'మన లింగమూర్తి గారి బంధువు, రావుగారని ఒకాయన మన ఆఫీసుకి రెండు మూడు సార్లు వచ్చారు. నీకు గుర్తుందా?' -- ఆఫీసు నుండి వస్తూనే మురళీ అడిగిన దానికీ తెల్లబోతూ 'రావు గారా?' మన ఆఫీసుకి వచ్చేవారా? నాకు గుర్తు లేదు మరి -- అయినా మేనేజరు గారి చుట్టం అయితే, వచ్చి అఫీసుకో మాట్లాడి వెళ్ళిపోతారు గాని మనందరికీ తెలిసే అవకాశం ఏముంది? ఇంతకీ ఏమయింది ఆ రావు గారికి?' అంది.
'రావుగారి కూతురు గీత అన్న అమ్మాయి భరతనాట్యం ప్రోగ్రాం వుంది -- రేపు రవీంద్ర భారతి లో -- ఆయన్ని నువ్వెపుడూ చూడలేదేమో , నాకోసారి లింగమూర్తి గారే ఇంట్రడ్యూస్ చేశాడు-- అయన ఇవాళ ఆఫీసు కి వచ్చి లింగమూర్తి గారితో పాటు మిగిలిన స్తాఫందరి కీ కూడా ఇన్విటేష న్లు ఇచ్చారు-- మన ఇద్దర్నీ తప్పకుండా రమ్మన మని మరీమరీ చెప్పారు.'
'అలాగే వెళ్దాం-- నాకూ సరదాయే ఇలాంటి ప్రోగ్రాము లంటే -- రేపు ఎన్ని గంటలకి.'
'ఆరు గంటలకి ప్రారంభం అన్నారనుకో --మనం కాస్త ముందుగ వెళ్తే ముందు వరసల్లో కూర్చోవచ్చు.'
'కావాలంటే నేను నాలుగ్గంటలకే అన్ని పనులూ ముగించుకుని రెడీగా వుండ గలను. సరేనా .' అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
మర్నాడు సాయంకాలం --
మురళీ కళ్యాణి రిక్షా దిగి రవీంద్ర భారతి ఆవరణ లోకి అడుగు పెడుతుంటే రమణ మూర్తీ, కామేశ్వర్రావు, కనిపించారు-- అదివరకు ఆఫీసులో వున్న పరిచయాన్ని పురస్కరించుకుని వాళ్ళు కళ్యాణిని కూడా పలకరించారు. కళ్యాణి కూడా మర్యాద కి రెండు మాటలు మాట్లాడింది....నలుగురూ మెట్ల మీదుగా పైకి వెళ్ళారు. ఎంట్రెన్స్ దగ్గర రావు గారు ఇంకా కొంతమంది వున్నారు. రావుగారు మురళీ వాళ్ళని గుర్తు పట్టి పలకరించి షేక్ హాండ్ ఇచ్చారు. మురళీ కళ్యాణి ని పరిచయం చేశాడు. కళ్యాణి పెట్టిన నమస్కారాన్ని అందుకుంటూ అయన వాళ్ళ పెద్దబ్బాయి ని పిలిచి, 'వీళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టు.' అని చెప్పి చీఫ్ గెస్ట్స్ గవర్నరు దంపతులనీ తదితరులనీ రిసీవ్ చేసుకోటానికి అయన అక్కడే నిలబడ్డాడు.
లోపల హాలు ఇంకా బాగా నిండలేదు. ముందు వరుసలలో వున్న ఖాళీ లని చూపిస్తూ 'ఇలా కూర్చోండి' అని చెప్పి రావు గారి అబ్బాయి వెళ్ళిపోయాడు.
వో వరుస లో చివర వున్న రెండు కుర్చీ లలో కళ్యాణి మురళీ కూర్చున్నారు. ఆ వెనక వరుసలో సరిగ్గా వాళ్ళకి వెనకగా రమణమూర్తీ కామేశ్వరరావు కూర్చున్నారు.
మరి కాస్సేపటి లో అంటే -- అన్న టైము కి ఒక్క నిముషం అయినా ఆలశ్యం కాకుండా గవర్నరు దంపతులు వచ్చేశారు.
