"ఆ! అవును అబ్బాయి పిలుపే." ప్రతి కణం ఎలుగెత్తి రక్తస్పర్శ లోని సామీప్యత అని పించేయి. పరుగే.
ఒక్క విననివాళ్ళల్లా అవధాని, దగ్గరగా కూర్చున్న వెంకటశాస్త్రి అయ్యేరు. వాళ్ళు సుందరకాండ అర్ధం, అంతరార్దాల్లో ములిగి పోయి, దొడ్లో బృందమ్మ వద్దనే ఉండిపోయేరు.
వీధి తలుపు భళ్ళున తెరిచింది పార్వతమ్మ. మరుగున ఉన్న లాంతరు, పడీపడని వెలుతురు.
"అమ్మా, నేను వచ్చేను" అనే కాళ్ళవద్ద కుదుటబడిపోయేడు. ముఖం తెరతీసినట్లయ్యింది. కంఠ ధ్వని మరిచిపోయినది జ్ఞాపకం అయ్యింది. క్షణికం కల్లోలితం అయినా, పాలు చేపొచ్చినట్లే అయి, కౌగలించుకుంది. అవ్యక్తంలో "రామం" అని హృదయానికి హత్తుకుంది. అది జన్మల అనుభూతి అన్నట్లే, మాతృత్వం పన్నీరైంది.
ఒక్కసారి గవద పైకెత్తి చూచింది.
"నాకు కితకితలే, అమ్మా?"
అదేవాక్కు అదే మురిపెం, అదే సిగ్గు తన చేతుల్లో. గుండెలు దూసుకుపోయేయి. కళ్ళు కడవలే అయ్యేయి. హృదయం బావురుమంది. వాచిపోయినట్లుగా గగ్గోలు.
"కాళ్ళు పట్టనా?"
భరించుకోలేని ఈ గత ప్రస్తుతాల ఆనకట్టల్లో ఉద్వేగం, కాలాగ్ని వెళ్ళక్రక్కే సత్యం.
"ఏమండోయ్! అబ్బాయి వచ్చేడు." పొలికేక పెట్టి "మాతండ్రే! ఎన్నాళ్ళకు?" అని కాళ్ళు జాపింది.
తిల తల్లీకొడుకులు ఉండగానే గోచీ జారిపోయిందన్న ఇంగితజ్ఞానం లేకుండానే అవధాని, వెనుక లాంతరులో వెంకటశాస్త్రి వచ్చేసేరు.
గుండెలు గుండెల్లో లేనట్లే కళ్ళప్పగించేడు అవధాని. ఇలాయిబుద్దే అయ్యేడు శాస్త్రి. తను తెలివి తప్పలేదు కదా? శరీరం గతులు తప్పిందా? దృష్టి మాంద్యం రాలేదుకదా? ఏమిటి ఎదురుగా చూస్తున్నది? వయస్సు వెనక్కు వెళ్ళి గతంలో పరితప్త అయ్యింది.
వాడే, వాడు ఎప్పుడూ ఇంతే. అమ్మమీద ఈగ వాలనివ్వని అభిమానం. తన్ను దూరంగా ఉంచిన గౌరవం. ఎంత గురుపీఠం ఆక్రమించినా తను ఆత్మీయుడు కాలేదు. కాలం స్థంభించి నట్లే తను ఉండిపోయేడు. అది కర్మలయంఅన్నట్లు ఆ క్షణంలో ఉంది. నిలిచేపోయింది కూడా.
"జగదంబకి సువర్ణ సింహాసనం చేయించేరా?"
ఉండీలు బద్దతో గురిచూచి కొట్టినట్లే అయితే డిల్లపోయేడు అవధాని. అదే ప్రశ్న ఇక భౌతికం కొద్ది రోజుల్లో మట్టిలో కలుస్తుందనగానే అడిగేడు.
"చేయించలేదు." అప్పుడు.
"వెంటనే చేయించండి, నాన్నారూ. అమ్మ పీఠంలేకుండా ఇరుగ్గా కూర్చున్నట్లు వుంటోందండీ."
