ఆ కబుర్లన్నీ వింటున్న మురళీ మధ్యలో అడిగాడు. 'అయితే తాతయ్యా, శరీరంలో ఓంపులన్నీ అలా నిర్లజ్జగా నడివీధి లో ప్రజలందరి ముందూ ప్రదర్శిస్తూ తైతెక్క లాడటానికి వాళ్ళకి సిగ్గు వుండదూ,'
'బాగుంది రా, సిగ్గూ బిడియం అంటూ కూర్చోటానికి వాళ్ళెం సంసారులా ఏమిటి సాని వాళ్ళా యిరి అన్నాడు తాతయ్యా---
అంతా తలుచు కుంటున్న మురళీ మనస్సు ఎలాగో అయిపొయింది. 'కళ్యాణి నాటికి వీధిలో మేళం కట్టటం, మేజావాణీలు చేసే ఆచారం పోయినా కళ్యాణి తల్లీ అమ్మామ్మా అలా ఆడిపాడి రసికులని రంజింప జేసినవారే '' అనుకున్నాడు-- ఇంకా అతని ఆలోచనలు అలా ఎంతదూరం సాగేవో కాని ఒక్కసారిగా సభికుల హర్షధ్వానాలతో హాలు మారుమ్రోగి పోవటంతో ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చాడు.
ఆ అమ్మాయి చేస్తున్న అభినయాన్ని ఆ చిరు పాదముల కదలికని చూస్తూ అప్పటి దాకా ఒక విధమైన తన్మయంలో మునిగిపోయిన కళ్యాణి అప్పటికి తేరుకుంటూ , 'అబ్బ, అద్భుతంగా చేసింది.' అంటూ ప్రక్కకి తిరిగింది, అంతే, మురళీ మొహం చూస్తూ తెల్లబోయింది. మనస్సు వులిక్కి పడింది.
'నీకో చక్కటి డ్యాన్సు ప్రోగ్రాం చూపిస్తాను అని నిన్న సాయంకాలం నుంచీ వూరించి, ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తీసుకు వచ్చిన మనిషి ఇతనేనా అనిపించింది -- ఇలా ఎందుకున్నారు? అసలు ఈయన మనస్సులో బాధ ఏమిటి అని ఎంత తర్కించు కున్నా సమాధానం మాత్రం దొరకటం లేదు-- కాని అతని మొహం చూస్తుంటే కళ్యాణి కి ఒక్క విషయం మాత్రం రూడి అవుతుంది, అతని మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా లేదు-- దానిలో ఏదో బాధ ఎవరి మీదో కోపం, కసి, అసహ్యం ఇలాంటి భావాలు ఎన్నో అందులో సుళ్ళు తిరుగుతూ వాటి తాలుకూ చాయలు అతని మొహం మీద పరచుకునేలా చేతున్నాయి-- ఆ మొహం చూడాలంటేనే ఆమెకి భయంతో గుండెలు పట్టుకు పోతున్నాయి. అతన్ని పలకరించాలంటే నే నోరు పిడచ కట్టుకు పోతోంది--
ఆనాటి ప్రోగ్రాం లో చివరి అంశం కురపంజి నృత్యం స్టేజి మీద ప్రారంభమయింది-- కుమారి గీతాదేవి అడివరకటి దుస్తులు అలంకరణ మార్చుకుని ఈ నృత్యానికి అనువైన దుస్తులతో అలంకరణ తో వుంది.
అడివరకటి వుత్సాహం అంతా నీళ్ళు గారిపోయినా ఏదో చూడాలి అన్నట్లు ఆటే చూస్తోంది కళ్యాణి.
'వెళ్దాం పద' మురళీ గొంతు వినిపించి ప్రక్కకి తిరిగింది. అప్పటికే అతను లేచి నిలబడి వెళ్ళటానికి వుద్యిక్టుడవుతున్నాడు. కళ్యాణి ఏం మాట్లాడకుండా అతన్ని అనుసరించింది.
తల వంచుకుని వస్తూ వస్తూ అప్రయత్నంగానే వోసారి వెనక సీటు వంక చూసిన కళ్యాణి రమణ మూర్తి, కామేశ్వర్రావు మొహలలలో కళ్ళల్లో వో వంకర నవ్వు కనిపించి మనస్సు జుగుప్స తో నిండిపోయినా తన ఆలోచనలకి సమాధానం దొరికినట్లయింది. నన్ను చూసి వీళ్ళేదో వంకర మాట అని అంటారు, అయన కోపం అంతా వాళ్ళ మీదే అనుకుంది.
ఇద్దరూ గేటు దాటి రోడ్డు మీదికి వచ్చి రిక్షా యెక్కి కూర్చున్నాడు-- దారి పొడుగునా మురళీ ఏం మాట్లాడలేదు. ఏదో అడగబోయిన కళ్యాణి కూడా మురళీ మొహం చూసి అతన్ని పలకరించే ధైర్యం లేక ఊరుకుంది.
