20

మధు, రావు, దశరథం, సత్య, మాల, సుభద్రమ్మ, ఆఖరుకు రామచంద్రయ్యకూడా ఎంత అడిగినా రుక్మిణి, రాజు ఈసారి తిరిగి వెళ్ళిపోవడానికి కారణం చెప్పలేదు. చెప్పలేక పోయింది. అది వాళ్ళు అంతగా పట్టించుకునేంత ప్రాముఖ్యంలేనట్లే తట్టింది.
ఆ వ్యక్తిని తను ఊహించినంతవరకూ, ఓ అసందిగ్ధ విప్రలంభమే కన్పించింది. ద్వివిధ స్వభావాలతో అత్తయ్య కడుపునబడి పుట్టేడన్న నిరుకే కలిగింది. జ్ఞానం, అజ్ఞానం అన్నని తారతమ్యాలే అయినా, అవి ఉండీ, లేవన్న ఝంఝాటనే రాజు.
ఇంతకూ తను నమ్మలేదు - ఈ నవ్య ఆధునిక యుగంలో, గత వాసనలు ప్రతిఫలించడానికి ఆస్కారం ఉందని; అవి కట్టుకథలా సత్యాలు అవుతాయని. తన మనస్సే రాయి చేసుకుంది. వస్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటాడు. ఈ రెంటిని కూడా తను భరించాలి. ఆ భరించేందుకు ధైర్యం ఉందో, లేదో విమర్శించడానికి వీళ్ళకు హక్కులేదు.
ఈ భావనలోనే చికాకు వస్తే "తగుదు నమ్మా అని వచ్చేరు. నా ఇంటి గొడవ మీకెందుకూ?" అనేసింది.
తల వంచుకున్నవాళ్ళు పైవాళ్ళు. సుభద్రమ్మ మాత్రం "ఎంతదానివయ్యేవే! తిన్నయింటి వాసాలు బాగా లెక్క పెట్టేవు" అనేసింది.
అదీ భరించింది రుక్మిణి.
వెళ్ళబోయేముందే మాలమాత్రం "రుక్మిణీ! నీ కళ్ళల్లో రాజుమీద కామం ఉంది. అతన్ని నీవాడుగా చేసుకుని, ఊరేగాలనుకున్నావ్! అది రాజు సాగనివ్వలేదు. అందుకే వెళ్ళిపోయేడు.
"అవునా? కాదా?" అనే ఉరిమింది.
"నీ లెక్కేమిటి" అన్నా, గుండెల్ని చీల్చేటట్లు ఉంది ప్రశ్న రుక్మిణికి.
సత్య గుటక మ్రింగి కళ్ళు నీళ్ళెట్టుకుంది.
ఎవరు ఎల్లా వచ్చేరో వాళ్ళు అల్లాగే వెళ్ళేరు.
మిగిలింది రుక్మిణీ, కొంగట్టుకున్న రామ చంద్రయ్యా అయ్యేరు.
21
'వారు వెళ్ళడం తథ్యం. అది జరగనివ్వకూడదు' అన్న దృక్పథంలోనే శాంత ఊగి పోయింది. దీని పర్యవసానం ఏమిటి అన్న విచక్షణే కోల్పోయి, ఉద్రిక్త అయ్యింది.
పెట్టె తెరిచింది. ఒక్కొక్క చీరే కలరా ఉండల వాసనల్లోని పైకి తీసింది. అన్నీ విప్పింది. అనునాయంగా బాగోగులు చూచి నట్లుగానే భుజంమీద వేసుకుని బిల్వరు అద్దంలో చూచుకుంది. ఒక్కటీ నచ్చనట్లే. ఏదో ఎక్కడో లోపం- పరిపూర్ణం కాలేని చతుర్ద శిలాగే.
అల్లాగే పాపిడి దువ్వింది. వాలుజడా? శిఖా, కొప్పా? పువ్వులు తురుముకొనా? లేక సన్నజాజుల వరుసా? మల్లెల పేర్లా? నిశ్చయించుకోలేకపోయింది.
ఒక్క మాటలో ఊగి ఊచే అయ్యింది.
అయినా తను వెళ్ళాలి. ఆయనను చూడాలి. మాట్లాడాలి. కన్పడాలి. అంతవరకూ తను ఇంట్లో ఉన్నట్లు కూడా తెలియదు.
ఒక్కసారి ఆ చిటికెనవ్రేలు పట్టుకుని, తనతో నడవడం, ఒకే పంక్తిని, వెండికంచాల్లో కూర్చుని భోజనం, బంతులాడడం, గుమ్మం దగ్గర పేరు చెప్పమంటే గునియడం గుర్తుకు వచ్చి ఊదరకొట్టేయి. ఉక్కిరి బిక్కిరే అయ్యింది, ఏమిటీ ఉక్కపోత అన్నట్లు.
కిటికీలోంచి పైకి చూచింది. దశమితిథి. ఆయన ప్రయాణం, వాళ్ళ పట్టపురాణితో అన్నట్లే సగం అలసిన వెన్నెల. ఊరుకోకుండా మధుర ప్రశాంతయామిని వింజామరం సంగీతపు పువ్వుల చెట్లమీద నుండి.
ఎప్పటికీ తెమలలేకపోతూంది అన్న చికాకు.
ఆఖరుకు మధుపర్కమే కట్టింది. పమిటసారించుకున్నపుడు, కుచ్చెళ్లు సరిదిద్దుకున్న ప్పుడు, జరీ తనకు కితకితలు పెట్టినట్లే అయితే, 'ఇన్నేళ్ళనుండి ఎరుగుదును, ఇప్పుడే సిగ్గుపడతావేం' అని కనరాలన్న ఆయత్తత.
బులబులాగ్గా అన్నట్లు వట్టివేళ్ళసెంటు వ్రాసుకుంది. మల్లెలూ, జాజులూ తురుముకుంది. అద్దంలో ఆఖరుకు బొట్టూ సరిదిద్దుకుంది.
మావగారి గదిలో గుర్రుద్వయం విన్పిస్తూనే ఉంది. గుండెలు ఓసారి తడుముకుంది. తంబూరా వాడినంటూ శాస్త్రి, గురువుగారికి తాళం.
నెమ్మదిగానే మెట్లు ఎక్కింది. కాళ్ళు తడబడ్డాయి. పిట్టగోడమీద చామంతులు. ఎదురుగా అరుంధతిన్నీ. మామిడి చిగుళ్ళల్లా బుగ్గలు ఎరుపెక్కేయి. నడిచేవెళ్ళి పాదాల మీద చేతులే వేసింది.
ఉలిక్కిపడ్డట్లే "ఎవరూ?" అన్నాడు రాజు.
"నేను."
"శాంతా! నువ్వా?"
"భయపడ్డారా?"
చిన్నగా నవ్వేడు. ఒక్కసారి పర్యవేక్షణలో సర్వం అర్ధం అయినట్లే తట్టేయి.
"తప్పుకాదూ?"
భుజానికి ఉన్న కట్టువంకి చూపించింది. అది కార్యానికి కొంగున కట్టేందుకు చేయించేరు అప్పుడు. ఈనాడు.....
సత్య, రుక్మిణి, మాల, వీళ్ళ పరీక్షలకు తను తట్టుకున్నాడు. మళ్ళీ ఈ శరీరానికి ఏం వ్రాసి పెట్టి ఉందో అన్న బీభత్సంలో కంగారు పడ్డాడు. ఏమిటీ వాంఛ?
తనలో పుట్టి పెరిగింది ఓ సత్యని గూఢ చైతన్యం. అది దైవపరం. అయినా, తన కర్మ ఎందుకు ఇల్లా, క్లిష్ట విషమ పరిస్థితుల్లోకి దించుతూందో అర్ధం కాలేదు. అదే ప్రబలంగా, బలంగా తన్ను నడిపిస్తూందా? నడిపిస్తే ఈ జ్ఞానం ఏమిటి? ఈ కాల, దేశ, విభిన్న ప్రవృత్తేమిటి? తను వరుడుగా ఉన్నా, ఈ అన్వేషణ, అందులో సత్యం, ఎంత అసందర్భంగా ఉన్నాయి? ఎందుకు ఈ రొంపలోకి దిగలాగబడుతున్నాడు? జీవితం అంతా కూడా ఇల్లా గడపవలసిందేనా? ఇది తన నుదుటను వ్రాసిన బలీయమైన గీతా?
"అది ఆనాటి చరిత్ర. అది పునరావృత్తి అవలేదు."
"భారతంలో ప్రతిసర్వమూ జరిగిందే."
సూటిగా తగిలింది. గతుక్కుమన్నాడు. "ఓ విధంగా నీకన్న వయస్సులో .....
"ఆది దంపతుల్లో అమ్మే పెద్దది."
"ఇటువంటి దగ్ధ జీవితం గడిపిన తర్వాత మళ్ళీ కోర్కెలు ఎందుకు రేకెత్తించుకుని ఆశలు మొలకెత్తించుకుంటావ్?"
"అది నిజమే. అయినా కట్టె వున్నంత కాలం, దాని విలువ, స్థితిలో దానికి కోర్కెలు వుంటాయి. అది అంతరంగిక శక్తి, ఆత్మను ఎంతకాలం మ్రోయాలో మ్రోసినా, స్వార్ధం లేకుండా, కర్మరహితంగా, సమాధిలోకి వెళ్ళి లేదుకా?"
"ఈనాటి రాత్రిలో....." ఆగేడు.
"ఇన్నాళ్ళూ ముత్యపుచిప్పలా ఎదురుచూచేను. అది దగ్దంలో జ్యోతి. ఆరిపోలేదు. జీవితం స్త్రీది ఎప్పుడూ ఇంతే. మాతృత్వం వహించనిది దప్పికతీరని దాహం స్త్రీకి. ఇది వ్రాసిపెట్టలేదేమో అనుకున్నా. ఆఖరుకు ఏకాకిగానే కట్టెలు పెట్టబడతాయనే కుమిలింపు.
"కాని ఆ అంబ నాలో ఆశ రేకెత్తించింది. మీరు కనపడ్డారు. దానితో శరీరం, ఆత్మకూడా కైపులోనే ఉండిపోయేయి. మధ్య వడగళ్ళూ వచ్చేయి.
"ఆఖరుకు ఒక్క ఆశయంతోనే జీవించే. అది మీరు ఆనాడు చూచిన ఆర్ద్రతాపూరిత మైన చూపు."
"ఈ శరీరానికి విలువ నివ్వడంవల్ల మనం దిగజారి పోతున్నామేమో!"
"లేదు. బాహికపు కలయిక ధర్మబద్ధం అయినా, ఆత్మ ఐక్యత ఏనాడో అయ్యింది."
"మరి ఈ కోర్కెకు విలువ లేనప్పుడు?"
చిన్నగా నవ్వింది. "అర్ధభాగం లేని మీరు మీరుగా ఉండలేరు. ఈ సంయోగమే దానికి లయం అవుతుంది." తటాలున అనేసింది. అన్న తర్వాతనే శ్లేష అర్ధం అయింది. ఎంత అశ్లీలపు వాక్కు దొర్లింది! దుఃఖం ఉములుకుంది. అయినా తను ఇప్పుడు చేసేదికూడా ఏమీ లేదు.
"ఆలోచిస్తున్నారా? నేను స్త్రీని. నా సృష్టే చపలత్వం. అయినా ఇన్నాళ్ళూ ముఫ్ఫై రెండు వత్సరాలు, పసుపు కుంకుమల మధ్య కాట్లాడేను. నేను విధవనో, సధవనో కూడా లోకం నిర్ణయించలేకపోయింది. ఆఖరుకు నిత్యాగ్నిహోత్రిమావయ్య కూడా ఇదమిత్ధంగా తీర్పు చెప్పలేకపోయేడు.
"మిగిలింది నేను ఒక్కదాన్నే అయ్యేను. అత్తయ్య ఉన్నా లేనట్లు లెక్కే.
"ఈనాడు అంతర్గత వసంతమే, మళ్ళీ నన్ను వసంతాగమనానికి ఎదురు చూడమని ప్రోత్స హించింది. అది ఆశ. ఆ ఆశే నేను. ఈ కళేబరం మాత్రం కాలంకొరకు వయస్సు లెక్కపెట్టుకుంటోంది.
"మిగిలింది ఏమిటి? భావి, గతాలు ఈ క్షణంలో నాకు లేవు. ఒక్క చింతనం తప్ప. అది ఈ ఒక్క రాత్రే నా భర్తకు పాదదాసి అయితే, కట్టెకోర్కె, ఆత్మ అభిలాష కూడా తృప్తిపడి, రేపు లేదనుకుంటుంది.
"అదే ఆశయం.
