Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 31


    వణుకుతున్న అతని కంఠం లోంచి వచ్చిన ఆ మాటలు ఆమెను పూర్తిగా కదిలించాయి. పెనుగాలికి ఊగిపోయే లతలా అతను ఆమెకు ఆ క్షణం లో గోచరించాడు. ఎంత సున్నిత హృదయుడు? అందమైన ఆ పురుషాకారం వెనక అంతటి స్త్రీ ప్రక్ర్రుతి ని భగవంతుడు ఎందుకు కల్పించాడో ఆమెకు అర్ధం కాలేదు.
    కాస్సేపు సమయం దుర్భరంగా గడిచింది. రవిచంద్ర నెమ్మదిగా తల ఎత్తి ప్రియంవద ను చూశాడు.
    స్పటికం లా ఆమె మెరుస్తున్నది. కాంతివంతమైన ఆమె కళ్ళు తదేకంగా తనను పరీక్షిస్తున్నాయి. ఆ కళ్ళల్లో మాటల్లో చెప్పబడని కరుణ తనపట్ల ఉన్నట్లుగా గోచరించింది.
    ఆ వదనంలో మెరుస్తున్న చిరునవ్వు వెనక తనంటే అంతులేని ప్రేమ, జాలి సానుభూతి ఉన్నట్లుగా అతని కనిపించింది. ఆ స్త్రీ మూర్తి తన జీవితపు ఎడారి లో ఒయాసిస్సు లా కనిపించింది.
    "రవిచంద్ర గారూ!" మృదువుగా ధ్వనించింది ఆమె కంఠం.
    "మీరు చాలా సున్నిత హృదయులు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో , మాటలతో మీ ఆవేదనను ఎలా తీసెయ్యాలో మాకు తోచడం లేదు. మీరు ఇవన్నీ కొన్నాళ్ళు మరిచి పోలేరూ?హాయిగా, సుఖంగా జీవితాన్ని గడప లేరూ? మీకు అన్నీ ఉన్నాయి. అవకాశమూ ఉంది. ఎందుకు మీరు వినియోగించు కోరు?"
    అతని కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. "మీరు నాకేమవుతారు? చెప్పండి, నేనంటే మీకెందు కంత అభిమానం?"    
    ఆ ప్రశ్న ఆమెకు నవ్వు తెప్పించింది. సన్నగా నవ్వుతూ "ఆప్తులు" అంది.
    'అంటే?" పిచ్చిగా అడిగాడు.
    "అంటే.....అంటే నేను చెప్పలేను. కాని మీరు బాధపడుతుంటే మాకు బాధ కలుగుతున్నది. మీకు నిరుత్సాహంగా ఉంటె మాకు నిరుత్సాహంగా ఉంది. మీకు సుఖం ఉంటె మాకు ఏమిటో హాయిగా ఉన్నట్ల నిపిస్తుంది. మాటల్లో నిర్వచించలేనిది మన బంధం."
    అతని కళ్ళలో మెరుపు కొట్ట వచ్చినట్లు కనపడింది. గభాల్న ఆమె దగ్గిరికి వచ్చి ఆమె రెండు చేతులను తన ఫాల భాగానికి ఆనించుకొని , "మీరెంత మంచివారు? నాపట్ల మీకెందు కింత జాలి?' అన్నాడు.
    అ క్షణం లో ఆమెకు అతను పూర్తిగా పసి పిల్లాడిలా అనిపించాడు. స్త్రీ సహజమైన మాతృత్వం ఆమెలో పొంగులు వారింది. మృదువుగా అతణ్ణి నిమురుతూ "మీరు బాధపడద్దు..రవీ.... బాధపడితే నామీద ఒట్టే" అంది.

                            *    *    *    *
    మరుసటి రోజు ఉదయం రవిచంద్ర లేచేసరికి రాజగోపాలం ఇంట్లో లేడు    ముఖం కడుక్కున తరవాత కాఫీ ఇస్తూ ప్రియ చెప్పింది, అతనెక్కడి కో ఊరికి వెళ్ళిన సంగతి.