'అందరూ ఇంత పంక్చ్యువల్ గా వుంటే ఎంత బాగుంటుంది -- కొంతమంది పెద్దల్ని ఏ ఫంక్షను ప్రిసైడ్ చేయ్యటానికో , ఇనాగ్యురేట్ చేయ్యటానికో పిలుస్తామనుకో -- అన్నదానికి టంచనుగా గంతాన్నర లేటుగా వస్తారు. ఈలోగా ప్రేక్షకులలో సరదా చచ్చిపోయి విసుగూ చిరాకూ వస్తాయి. ఆ పెద్దల్ని రిసీవ్ చేసుకోటానికి గేటు దగ్గర నిలబడ్డ కార్యకర్తల కాళ్ళు కదుములు కట్టిపోయి వాళ్ళకి నిస్త్రాణ ముంచుకు వస్తుంది.' మెల్లిగా అన్నాడు మురళీ కళ్యాణి తో-
ఇంతలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గవర్నరు గారు కుమారి గీతాదేవి ని సభికులకు పరిచయం చేయటం మొదలవటం తో అందరితో పాటు కళ్యాణి మురళీ కూడా ఖబుర్లు మాని స్టేజి వైపు కి దృష్టి తిప్పారు.
కుమారి గీతాదేవి ఇంత చిన్న వయస్సులోనే ఈ అరంగెంట్రం ప్రదర్శన ఇవ్వడం చాలా మెచ్చుకోదగ్గ విషయమనీ ఈ చిరంజీవి ఈ కళారాదన ను చిరకాలం కొనసాగించి ఈ కళలో ఉన్నత శిఖరాలని చేరుకోవాలని తను కోరుకుంటున్నాననీ అదే ఆశీర్వాదమనీ-- ఈ కుమారి ప్రదర్శించబోయే కళాభిజ్ఞాతను సావకాశంగా తిలకించి ఆనందించటానికి తనకి వ్యవధి లేదనీ, తను మధ్యలో వెళ్ళిపోయినా మిగిలిన సభికులంతా చివరి దాకా వుండి ఈ పాపకి ఉత్సాహాన్నీ ప్రోత్సహాన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాననీ -- ఏవో నాలుగు మాటలు చెప్పారు అయన.
తరువాత రావు గారు, గవర్నరు దంపతులు తమ ఆహ్వానాన్ని అందుకుని శ్రమ అనుకోకుండా విచ్చేసినండుకుం అవతల మరెన్నో కార్యక్రమాలు వున్నా కాస్త వ్యవధి చేసుకుని ఇక్కడకు వచ్చి తన కుమార్తెను ఆశీర్వదించి ఆమె నాట్యాన్ని తిలకించి వెళ్తున్నందుకు తమ కుటుంబం అందరి తరపునా కృతజ్ఞతలు అందజేశారు.
ఆ తరువాత అంతా స్టేజి దిగి హాలులోకి వచ్చి కుర్చీలలో కూర్చున్నారు. మరి పది నిముషాల్లో నాట్యం ప్రారంభమయింది.
కళ్యాణి సరదాగా, ఆసక్తిగా కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తోంది -- పట్టుమని పది సంవత్సరాలు నిండాయో లేదో అన్నట్లున్న ఆ పాప ఆ దుస్తులలో అలంకరణ లో ఎంతో ముద్దుగా వుంది --
మురళీ దృష్టి డ్యాన్సు చూస్తున్నా మనస్సు మాత్రం పూర్తిగా నిలపటం లేదు --రమణమూర్తీ , కామేశ్వర్రావు ఇందాక కళ్యాణి ని చూడగానే ఏమిటో వేళాకోళం గా వెక్కిరింతగా నవ్వుకోతం గుంభనంగా మొహాలు చూసుకోతం ఆ తరువాత మెల్లిగా ఏదో గోణు'క్కోటం గుర్తు వచ్చి మధ్య మధ్య మనస్సు చివుక్కుమంటూండేది.
'వాళ్ళు మమ్మల్ని గురించే నవ్వుకున్నార ని, మాట్లాడు కున్నారనీ ఎందు కనుకోవాలి.' అని సరిపెట్టుకుని మళ్లీ ఉత్సాహంగా స్టేజి వైపు కి చూడబోయాడు గాని ఇంతలో వెనక నుండి వచ్చిన విసుర్లకి అతను వులిక్కి పడ్డాడు అతని మొహం పాలిపోయింది.
'వోయ్ రమణ మూర్తీ -- నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. మా వూళ్ళో బోగం మేళం ఇంతకన్న బాగానే ఆడేవారు-- నువ్వెప్పుడూ చూడలేదా?' అంటున్నాడు కామేశ్వర్రావు వెక్కిరింతగా.
