"దానికే భిక్షాం దేహి అంటున్నా. దాన్ని కాదనకండి. ఈనాడు యుగవిరుద్ధంగా దగ్ధం అయ్యేనేను. నాతో మీరున్నూ మాత్రం ఉండి పోయేం. తప్పు ఒప్పు, హెచ్చు తగ్గు, ఔచిత్యం అనౌచిత్యం అవిలేవు. మీరు, నేను, లేనిస్థితిలో ఉన్నాము. శూన్యం అనుకోండి.
"ఆ అంబే నన్ను త్రోసిందేమో!" కాళ్ళ మీదనే వ్రాలింది. కన్నీళ్ళు పాదాల్ని తడుపు తున్నాయి. తన శరీరం మండి, బుగ్గి అనలేక, ఉరిలో కొట్టుకుంటున్నా, స్పృహతప్పలేని జన్మ జ్ఞాపకం తెప్పిస్తూనే ఉంది.
జీవిత చరిత్ర. నగ్నసత్యం - శాంతది. తను నిమిత్త మాత్రుడే అయినా, కర్తవ్యశూన్యం కన్పడి చికాకు పెట్టింది. అచేతనంగానే, జబ్బలు పట్టుకుని లేవనెత్తేడు.
గుండెలకు తల ఆన్చుకుని దుఃఖిస్తూంది. ప్రతికణం పరితప్తం అయి తన్ను ములుకుల్లా పాడుస్తూంది. 'దీనికంతకూ నువ్వే కారణం. నీమూలాన్నే ఈ బలిజరిగింది. సృష్టి సత్యం మ్రింగ లేని గరళం. అది మ్రింగలేక క్రక్కేవు. ఇప్పుడు అనుభవించు'-అన్న ఎలుగే. ఎంత అభాజనపు బ్రతుకు తనది! కళ్ళమ్మట నీళ్ళు తిరిగేయి.
ఆ ఈషణ్మాత్రపు జాలి దొరికిందికదా అని దిగంతాలు ప్రతిధ్వనించే ఆనందంలోనే శాంత మైమరిచిపోయింది. కాలిన కాలం అంతా లేదన్నట్లు నవ ఓషధీ పూరితం అయి-
"ఎందుకు కన్నీళ్లు పెడతారు?" అని గవద పైకెత్తి చీరచెంగుతో తుడిచి కళ్ళల్లో కళ్ళు కలిపింది. గిలిగింతలు రేగే స్త్రీ శక్తి అది.
"వంకీ బాగుందా? పువ్వులు సరిదిద్దరూ? ఎల్లా వుండగల్గేరు నేను లేకుండా? ఎంతగా చిక్కిపోయేరు! ఇన్నాళ్ళనుండీ మిమ్మల్ని ఇక్కడే దాచుకున్నా అక్కడే పూజించే.
"ఇక నన్ను వదిలి వెళ్ళనని వాగ్ధానం చేస్తారు కదూ?
"రేపు నేను మీకు భోజనం వడ్డిస్తా. అన్నీనూ.
"చంద్రుణ్ణి చూచేరా? శుక్రుడు ఉదయిస్తున్నాడు......" ఆ వరసలో తను లేనట్లే ఉన్మత్త అయ్యింది. తనచే సవరింపచేయించింది. ఏదో ఓ శక్తి పరంగానే తను లోబడిపోయి, భ్రుత్య భావం క్రమ్మినట్లే. అజ్ఞానం. తెలుసుకున్న సత్యం ప్రబలమైనతట్టడి. కట్టెలు ఆగలేని రుధిరహోమం.
పిట్టగోడ చేమంతుల దగ్గరినుండే, నడుంమీద చెయ్యివేసి నడిపించింది. శరీరం ప్రక్కగా అగ్నిహోత్రంలా కాలుస్తూంది. రెచ్చబడిన ఆజ్యం ఆహుతి కోరుకుంటున్న లోతు.
"ప్రభూ!" ఆవిడ శరీరంలో వంపులు తనకు హత్తుకుని, ఎరుపెక్కిన కళ్ళలో వాంఛ.
"రాండి." లాక్కునే వెళ్ళుతూంది.
కర్మ! ఇది యింత ప్రబలంగా తన్ను లాక్కెళ్ళుతూనే ఉంది. యమపాశం, యమ ఘంటికానధాలు చెవుల్లో మ్రోగినట్లే, శిల అయ్యేడు. ఏమిటి ఈ పతనం? తన ఉన్నతి, ఇంతకాలం నిల్పుకుని మ్రింగిన ఔన్నత్యం కూడా, ఓ స్త్రీ చేతుల్లో, శలభంలా అయిపోతున్నాయి. పతనం జరగడానికి నాంది అయ్యింది.
'ఎందుకు జరుగుతోంది, అంబా!' ఒక్కటే నరనరాల కణకణాల ఎలుగు. ఉరుకులో వెళ్ళి ఆవిడ పాదాలమీద పడాలన్న ఆయత్తతే. కాని శాంత చేతులు ఇనపకచ్చడాలు అయ్యేయి.
తను దిగజారిపోయి, నైతికపతనం చెందలేడు. ఏ శక్తి అయితే తనకు ఇక్కడ ఈ సమాజానికి నాంది అయ్యిందో అదే నవనాడుల్నీ బిగించి, లాక్కొని వెళ్ళడానికి సిద్ధమవుతూంది. తను తనుగాలేని వెయ్యేనుగుల బలం వచ్చినట్లే....
ఆలింగనపు సంధానంలోనే రెచ్చిపోయిన శాంత శరీరపు విజ్రుంభణే.
ఒక్క ఊపులో రెండు చేతులతోనే, విసురుగా త్రోసి .... "శాంతా, అది ఈ జన్మలో కాదు...." అనే పరుగెత్తేడు. మెట్లు దిగబోయి జారేడు. తలకు మాత్రం గాయంతోనే ఆఖరు మెట్టు చేరేడు. వీధి తలుపు తీసుకుని బయటకే పరుగెత్తేడు - ఎవరో లాగుకుని, పాశం వేసినట్లే.
రావిచెట్టు చేరేసరికి ఆయాసం వచ్చింది. నరాలు స్వాధీనం తప్పినట్లే. పాడుపడిన నూయిలో కప్పలు. ఝయ్యిమన్న భీకరశబ్దంలోంచి తను నవ్వులు విన్నట్లే. గుబురులో చీకటి వెలుగులు.
చెట్టుకు ఆనుకునే ముఖం తుడుచుకున్నాడు. చెయ్యంతా రక్తం. నవ్వు వచ్చింది. తన హోమం పూర్తి కాలేదన్నట్లే అభిషేకమే అయ్యింది. నైవేద్యం ఏది అన్న ప్రశ్నే.
చుట్టూరా చూచేడు. శుక్రుడే మెరసిన వాతావరణంలో రంగు. ఎర్ర సింధూరపు ఛాయలూ. 'కొన్నాళ్ళు మేమూ ఆ ఎరుపును పొగుడుకున్నాం' అన్నట్లు పుర్రెలు. కర్మల ఫలితం అన్న బొమికలు, ఎండి నుసి అవలేక. కాకములు మార్గదర్శికలు అన్న విసిరిన మిగుళ్ళు.
బొమ్మ చెముడు డొంకల్లో దాగుకున్న మిణుగురు పురుగులు. ఆరిపోలేని చితాగ్నులమధ్య కాపలాగా గొంతారని కీచురాళ్ళు. తన ప్రక్కనుండి నడిచివెళ్ళిన అనుభూతి.
తనది ఆ దశ కాదు. ఆ వ్యక్తిత్వం కాదు. కాలేదు అన్న ధీమాయే. నెమ్మదిగా అడుగులు వేసేడు. అదే సమాధి. అదే తులసికోట. అదే ప్రకృతి. అవే నిలిచిపోయేయి భౌతికంగా అన్నట్లే.
కొన్ని క్షణాలు కాదు, ఘంటలే అక్కడ ఓనాడు అలసట తీర్చుకున్నాడు. పునహ అదే స్థలానికి, దాని బలమేమిటో తెలియవన్నట్లు, తన్ను విధి తీసుకువచ్చింది. తను ఉన్నా లేడు. లేకున్నా ఉన్నాడు. ఇదే తీర్పు.
తెలియనట్లే ప్రదక్షిణం చేసేడు. చితి మీద భస్మమే తెచ్చి, అమరం, సర్వేశ్వకరీ అన్నట్లే పూజ చేసేడు. రెండు తులసిదళాలు పెట్టేడు.
అంతే. బ్రహ్మాండం బద్దలైనట్లు చీకటే క్రమ్మింది. అందులో దూరంగా, దూర దూరంగా చిన్నజ్యోతి. అది రెపరెపలాడింది. తన కళ్ళు మూతలుపడ్డాయి. శరీరం చైతన్యం తప్పింది. శ్వాస .... అది బిగుసుకేపోయింది. 'ఓం!' అదే ప్రజ్వరిల్లింది.
భళ్ళున అటు తొలి రేఖలు కన్పడడం, ఇటు బ్రహ్మరంధ్రం ఫట్ న విడి, కట్టె కుప్పే అవడం జరిగింది - జన్మల క్రమం, విముక్తి, కర్మసంచయం అన్న ఆధ్యాత్మిక భావాలమధ్య ఉన్న ప్రపంచంలో.
రావిచెట్టు మాత్రం ఓరుగాలి వీచినట్లు ఊగిపోయి రొదపెట్టింది. అది ప్రకృతి పిలుపు. లాలింపు. కన్నీళ్లు అన్నట్లు. గూడ కట్టుకున్న పిట్టలన్నీ లేచి, దిక్కులకు వార్త సందిస్తాం అన్నాయి.
శ్మశానం, శ్మశానమే అయ్యింది. ఓ ప్రకృతి ప్రశాంతం. విచక్షణలేని ఔన్నత్యానికి నేను రహదారీ అన్నట్లే.
ఊరిజనం అంతా ఝాము ప్రొద్దెక్కేటప్పటికి ప్రోగడింది. అది తీర్ధమే.
ఇక మిగిలింది పార్వతమ్మా, అవధానీ. కన్నీళ్లు ఎండిన ప్రాలుబ్ధం తమకు తీరలేదు. చక్షువుల చూపు పోలేదు.
అచేతనంగా చితి అంటించేడు అవధాని. అదే తనకు తెలియని అభ్యాగతి. తను ఏడ్చి, మొత్తుకోలేని భౌతికం. తను తండ్రి కాని తండ్రి. ఒక్కసారి యుగాల సంధి కలయిక అన్నట్లే, ధర్మ సంస్థాపనన్నట్లే, ననుస్కరించి కట్టెను ఇంట్లోకి చేరేసేడు.
'ఏమిటిది?' అన్న ఆవేదనే. అజ్ఞానమే. అందులోనే వచ్చి గడపవద్ద ఆగిపోయేడు. తలనేలకువేసి కొట్టుకుని, చైతన్యం తప్పిన శాంత అమ్మ పాదాల దగ్గరనే ఉంది.
ఒక్క అంగలో వెళ్ళేడు. ఎందుకో అన్నట్లే చెయ్యి చూచేడు. కలువకాడల్లా ఉంది. శరీరం గడ్డకట్టుకుంది. శాంత లేదు. అదిన్నీ ... అదిన్నీ ...
'ఇవేనా మానవ జీవితాలు' అనుకున్న ఆలోకపు ఆజ్యంలోనే, వీధి గదిలో ఉన్న పార్వతమ్మ వద్దకు వచ్చి -
"దైవేచ్చ" అంటూ కుప్పకూలి, దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడ్చేడు.
ముఖం జేవురించి, దుఃఖంలేని అనునయంలో "మనం మిగిలేం" అనే పాదాలమీద తల పెట్టి ఏడ్చింది పార్వతమ్మ.
22
అదే రావిచెట్టు. అదే పాడుపడిన నుయ్యి. అదే శ్మశానం. అందులో ఒకదాని ప్రక్క ఒకటిగా మూడు సమాధులు ఈనాటికీ ఉన్నాయి. ఊరూ పేరూ ఉంది. సగంపైగా జనాభా పెరిగింది. పార్టీల ప్రభావం అన్నట్లుగా జెండాలు పెరిగేయి.
కాని ఎప్పుడేనా, ఎవరేనా, ఒంటరిగా వెళ్ళినప్పుడుమాత్రం, ఎక్కడనుండో, ఎవరో, అతి బాధతో, ఆవేశంతో, ఏదో అడిగినట్లు ...
అది నిర్ణీతం కాకపోయినా క్షణికం తాదాత్మ్యతలో "నువ్వెవరవు? ఎక్కడికి ఈ ప్రయాణం" అన్నట్లు సంభూతి కలుగుతుంది.
భయంలో, పారిపోతారు ఈనాటికీ.
సమాధానం చెప్పలేరు. చెప్పుతారేమో అన్న ప్రకృతి దిగులు.
కాని ఈనాటికీ అక్కడ ఓంకారం ప్రజ్వరిల్లుతూనే ఉంటుందంటారు. రోజూ ఓ స్త్రీ ఆ మూడు సమాధుల మీద తుమ్మపువ్వులు పెట్టి ఈనాటికీ వస్తూంది. పేరు మాల మాత్రం అని అంటుంది. అదీ కథ.
సర్వం శివోహం.
:-సమాప్తం:-