    కాలకృత్యాలు తీర్చుకున్న తరవాత రవిచంద్ర పేపరు పట్టుకొని డ్రాయింగు రూం లో కాస్సేపు కూర్చున్నాడు. కాని, అతనికకి పేపరు చదవ బుద్దవ లేదు.
    ప్రియంవద కాస్సేపు అక్కడే కూర్చుంది.
    "ఏమిటీ పేపరు విశేషాలు" అంది ప్రియ.
    రవి కాస్సేపు పరధ్యానంగా చూసి, "ఏం లే" దన్నట్లుగా తల ఊపాడు.
    "అదేమిటి, పది పేజీల పేపరు నిండా విశేషాలు ఉంటె, మీరు ఏం లేవంటారేం?' ప్రియ నవ్వుతూ అంది.
    అతను తెచ్చి పెట్టుకున్న నవ్వుతో "చదవలేదు" అన్నాడు.
    "అదీ సంగతి!" అంది ప్రియ చురుగ్గా అతణ్ణి చూస్తూ.
    "రాజగోపాలం గారు ఎప్పుడొస్తారు?' అన్నాడు రవి కాస్సేపాగి.
    "రాత్రికి కొంచెం పొద్దు పోతుందని కూడా చెప్పారు" అంది ప్రియ.
    అతను టీపాయ్ మీద ఉంచిన పేపరు తీసుకొని అందులోకి చూస్తూ , ":నే నివ్వాళ క్వార్టర్స్ కు వెళ్ళిపోతాను" అన్నాడు సాలోచనగా.
    "అదేమిటి? ఇక్కడ బాగాలేదా?" కంగారుగా అడిగింది ప్రియ.
    'అదేం లేదు....నాకేండుకనో అక్కడికి వెళ్లాలని పిస్తున్నది.
    అ జవాబు ఆమెను ఇంకేం మాట్లాడ నివ్వలేదు. రవి ముఖంలోకి చూస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నించింది కాని, నిరాశా మూర్తి లా మారిపోయిన అతని వాలకం గొంతులోకి వచ్చి అడ్డుకున్నట్లయి క్షణకాలం నిశ్శబ్దంగా ఉంచింది.
    సమయం బరువుగా గడవసాగింది. చాలాసేపటి దాకా ఎవరూ మాట్లాడుకోలేదు. అలా చాలాసేపు గడిచిన తరవాత వణుకుతున్న కంఠం తో రవి" నా కిక్కడ ఉండ బుద్ది అవటం లేదు" అని అన్నాడు.
    విస్తుపోయి ప్రియ , 'అంటే మా ఇంట్లోనా?' అంది.
    "ఎబ్బే , మీ ఇంట్లో కాదు, ఈ ఊళ్ళో."
    ప్రియ విననట్లు తల వంచుకుంది.
    అతను ఆశక్తుడయినట్లుగా లేచి కిటికీ దగ్గిరికి వెళ్లి "ఈ పరిసరాల జ్ఞాపకాలు నన్ను భయంకరంగా వెన్నాడు తున్నాయి. ఎక్కడికో దూరంగా నన్ను నేను మరిచి పోయేంతగా మార్చే చోటికి వెళ్లాలని పిస్తున్నది" అన్నాడు.
    "అయితే మేము మిమ్మల్ని బోర్ చేస్తున్నామన్న మాట!" అతని మాటలకు తేలికతనపు చాయను ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఆమె గడుసుగా నవ్వింది. కాని ఆమె మాటల్లోని హాస్యం అతను పట్టించుకునే స్థితిలో లేడు.
    "నేనెందుకనో దురదృష్ట వంతుణ్ణి అని అనిపిస్తున్నది. నావలన నా గాలి సోకితేనే అందరు దురదృష్ట వంతులుగా మారేటట్లున్నారు. మీలాంటి వారికి ఆ ప్రమాదం రావడం నా కిష్టం లేదు" తల నెమ్మదిగా ఆమె వైపు తిప్పి పేలవంగా నవ్వుతూ అన్నాడు.
