చటుక్కున రవి ఆగి "నేను రవిచంద్ర ను" అన్నాడు.
"ఒక్క క్షణం ...వస్తున్నాను" అంది.
అతను గబగబా బయటి గదిలోకి వచ్చి కూర్చున్నాడు.
కాసేపాగిన తరవాత ఆమె వచ్చింది.
అంతకు క్రితమే స్నానం చేసినట్లుంది. ముఖం స్వచ్చంగా, కాంతి వంతంగా ఉంది. బిస్కటు రంగు చీరలో ఆమె నిండుగా ఉంది.
కొంచెం పస్తాయింపు తో "రాజగోపాలం గారు లేరా?" అని అడిగాడు రవి.
"లేరు. ఆఫీసుకు వెళ్ళారు. మధ్యాహ్నం వస్తారు. అయినా మీరు ఆఫీసుకు వెళ్ళలేదా?"
"వెళ్లాను . పదిరోజులు సెలవు తీసుకున్నాను." ఆ ప్రయత్నంగా అతని దృష్టి సురేంద్ర ఫోటో మీదికి మళ్ళింది. ఈ మధ్యనే అమర్చినట్లుంది. ఆ గదిలో అది కొత్తగా ఉంది.
"అలాగా!"
రవి లేవబోయాడు. "అదేం కూర్చోండి? సెలవేగా?"
ప్రియ మాటలకు రవి పేలవంగా నవ్వి ; "అబ్బే , లేదు. వెళతాను" అన్నాడు.
"వారు గంటలో వస్తారు. తీరికేగా కూర్చోండి."
రవి నెమ్మదిగా కుర్చీలో సాగిల బడ్డాడు.
ప్రియ అతణ్ణి పరీక్షగా చూసింది. రవిచంద్ర చాలా చిక్కి పోయాడు. ఐ.ఎ.యస్ అఫీసరయి కొత్తగా వచ్చిన రోజుల్లో మనిషి మిసమిస లాడుతుండే వాడు. ఇప్పుడు ఆ కాంతి పూర్తిగా తరిగిపోయింది. విషాదానికి ప్రతి రూపంలా , ఏదో జబ్బుతో సదా తీసుకుంటున్న మనిషిలా ఉన్నాడు.
కొన్నేళ్ళ కిందట నాగపూర్ కు కొత్తగా వచ్చిన రవిచంద్ర జ్ఞాపకం వస్తున్నాడు ఇప్పటి వాలకాన్ని చూస్తుంటే.
"మీరు చాలా చిక్కిపోయారు." జాలిగా అంది .
"ఊ'!"
"ఎందుకలా ప్రతి విషయానికి బాధపడతారు?"
రవికి కొంచెం కోపం వచ్చింది. "నేనేం బాధ పడటం లేదు. నన్ను బాధ పెట్టటానికే మీరు ప్రయత్నిస్తున్నారు. లేకపోతె ఆ ఫోటో ఎందుకలా పెడతారు? నాకు తెలుసు, మీరు నన్ను ద్వేషిస్తున్నారని, అసహ్యించు కుంటున్నారని " ఆవేశంగా అన్నాడు.
ప్రియ నివ్వెర పోయింది. అతని వాలకం ఒక్క క్షణం అర్ధం కాలేదు. కాని, సురేంద్ర ఫోటో చూడగానే అంతా తెలిసి పోయినట్లయింది.
"పొరపాటయింది. ఈ ఫోటో సురెంద్రను జ్ఞాపకం తెప్పించి ఉండవచ్చు." గభాల్న లేచి అది తీయబోయింది.
"ఉంచండి, నేను మరిచి పోతేగా జ్ఞాపకం తెప్పించడానికి? నిజం చెప్పండి, మీరు నేనంటే ద్వేషించు కోవటం లేదూ?"
"ద్వేషం ఎందుకూ?"ప్రియ ఆశ్చర్యపోతూ అడిగింది.
రవి తల వంచుకున్నాడు. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించాడు. ఏమిటి ఈ ప్రవర్తన? తనెందు కిలా దురుసుగా , మతిలేని వాడిలా ప్రవర్తిస్తున్నాడు?ఆ ఫోటో అయాచితంగా పెట్టి ఉండచ్చు. సురేంద్ర వారి స్నేహితుడు కూడా. స్నేహితుణ్ణి ఫోటో ద్వారా జ్ఞాపకం ఉంచుకుందామనుకోవటం లో తప్పేముంది? తనను బాధ పెట్టడానికే అలా పెట్టబడిందని ఎందు కనుకోవాలి?
నెమ్మదిగా బరువుగా లేచాడు. ప్రియ జాలిగా అతణ్ణి చూస్తూ , "ఒక్క క్షణం ఉండండి. కాఫీ తాగుదురు గాని"అంది.
అతను అశక్తుడయినట్లుగా కూర్చున్నాడు.
కాసేపట్లో ప్రియ కాఫీ కప్పుతో వచ్చింది.
'కాఫీ ప్రత్యేకంగా మీకోసం తయారు చేశాను. హాయిగా తాగండి" అంది. ఆమె స్నిగ్ధ మందహాసం లో అందం విరుపులు. ఆమె వదనం లో అంతులేని ప్రశాంతత. బాధను , ఆవేదనను ఇట్టే తొలిగించే స్నేహపూర్వక సత్కారం ఆమె సొత్తు.
నెమ్మదిగా కప్పు అందుకొని కాఫీ తాగాడు.
క్షణకాలం కళ్ళు మూసుకొని కణతలు నొక్కుకున్నాడు.
ప్రియ కెందుకనో అప్రయత్నంగా అతనంటే అంతులేని జాలి, దయ, అతని ఆవేదన ను తొలగించటానికి ఏదైనా చేయాలనే భావం కలిగాయి.
నెమ్మదిగా "రవీ" అంది.
ఆ పిలుపు అతనికి కొత్తగా ధ్వనించింది. విస్తుపోతూ రవిచంద్ర తల ఎత్తి చూశాడు. కరునాపూరితమైన అందామైన నేత్రాలు అతణ్ణి పరీక్షగా చూస్తున్నాయి. ఎందుకనో ఆ క్షణంలో తన మనస్తాపాన్ని ఇట్టే తొలగించే దేవతా రూపంలో ప్రియ ప్రత్యక్ష మయినట్లుగా తోచింది.
కళ్ళల్లో నీళ్ళు నిండుకుంటుంటే "నాకు పిచ్చేక్కేటట్లుగా ఉంది. నాకేం తోచడం లేదు.... నేను...." గభాల్న రెండు చేతులతో తన ముఖాన్ని మూసుకున్నాడు.
సానుభూతి సముద్రం లా అమెలోంచి పొంగుకొని వచ్చింది అతని పరిస్థితికి.
ఆప్రయత్నంగా ముఖానికి అడ్డు ఉంచుకున్న అతని రెండు చేతులను తొలగించి , "ఏమిటిది? చిన్న పిల్లాడిలా? ఛ...ఛ....ఏడుస్తారా? తప్పు కాదూ" అంటూ అతి సున్నితంగా అతని కంటి నీరు తుడిచింది.
అమెస్పర్శ , అతనికి హాయిని, సుఖాన్ని కలిగించింది. ఆమె మాటలు ఎండలో దప్పిగొన్నవాడికి దాహం తీర్చడానికి ఇచ్చే శీతల పానీయం లా అనిపించాయి. పరిపూర్ణ కృపా వతి అయినఆ స్త్రీ లాలింపు అతని జీవితపు ఎడారి లో ఒయాసిస్సు లా గోచరించింది. ఆ క్షణం స్త్రీ సాన్నిహిత్యము , మమత, లాలింపు ఎంత అవసరమో ఎండిపోయిన అతని బ్రతుకుకు తెలియ జెప్పింది. ఆమె మృదువైన హస్తాలను నెమ్మదిగా తన ఫాల భాగానికి రాసుకుంటూ, "నాకు శాంతి కావాలి! నాకు శాంతి కావాలి..." అని గొణుక్కున్నాడు.

20
"మీరు ఈ పదిరోజులూ ఇక్కడే ఉండండి.
అక్కడ ఒంటరి తనం భరించలేరు." రాజగోపాలం స్వచ్చంగా నవ్వుతూ చెప్పాడు.
"ఒంటరితనం అలవాటయింది . నేను వెళతాను" అన్నాడు రవి.
"అలా వీల్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకే భయమవుతున్నది. మనిషి చాలా చిక్కిపోయారు. మీరు వెళ్ళద్దు. ఇక్కడ ఉండక తప్పదు!" ప్రియ అన్న మాటలకు రాజగోపాలం అవునన్నట్లు తల ఊపాడు.
రవికి కొంచెం కోపం వచ్చింది కాని, ఇక ఎక్కువగా ఆ సంభాషణ ను పొడిగించలేదు.
ఆ మధ్యాహ్నం రాజగోపాలం ఆఫీసుకు వెళ్ళాడు. రవిచంద్ర చాలాసేపు అతని లైబ్రరీ లో గడిపాడు. ఇంతకూ మునుపు పుస్తకాలు అతనిలో ఉత్సుకత ను రేకెత్తించేవి. చదవాలనే ఆదుర్దా, ఏదో తెలుసుకోవాలనే తపన ఉండేవి. కాని ఇప్పుడు అతనికి అలా అనిపించడం లేదు. ఏ వ్యాపకం లేకపోవడం వల్ల లైబ్రరీ లో కూర్చోవలిసి వచ్చింది.
మూడు గంటల ప్రాంతంలో ప్రియ టీ తో లోనికి వచ్చింది. మధ్యాహ్నం నిద్ర వల్ల కాబోలు ముంగురులు చెదిరి ముఖం మీద పడ్డాయి. వదనంలో అలసత్వం ఉంది. వస్తూనే మందహాసంతో "ఏం చదువుతున్నారు?' అంది.
టీ కప్పు అందుకొని "ఏమీ లేదు" అన్నాడు రవి శుష్క మందహాసంతో.
"వారు వెళ్లిన దగ్గిరి నించి ఇక్కడే కూర్చొని ఉన్నారుగా . ఏమీ చదవలేదా?"
"చదివాను కాని, అర్ధంకాలేదు."
"అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించ లేదా?"
"అర్ధం చేసుకొని మాత్రం చేసే దేముంది?" నిరాశకు ప్రతీకగా అతను.
"ఈ మధ్య మీరు నిరాశావాదం బాగా అలవాటు చేసుకున్నారు. ఊరికె అనవసరపు విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించడం, బాధపడటం -- ఎందుకలా చేస్తున్నారో మా కర్ధం కావడం లేదు ." ఆమె కుర్చీని దగ్గిరగా గుంజుకుంటూ అంది.
అతను ఒక్క క్షణం మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచిస్తుండడం వల్ల కనుబొమ్మలు ముడి పడ్డాయి. కాస్సేపాగి కళ్ళు తెరుస్తూ అన్నాడు.
"నేను అనవసరపు విషయాలను గురించి బాధపడుతున్నారా? లేదు, ప్రియంవద గారూ , లేదు . కళ్ళు మూసుకున్నా, తెరిచినా సురేంద్ర జ్ఞాపకం వస్తున్నాడు. నా గుండెల్లో పోట్లు పొడుస్తున్నారు. నేనంత క్రూరంగా, నీచంగా ప్రవర్తించినందుకు నన్ను అమానుషంగా హింసిస్తున్నాడు."
"రవిచంద్ర గారూ, అందులో మీ నేరం ఏముంది? మీరనవసరంగా ఏవేవో ఊహించుకొని బాధపడుతున్నారు కాని." ఆమె కంఠం లో జాలి తొణికింది.
"మాటల కందని నేరం నాది. నా అధికారాన్ని, హోదాన్ని మరిచి పోయి ఉన్నట్లయితే నేను సురేంద్ర ను దక్కించు కొనే వాణ్ణి. ఇలా చిత్ర హింసలు గాకుండా ఉండే వాణ్ణి."
"మీరిలా మిమ్మల్ని మీరు వేధించుకోడం మరిచిపోవాలి. అలా జరగడం విధి లిఖితం. మీరేం చేయగలరు?"
"విధి లిఖితం!" పేలవంగా ఆ మాటను ఉచ్చరిస్తూ "నే నింతకు పూర్వం విధి లిఖితాన్ని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. "విధి" అనేటటువంటి దానిమీద నాకు నమ్మకం లేదు. నా కేందుకనో ఇప్పుడు నా నమ్మకాల పట్ల నమ్మకం సడలు తున్నది. నేనిలా ఎందుకయ్యాను? నా జీవితం ఇలా ఎందుకు మారింది? సుఖంగా జీవిత యాత్ర నడుస్తుందనుకున్న నాకు ఈ దుఃఖ మేమిటి? ఈ ఆటుపోట్లు , ఈ ఎదురు దెబ్బలు, ఈ అనిశ్చిత పరిస్థితి ..." ఎత్తుగా అమర్చిన పుస్తకాల బీరువా వైపు చూస్తూ అన్నాడు. అందులో అమర్చిన పుస్తకాలు చదివితే అర్ధమవు తాయి. కాని అతనికి ఈ జీవితం ఇన్ని రోజుల నించి అనుభవిస్తున్నా అర్ధం కావడం లేదు. "జీవితం" అనే పాఠ్యభాగం లోని ప్రతి అక్షరము గొట్టుగా, కొరుకుడుపడని వస్తువులా ఉంది.