వాడిలో కలిగిన పూర్వపుణ్య విశేషమో, లేక తన వంశానుగతమైన ఉత్క్రుష్టతో, పీఠం దగ్గర కూర్చున్నప్పుడల్లా అనేవాడు. ఏదో వ్యక్తితో మాట్లాడినట్లే మాట్లాడేవాడు. ఇవ్వాళ అమ్మకు దద్దోజనం నైవేద్యం అంటే, అది పెట్టి తీరవలసిందే. అదీ వాడు. అదె పోతలో సృష్టికర్త అన్నవతులోనే తనకు పునహ ఒకే ప్రశ్న.
చిత్తరువులా లేదన్నట్లు తలూపేడు.
"ఇన్నాళ్ళయినానా? ఎంత అపచారం! నేను వచ్చేను. రేపే కంసాలికి కవురు పెట్టండి."
వెంకటశాస్త్రికి అర్ధం కాలేదు. తల తిరిగింది. ఏమిటిది? ఎవరు? శాంతతో జరిగిన రాద్దాంతం ఉంది. ఆవిడ వ్యక్తీకరించిన అభిప్రాయం, చెరుపుకున్న బొట్టుకూడా తనలో ఇంకా చిగురాకులా ఉండి కెలుకుతున్నాయి. క్షోణాలకు తిరిలా ఉన్నాయి.
"అమ్మా,కోడలు పిల్ల ఏది?" రహస్యంతో సిగ్గు మిళితం అయ్యింది.
గుండెలు దూసుకున్నాయి అందరికి. అది విన్న శాంత లోపలే ఉండి తల గోడకు వేసి కొట్టుకుని "అమ్మా, ఆనాడే ఎందుకు నన్నుకూడా తీసుకు వెళ్ళలేక పోయేవు" అనే గగ్గోలులో ఏడ్చింది.
అవధాని ప్రవృత్తి, మనస్సు, కర్మకూడా క్షణికం ఒకటే ప్రశ్నలో కలిసిపోయేయి. ఆధ్యాత్మికం బలవత్తరం. అది ఉంది. దాని చైతన్యం వ్యక్తిచేసే కర్మమీద ఆధారపడి ఉంటుంది అన్న గాఢ నమ్మకం ఓవైపు, కర్మగతంలోది వైతరణిలాగే వెన్నంటుతున్న ప్రస్తుతంలో ప్రతిది నిమిత్తమాత్రం అన్న అవధానంలో కణకణాన్ని అదుపులో పెట్టుకుని నడిపించుకున్న కర్తవ్యం రెండోపెడ ఉదయాస్త మయాల్లా ఉంటే, ఏళ్లమధ్య కొలతలు వేసుకున్న శరీరం అది. ప్రబలం, అచంచలం అయిన ఉన్మత్తలో ఊగి, తేటతేరిన, బాట తనది. అదే ఇప్పుడు కూకటివ్రేళ్ళతో పెగలింపబడే టట్లు పెనుగాలిలో పరీక్షకు వచ్చినట్లయ్యింది.
'త్వమేవ శరణం మను' అని జీర్ణం అయి, అది వాతాపే అయిన శక్తిపరం కణకణం. అదే అహం బ్రహ్మాస్మి అనగలిగిన పవిత్రత. ప్రవహించే ఝరి.
ఈ క్షణికం అవి రెండూ కూడా స్తబ్ధత పొందినట్లే అయ్యేయి. ఈ అనుక్రమణికు తను సమాధానం చెప్పలేడు. ఇక మిగిలింది గృహాధిపతి అన్నట్లే "వాడు భోజనం చేసేడో, లేడో" అనేసేడు.
"ఎంత మతిమాలినదాన్ని!" జబ్బ పట్టుకునే లేవదీసుకు వెళ్ళింది. వెంకటశాస్త్రి, అవధాని ఉండిపోయేరు. శిష్యుడు ఊరుకోలేనట్లే "ఎవరండీ వారు?" అన్నాడు.
"మేం ఎరుగున్నవారు."
"చుట్టాలా?"
ఇక తట్టుకోలేక పోయేడు. "నీకు ఎల్లా చెపితే అర్ధం అవుతుంది, నాయనా?" అసహాయత వ్యక్తీకరించేడు అవధాని.
