"వాళ్ళ చెల్లెలు పెళ్ళికి రమ్మంటాడు" సురేఖ నవ్వింది.
"వెళ్ళూ"
"నన్ను కాదోయ్ ! నిన్నూ"
"నేనెందుకుటా?"
"సరే! నన్నడిగితే?"
సురేఖకి కూడా మనసు నొప్పెట్టింది.
"ఈ వాదనతో ఎందుకు టైము వృధా చేస్తావు? ఇద్దరం వెళ్దాం మా దొడ్డమ్మ గారిదే మగ పెళ్ళివారి పెద్దరికం- గనుక నేను "మగపెళ్ళి దాన్ని"- నువ్వు ఆడపెళ్ళివారి తరపునరా!" అంటూ లేచింది.
"అంత అవకాశమా? భాస్కరం గారికి చిన్నతనం కాదూ, నేను అలా వస్తే?"
"చూడు పద్మా! ఆ ప్రశ్న ఆ పెద్దమనిషినే అడుగు నేను మీకు స్నేహితురాలిని-అంతేగాని మధ్యవర్తినీ రాయబారినీ కాదు."
ఒక్క విసురున అటు తిరిగి నడక సాగించింది సురేఖ.
పద్మావతి నిశ్చేష్టురాలై నిలిచి పోయింది!
నాలుగు అడుగులు వేసిన సురేఖ వెనుదిరిగి కోపం దిగమింగి, చల్లబడి- తిరిగి వచ్చింది
"రా!" అంది.
"ఉహూఁ! యూకెన్ గో....." అన్నది పద్మావతీ.
"నాన్ సెన్స్! ఐఫీల్ లైక్ కిల్లింగ్ యూ చంపేద్దామనుంది నిన్ను- డూ కమ్!"-
అనురాగంవల్ల స్నేహానుబంధంవల్లా కలిగిన ఆగ్రహా వేశాల్తో రెండు కెరటాల్లా డీ కొన్నారా ఇద్దరూ.
రెక్క పుచ్చుకుని లాక్కెళ్తున్న సురేఖను వెనక్కు లాగి "ఉండూ! చెయ్యి విరిగిపోగలదూ! నేను రాగలనులే" అన్నది పద్మావతి.
ఇద్దరూ అక్కడే కూలపడ్డారు సురేఖ పద్మా వతి ఒళ్ళో తలదూర్చి
"సారీ!" అన్నది.
పద్మావతి చలించి పోయింది సురేఖ తనకంటే చిన్నదై చంటిపిల్ల ఐనట్లు అనిపించింది.
"పాపం! రాణీగారికి అంతలోనే కోపం అంతలోనే దుఃఖం - ఫోఫో! నా ఒళ్ళో నీకు చోటు లేదు" అన్నది ఆప్యాయంగా సురేఖ తల నిమిరి! కదల్లేదు సురేఖ.
సముద్రం కెరటాలు మరింత మరింత హోరుచేస్తూ ఒక్కో అడుగూ ముందుకూ వస్తూంటే, గంభీరతా చీకటి ఒక్కోక్షణానికి రెండింతలు పెరుగుతున్నాయి.
"అమ్మయ్యో!"
చుట్టూ దూరదూరానగల మనుషులు కూడా మాయమై పోయారు!
వడివడిగా లేచి బయలుదేరారు!
"అమ్మ నిన్ను భోజనానికి రామమంది" ఇల్లు దగ్గరకు రాగానే పద్మావతి అన్నది.
"అమ్మో! మరోనాడే! ఇవాళకాదు! ప్లీజ్ ప్లీజ్ ...." సురేఖ గునిసింది.
"కాదు ఇవాళే!" అని మళ్ళీ కోపంగా "పోనీ! నీ ఇష్టం మా అమ్మకినేను నువ్వు రానన్నావని చెప్పేస్తా! సరేనా? ఎందుకంటే పేదవాళ్ళం అందుకనీ అంటాను"- అన్నది పద్మావతి వేలుచూసి హెచ్చరించింది కూడా!
"ఓ.కే. పద! నీ చీవాట్లు మీ ఇంటి భోజనం రెండూ రాశాడు నీ బుద్ధ భగవానుడు నా మొహానో" - సురేఖ ఒప్పుకుంది-
* * *
సురేఖాను క్రిష్ణనగర్ వెళ్ళే ఆఖరి బస్సు ఎక్కించిన తరువాత పద్మావతి ఇంటికి వచ్చి పడుకున్నదే గాని నిద్రరాలేదు.
"సురేఖ సుఖపడితే మాత్రం నాకు సంతోషం కాదూ? పోనీ భాస్కరం గారిని అది పెళ్ళి చేసుకుంటే ?......"
"మరి నీగతో? నీసంగతో?" ఎవరో గుండెల్లో నించి కేకలు.
"నా సంగతా? బడి పంతులమ్మ నవుతా!" నంది ఎవరికోసమాధానం ఇస్తున్నట్లు.
"కానికాని...... భాస్కరం నన్ను ఇంత ఇంత అన్యాయం అన్యాయం చేస్తాడనుకోలేదు" అని బాధపడ్డది.
ఐతే భాస్కరం సురేఖా ప్రేమించుకున్నట్లు నిర్ధారణ ఏదీ?
"సురేఖ అందరితోనూ నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. దానికి భయంలేదు- భాస్కరం గారితోనూ అంతే నేమో......"
"అంతే..... అంతే....." అనుకుంటూ కలత నిద్ర పోయింది పద్మావతి.
40
పెళ్ళి సందడి అంత ఇదిగానూ ఉంది. పెళ్ళికి ఆశ్చర్యకరమే అయినా ధనమ్మగారే తనలోగిలి నంతా ఆడపెళ్ళివారి తరపున్ 'విడిదిగా' ఇచ్చింది. దీనికి సంప్రదాయాలు పట్టింపులు యేమిటీ? నాకు లోగిలి ఉన్నది జానికమ్మగారూ! అదే మనదే ననుకోండి పైగా మీరు మేమూ అనేతేడా ఎన్నాళ్ళూ" అన్నదామె.

"సుఖంగా ముహూర్తాలు శీతాకాలంలో పెట్టుకోరెంచేతో? ఈ మండుటెండాకాలం గాకపోతే" నంటోందేవరూకావిడ.
"ఇది శ్రావణ మండీ వదినగారూ? కాని ఈ పాడు ముండావూరు..... దీనికి శీతాకాలమెక్కడతల్లీ! ఎండాకాలం మండుటెండాకాలం గాకపోతే" నంటోందెవరో ఒకావిడ.
"ఇది శ్రావణ మండీ వదినగారూ? కాని ఈ పాడు ముండావూరు..... దీనికి శీతాకాల మెక్కడతల్లీ? ఎండాకాలం మండుటెండా కాలం అని రెండే కాలా లిక్కడ. కురిస్తే వానా వరదా రెండూను....." విసనకర్ర విరిగిపోయేలా విసురుకుంటూ అన్నది మరో ముత్తయిదువ.
"ఇంకా నయం పోయిన్నెల ఈ వేళకి మావాళ్ళింట పెళ్ళికి ఈ గూబగాడ్సు ఆ గూబకు కొడుతున్నది" అన్నది మరొకామె. నీరసంగా, దూరంగా అరుస్తున్నట్లు అరుస్తున్నాయి కాకులు కూడా- పెళ్ళి పందిట్లో విస్తళ్ళు వేసి వడ్డనలు ప్రారంభించే సరికి ఎవరికీ మంచి నీళ్ళుకంటే అమృత ప్రాయంగా మరో వస్తువు అగుపించలేదు. ఒక చేత విసన కర్ర రెండోచేత మంచినీళ్ళ గ్లాసూ- అధీవరస.
అయినా రాఘవేంద్రంగారి భార్య సూర్యకళమ్మ, ధనమ్మ, జానికమ్మ అందరూ కూడా పట్టుచీరెలతోనే ఈ తీక్షణత భరిస్తున్నారు. వసంత లేత అరిటాకులా వాడిపోయింది.
"పెళ్ళికూతురట ?! బండముస్తాబులు!- - పిల్ల అందమంతా ఈ ముస్తాబులోనే దాగి పోయింది" అనుకున్నాడు భాస్కరం.
భాస్కరం అదివరకు నాలుగు పెళ్ళిళ్ళు చూసి కూడా ఎరుగడు. ఆందోళన హడావుడీ పడతాడేకాని, ఏ పని చెయ్యాలో ఏది చెయ్యనక్కర్లేద్జో తెలియదు.
మగపెళ్ళి వారంతా- అతన్ని సొంత బంట్రోతులా చూస్తున్నారు.
"ఎమ్మెస్సీ! చదువుతున్నాట్ట!" అన్నది ఒకావిడ ఎడంగా.......మరొకామెతో.
"ఐతే మాత్రం- పెళ్ళి కూతురు అన్నయ్య కాడా?- తెమ్మనూ రెండు లైమ్ జ్యూసు బుడ్లేగా- పైగా మనం మగపెళ్ళివారి తరఫున బంధువులమే! అదీగాక నేను ముకుందరావుని చిన్నతనంనించీ ఎరుగుదును!" అంటూ రెండో ఆవిడ- ఎడం ఎడంగా వెళ్ళిపోతున్న భాస్కరాన్ని "చూడు బాబూ! నన్ను ఫలానా వారి కోడలంటారు- ఈ ముకుందం అంటే పెళ్ళి కొడుకు మాకు చాలా ఐనవాడూ....." అంటూ పిలిచింది.
"అమ్మా! మీకేం కావాలి?"
"నాకేమీ వద్దులే! పెళ్ళికి వచ్చిన మనకి పట్టు పరుపులెలా వస్తాయి!- జంఖానా చాలుగాని, ఈవిడ ఎడపిల్లకి కాస్త కడుపు నొప్పిగా ఉంది-రెండు లైమ్ జ్యూస్ లు తెస్తావ్?"
"తప్పకుండాను" భాస్కరం వినయంగా చెప్పాడు. "ఒక్క రెండు నిమిషాల్లో తెప్పించుతాను"-
"అలా అనకు- మళ్ళీ ఎవరో అయితే అర్జంటుగా రావు-ఇప్పుడే అది కడుపునొప్పో అని 'కింక' పెడుతున్నది..... నువ్వు బాబ్ బాబూ? కాస్త స్వయంగాతే!"- అది హుకుమే.
భాస్కరం "చిత్తం" అని లోపల లోపలే గొణుక్కుని బయలుదేరాడు.
* * *
పెళ్ళి సందడి బాగా ఇనుమడించింది-భాస్కరం జానికమ్మగారిని చూసి
"పిన్నీ! నువ్వు ఇంత అలసిపోకూడదమ్మా!" అన్నాడు- ఆమె నుదుట చెమటలు ముత్యాలై నిలిచాయి. కుంకుమ పాతరూపాయి కాసంత బొట్టు పెట్టుకున్నదేమో ముక్కుమీదకు కారుతున్నది.
అలసిపోయిన కళ్ళు, లోతుకు పీక్కుపోయి -భాస్కరానికి "పిన్ని" ఈ నలుగు రోజులూ ఐపోతే "మంచాన పడదు" కదా అని భయం వేసింది.
"ఒరే! ఎవరికిరా చెప్తున్నావ్?.... నీ మొహం ఒకసారి అద్దంలో చూస్కో...... పెళ్ళికూతురై నీ చెల్లెలంత నీరస పడిపోయిందో, నువ్వు అంతకు రెట్టింపు పీక్కుపోయి, తోటకూర కాదలా ఎండిపోయావ్!..... ఇలారా!" అని ప్రక్కకు పిలిచి కొంగుతో నుదుటి చెమట ఒత్త్హి వంట ఇంటికేసి తీసి కెళ్ళిందామె..... గ్లాసు నిండా పాలు తెచ్చింది.
"నా కెందుకమ్మా! చెల్లాయ్....."
"త్రాగు ముందు..... నలుగురూ వస్తే ఏడుస్తారు" ఆమె పట్టేసినంత బలవంతం చేసింది.
'నువ్వు తాగమ్మా"
"ఛీ! నోర్ముయ్! చాదస్తం.. వూఁ వూఁ.....వాళ్ళంతా దానిని నే దగ్గర లేపోతే బ్రతకనివ్వరు" ఆమె బ్రతిమాలుతూనే తొందర పడ్డది.
భాస్కరానికి పిన్ని తాగలేదని బాధగానూ ఉంది. తనకి త్రాగడానికి సిగ్గుగాను ఉంది.
"ఉహూ నువ్వు త్రాగకపోతే నేతాగను"
"మంకుతనం !....." ఆమె ఏమో అనబోయే టంతలోనే ఎవరో ఆమెను.
"రావాలి! రావాలి! జానికమ్మా రావాలి! అవతల ముహూర్తం గడియలు దాటిపోతున్నాయ్!" అని కేక వేశారు.
భాస్కరానికి ఆమెను ఇక అల్లరి పెట్టడం ఇష్టంలేక పోయింది. గ్లాసు అతని రెండు చేతుల్లోను పెట్టి ఆమె సంరంభంగా వెళ్ళిపోయింది.