    "బాధపడటం మీ హబీలా ఉంది. కాస్సేపు ఈ ఆలోచనలను వదిలి పెట్టి ప్రశాంతంగా ఉండలేరూ?"తెచ్చి పెట్టుకున్న కోపంతో కోపంలో చనువును రంగరిస్తూ అమెప్రశ్నించింది.
    "బాధపడటం నా హాబీ కాదు. నా జీవితం అయింది. ఎలా మరిచి పోగలను? ఎలా ఆలోచించ కుండా ఉండగలను? నా జరిగిపోయిన జీవుతానికి ఎలా దూరంగా ఉండగలను?"
    'అది జరిగిపోయింది కాబట్టి మీరు దూరంగా ఉండాలి తప్పదు. మన చేతుల్లో ఏమీ లేదు. అంతా భగవంతుడి ఇష్టం. మనదేముంది?" ఏ విధంగా అతనితో సంభాషించాలో తెలియక పోవటం వల్ల ఓదార్పు గా ఏదో ప్రియ అనేసింది.
    మళ్ళీ చాలాసేపటి దాకా నిశ్శబ్దం.
    రవిచంద్ర ఆవేశంతో "నాకీ జీవితం విసుగెత్తింది. నాకేదో మార్పు....నాలో ఏదో మార్పు కలగాలనిపిస్తుంది. ఆ మార్పు ఇలాంటిదని చెప్పెలేకుండా ఉన్నాను. ప్రశాంతత నాకు కలిగితే బాగు. కాని నాకు లభ్యమవుతుంది, దుస్వప్నాల్లా జరిగిపోయిన సంఘటనలు నన్ను వెన్నాడుతుంటే ?" అరిచినట్లుగా మాట్లాడాడు.
    ఆశ్చర్యంగా జేవురించిన అతణ్ణి చూసింది ప్రియ.

                          *    *    *    *
    సాయంకాలం ఆరు గంటలకు రవిచంద్ర క్వార్టర్స్ కి తిరిగి వచ్చేశాడు. అప్పుడప్పుడే చీకటి ఛాయలు అలుము కుంటున్నాయి. గార్డెను మధ్యలోని ఆ బంగళా బోసి కొడుతున్నది. నిర్మానుష్యంగా ఉన్నట్లు కనబడుతున్న ఆ ప్రదేశం విచారానికి ఉద్దీపకంగా ఉన్నట్లు ఒంటరితనంతో బాధపడుతున్నదా అనే భావం కలిగేటట్లు ఉన్నది.
    నెమ్మదిగా లోనికి నడిచాడు రవిచంద్ర.
    వంటవాడితో బంట్రోతు ఏదో చెబుతున్నాడు. అతణ్ణి చూసి గభాల్న సంభాషణ ఆపుచేసి, వినయంగా నమస్కరించి, తల వంచుకున్నాడు.
    నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లి సోఫాలో జరగిలబడ్డాడు రవిచంద్ర.
    బంట్రోతు చీకట్లో తడుముకుంటూ వచ్చి లైటు వేశాడు.
    "లైటార్పేసేయ్" అన్నాడు విసుగ్గా రవి.
    "చీకటి....." ఏదో నసుగుతూ చెప్పబోయాడు.
    "నాకు చీకటే బాగుంది. లైటు తీసెయ్!" అన్నాడు.
    అతడు సున్నితంగా , ఎక్కువ శబ్దం కాకుండా స్విచ్చిని ఆఫ్ చేశాడు.
    తలను రెండు చేతుల్లోను ఇముడ్చుకొని కాస్సేపు అలాగే కూర్చున్నాడు రవి. పేరుకొని పోయిన ఒంటరితనం, హృదయం లో గూడు కట్టుకున్న విచారం, ఆందోళన, ఆవేదన, ఆదుర్దా -- అన్ని కలిసికట్టుగా అతని మీద దండయాత్ర చేస్తున్నట్లుగా బాధపడ్డాడు.
    విసుగ్గా లేచి తోట మధ్యలోకి వెళ్లి పచ్చిక మీద వెల్లికిలా పడుకొని ఆకాశం వైపు చూడసాగాడు. చీకటి ఇంకా దట్టం కాకపోవడం వల్ల అక్కడక్కడ కనబడుతున్న నక్షత్రాలు కాంతి విహీనంగా ఉన్నాయి. ఆకాశం ఎందుకనో పాలిపోయి ఉన్నట్లుగా అతని కనిపించింది. కళ్ళు మూసుకొని కాస్సేపు నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నించాడు. కాని, అది అతనికి శక్యమవడం లేదు. బావురుమంటున్నట్లుగా తోట! శ్మశానం లో ఉండే ప్రశాంతత! ఆనందం లేని ఆ ఇల్లు!
    చటుక్కున లేచి ఇంటి లోనికి వెళ్ళాడు. మళ్ళీ కాస్సేపు అటూ ఇటూ పచార్లు చేశాడు.
    భయంకరమైన నిశ్శబ్దము, భారంగా గడుస్తున్న సమయము అతణ్ణి భయపెట్టాయి.
    దొంగలా వెళ్లి వెనకగది లోని బీరువా తలుపులు తెరిచాడు. రెండు విస్కీ బాటిల్స్ అతణ్ణి నవ్వుతూ ఆహ్వానించాయి. తటిల్లతలా అతనిలో ఉత్సాహం మెరిసింది.
    ఆప్రయత్నంగా అతని చేతులు ఆప్యాయంగా ఆ సీసాలను స్పృశించాయి.
    నెమ్మదిగా కూర్చుని మూత తొలిగించి గ్లాసు లోనికి వంచి గడగడ తాగేశాడు. మృత్యువు తో రోగి పోరాడుతున్న సమయంలో, అమృతం దేవలోకం లోంచి తీసుకువచ్చి అతనికిస్తే, ఎంత ఆహ్లాదం పొందుతాడో , అంతటి ఆ ఆనందం రవి పొందాడు.
    మళ్ళీ శరీరం తెలిపోసాగింది. నరాలు వదులు కాసాగాయి. మెదడులో ఏవో దూది పింజలు ఎగురుతున్నట్లుగా అనుభూతి. సీసా ఖాళీ కాసాగింది. ఈ సృష్టికి మూలకారకుడు 'తనే' అనే ఏదో అర్ధం లేని భావన! తానెంతో గొప్పవాడు. ఎంతో మంచివాడు. ఎంతో నిగ్రహ పరుడు! ఎంతో వివేకి. తను వాల్మీకి....తను భగవంతుడు...తను అన్నీ! ఈ సమస్తము, సృష్టి లోని ప్రతి వస్తువు తనదే. తను లేకపోతె ఈ ప్రపంచం ఉండదు. తనెంత అవసరం , చిక్కి శల్యావస్థ లో యుగాల తరబడి ఉన్న ఈ జగత్తుకు?
    ఈ జగత్తు ఏమిటి? తనేవరు?
    జగత్తు కు , తనకు ఏమిటీ సంబంధం?
    ఈ జగత్తు కు ప్రాణం ఇచ్చింది తను....,మానవుడు .
    మరెందుకు కిలా తనచేత సృష్టించబడిన ఈ లోకం తనను శాసిస్తున్నది?
    ఈ సుఖము , దుఃఖము ఎవరు సృష్టించారు?
    ఇవి తన భావనల చేత సృష్టించబడినవి. దుఃఖం లో సుఖం ఉందను కుంటే, అది సుఖంగా మారుతుంది. సుఖంలో దుఃఖం ఉందని తను అనుకుంటే  అది దుఃఖంగా మారుతుంది. అంతా కేవలం తన భావన. తన అభిప్రాయం. తన ఆలోచన. అంతా తన శాసనం మీద ఆధారపడి ఉంది.
    మరి.......మరెందు కిలా తను వీటికి బందీ అవుతున్నాడు? తనలో అర్ధం లేని, అర్ధం కాని, ఎందుకూ పనికి రాని, ఈ భావ సంచలనము ,ప్రతి సారీ తప్పొప్పుల పట్టిక రివ్యూ ఎందుకు, ఎందుకు?    
    'ఎందుకు , అని గొణుక్కున్నాడు అతను.
    చేతులు పట్టు తప్పిపోతున్నాయి. గ్లాసు సీసాగా సీసా గ్లాసు గా అతని కంటికి మారిపోసాగింది.
    తనేవరు?
    తను రవిచంద్ర ....కాదు సురేంద్ర ...కాదు సురేఖ! కాదు రాజగోపాలం.
    తను రవిచంద్ర కాదు, రాజగోపాలం!
    ఓహ్, ఆ ఊహ ఎంత బాగున్నది? చీటికి మాటికి ఎదురు దెబ్బల్లాంటివి తింటూ, చేతికందిన అమృతాన్ని జారవిడుచు కుంటూ శాంతికి దూరమయి, అశాంతికి నిలయమైన రవిచంద్ర కాదు తను. నిండుగా, హాయిగా సుఖాన్ని క్రమబద్దం చేసుకొని వడ్డించిన విస్తరిలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న రాజగోపాలం తను!
    తను రాజగోపాలం! బిగ్గరగా, గుండె తప్పేలా నవ్వుకున్నాడు. అతని మస్తిష్కం గిర్రున తిరగసాగింది. అతని సర్వావయవాలు పట్టు తప్పాయి. అతను "అతను' కానట్లుగా మత్తు కల్పించిన భావన.
    'ఇది నా ఇల్లు కాదు. ఇది రవిచంద్ర ఇల్లు. నా ఇంటికి నేను పోతాను. నేను రాజగోపాలాన్ని , వెర్రిగా , దాదాపు పిచ్చివాడిలా నవ్వుకుంటూ, తూలుతూ బయటకు వచ్చి కారులో కూర్చుని పోనివ్వ సాగాడు.
    కంట్రోలు లో లేని అతను! కంట్రోలు తప్పుతున్న స్టీరింగ్! కారును తన ఇష్టం వచ్చినట్లుగా నడపసాగాడు.
    అతనికి తెలియకుండానే కారు సదరు స్ట్రీట్ లో ఆగింది. ఎప్పుడో ఆ గొందులను ఒకసారి చూసినట్లుగా అతని మదిలో జ్ఞాపకం మెదిలింది.
    కారు అపు చేసి నిర్మానుష్యంగా ఉన్న ఆ గొంది లోకి తూలుతూ వెళ్ళాడు.
    ఎదురుగా ఉన్న ఇంట్లోకి, పడిపోతున్న ఆ ఇంట్లోకి తనేప్పుడో వెళ్ళినట్లుగా జ్ఞాపకం. ఎవరి కోసం తను అక్కడికి వచ్చాడు? ఎవరిది ఆ ఇల్లు?
    పందులు అతని ముందు నుంచి గురగుర మంటూ ఉరకసాగాయి. అతని తోపుడుకు తలుపులు తెరుచు కున్నాయి.
    లోపల గుడ్డిగా దీపం వెలుగుతున్నది. వెనక నించి ఎవరో తలుపులు మూసినట్లనిపించింది.
    కనురెప్పలు కుంగిపోతుంటే తలుపులు మూసి తన కెదురుగా వస్తున్న మనిషిని చూశాడు. సురేఖా అనిపించింది.
    "సురేఖా!" అన్నాడు దగ్గిరికి వెళ్ళుతూ.
    ఎదురుగా వచ్చిన మనిషి అతణ్ణి గట్టిగా కౌగలించుకొని "నేను సురేఖ ను కాను, చంద్రికను" అని మరాఠీ లో అతని చెవిలో గొణిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS