Previous Page Next Page 
మారిన విలువలు పేజి 30

 

    ప్రకాశం వీధిలోకి వచ్చేడు. శాంత శారద ఇంటికి వెళ్ళిందంటే ఎందుకో అతనికి నమ్మకం కుదరలేదు. ఆరోజు వచ్చిన కొత్త పుస్తకాలు చూపించేందుకు పన్నెండు గంటల ప్రాంతంలో అతను వారింటికి వెళ్ళేడు. శారద తల్లి కాంతామ్మ గారికి పుస్తకాలంటే మహా పిచ్చి. ఏ కొత్త తెలుగు పుస్తకం మార్కెట్టు లోకి వచ్చినా ఆవిడ విధిగా కొనేది. "ఏమైనా కొత్త పుస్తకాలు వస్తే నా చెవిని కాస్త వెయ్యి వోయి, ప్రకాశం" అనేది ఆవిడ.
    ఆరోజు నుంచి పేరుపడ్డ రచయితల పుస్తకాలు రెండు మూడు కొత్తగా వచ్చేయి. వాటిని తీసుకొని వారింటికి వెళ్ళేడు. పుస్తకాలు తీసుకొని ఆవిడ ప్రకాశాన్ని వెంటనే పంపివేయలేదు. వ్యాపారం ఎలా జరుగుతున్నది ఇంట్లో క్షేమ సమాచారాలన్నీ కనుక్కోంది. ప్రకాశం అంటే ఆవిడకి చాలా అభిమానం. కష్టపడి పని చేస్తాడన్న మెప్పుదల; వృద్ది లోకి రావాలసినవాడన్న నమ్మకం.
    ప్రకాశం వారి ఇంటికి వచ్చినప్పుడల్లా తాగేందుకు కాఫీయో, మజ్జిగ తేటో ఇచ్చి మరీ పంపుతుంది ఆవిడ. శారద మూడు గ్లాసులతో మజ్జిగ తేట తెచ్చింది. ముగ్గురూ ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పుకొంటూ తాగేరు. ఆ మాటల్లో శాంత పేరు కూడా వచ్చింది. అప్పుడు శాంత అక్కడ ఉన్నట్లు కాని వచ్చివెళ్ళినట్లు కాని ఆ తల్లీ కూతుళ్ళు చెప్పలేదు.
    ప్రకాశం మనసులో అదివరలో జరిగిన సంఘటన మెదిలింది. ఈ మధ్యనే ఆ కుర్రాడిని కూడా బజార్లో రెండు మూడుసార్లు చూసేడు. కాని, శాంత అతని స్నేహం వదిలి పెట్టిందన్న నమ్మకం చేత అతని గురించి పట్టించుకోలేదు. బజారు చివరగా ఉన్న హోటలు గుమ్మంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. అతనికి ఆ హోటలు వాళ్ళతో పరిచయస్తులో బంధువులో ఉండి ఉంటారనుకొన్నాడు ప్రకాశం.
    అనుమానం తీర్చుకొందుకు శారద ఇంటికి వెళ్ళేడు.
    "మీ శాంతా? ఇక్కడికి రాలేదే" అన్నారు వాళ్ళు.
    తిన్నగా బజారు చివర ఉన్న హోటలు వైపు నడక సాగించేడు ప్రకాశం. శాంత ఇలా అబద్దాలు చెప్పి ఇంటి నుండి వచ్చేందుకు ఆ సుదర్శనమే కారణం అయి ఉంటాడని అతని నమ్మకం. హోటలు ప్రొప్రయిటరు దగ్గర కెళ్ళి "సుదర్శనం గారు ఉన్నారండీ?' అని ప్రశ్నించేడు.
    "ఏ సుదర్శనం?"
    ప్రకాశం అతని రూపాన్ని వర్ణించేడు.
    "ఓ! సుబ్బరాజు గారి మాటా మీరంటున్నది? ఈరోజు గది ఖాళీ చేస్తానని చెప్పి ఉదయాన్నే సొమ్ము చెప్పించేరు. వెళ్ళిపోయేడో లేదో నాకు తెలియదు. ఉండండి. కనుక్కొంటాను." అన్నాడు.
    "ఏయ్ రంగన్నా! ఆ పన్నెండో నంబరు గదిలో అయ్యగారు ఉన్నాడో వెళ్ళిపోయేడో చూసిరా."
    "ఆ బాబుగారు ఎల్లిపోయారండి" అన్నాడు వాడు తిరిగివచ్చి.
    "ఎక్కడికి వెళ్ళి ఉంటారో చెప్పగలరా? చాలా అవసరమైన పని' అన్నాడు ప్రకాశం.
    "తెలియదండి. ఆయనకీ ఊళ్ళో ఏదో పనుంటుంది లాగుంది. అప్పుడప్పుడు వచ్చి, వారం పది రోజులు ఉంటుంటారు. అంతకన్న నాకేం తెలియదు. మళ్ళా వస్తే మీరు వచ్చేరని చెప్పమంటే చెప్తాను. మీ పేరు రాసివ్వండి."
    "అవసరం లేదులెండి. ఎలాగో లాగ ఆయన్నే కలుసుకొంటాను."
    ప్రకాశం బయటికి వచ్చేడు. శాంత సుదర్శనం తో వెళ్ళిపోతుందేమో అన్న శంక అతనికి ముల్లులా గుచ్చుకొంది. తిన్నగా రైలు స్టేషను కు దారి తీసేడు. బళ్ల వాళ్ళను, రిక్షా వాళ్ళను గుర్తులు చెప్పి , అలాటి అబ్బాయి ఏ రైలు లో వెళ్ళేడో చెప్పగలరా?" అని ప్రశ్నించేడు.
    ప్రకాశం చెప్తున్న గుర్తులు విని, "సదువుకున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు అంతా అలాగే ఉంటారు బాబూ! తెల్లారి లేచి ఎంతమంది పోతుంటారు! ఏరని చెప్పగలం?' అన్నారు.
    నాలుగు ఫ్లాట్ ఫారాల పైన ఇటు అటు తిరిగేడు. వెయిటింగ్ రూమ్ లోకి, బుక్ స్టాల్స్ లోకి తొంగి చూసేడు. ఇటు, అటు పోతున్న రెండు మూడు రైళ్ళు కదలడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రతి కిటికీ లోంచి శాంత లాటి ముఖాలు గల అమ్మాయిలే కనిపిస్తున్నట్లనిపించింది ప్రకాశానికి.
    ఒక పెట్టెలో ఒక అమ్మాయి బత్తాయి పండు వలుచుకుంటూ తొక్కలు పారవేయ్యడానికి గుమ్మం దగ్గరికి వచ్చింది.
    "శాంతా....శాంతా!' అరుస్తూ ప్రకాశం పరుగు పెట్టేడు.
    అ పిల్ల తిరిగి చూసింది.
    "ఎవరూ?' అన్నాడు ఆ పిల్లతో ఉన్న యువకుడు.
    "నాకు సరిగా పోలిక గుర్తు రావడం లేదు. దగ్గరికి రానిండి."
    "అంతలా తెలిసినట్లు పేరు పెట్టి పిలుస్తుంటే?"
    "అదే చిత్రంగా ఉంది."
    ప్రకాశం దగ్గరికి వచ్చేడు.
    "ఎవరు కావాలండీ?' ఆ యువకుడు ముందుకు వచ్చి ప్రశ్నించేడు.
    అతాని భుజాన్ని పట్టుకొని నించుని ప్రకాశం వైపు పరిశీలనగా చూస్తున్నది ఆ అమ్మాయి.
    "క్షమించండి . దూరం నుండి చూసి మా చెల్లెలను కొన్నాను." ప్రకాశం ముఖం దించుకొని వెళ్లిపోయేడు.
    "ఎక్కడ ఉందొ ఆ చెల్లెలు?' అనుకొన్నారు ఆ దంపతులు.
    శాంత కోసం ఎక్కడ వెతకడం? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకిలా చేసింది? ప్రకాశం పార్కులు బజార్లు సినిమా హాల్సు వరుసగా వెతుక్కుంటూ పోతున్నాడు.
    ఈ మధ్య కొంత కాలంగా శాంత అదోలా ఉంది. కొంపతీసి సాంబులా.... ప్రకాశం తన మనసులోకి వచ్చిన ఆలోచనను కాలు పట్టుకు ఈడ్చి పారేసేడు.
    శాంత అటువంటిది కాదు. దానికి జీవితం మీద ఎంతో మామకారం ఉంది. మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి. శాంత వంటి కలలు కనే పిల్లలు ఏమైనా చేసేందుకు వేనుతీయరు. ఒక్క ఆత్మహత్య తప్ప -- అనుకొన్నాడు ప్రకాశం.

                         *    *    *    *
    రెండు పట్టాలను నమ్ముకొని రైలు కళ్ళు మూసుకు పడుచుకు పోతున్నది. అసలు దానికి ఉన్నదే ఒక్క కన్ను. అదైనా పగలంతా విప్పనే విప్పరు. రాత్రులందు మాత్రం తప్పదన్నట్లు తెరుస్తుంది. అయినా ఎందుకో ఆ గుడ్డి రైలంటే మనుష్యులకు ఇంతా అంతా నమ్మకం.ఒక్కసారి దాని మీద కాలు పెట్టెక, ఇంక గమ్యస్థానం చేర్చే పూచీ దానిదే అన్నట్లు, హాయిగా నిద్రపోతారు. కడుపునిండా తింటాడు; కావలసినన్ని కబుర్లు చెప్పుకొంటారు; కొట్టు కొంటారు; తిట్టుకొంటారు; కేరింతలు కొట్టుకొంటారు; తుమ్ము కొంటారు; దగ్గు కొంటారు; పాటలు ,పదాలు పాడుకొంటారు. కాని, ఇవేమీ ఆ రైలుకు పట్టవు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముందు నుయ్యే ఉందో, గోయ్యే ఉందొ చూసుకోకుండానే పరుగులు పెడుతుంది.
    అందులో ప్రయాణం చేస్తున్నవాళ్ళ అదృష్టం వల్ల రైలు దారిలో నూతులు, గోతులు తవ్వకుండా రైల్వే వారు చూసుకొంటారు. "మీకేం అటువంటి బెంగ అక్కరలేదు. అవన్నీ మేం చూసుకుంటాం. మీరు కులాసాగా ప్రయాణం చేయ్యండని టిక్కెట్లు చింపి ఇస్తారు.
    అంత హామీ ఇచ్చినా థర్డు క్లాసు ప్రయాణీకులు ముక్కుతూ మూలుగుతూ రైల్వే వారిని తిట్టుకుంటూ,తమలో తాము కాట్లాడుకొంటూ  ప్రయాణం చేస్తారు.
    ఫస్టు క్లాసు వాళ్ళు దర్జాగా ప్రయాణం చేస్తారు. అందులో ఇద్దరు మనుష్యులు మాత్రమే ప్రయాణించే లాంటి చిన్న 'కూపే' వయస్సులో ఉన్న అమ్మాయి , అబ్బాయి జంటగా ప్రయాణిస్తే ఇంక చెప్పేదేముంది?  ఆ భూలోక స్వర్గాన్ని చూడ్డానికి దేవతలు దిగివస్తారన్నా తప్పులేదు.
    అటువంటి చిన్న పెట్టెలోనే ఓ అమ్మాయి కిటికీ అనుకోను కూర్చుంది. అబ్బాయి అమ్మాయి ఒళ్ళో తలపెట్టి పడుకొన్నాడు. అమ్మాయి నారింజ తొనలు వలుస్తూ , తానొకటి తింటూ, ఆ అబ్బాయి నోటి కొకటి అందిస్తూ మాట్లాడుతున్నది. సునాయాసంగా తడుముకోకుండా సమాధానాలు చెప్తున్నాడు ఆ అబ్బాయి.
    "ఇలా ఫస్టు క్లాసు లో మనిద్దరం తప్ప మరెవరూ లేకుండా ప్రయాణిస్తుంటే,ఈ మెత్తని పరుపు మీద కూర్చుని , రైలుతో పందెం వేసి ఓడిపోతున్న చెట్లనీ, చెట్లని ఓదారుస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న భూమిని చూస్తుంటే.... కొండల చాటు నుండి చెట్ల తోపులలోనుండి మనతో దాగుడు మూతలాడుతున్న ఆ చంద్రుడూ....ఓహ్! ఎంత హాయిగా ఉందని! బ్రతుకెంత తీయగా ఉందని! ఇలా శాశ్వతంగా ప్రయాణిస్తూ ఒకరి పక్కన ఒకరం.... ఇంక మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోగలిగితే...."
    ఆ అమ్మాయి మాట పూర్తి కాలేదు. పై నుండి ఎవరో తలుపు దబదబా కొట్టేరు. ఆ యువకుడు లేచి తలుపుతీసేడు. టిక్కెట్టు కలెక్టరు. రెండు ఫస్టు క్లాసు టిక్కెట్లు తీసి చూపెడు. రిజర్వేషన్ నంబర్లు నోటు చేసుకొని వాటిని తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు అతడు.
    "ఇంక రాత్రి పొడుగునా ఇలాగే తలుపులు బాదుకొంటూ వస్తారా?" కోపంగా అడిగింది ఆ అమ్మాయి.
    "తొమ్మిది దాటిన తరువాత రారు" అతడు సమాధాన పరిచేడు.
    "......ఆ ఏమిటి చెప్తున్నాను? ఎవరి కోపతాపాలతో ప్రమేయం లేకుండా, నిందాస్తుతులతో పని లేకుండా...."
    "లాభం లేదు, రాణీ, మనం ఇచ్చిన డబ్బుకి మించి ఒక్క అడుగు ముందుకి పోనీరు. ఈడ్చి పారేస్తారు. అంతేకాదు. ఈ రైళ్ళు అవిరామంగా నడుచుకుంటూ పోవు. వాటికీ ఓ గమ్యం అంటూ ఉంటుంది. అక్కడితో మొండి కేసినట్లు మరి కదలవు."
    "ఈ సంగతి నాకు తెలియకే అంటున్నాననుకొన్నారా? ఇది నా కల. నేనెన్నో తీరని కలలుకంతున్నాను. అవి తీరేవి కావని తెలిసినా, వాటి మీద మమత మాపుకోలేను. కాని ఇప్పుడు నా కలలు తీర్చిందికి మీరు ఉన్నారు. నాకింకేం కావాలి? ఇలా మీ కళ్ళలోకి చూస్తూ..."
    ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఆ అమ్మాయి అతని ఒళ్ళో తల పెట్టుకొని పడుకొన్నది. గాలికి ఎగిరెగిరి పడుతున్న అతని క్రాఫింగు సవరిస్తున్నది.
    'ఇలా జీవితం అంతా గడిపేయాలని నా కోర్కె."   
    "ఓ దానికేం? అదేం భాగ్యం!" అన్నట్లు ఆమె మీదికి వంగి ముద్దు పెట్టుకొన్నాడు అతడు.
    విచ్చుకొంటున్న గులాబుల్లా ఉన్న ఆమె బుగ్గలు మరీ ఎరుపెక్కాయి. చిరునవ్వు చాటున పలువరుస ముత్యాల కొనలా తళుక్కున మెరిసింది.
    "నాకీ ఆనందం తరిగిపోవాలని లేదు. ఈ మధుర స్వప్నం కరిగిపోవాలని లేదు. భూమి మీద కాలు మోపితే ఈ జీవితం మసిపోతుందేమో? ఈ అనుభూతి కరిగిపోతుందేమో! నాకు చాలా భయంగా ఉంది."
    "ఎందుకీ పిచ్చి భయం, రాణీ! మన ఆనందం చెడగొట్టిందికి ఎవరికి హక్కు ఉన్నది? అసేడు శీతనగరం హాయిగా తిరిగివద్దాం. కాశ్మీరు దాల్ సరస్సు లో బొట్ హౌనుల గురించివిన్నావా?"
    "ఆ"
    'కుఫ్రీ ఐస్ స్కీయింగు గురించి తెలుసునా?"
    ".........."
    "సిమ్లా వీధుల్లో స్నోఫాల్ అవుతున్నప్పుడు తిరిగేవా?"
    "..........."
    "డిల్లీ ఎర్రకోట మీద భారత పతాకం చూసేవా?"
    ".........."
    "ఆగ్రా తాజ్ మహల్... జైపూర్ రాజ మహల్.... కోణార్క్ శిల్ప సంపద.... మైసూర్ దసరా ఉత్సవాలు .... ఉదయ సంధ్యలలో కన్యాకుమారి ...పుట్టి నువ్వేం చూసేవు , రాణీ! జీవితమంతా మనముందు పరుచుకొన్నది. కావలసినంత స్వేచ్చ..... ఎంత ఖర్చు పెట్టినా తరగనంత డబ్బు,మనకేం కొదవని నీకా భయం!"
    ఆ అమ్మాయి అమృత సోనలైన ఆ మాటలు వింటూ అతని ఒళ్ళో అలాగే నిద్రపోయింది. అతడు ఆమె వైపు చూసి హుషారుగా ఒక చిరునవ్వు నవ్వేడు. లైటు స్వేచ్ అప్ చేసి నైట్ లైటువేసేడు. ఆ నీలం కాంతి లో ఆమె బుగ్గలు ఊదారంగుతో మిలమిల మెరుస్తున్నాయి.తనివితీరా బుగ్గల పై ముద్దు పెట్టుకొని, ఆమె పక్కగా కొంచెం చోటు చేసుకోని అతనూ పడుకొన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS