైము పడుతుంది. మురళీ వచ్చే వేళ వుతోంది. కాస్త వుప్మా కలియ బెట్టేస్తే త్వరగా తెమిలి పోతుంది అనుకుంటూ కూరల బుట్ట ముందు పెట్టుకుని పచ్చి మిరపకాయలు అల్లం ముక్కలు తరుగుతుంటే వీధి తలుపు చప్పుడయింది.
'ఆ-- వస్తున్నా --' అంటూ వెళ్లి తలుపు తీసింది.
రోజూ తను వచ్చేసరికి చక్కగా తల దువ్వుకుని ముస్తాబయి చక్కటి ఇస్త్రీ చీరలో కడిగిన ముత్యం లా వుండే కళ్యాణి ని అలా చూసి ఏమిటీ అవతారం అన్నట్టు చూశాడు మురళీ.
'పుస్తకం చదువు తొంటే టైమే తెలియలేదు -- వస్తున్నా స్టౌ మీద నీళ్ళు మరిగి పోతున్నాయో ఏమిటో -' అంటూనే గబగబా లోపలికి వెళ్ళిపోయింది.
డికాక్షన్ వేసి బూర్లె మూకుడు స్టౌ మీద పడేసింది . మురళీ బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కు వచ్చేసరికి రెండు ప్లేట్లలో ఉప్మా సర్ది పెట్టి సన్నటి మంట మీద పాల గిన్నె పెట్టింది ఇద్దరూ టిఫిన్ తిని కాఫీ తాగారు.
తల దువ్వుకుందామని జడ విప్పుకుంటుంటే 'కళ్యాణి, ఏం చేస్తున్నావ్ .' అంటూ వచ్చింది శాంత పెరటి వేపు నుంచి.
'రా అక్కయ్యా.' అంది కళ్యాణి జడ లోంచి వాడిన పూల చెండు తీసి దూరంగా పడేసి జుట్టు వదులుగా వేలు ముడి వేసుకుంటూ.
'నిన్నొకటి అడుగుదామని వచ్చాను.' అంది ఉపోద్ఘాతంగా శాంత.
'ఏమిటది ?' అంది కళ్యాణి యధాలాపం గానే.
'ఇవాళ , -- మాతో సినీమా కి రావాలి నువ్వు--'
'సినీమాకా.' ఈసారి ఆశ్చర్యంగానే అంది.
'అవును-- ఇవాళ మొదటి ఆటకి వెళ్దాం-- నీతో కలిసి సినీమా చూడాలని ఎప్పటి నుంచో నాకు సరదాగా వుంది. ఎప్పటికప్పుడు అలాగే అయిపోతోంది-- ఇవాళ మావారికేవరో పాసులు ఇచ్చారు-- నేనేం నా చేతి డబ్బులతో తీసు కెళ్ళటం లేదులే--' అంటూ నవ్వేసింది శాంత.
'సరే-- డబ్బు మాటకేం గాని, ఇవాళ నా పని అసలు తెమలలేదు-- ఇంకా తలయినా దువ్వుకోలేదు-- కనిపిస్తూనే వుందిగా నా అవతారం , వంట కావాలి....నేను తెమలాలి....'
'నేను ఎంతో మనసుపడి అడిగిన నాడే నీకిన్ని కారణాలు కనిపించాయి కదూ-- మరేం ఫర్వాలేదు లెద్దూ-- స్టౌ మీద బియ్యం పడేసి నువ్వు గబగబ తయారవు. నీ ముస్తాబు పూర్తయ్యేసరికి ఆ అన్నం వుడికి పోతుంది -- ఈ ఒక్క పూటకి కాస్త కంది గుండ ఆవకాయ వేసుకు తిందురు గాని-- మరిది గారికి నేను చెప్తాలే..ఇప్పుడు మావారు వచ్చి చెప్పిందాకా నాకూ తెలియదు-- లేకపోతె కాస్త ముందుగానే చెప్పేదాన్ని. నేనూ కుంపటి మీద ఎసరు పడేసి వచ్చాను .......'
లోపలి గదిలో కూర్చున్న మురళీ కి వాళ్ళ మాటలన్నీ వినిపిస్తూనే వున్నాయి. ఇంత గట్టిగా పట్టు పట్టడం లో శాంత కోరిక అర్ధమయింది మురళీ కి. శాంతా వాళ్ళ కుటుంబం తమ వల్ల తరచు ఏదో ఉపకారం పొందుతూనే వుంటారు-- నెలలో పదిహేను తారీకు గడిచిం దగ్గర నుంచీ అయిదూ పది రూపాయలు కావాలనో, పప్పూ ఉప్పూ కావాలనో దేనికో దానికి వస్తూనే వుంటారు. కళ్యాణి కాని, మురళీ కాని ఎప్పుడూ విసుక్కో కుందా పై నుంచి, వాళ్ళ పరిస్థితిని అర్ధం చేసుకున్న వాళ్ళలా అడిగినదేదీ కాదనకుండా ఇస్తూ వుంటారు. పట్టుకెళ్ళి న వన్నీ ఫస్టు తారీఖున మళ్లీ తీర్చేసినా ఈ మాత్రంగా అప్పు పుట్టడమే ఒక మహా భాగ్యంగా అనుకుంటుంది శాంత. ఆ మాటే చాలాసార్లు కళ్యాణి తో అంటే 'చాల్లే నువ్వూ నీ ఖబుర్లూ' అని చనువుగా విసుక్కుంటూ ఉండేది కళ్యాణి.
ఒక్క అప్పులివ్వటమే కాదు తను కొనుక్కున్న పువ్వులలో కాసిన్ని పువ్వులూ వాళ్ళ పిల్లలకీ- బిస్కట్లూ, చాక్ లేట్లూ ఇలా ఏవేవో ఇస్తూనే వుంటుంది-- కళ్యాణి కి మళ్లీ తిరిగి ఏదో ఇస్తూ వుండాలని ఆవిడ ఆరాటం. ఇవాళ చేతి డబ్బు పెట్టుకో అక్కర్లేకుండా ఫ్రీగా వచ్చిన పాసుతో నయినా కళ్యాణి ని కూడా వెంట బెట్టుకు వెళ్లాలని , ఎంతో ఆశతో వచ్చింది. ఆవిడకి ఆ తృప్తి లేకుండా ఎందుకు చెయ్యాలి అనుకుంటూ ఇవతలకి వచ్చి 'ఆవిడ అంత సరదా పడుతుంటే కాదంటా వేమిటి? వంటకే మిటి లే-- కాసిన్ని బియ్యం కడిగి పడేసేయి . అన్నం ఉడికి పోగానే నేను దింపేస్తాను, ఊ త్వరగా కానీ....నీ నుంచి వాళ్ళకి ఆలశ్యం అయిపోతుంది లేకపోతె ,' అని కళ్యాణి తోనూ, 'వస్తుంది లెండి ,' అని శాంత తోనూ చెప్పాడు.
'చూశావా?' అన్నట్లు కళ్యాణి వంక వోసారి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శాంత.
'అయితే రెండు వంకాయల యినా తరిగి పోపులో పడేస్తా.' అంటూ రెండు స్టౌ లూ వెలిగించి వోదాని మీద కూర మరో దాని మీద అన్నం పడేసింది-- ఆతరువాత గబగబా జడ అల్లుకుని మొహం కడుక్కుని అద్దం ముందు నిలబడి పౌడరు రాసుకుంటూ, 'ఏమండీ, ప్లీజ్, ఆ కూర ఒక్కసారి కలియబెట్టి వద్దురూ -- గరిట అక్కడే వుంది.' అంది.
'అల్లం, పచ్చిమిరపకాయల వాసన ఘుమఘుమ లాడిపోతోంది-- నువ్వు వచ్చే లోపుని ఆ కూర తినేస్తాను నేను,' అన్నాడు మురళీ లోపలికి తిరిగి వస్తూ.
'ఉత్త కూర ఏం తింటారు కాని ఏకంగా అన్నం లో కలుపుకుని తినండి.' హాస్యంగా అని , 'నిజంగా , మీరు నాకోసం కనిపెట్టుకుని కూర్చోటం ఎందుకు మీ భోజనం కానిచ్చేసేయండి,' అంది.మళ్లీ.
'సలహా కి సంతోషించాం లే ,' అన్నాడు మురళీ.
'పిన్నీ అయిందా,' అంటూ పిలిచింది మణి వీధి గుమ్మం దగ్గర నిలబడి.
'ఇదుగో ఒక్క నిముషం.' అంటూ గబగబా బీరువా లోంచి చీర తీసుకుని ముస్తాబయి ఇవతలకి వచ్చి, వంట గదిలోకి వెళ్లి చూసి 'ఒక్క రెండు నిమిషాల్లో అయిపోతుంది. అన్నం , కూర కాస్త దింపేస్తారు కదూ,; అంది.
'వో-- అవన్నీ నేను చూసుకుంటాను -- నువ్వు నిశ్చింత గా మ్ సరదాగా వెళ్లిరా.' అని 'ఏది, ఇలారా,' అంటూ తనే వో అడుగు ముందుకు వేసి కళ్యాణి దగ్గరగా వెళ్లి మెడ దగ్గర మడత పడిపోయిన చీర జరీ అంచుని సరిజేసి ఆ చేత్తోనే వోసారి మృదువుగా ఆమె బుగ్గలు నిమరబోతుంటే 'ఇస్ ఎవరైనా చూస్తారు.' అన్నట్లు కళ్ళతోనే వారించి, వీధి గుమ్మం వైపు వేలు పెట్టి చూపించింది కళ్యాణి మురిపెంగా నవ్వుతూ.
'ఏం, చూస్తె భయమా? నేనేం తప్పుపని చేస్తున్నాను?' అంటూనే చటుక్కున ముందుకు వంగి ఆ మందహాసాన్ని ముద్దు పెట్టుకున్నాడు మురళీ.
కళ్యాణి నవ్వుకుంటూ తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. క్షణం క్రితం తను పొందిన అనుభూతి తాలూకు మాధుర్యం ఇంకా మొహం లో ఆవరించుకుని వుండగా మృదుదరహాసం ఆధారాల మీద లాస్యం చేస్తుండగా వీధి గది కిటికీ దగ్గర నిలబడ్డాడు మురళీ ఆ వెళ్తున్న వాళ్ళని చూడటానికి.
పిల్లలంతా అప్పటికే గేటు బయట రోడ్డు మీద నిలబడ్డారు-- ఈ సినీమా ప్రోగ్రాం తో వాళ్ళకి ఒళ్లు తెలియనంత వుత్సాహంగా వుంది. కళ్యాణి గేటు దగ్గరికి వెళ్తూ వాళ్ళని పలకరించింది. ఇంతలో వెనక నుంచి శాంత వచ్చింది చంటి వాడిని చేతులతో పట్టుకుని-- శాంతని చూశాక ఇంక వెళ్తాం అన్నట్లు కళ్యాణి ఒక్కసారి వెనక్కి తిరిగి కిటికీ వంక చూసింది. మురళీ నవ్వుతూ 'టాటా' చెప్తున్నట్లు చెయ్యి ఊపాడు వోసారి. అంతే , అలా ఊపిన చెయ్యి గాలిలో అలాగే బిగుసుకు పోయినట్లు ఆగిపోయింది వో క్షణం ....అతని పెదవుల మీది చిరునవ్వు మాయం అయిపొయింది. కళ్ళల్లో ఏవేవో భావాలు పోటీ పడి పేరుకుంటూన్నాయి...కాని, అప్పటికే వెనక్కి తిరిగిన కళ్యాణి అవేమీ గమనించలేదు.
'ఇతను కూడా వెళ్తున్నాడా -- మరి అలాంటప్పుడు నన్ను కూడా పిలవాలనే ఆలోచన వాళ్ళకి రాలేదా?-- లేకపోతె కావాలనే కళ్యాణి ని ఒక్కదాన్ని ప్రయాణం చేయించాడా? ఎంత మోసం, ఎంత నాటకం ఆడాడు -- ఆవిడ వచ్చి కళ్యాణి ని ఒక్కదాన్ని పిలుస్తుంటే ఆడవాళ్ళూ, పిల్లలూ వెళ్తారు కాబోలనుకున్నాను-- హు-- పరాయి వాడి పెళ్ళాన్ని కూడ వెంట బెట్టుకుని సినీమాలకీ షికార్ల కీ తిరుగుదామను కుంటున్నాడా వీడు ?' .....మురళీ రెండు చేతులూ కిటికీ వూచలని గట్టిగా పట్టుకున్నాయి-- ఆ క్షణంలో ఆ వ్యక్తీ తన ఎదురుగా వుంటే వాడి పీక నులిమేద్దామా అన్నంత కసిగా వుంది----రెండు పిడికిళ్ళూ వూచల మీద బిగించి వుడుకు మొత్తనంగా పళ్ళు నూరుకుంటూ అలా ఎంతసేపూ నిలబడ్డాడో అతనికే గుర్తు తెలియలేదు కాని అన్నం కూర మాడిపోయిన కాతువాసన లోపల నుండి గుప్పుమని రావటంతో విసురుగా వంటగది లోకి వెళ్లి 'వెధవ వంట , వెధవ సంసారం.' అని తిట్టుకుంటూ ఆ రెండు గిన్నెలు దింపి క్రింద పదేసి రెండు స్టౌ లూ ఆర్పేసి, వెళ్లి గదిలో కూర్చున్నాడు. అతనికి ఏమీ తోచటం లేదు. అలాగని ఏపనీ చెయ్య బుద్దీ వెయ్యటం లేదు-- చేతిలోకి తీసుకున్న పేపరు చదవాలని పించక విసుగ్గా వో మూలకి గిరవాటు వేశాడు. బుసలు కొడ్తున్నట్లు పొంగి వస్తున్న ఆవేశాన్ని ఉక్రోషాన్ని అలా తనలో తనే దిగమింగు కుంటూ , 'అసలు కాలం అనేది కదులుతుందా , ఈ లెక్కని వాళ్ళు సినీమా నుంచి తిరిగి వచ్చేసరికి ఎన్ని యుగాలు పడుతుంది?' అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కళ్ళ మీద చేతులు పెట్టుకుని కుర్చీ వెనక్కి వాలి కూర్చున్నాడు.