గబగబా త్రాగేశాడు పాలు. సగం త్రాగాక - "మళ్ళీ తను కనిపిస్తే బాగున్ను.... వెధవను నేనొక్కన్నే అర్ధశేరు పాలు త్రాగేయడమే అసలు తను తిండీ, నిద్రా ఇలాంటి వాటి కతీతంగా ఉన్నదే!.....ఎలా చెప్మా" ననుకున్నాడు పిన్ని గురించి మనసంతా అదో రకమైన ఆందోళన పీకింది. అటూ ఇటూ చూశాడు.
గాడీలు, 'పెద్ద ఫర్నస్'ల్లా మండుతున్నాయి. వంట బ్రాహ్మలు కళాయిలు గుండిగలు ఎక్కిస్తున్నారు. దింపేస్తున్నారు - చాపలమీద వెలిసేస్తున్నారు.
అంతలో అట్నుంచి పిన్ని తిరిగి తనకేసే వస్తున్నది.
"భాసా! అక్కడ భాజాలవాళ్ళకి మధ్యలోనే కాఫీలు కావాల్సి వచ్చాయిరా! ఈ వంట బ్రాహ్మడు కాఫీపొడుం లేదంటున్నాడు.... కాస్త ఒక రెండు పౌనులు తెప్పించు.....బజారుకి నందివారి రావున్నో పాలూరి వాళ్ళ అబ్బాయినో పంపు" అంటూనే ఆమె కొడుకు చేతిలోని గ్లాసూ అందులో సగం పాలు చూసి విస్తుబోయి అంతలోనే నొచ్చుకుని ఇకవాన్ని బ్రతిమాల గలవోపిక లేదన్నట్లు వూరుకుని, నిట్టూర్చింది.
"ఇదో! ఇట్టే వస్తా! ఇంద యివి నువ్వు త్రాగేయ్! లేపోతే అంత ఒట్టే!" భాస్కరం ఆ గ్లాసు ఆమె చేత బట్టి పరిగెత్తాడు.
ఆమెకు ఒళ్ళు మండిపోయింది. అంతలోనే మనసు చల్లబడి పోయింది. మండు వేసవిలో పిల్ల తెమ్మరలా అనుభూతి కలిగి చిన్న నవ్వు విరిసింది పెదాలమీద.
"వాడికి నాభెంగా, నాకు వాడి బెంగా.....అంతేగా" అనుకుంది. "ఒట్టు పెట్టుకున్నాడు కూడా! వెర్రినాగమ్మ!" అనుకుని మళ్ళీ "అబ్బ! వీడితో తెలిసీ తెలియని గోల! ఇదేం మన ఇల్లా ! ఇక్కడ 'అవ్వఁ'- నేను పాలుత్రాగితే చూసిన వాళ్ళేమనుకుంటారూ?!"
నిజంగా ఆమెకలాంటి సంకటస్థితి భాస్కరం గనుక సరిపోయింది. మరెవ్వరు కల్పించినా సహించదు. అటు తిరిగి ఒక వారకువెళ్ళి, ఎలాగో ఆ పాలు గొంతులో పోసుకుని - ఆమె తిరిగి పెళ్ళి పందిట్లోకి ఆందోళనగా వెళ్ళిపోయింది.
ఆమెకు అట్నుంచి సురేఖ మరో అమ్మాయి కూడావస్తూ అగుపించారు. పద్మావతి నామె వెరుగదు. సురేఖను పోల్చుకున్నది. కాని అప్పటి బరువు బాద్యతల మధ్య ఆమె కే ధ్యాసా ధ్యాసమూ పట్టడం లేదు.
* * *
సురేఖ రాకూడదు అనుకుంది- కాని పద్మావతి నేనొక్కర్తినీ వెళ్ళలేనంది - పైగా భాస్కరం ఇద్దరికీ మరీమరీ చెప్పాడు.
అసలు పద్మావతీ భాస్కరాన్ని ఆ రోజు చేసిన అవమానానికి క్షమాపణ చెప్పుకోవాలని కూడా వచ్చింది.
సురేఖ మొదట రాకతప్పలేదు. పద్మావతి జయమ్మగారిని ఒప్పించి ఎలాగై తేనేం ఆ ఉదయమే రాగలిగింది.
వస్తూనే సురేఖ ఆప్యాయంగా పద్మావతికి తన గదిలోనే ఉండగల అనుమతి కోసరం ధనమ్మ గారిని ఉబేసి మరీ- ఏర్పాట్లు చేసింది.
పద్మావతికి అంతా భయంగాను కొత్తగాను ఉంది. సురేఖ తప్ప అందరూ కొత్త వాళ్ళే-పైగా పుట్టి బుద్దెరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇలా బంధుకోటిలోకి రాగల అవకాశమే కలుగలేదు!