రిక్షా ఇల్లు చేరుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు-- మొహం ముడుచుకుని మురళీ, అతని వాలకం చూస్తూ ప్రాణం వూసూరు మంటూ కళ్యాణి బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని వచ్చారు.
ఇద్దరికీ కంచాలు పెట్టి అన్నం వడ్డిచింది కళ్యాణి.
'నువ్వెప్పుడయినా బోగం మేళం చూశావా ?' అన్నం కలుపుకుంటూ అదోలా కళ్యాణి వంక చూస్తూ అన్నాడు మురళీ.
నోట్లో పెట్టుకోబోతున్న ముద్దని అలాగే చేతిలో పట్టుకుని బిత్తరపోయి చూసింది కళ్యాణి.
'నువ్వెప్పుడూ చెయ్యలేదేమో కాని మీ అమ్మా, అమ్మమ్మా అంతా పెళ్లి వూరేగింపు లలోనూ, అక్కడా మేళం చేసిన వాళ్ళే కదూ .' అతని మాటల్లోని ఎత్తి పొడుపు కళ్యాణి గుండెల్లో కత్తి దింపినట్లే అనిపించింది -- అలా బాధపడుతూనే.
'అవును.' అన్నట్లు తలవూపి సమాధానం చెప్పింది.
'నడివీధి లో అంతమంది జనం ముందు తైతెక్క లాడటం శరీరంలో ఒంపు సొంపులు అసభ్యంగా ప్రదర్శించుకోటం , ఛ, సిగ్గు లేని మనుషులు.' మురళీ గొంతులో కరుడు కట్టిన కాఠిన్యం , సాధించలేని కసి .
కళ్యాణి తల వంచుకుని అన్నం కలుపుతూ కూర్చుంది. -- నా వంశాన్ని నా పుట్టుకని తలుచుకుంటుంటే నా మీద ఈయనకి అసహ్యం కలుగుతోంది -- నిజమే' నా తల్లి వాళ్ళు అంతా నడి వీధిలో నాట్యం చేసి, కోరివచ్చిన వారందరికీ శరీరం అర్పించి అతి నీచంగా బ్రతికారు-- నాది కృష్టమైన పుట్టుకే-- ఆ సంగతి తనకు ముందే చెప్పాను కదూ-- ఇవాళ కొత్తగా తలుచుకుని బాధపడి , కోపం తెచ్చుకోవటం వల్ల జరిగేదే ముంది. మనస్సులు నలిగి పోవటం తప్ప ప్రయోజన మేముంది? ఇలా నా పుట్టుకని కులాన్ని గుర్తు చేస్తూ నన్ను బాధించటం వల్ల ఆయనకి ఒరిగేదే ముంది.' కళ్యాణి కి మరి ముద్ద నోట పెట్టుకో బుద్ది కాలేదు.
ఇద్దరూ అర్దాకలితోనే లేచి పోయారు. --మురళీ కి ఇష్టమని సాయంకాలం చేసి మూత పెట్టి వుంచిన వుల్లికారం పెట్టి వేయించిన వంకాయ కూరా, కొబ్బరి కాయ పచ్చడీ, టమేటో చారూ అన్నీ అలాగే వుండిపోయాయి.
వంటగది సర్దేసి వెళ్లి పడుకుంది ...గుండెల్లోంచి ఉబికి వస్తున్న దుఃఖం తో కళ్ళు రెండూ నిండి పోతుంటే ప్రక్కకి ఒత్తిగిలి కొంగుతూ తుడుచుకుంది ---
మనస్సులో రేగిన కోపాన్ని మాటల్లో కాని చేతుల్లో కాని బహిర్గతం చేసుకున్నాకే ఒక్కొక్కసారి వివేకం తల ఎత్తుతుంది -- సరిగ్గా అలాంటిదే ఇప్పుడు మురళీ లో మేల్కొంది -- కళ్ళ మీద చెయ్యి ఆనించుకుని మౌనంగా పడుకున్న అతనిలో ఆలోచనలు అలలు అలలుగా లేస్తున్నాయి.
'నా మన సేందుకిలా అయిపోతోంది -- మొదటే అన్నీ తెలుసుకుని, కావాలని ఈ పెళ్లి చేసుకుని, ఇప్పుడిలా , ఏవేవో జ్ఞాపకం చేసుకుంటూ తనని బాధ పెట్టటం లో అర్ధం ఏమైనా వుందా? మనం దారిన నడుస్తుంటే అనేకమంది అనేకం అనుకుంటారు. అవన్నీ లక్ష్య పెట్టటం మొదలు పెడితే అసలీ ప్రపంచంలో బ్రతక గలమా?....రమణ మూర్తీ వాళ్ళకి మొదటి నుంచి నామీద అదోరకం అక్కసు. వో మంచి పని చేశాను అనే కీర్తీ నాకు దక్కింద నీ, కీర్తీ తో పాటు అతిలోక సౌందర్యవతి అయిన భార్య నాకు దొరికిందనీ , వాళ్ళు ఎవ్వరూ చెయ్యలేని పని నేను చేశానని వాళ్ళందరికి ఉడుకుమోత్తనం , వో విధమైన కసి, అదంతా ఇలా వెక్కిరింతల రూపంలో బహిర్గతం చేసుకుంటున్నారు-- అది గ్రహించుకోలేక నేను బాధపడి, కళ్యాణి మనస్సు పాడు చేశాను-- ఛ -- ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాను? అసలు ఏం జరిగిందని నేను అంత అవేశాపడ్డాను? నీ వంశం అల్లాంటిది . నువ్వు మట్టిలో దోర్లాల్సిన మసి బొగ్గువి సుమా! అనే అర్ధం వచ్చే మాటలతో తనని చిత్రవధ చేశాను-- అసలే అభిమానవతి. నేనన్న మాటలతో ఎంతగా కుమిలిపోతోందో.............
'నా కసలు బుద్ది లేదు.' అనుకున్నాడు మరోసారి-- అలా ఆలోచిస్తుంటే అతని మనస్సు చాలా తేలికగా , భారం అంతా తీరిపోయినట్లు అనిపించింది -- కాస్సేపటి తరువాత ,
'కళ్యాణి , మెల్లిగా లాలనగా పిలిచాడు.
కళ్యాణి దగ్గర నుంచి సమాధానం రాలేదు.
చెయ్యి జాచి ప్రక్క మంచం మీద పడుకున్న కళ్యాణి ని దగ్గరగా తీసుకో బోయాడు. అటు తిరిగి వున్న కళ్యాణి చటుక్కున కొంగుతో కళ్ళు అద్దుకోటం తెలిసింది. 'ఏడుస్తున్నావా, కళ్యాణి , ఇటు చూడు.' అంటూ తన చేత్తో ఆమె కళ్ళు తుడిచాడు. 'ఒక్కొక్కసారి నాలో ఏదో దెయ్యం ప్రవేశిస్తుందనుకుంటాను. అది కొద్ది క్షణాల పాటు నన్ను మనిషిని గాకుండా చేసేస్తుంది. అలాంటి సమయంలో నేను ఏం చేస్తానొ , ఏం మాట్లాదతానో తలుచుకుంటే నాకే సిగ్గు వేస్తుంది.' అతని గొంతు ఆర్ద్రంగా పలుకుతోంది.
కళ్యాణి ఏమీ మాట్లాడలేదు.
'ఇందాకా అంత సరదాగా అక్కడికి వెళ్ళామా, అక్కడ ఆ రమణ మూర్తీ, కామేశ్వర్రావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే నా రక్తం మరిగి పోయిందను కో....నీకో చిన్న వుదాహరణ చెప్తాను. ఒక సరస్సులో నిర్మలంగా నిశ్చంతగా నీరు ఉందనుకో -- ఎవరైనా ఒక దోసెడు బురద తీసుకు వెళ్లి దాంట్లో గుమ్మరిస్తా రనుకో అప్పుడేం జరుగుతుంది . ఆ నిశ్చలత చెదిరిపోయి కొద్ది క్షణాలు ఆ నీటిలో కదలిక పుడుతుంది. అంతేకాదు ఆ బురద కలిసిన నీరు స్వచ్చతని కోల్పోయి నల్లగా బురద రంగులో చూడటానికే అసహ్యంగా అయిపోతుంది. అయితే అది తాత్కాలికమే -- మళ్లీ నీటిలో కదలిక ఆగిపోయి నిశ్చలంగా వుండిపోతుంది -- బురద అడుగుకి దిగిపోయి ఎప్పటిలా తేటనీరు మిగులుతుంది-- అలాగే మన మనస్సూనూ-- ఒక్కొక్కసారి మనకి వచ్చిన ఆలోచనల వల్లా, ఇతరుల అన్న మాటల వల్లా కూడ ప్రశాంతత ని కోల్పోయి ఏమిటో అల్లకల్లోలం అయిపోతుంది-- స్వచ్చతని కోల్పోయి మసిబారి పోయిన మనస్సులో అన్నీ దుష్ట తలంపులే వస్తాయి...అదంతా కొంతసేపే -- తరువాత క్రమంగా మనస్సు అదే కుదుట బడుతుంది.
తనని దగ్గిరగా తీసుకుని అతను అలా నెమ్మదిగా మాట్లాడుతుంటే ఆ చెప్పే తీరు ఆ గొంతు ఏదోలా అనిపించింది కల్యాణికి-- అతని గొంతులో అర్ద్రతకి ఆమె మనస్సు మెత్తబడి పోయింది.
