Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 30

           

                             
                                    43

    అరుణ కు అన్ని ప్రదేశాలూ తెలుసు. ముందు తేనాం పేట వెళ్ళింది. అక్కణ్ణించి సైదా పేట వెళ్ళింది. అక్కడా రఘు అగుపడక పోయేసరికి వెనక్కి తిరిగి లేక్ ఏరియా ప్రాంతాల్లోకి వచ్చింది.
    పేదవారి పిల్లలకు కార్ ని చూస్తె అదొక ముచ్చట. అదొక ఆనందం. దాని వెంట పరుగు లెత్తడం ఒక అట. అందులోనూ బెంజ్ అది. దాని వెంట పడ్డారు. "కార్ కార్ " అంటూ కేరింతాలు కొట్టారు. కారు రఘు నడుపుతూన్న ఎలిమెంటరీ స్కూల్ ముందు ఆగింది. రఘు ఫియట్ కారూ అక్కడే ఉంది. ఆ కారులోపలా......టాప్ మీదా ఓ పదిహేను మంది పిల్లలున్నారు. బ్యాటరీ బాగా వీక్ అయి ఉండడం మూలాన్ని కుర్రాళ్ళ ఉత్సాహానికి తగినంత బిగ్గరగా అది మోగడం లేదు. నలుగు గయిదుగురు పెద్దవారూ పోగయ్యారు అరుణ కారు చుట్టూ.
    "ఆడేయ్......ఆడేయ్.....పొంగోడా పారికి పసంగళా!' అంటూ అరుణ కారు చుట్టూ ఉన్న పిల్లల్ని పారద్రోలి "ఎన్నామ్మా......యార్ వేణుం?' అన్నారు అరుణతో.
    "రఘుపతి యార్........"
    "అడ, నమ్మ చిన్నన్నడా........" ఈలోగా రఘు రానే వచ్చాడు.
    "నమస్కారమండీ యువరాజావారూ........"
    అందరి పేదల ఎదురుగా అరుణ తననలా పిలవడం వల్ల రఘుకు చచ్చినంత సిగ్గు వేసింది. అయినా యేమన గలడు? అరుణ వచ్చింది ఇంటి దగ్గిర నించే! తానింటి కి వెళ్లి ఎన్నాళ్ళ యిందీ? ఏమనాలో తెలియక అర్ధం లేని చిరునవ్వు నవ్వాడు అరుణ ను చూస్తూ.
    "ఇంటి మొహం చూసి, ఎన్నాళ్ళయింది?"
    "ఆ.....లేదు ఆరూ......అది కాదు ఆరూ.......కారులో పెట్రోలయిపోయింది."
    "జేమ్స్ , ఆ కారును టో చేసుకుని వెళదాం. ఏర్పాటు చెయ్యి!" అంది అరుణ, మెర్సిడేజ్ డ్రైవర్ తో. వాడా పనిలో నిమగ్నుడై పోయాడు.
    "ఏమండీ పంతులమ్మ గారూ, మీ ఊరేలా ఉంది? మీ ఉద్యోగమేలా ఉంది?"
    "నాలాగానే ఉన్నాయి అన్నీ!"
    "గ్రేట్ ! నీవు బ్రహ్మాండంగా ఉన్నావు! అయినా ....నీవంత దూరంలో ఉండి ఉద్యోగం చెయ్యడం నా కిష్టం లేదు ఆరూ. అయినా.....తప్పదు లే ఇప్పుడప్పుడే . మరో రెండు మూడేళ్ళాగు. దీన్ని బ్రహ్మాండమైన ఉన్నత పాఠశాల గా చేస్తా. అప్పుడు ప్రదానో పాద్యాయినివిగా ఇక్కడే ఉండి పోవచ్చు."
    "అలాగే."
    "రెడీ అమ్మా. పోలామా?"
    "ఆ? పోలాం. రఘూ . కారెక్కు!"
    రఘు వెళ్లి ఫియేట్ లో స్టీరింగు వద్ద కూర్చున్నాడు. అరుణ వెళ్లి, అతని పక్కనే కూర్చుంది. పెద్ద కారు చిన్న కారుని లాక్కు వేడుతూండడం కూడా చాలా ఆనంద దాయకమైన విషయం గానే ఉంది అక్కడి పిల్లలకు. రెండు కార్లూ మెయిన్ రోడ్ ఎక్కి , స్పీడు అందుకునే దాకా నానా గోలా చేస్తూ వాటి వెంటనే పరుగు దీశారు అందరూ. కారులో --
    "ఏమిటిదంతా?' అంది అరుణ.
    "మనసేమీ బాగుండడం లేదు ఆరూ!"
    "బాగుండనప్పుడు నిన్నేం చెయ్యమన్నాను?"
    "అంతదూరం రావడానికి పెట్రోలుకు డబ్బులు లేవుమాన్! జీతం డబ్బులు పదో తేదీకే ఆఖరయ్యాయి. ఏం చెయ్యమంటావు?"
    "అందుకనే పెద్దలు "తనకు మాలిన ధర్మం చెయ్యరాదు" అన్నారు"