నాలిక్కరుచుకుని, తను అనవసర జోక్యం అయినట్లుగా "క్షమించండి" అన్నాడు శాస్త్రి. అవధానికి బాధ కలిగింది, కుర్రాడు అనవసరంగా వ్యాకులపడి, కుమిలింపు పొందుతున్నాడని. జాలి కలిగింది.
"శాస్త్రీ!"
చేతులు కట్టుకున్నాడు శాస్త్రి.
"మాజీవితాలకు-నాది, ఆవిడది, శాంతది-అతనిలోని చైతన్యానికి సన్నిహిత సంబంధం వుంది. అతను మా గోత్రికుడుకాదు. మా శాఖ కాదు. మా రక్తం పంచుకున్నవాడు కాడు. అయినా మాకు ఆత్మీయుడు. మావాడే." కంఠం రుగ్ధపోయింది.
చెదురుగా 'ఇదెక్కడ సంభవం' అన్న చూపులు బాగా ప్రస్ఫుటం అయ్యేయి.
"ఆ వ్యక్తిలో ఆధ్యాత్మికం సంబంధంగా ఇంకో వ్యక్తి చెలరేగుతాడు. అప్పుడు అతనికి సర్వస్వం అదే అయి, మ్రుక్కుకు తాడు పోసి నట్లు, పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. అటు వంటి సమయంలో మనలో వున్నవాడు కాడు. ఆ శరీరమే ఉండదు. కాని నడిపించే కళ్ళెం మాది."
'పిచ్చివాడేమో!' అన్న సంశయం రేకెత్తింది శాస్త్రికి.
"ఆ భావన, సంభూతి కూడా లోకం నమ్మదు. నమ్మలేదు. కాని, మేం నమ్మగలుగుతున్నాం. అది ప్రతి చిన్న విషయాన్ని మాలో ఈ శరీరానికి అనుభూతిని, నగ్నసత్యాన్ని ప్రదర్శిస్తూ వుంటుంది. నా ఒక్కనిలోనే కాదు, ఆవిడలోనూ, ఆఖరుకు శాంతలోనూ ఈ సంచలనం ఉద్విగ్నం అవుతోంది. అప్పుడు మేం మరిచిపోయినవి జ్ఞాపకం తెచ్చుకుంటాము. అందులో పునహ జన్మ పొంది, పాపులం అవుతాము. ఈ జ్ఞాపకాలు తల మునకగా మాలో ఇమిడి ఉండడంవల్లనే నీ దత్తతకు అవాంతరం జరిగింది, ఇది ఓవిధంగా దైవనిర్ణయమే అయితే ఆ దైవమే దాన్ని సరిదిద్దాలి."
"అయితే శాంతమ్మగారి....." ఆగిపోయేడు శాస్త్రి.
"అవును. ఆ జన్మల వాసనలో వ్యక్తి నా కొడుకు. రామం."
కెవ్వుమన్నాడు శాస్త్రి - ఈయన ఆ శక్తి పూజతోపాటు దెయ్యాల్ని, భూతాల్ని కూడా ఆవహింపజేసి, త్రిప్పుకుంటాడా అని. ఇదే నిజంలా తట్టింది. కళ్ళు అప్పగించి భయపడ్డాడు.
అవధాని జాలితోనే, అనునయంగానే భుజం తడుతూ "చూడు, శాస్త్రీ, పై గదిలో ప్రక్కా అవీ వెయ్యమ్మా" అనే పంపించేడు.
వంటింట్లో చప్పుడూ, కబుర్లూ వినీ వినపడనట్లు గోడలకు చెవులు. ఆ "కందిపొడెం రవ్వంత కల్పుకోరా." ఆవిడ ఆదేశింపు.
"శివయ్య పెద్దవాడై వుండాలే?"
"ఇద్దరు బిడ్డలు. ఒకటి కోడె. ఒకటి పెయ్య. వాళ్ళని మీ నాన్నగారు ప్రమధద్వయం అంటారు."
"మంచిపేర్లే."
"శాంతకి కట్టువంకీ చేయిద్దామనుకున్నాం?" అని ఆగేడు. ఆశ్చర్యంగా చూడనూ చూచేడు.
"ఏమిటి అల్లా చూస్తావు?" అంది పార్వతమ్మ.
"తర్వాత నాకు జ్వరం వచ్చింది. డోకులు. రెండు రోజులలో తగ్గిపోతుందని మామగారు ముహూర్తం కూడా పెట్టిపంపేరు. తర్వాత ఏం జరిగింది, అమ్మా?"
సత్యం వెనుక సత్యం. గతం నెమరు. క్రమ బద్ధపు బీజాలు. గ్రక్కున కన్నీళ్ళు తిరిగితే, చీరచెంగులో ముఖం దాచుకుంది.
"ఎందుకమ్మా ఏడుస్తావ్? కాని దానితర్వాత ఏం జరిగిందో ఎంతగా ఆలోచించినా జ్ఞాపకం రావటంలేదు. అదే విచిత్రంగా వుంది. రేపు అంబని అడగాలనుకుంటున్నాను."
బావురుమనలేని శాంత శోకంలో డెక్కు వినబడితేనే, అవధాని, అంగలు వేసుకుంటూనే వంటింట్లోకి వస్తూనే "రామచంద్రయ్యకు అప్పచెప్పేం. అక్కడ ఇన్నాళ్ళూ పెరిగేవు" అన్నాడు.
లౌక్యంలో ఆరితేరినట్లు ఆ సమాధానం తడితే "అల్లాగా!" అని సాగతీసి ఉత్తర ఔపోసనం పెట్టేడు. నిద్రనుండి మేల్కొన్నట్లు గానే తడితే, ప్రతిదీ ఏదో మార్పు పొందినట్లు, తనకు గుర్తుకు రానట్లు, వచ్చినా సంశయాకులంగానూ తట్టేయి.
సావిట్లోకి వచ్చేడు. పళ్ళెంలో పోకచెక్క ఉంది.
"అమ్మా, శాంత కన్పడదేం?" అనేసేడు
ఆ క్షణంలో తను జీవితం చాలు అన్నా 'చాలు' అన్నట్లే అర్పణ చెయ్యగలిగినంత ఆనందం మునక వేసింది శాంతలో. తృప్తీపడింది. ఆయనలో తన చోటు ఇన్నాళ్ళూ అస్పష్టంగా, ఆవేదనగానే ఉన్నది, షోడశాంకురం అయినట్లు ఉంటే, తను ధన్యురాలు అనీ అనుకుంది. మనస్సు క్షణికం ఊగింది ఆ పాదాల్ని పునహ ఓసారి కళ్ళకు అద్దుకోవాలని.
చురిక విసిరినట్లే 'ఆనాటి రూపం కాదు తనది' అన్న శరీరపు పర్యవేక్షణే అయితే, కుప్పకూలి పోయింది.
"వస్తుంది, నాయనా" అనేసేడు అవధాని, పార్వతమ్మ వైపు చూస్తూనూ. ఆవిడ తమాయించుకుంది తుని తగవన్నట్లు.
"మీరు లేరు. అప్పుడోసారి వచ్చేను. శాంతే ఆతిథ్యం ఇచ్చింది. వసారాలో జపం చేసేను. వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళకి వంగి నమస్కారం పెట్టింది. 'నాకంటే పెద్దవారు. తప్పుకదా' అన్నాను. 'నా భర్తకు నేను నమస్కరించడంలో తప్పేమీ లె'దంది." నిశ్చింతలో అంబ ఫోటో చూస్తూనే చెపుతున్నాడు.
అవధానికి కంగారు పట్టుకుంది- ఈ అనుక్రమణిక, సంపుటి ఎక్కడకు తరుముకు వెళ్ళు తున్నాయా అని. చూచాయగా అర్ధం అవుతూంది. ప్రస్తుతంలో తను, పార్వతమ్మ, చాటుగా శాంత వింటూవుండడం తప్ప వేరు శరణ్యం లేదు.
"శాంత నాకంటే పెద్దది. దానితో వివాహం నాకు జరిగింది. కాని, అది, అది..... మీకొడుకు రామంతో అయ్యింది. అతను జనవరి 16, 1934 నే చనిపోయేడు. అవునా, కాదా?"
"ఆత్మకు వయస్సేమిటి, నాయనా, జీవితాలకు మననాలుకాని?"
"అయితే మీరు అబద్ధం ఆడేరన్నమాట."
మాట్లాడలేదు అవధాని.
"మా అమ్మ నన్ను రుక్మిణిని పెళ్ళిచేసుకోరా అని చేతులో చెయ్యి వెయ్యమని, ఆ ఆఖరు ఘడియల్లో అడిగింది. ఉండబట్టలేక చెయ్యి ఎత్తే. కాని ఆ వాగ్ధానం సాగలేదు. ఎందుచేతనంటే అప్పటికి నాకు ఎవరో చెప్పేవారు-నీ భార్య సజీవి' అని......"
"అదంతా ఓ కలరా, నాయనా." పార్వతమ్మ అడ్డుకుంది.
"ఒక్కటి అడుగుతా. నేను ఆ రామచంద్రయ్య రక్తం పంచుకున్న బిడ్డని. కాని నాలో వున్నది ఆ పద్దెనిమిది ఏండ్లక్రితం చనిపోయిన రామం ఆత్మ! దీన్ని మీరు నమ్మి, నన్ను మీ కొడుగ్గా, శాంత తన భర్తగా స్వీకరించే ధైర్యం ఉందా? లోకం వెయ్యికాకుల్లా పొడుస్తే తట్టుకోగలరా? మీ ...... బలిపెట్టగలరా?" తడబడ్డాడు.
"అంబ ఇచ్చ ఎల్లావుంటే అల్లాగే జరుగుతుంది."
"నాకోసం ఈ వయస్సులో త్యాగం దేహీ అని అడగడం క్రూరత్వం. ధర్మం కూడాకాదు. పైగా ఈ రెండు స్వభావాలు ఉన్నాయన్న జ్ఞానం దాన్ని ఏమాత్రం సహించటం లేదు. అయినా ఒక్కటి. ఇక్కడ శాంతం, అక్కడ హాలాహలం! ఇదీ నేను. దీని ఆంతర్యం, జన్మల వాసన అనుకున్నా అది ఒట్టి మిథ్య అంటారు.
"అందువల్ల ఒక్క ఆశయంతో వచ్చే. మిమ్మల్ని చూడాలని. చూచేను. ఏవో ఏవో మననం అయ్యేయి. ఎందుకో సంతోషంగా వుంది. ఇక నేను......"
"వెళ్ళనివ్వను." పార్వతమ్మ గట్టిగానే అరిచింది.
"పిచ్చితల్లీ! నేను నీ కడుపున......."
"అది నా కనవసరం. ఈ కొసంత ప్రాణం ఉన్నంతకాలం, నన్ను వదిలి వెళ్ళనని ఒట్టెయ్యి. ఒట్టెయ్యరా, రామం." ఆవిడ ఉద్వేగం.
అవధానికి కళ్ళు తడయ్యేయి.
రాజు స్థంభించే పోయేడు.
"నువ్వన్నట్లుగా ఆ ఆత్మకే తల్లినిరా, నాయనా. అందుకే బ్రతికి ఉన్నా" అనేసింది.
"అలసిపోయావు వున్నావు. పండుకుందువుగాని రా" అంటూనే జబ్బ పట్టుకున్నాడు అవధాని. మెట్లూ ఎక్కించేడు. భుజంవరకూ దుప్పటీ కప్పి తను కన్నార్పకుండానే కావలి కాసేడు.
'రామస్కంధం..... చిద్రూపే పరదైవతా....' ఓంకారేశ్వరా.... తత్సర్వం శంకరోవతు .....లోంచి, 'ఓం'. అదే ఆద్యంతాల శబ్దం అయ్యితన్ను, ప్రపంచాన్ని, లోకాన్ని, కాలాన్ని, అన్నిటినీ లయం చేసుకున్న, రామంస్వరంలో కలిసిపోయింది.
శుక్రుడే సాక్ష్యం.
* * *