'చూడకేం -- మా వూళ్ళో నాయుడు గారి కూతురు పెళ్ళికి పట్నం నుంచి తెప్పించారు బోగం మేళాన్ని , అప్పటికి నేను చిన్నవాడినే కాని నలుగురు చెప్పుకున్న దేమిటంటే బోగం వాళ్ళు పెళ్ళిలో మేళం చెయ్యటానికి నాయుడు గారి దగ్గర పుచ్చుకున్న డబ్బే కాకుండా ఆ రాత్రిరలో వెయ్యి రూపాయలూ సంపాదించుకుని మూట కట్టుకుని మరీ వెళ్ళారుట.' రమణ మూర్తి గొంతులో హేళన వ్యంగ్యం స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఆ మాటలు కళ్యాణి చెవిని కూడా పడతాయేమో అని భయం భయంగానే తలతిప్పి చూశాడు. కళ్యాణి అసలు ఈ లోకంలో వున్నట్లు లేదు. పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతుండగా , ఉత్సాహం తోనూ, ఆ చిన్నారి పట్ల అభిమానం తోనూ మొహమూ కళ్ళూ మెరిసి పోతుండగా తదేకంగా స్టేజి వంకే చూస్తోంది --
మురళీ గుండెలలో నుండి ఒవిధమైన తృప్తి తోనూ, జాలి తోనూ కూడిన నిట్టుర్పు వెలువడింది. 'పోనీలే -- ఆ మాటలు తన చెవిని పడలేదు, అది వింటే ఎంత బాధపడేదో -- సరదాగా వినోదం చూపిస్తాననీ తీసుకొచ్చి చివరికి మనస్సు నొప్పించినట్ల యేది .' అనుకున్నాడు--
కాని ఆ విన్నది మరిచిపోవటం మాత్రం అతనికి సాధ్యం కాలేదు. మళ్లీ మళ్లీ వాటినే గుర్తు చేసుకుంటున్న కొద్దీ అతని మనస్సు నిండా ఏదో చెదు వంటి భావం ఆక్రమించుకో సాగింది. ఎంత అణచు కుందామన్నా ఆగని ఆలోచనలు జ్ఞాపకాలు అతన్ని తరుముకు రావటం మొదలు పెట్టాయి.
మురళీ పెద్ద చెల్లెలు వైదేహీ పెళ్లి నాటికి వాళ్ళ తాతగారు బ్రతికే వున్నారు-- ఇప్పటి పరిస్థితులని బట్టి తమ శక్తిని బట్టీ వైదేహీ పెళ్లి ఒక్కరోజే జరిపించాలని నిర్ణయించు కున్నారు శివరామయ్య గారు, 'బొమ్మల పెళ్ళిలా బొత్తిగా ఒక్కరోజు ఏమిటి, మూడు రోజుల పెళ్లయినా చెయ్యి.' అన్నారు ముసలాయన కొడుకుతో.
'ఉహు-- నేను తూగలేను .' అన్నారు శివరామయ్య గారు.
కొడుకు తన మాటకి కించిత్తయినా విలువ ఇవ్వలేదు అన్న ఉక్రోషం తోనూ, మాకాలం లో మేం ఇంతకన్నా దర్జాగా బ్రతికే వాళ్ళం అని చెప్పాలనే ఉద్దేశ్యం తోనూ అయన మురళీ వాళ్ళని దగ్గర కూర్చో పెట్టుకుని ఆ ఖబుర్లన్నీ చెప్పాడు. అయన తన కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా చేశాడో తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కి వాళ్ళ నాన్నగారు ఎంత దర్జాగా డబ్బు వేదజల్లారో అన్నీ కధల్లాగా చెప్పాడు.
అయన చిన్న చెల్లెలు పెళ్లి మరీ గొప్పగా జరిగిందిట. ఆ మొగ పెళ్లి వారు నాలుగు రకాల బ్యాండు మేళల్ని తెచ్చుకోటమే కాకుండా బోగం మేళాన్ని కూడా తీసుకోచ్చారట. పెళ్లి అయిదు రోజులూ ఊరేగింపు లో ఈ బోగం వాళ్ళు మేళం చేస్తుంటే ఊరంతా కళ్ళూ నోళ్లూ వెళ్ళ బెట్టుకుని మరీ చూసేవారుట. అందులో వో చిన్నది చక్కని చుక్క వూళ్ళో కుర్రకారు అందరికీ వేర్రేట్టించేసిందిట. వీళ్ళ వంట వాళ్ళల్లో ఒకడు తను చేస్తూ చేస్తూ వున్న పని కూడా అలాగే వదిలేసి ఆ పిల్ల వెంట పడేవాడుట ఊరేగింపు లోనూ అక్కడా --