    రఘు మరి మాట్లాడలేదు. అరుణ కెందుకో అపుకోలేనంతటి ఆవేశం వచ్చింది!
    "ఓ....రఘూ , జీవితంలో ఏం సాధించాలని నీవీ తపస్సు చేస్తున్నావు?" -- అంటూ అతని భుజాల మీద వాలిపోయింది.
    ఆ స్థితిలోనే ఆ ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.
    ఆ ఆదివారం సేతుపతి గారి సంసారానికి ఒక ఉగాది పండుగ వంటి దయింది. అందరూ కలిసి భోం చేశారు; తాంబూలాలు వేసుకున్నారు; కలిసి ఆదుకున్నారు; ముచ్చట్లాడుకున్నారు; సినిమా చూశారు ; బీచికి వెళ్ళారు. మధ్య మధ్య ని వీలు చిక్కినప్పుడల్లా అరుణ రఘుకు ఉపదేశిస్తూనే ఉంది.
    అరుణ మళ్ళీ ప్రయాణ మయింది. స్టేషన్ దాకా రఘూ కూడా వెళ్ళాడు. రైలు కదల బోతుంది.
    "నీ మనసు బాగోలేక పొతే...."
    "నీ దగ్గిరికి వచ్చేస్తా!"
    "రోజూ రెండు పూటలూ...."
    "తిండి అమ్మ చేతులారా తింటా!"
    "చూస్తానుగా? మళ్ళీ ఆదివారం ఎంత సేపు వస్తుంది!' రైలు కదిలింది.
    స్టేషన్ నించి రఘు సరాసరి ఇంటికే వచ్చాడు. అతని రాకను సేతుపతి గమనించారు. చాముండేశ్వరి చూచింది. కొడుకు గదిని చేరుకునే లోగానే ఆమె రఘు కోసం హార్లిక్స్ కలిపి తీసుకు వెళ్ళింది.
    "నా బాబే ....నా తండ్రే ....." అంది చాముండే శ్వరి రఘు తల నిమురుతూ. మాట్లాడకుండా రఘు హార్లిక్స్ తాగాడు. పడుకున్నాడు. లైట్ అర్పి చాముండేశ్వరి తృప్తిగా వెళ్ళిపోయింది.
    నిమిషాలు గడిచి పోతున్నాయి. పెద్ద మంచం ; అంత పెద్ద డన్ లో పిల్లో పరుపు, నాలుగయిదు దిళ్ళు ; దోమ తెర ; పైన తిరుగుతున్న ఫాన్. రఘు కళ్ళలో మాత్రం, సుందరం గుడిసె....ఓబులేసు కొట్టాయి.......మరొకడి పాక.......మెదులుతున్నాయి. ఒక చింకి చాప......దాని మీద నలుగురు పిల్లలు.....ఆ అందరికీ కలిసి ఒకటే దుప్పటి.....తల్లీ , తండ్రీ , ఏ చినిగి పోయిన పంచెనో, చీరనో పరుచుకొని అటు వైపు ...ఇక, చీమ దూరడానికి కూడా చోటుండదు ఆ కొట్టాయి లో ....తలలు కింద దిళ్ళు కాదు! ఎత్తుకు ఇటక రాళ్ళు "ఛీ ఛీ" అనుకున్నాడు రఘు. లేచి వెళ్ళిపోయాడు.
    వారం లోని ఆరు రోజులు అసంతృప్తి కరంగా గడిచినా అరుణ పుణ్యమా అంటూ, అడివారాలూ మాత్రం పర్వదినాల్లు గడిచి పోతున్నాయి సేతుపతి గారి ఇంట. రానూ రానూ......ఆదివారం వస్తుందంటే , శనివారం నుంచీ కూడా రఘు ఇంటినే అంటి పెట్టుకుని ఉండేవాడు. అలా ఎన్నో వారాలు గడిచి పోయినాయి.

                                     44    
    మానవుల జీవితాల్లో వారి వారి అదృష్టం కొద్దీ ఎన్ని శుభాలు సమకూర గలవో, వారి వారి ప్రారభ్డానుసారం అన్ని అశుభాలు కూడా ప్రాప్తించగలవు. అరుణ ఓక ఆదివారం నాటి రాత్రి వెళ్ళిపోయింది. సోమవారం మామూలుగానే గడిచింది. మంగళ వారం నాడు జరిగింది గొడవ.
    ఫ్యాక్టరీ లో ఏదో కొత్త మిషినరీ స్థాపించాలన్న ఉద్దేశంతో బెకో స్లావేకియా నించి కొంత యంత్ర సామాగ్రి తెప్పించారు. అందులో ఒక యంత్రాన్ని మెకానికల్ ట్రాలీ మీద వేసుకుని ఆవరణ లోంచి ఆ సెక్షన్ లోకి తీసుకు వెళుతున్నారు. ట్రాలీ నడిపే వాడు గాక, మరో పదిమంది పన్నెండు మంది దాని వెంట నడుస్తున్నారు. ఓబులేసు ట్రాలీ మీద నిలుచున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS