ఉష కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. ప్రభాకర్ కుర్చీ చెయ్యి మీద కూర్చున్నాడు.
"మోహన్ మీకు తెలుసుగా? నాన్నగారికి అతని పోడంటేనే గిట్టదు!...."
"ఎందుకని? వాడెం అహంకారి కాడే?"
"సినిమా వాళ్ళంటే చాలు నాన్నగారు భగ్గు మంటారు...." అని చెప్పింది ఉష జాలిగా చూస్తూ.
"పోనివ్వండి! వాడిని సినిమాలు వదిలి పెట్టి మరో ఉద్యోగం చూసుకోమంటే తీరిపోతుంది.... ఈ పనికి మాలిన వేషాల వల్ల వాడికి ఏగానీ కూడా రావటం లేదు-"
ఉష కుర్చీలో నుంచి లేస్తూ "ఏమో! నాకు నమ్మకం చాలటం లేదు!" అంది.
మోహన్ సినిమాలు వదిలి పెట్టాడా? వదిలి పెట్టినా ఉష నాన్న వప్పుకోడా? మరి వాళ్ళిద్దరి పెళ్లి ఎలా అవుతుంది? వాళ్ళ పెళ్ళి కాకపోతే తమ పెళ్ళి కాదు.... ఇదెక్కడి చిక్కు వచ్చి పడిందిరా బాబూ! ఏదో ఎత్తు ఆలోచించక పొతే లాభం లేదు అనుకున్నాడు ప్రభాకర్ తను కూడా లేస్తూ.
11
సాయంత్రం నాలుగు గంటల వేళ. ఆకాశంలో మబ్బులు తారట్లాడుతున్నాయి. ఇల్లు కదిలి వెళ్తే దారిలో చిక్కుకోవచ్చు. చిత్ర సాలోచనగా ఆకాశం కేసి చూస్తూ వరండాలో నిలబడింది.
పడకకుర్చీ జర్రుమని లాగిన చప్పుడు విని చిత్ర అటు కేసి చూసింది. పెర్రీ మేషన్ నవల చేతిలో పట్టుకుని బావ కనబడ్డాడు.... బావ ఈ మధ్య హుషారుగానే కనబడటం లేదు. వూర కుక్క కోసం అంత బెంగ పెట్టుకు పోవాలా? కావాలంటే ఇంకో వూర కుక్కను తెచ్చి పెంచుకోవచ్చును.... బావ నోటి వెంట అన్నీ అబద్దాలే! నాలుగైదు రోజుల్లో ఫ్రెండ్ వూరి నించి వస్తాడని చెప్పాడు. వారమైనా ఇంకా ఆమాటే ఎత్తటం లేదు!
"బావా! మీ ఫ్రెండ్ ఇంకా వూరి నుంచి రాలేదా?"
శేఖర్ పుస్తకం మీది నించి దృష్టి మళ్ళించి చిత్ర వంక చూశాడు....
చిత్ర తను చెప్పినవన్నీ నిజమే అనుకుంటున్నది.... ఎంత అమాయకురాలు! వాడు మధుర దాకా ఎందుకు పొరుగూరి కైనా వెళ్ళలేదు. చిత్రకూ కావలసింది సవరమే కదా? అది వాడిస్తానన్నాడు. నిన్న వాళ్ళింటికి వెళ్తే వాడు యింట్లో లేడు.... మరి ఏం చేయటం?
"వాడింకా రాలేదు చిత్రా!" అనేసి తొందర తొందరగా పుస్తకంలో తల దూర్చేసుకున్నాడు శేఖర్.
"ఏవండీ? చిత్రా! కులాసా?"
చిత్ర తలెత్తి చూసేసరికి ఖరహర ప్రియ నవ్వుతూ కనపడింది. చిత్ర ఎదురెళ్ళి ప్రియను లోపలి గదిలోకి తీసుకు వెళ్ళింది.
కాస్సేపు అంతా కలిసి మాట్లాడుకున్నాక చిత్ర, తను తప్ప మరెవ్వరూ లేని సమయం చూసుకుని ప్రియ కోపగించుకున్నట్టుగా అన్నది.
"మీరు మా యింటికి రావటమే మానేశారు! అమ్మమ్మ మిమ్మల్ని ఇప్పుడు వెంట బెట్టుకుని తీసుకు రమ్మంది...."
చిత్ర సిగ్గు పడినట్టుగా నవ్వింది.
"ఇంకోమాటు వస్తాం లెండి. ఇప్పుడు వానొచ్చేట్టుగా ఉంది...."
"వానేం రాదులెండి. ఒకవేళ వచ్చినా మీరు తడవకుండా జాగ్రత్తగా తీసుకెళ్తానుగా?..... మీరు లేకుండా నేనేక్కర్తిని వెళ్తే అమ్మమ్మ -- నన్ను ఇంట్లోకి రానివ్వదు..." అంది ప్రియ బ్రతిమాలు కుంటున్నట్టు.
చిత్ర ప్రియ మాట తీసేయ్యలేక పోయింది.
ఇంతలో కళ కాఫీ పట్టుకుని గదిలోకి వచ్చింది.
"కళా! ప్రియ వాళ్ళింటికి, రమ్మంటున్నది. వాళ్ళ అమ్మమ్మ మరీ మరీ చెప్పారట...."
ప్రియ గుండెలు దడదడ లాడాయి. కళ యెక్కడ వస్తానంటుందో అని. "మీరు మరోలా అనుకోకండి. నేను యింకో రోజు వస్తాను. చిత్ర వస్తే తీసుకెళ్ళండి." అంది కళ ప్రియకు కాఫీ కప్పు అందిస్తూ. ప్రియ తేలికపడి కాఫీ ఒక గుక్కలో తాగేసి లేచి నిలబడింది.
ఆకాశంలో మబ్బులు చెల్లాచెదురవుతున్నాయి.
"వాన వస్తుందని భయపడ్డారు! చూడండి! మనని చూసి మబ్బులేలా పారిపోతున్నాయో ?' అంది ప్రియ త్రోవలో.
చిత్ర నవ్వి వూరుకుంది.
"అన్నయ్యను నేను నిష్కారణంగా కొట్టానండి.... రెండు బుగ్గలు ఇంతెత్తున వాచీ వాడు మంచం దిగటం లేదు....' అంది ప్రియ విచార వదనంతో.
చిత్ర ఉలిక్కిపడింది.
"అరె! అదేమిటి? ఎందుకు కొట్టారు?" అంది ఆశ్చర్యపోతూ.
'అన్నయ్య ఎంత మంచి సవరం తెచ్చి పెట్టాడనుకున్నారు? నాకు చూపెట్టకుండా డ్రాయర్ లో దోసేశాడు... నేను కనుక్కోలేనకున్నాడు...."
చిత్ర మరీ ఆశ్చర్యపోయింది. అన్నయ్యకు వంట్లో బాగుంద లేదంటున్నది. ఇంతట్లోనే సవరం సంగతి చెపుతుంది.... ఈ అమ్మాయికి స్క్తూ ఏవైనా వదులా అనుకుంది చిత్ర.
"ఇప్పుడు వేసుకున్నారా?' అంటూ చిత్ర ప్రియ జడ కేసి చూసింది.
ప్రియ తల అడ్డంగా తిప్పింది.
"ఇంకా ఏం వేసుకొను? అ సవరం నుంచే ఆన్నయ్య చచ్చే దెబ్బలు తిన్నాడు....అదే వేసుకుని వెళ్తుంటే అన్నయ్య తమాషా చేద్దామని గుంజాడు. నేను ఎవరో అనుకుని చెప్పుతో......."
చిత్ర తెల్లగా పాలిపోయింది.... తెలిసింది! తను నిష్కారణంగా మోహన్ గారిని అనుమానించింది.
ఇల్లు చేరుకున్నాక ప్రియ అన్నది --
'అన్నయ్య మంచం ఎక్కటం చూసి రంభ కూడా బెంగ పెట్టుకున్నది. అది వాడి గది దాటి బైటకు రావడమే లేదు....."
చిత్రకూ సానుభూతి కలుగలేదు సరిగదా వళ్ళు భగభగ మండింది.
ఇంతలో ప్రియ వాళ్ళ అమ్మమ్మ వచ్చి పలకరించింది. కొంతసేపయ్యాక ప్రియ 'అన్నయ్యను చూస్తారా?" అనడిగింది.
ప్రియ అమ్మమ్మ 'చూసిరా అమ్మా! మేడ మీదున్నాడు. నిన్నటి రోజు లేచిన వేళా విశేషం అలాంటిదమ్మా!" అంది వేదాంత ధోరణి లో.
చిత్ర కాదనలేక ప్రియ వెంట మేడ మీదికి బయలుదేరింది.
మెట్ల కానుకున్న ఉన్న గదిలో కిటికీ కి దగ్గరగా ఒక మంచంమీద సారంగ మట్టి రంగు శాలువా కప్పుకుని మెలకువగా పడుకున్నాడు. రెండు బుగ్గల మీదా శోంటి పట్లు.....మంచానికి దగ్గర్లో నిద్రపోతున్న రంభ....
సారంగను చూడగానే చిత్ర పోల్చుకోలేక పోయింది. మంచానికి దూరంగా ఉన్న రెండు కుర్చీల్లో ఒకదానిని దగ్గరగా లాగి చిత్రను కూర్చోమన్నది ప్రియ. ఏదో పని మీద ప్రియ క్రిందికి వెళ్ళింది.
సారంగ యెదురుగా కూర్చోవటం ఇష్టం లేక చిత్ర లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. కిటికీ లోంచి సముద్రం కొద్దిగా కన్పిస్తున్నది. మెల్లిమెల్లిగా చీకటులు మూసుకు వస్తున్నాయి. సముద్రపు హోరు మరీ స్పష్టంగా వినిపిస్తున్నది. చీకటిని చూస్తె సముద్రానికి సైతం గాభరా యే కాబోలను కుంది చిత్ర.
"మీరు నన్ను క్షమించరూ?"
జాలిగా అస్పష్టంగా అర్ధిస్తున్న కంఠస్వరం....
చిత్ర కలలకు అంతరాయం కల్గింది. జాగ్రదావస్థలోకి జారుకుని కోపంగా చూస్తూ "నా జేడెందుకు గుంజారు?" అనడిగింది.
సారంగ నీరసంగా జవాబిచ్చాడు.
"నాకేం తెలుసు ? ఆడవాళ్ళకు మూరెడు జడలో బారెడు సవరం ఉంటుందని!"
చిత్ర హుంకరించింది.
'ఆడవాళ్ళ జడల సంగతి మీకెందుకు? ...నిక్షేపం లాంటి మీసం గీరి మీరెందుకు నల్ల పెన్సిల్ తో మీసాలు దిద్దుకుంటారు?" అనడిగింది ఉక్రోషంగా.
తన మీసాల సంగతి ఎత్తేసరికి సారంగ కంగారు పడి లేచి కూర్చున్నాడు.
"మీ జడ జోలికి రాను గాని నా మీసాల సంగతి ఎత్తకండి.... తాతయ్య విన్నాడంటే చర్మం వలిచేస్తాడు. తాతయ్య కు ఫేషన్ల సంగతెం తెలుసు? నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు పెంచు కోమంటాడు. అయన వూళ్ళో లేనప్పుడు ఒకరోజు పెట్టుకున్నా నంతే! దానికి ... మీరు ...ఇంతకీ మీ జడ గుంజటం లో నాకెలాంటి దురుద్దేశమూ లేదు... నన్ను క్షమించరూ?
"దురుద్దేశం ఏం ఉంటుంది లెండి? కుక్కను దొంగిలించినట్టే మీ చెల్లెలి కోసం సవరం కూడా దొంగిలించారు...." అంది చిత్ర ఆగ్రహం పట్టలేక.
సారంగ మంచం మీద దిండు నానుకుని సరిగా కూర్చున్నాడు. "ఆ మాటే అనకండి! నేను కుక్కను దొంగిలించలేదు. సవరాన్నీ దొంగిలించలేదు....ఆరోజు కూడా మీరిలాగే నాకు దొంగతనం అంటగట్టి ఎన్ని మాటలన్నారు? అక్కడితో వూరుకున్నారా? మళ్ళా మా యింటి కొచ్చి నానా మాటలని వెళ్ళారు. మీరంటే నాకు చాలా కోపం వచ్చింది. మీమీద కసి తీర్చుకోవాలను కున్నాను.... అందుకే మీరు ఒంటరిగా వెళ్తుంటే జడ పట్టుకు లాగాను. కాని చేతిలోకి నల్లని జడ వూడోచ్చేసరికి నాకు చెప్పలేనంత భయమేసింది. మీరు వెనక్కి తిరిగి చూసేలోగా దాన్ని జేబులో పడేసుకుని పారిపోయాను....."
అంతా విన్నాక చిత్ర నిట్టూర్చింది. తను బొత్తిగా మర్యాద లేకుండా ప్రవర్తించింది కాబోలు... దొంగలకు కూడా మర్యాద ఇవ్వాలా? దొంగను కానంటారు. దొంగ దొంగనని ఒప్పుకుంటాడా?
"ఇంక తెలిసింది లెండి... మీరు దాన్ని డ్రాయర్లో పడేస్తే ప్రియ దాన్ని జడలో వేసుకున్నది.... ఆ తర్వాత మీరు ప్రియ జడ పట్టుకు లాగటం , చావు దెబ్బలు తిని మంచం ఎక్కటం...."
సారంగ నిట్టూర్చాడు.
"సూక్ష్మంగా అదే అనుకోండి....కాని..."
ప్రియ మీద సారంగకు కోపమా? ప్రియ జడ ఎందుకు లాగినట్టు? చిత్ర కిటికీ దగ్గర నుండి కదిలి సారంగ ఎదురుగా కుర్చీ లో కూర్చున్నది.
"ప్రియ నెందుకు భయపెట్టాలను కున్నారు?" అంది సారంగ కళ్ళలో గ్రుచ్చి చూస్తూ.
సారంగ దిగులుగా చూశాడు. చిత్ర కోపంగా చూస్తున్నది. సారంగ మరీ బెంబేలు పడిపోయాడు.
"చెప్తే క్షమిస్తారా?.....మీ సవరం డ్రాయరు లో పడేశాను.... నాకేమిటో బాధగా ఉండేది. రెండో రోజు కాబోలు రోడ్డు మీద శేఖర్ కలిశాడు...."
చిత్ర ఆశ్చర్యంగా చూసింది.
"ఎవరు? మా బావా?"
"అవును శేఖర్ మీ బావని నాకు మొదట్లో తెలీదు. వాడూ నేనూ యూనివర్శిటీ లో స్నేహితులం -- ఈ మధ్య శేఖర్ కనబడగానే నా దుఃఖ గాధ వాడి ముందు వెళ్ళ బోసుకున్నాను. వాడు అంతా విని నిర్ఘాంత పోయాడు. "మా చిత్ర సవరం నువ్వు కాజేశావా? దాని కోసం చిత్ర ఒకటే దిగులు పడుతున్నది...." అన్నాడు. నేను వాడిని బ్రతిమాలుకున్నాను సవరం తెచ్చిస్తాను, గుట్టు చప్పుడు కాకుండా మీ చేతిలో పెట్టమని. వాడు అమ్మయ్యో! సడన్ గా సవరం తీసి కెళ్తే ఇదేక్కడిది? ఎలా వచ్చింది? అని నన్ను నిలవేయ్యదూ? దానికే దైనా పధకం ఆలోచించాలి. అంతవరకూ నీ దగ్గరే ఉంచు' అంటూ వెళ్ళిపోయాడు. నిన్న వాడు మా యింటి కొచ్చి తీసుకెళ్తానన్నాడు..... ఈలోగా బేబీ జడలో పెట్టి అల్లుకుంది.... నాకు ఏం చేయటానికి తోచలేదు.... మళ్ళీ మొదటి ఉపాయం పని చేయక పోతుందా అని దాని వెనకాలే వెళ్ళి గట్టిగా గుంజాను.... కాని దురదృష్టవశాత్తూ సవరం ఊడిరాలేదు, చెప్పు దెబ్బలు మాత్రం తగిలాయి...." చివరకు మీ వస్తువు మీకివ్వ లేకపోయాను.
