తమని ఎవరయినా కనిపెడతారేమోనని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారుగాని, వాళ్ళ ముఖం చూసిందిగాని వాళ్ళ మాటలని పట్టించుకుందిగాని అక్కడెవరూ లేరు, ఇవన్నీ వీళ్ళకి పుట్టిన అనుమానాలే.
పది నిమిషాల తరువాత.
అతను ఉన్న గది తలుపులు కాస్త తెరచుకున్నాయి. అతను గదిలోంచి బయటకి వచ్చాడు.
ఒకసారి అటూ ఇటూ చూసి గది తలుపులు వేసి బయట తాళం వేశాడు. తాళంచెవిని జేబులో వేసుకుని ముందుకుసాగాడు.
"హాచ్, హాచ్" అంటూ రెండు తుమ్ములు తుమ్మాడు అహోబిలం.
'రెండు తుమ్ములు, మంచిదే' అన్నాడు వర్ధనరావు.
'ఆ విషయం నాకూ తెలుసు'
'నాకు తెలుసులే, ఇక పద గుడికి వెళదాం' అన్నాడు వర్ధనరావు.
అహోబిలానికి నిజంగా తుమ్ములు రాలేదు. అతను గదిలోంచి బయటకి వచ్చి తాళంవేసి బయలుదేరటం చూసి తుమ్మాడు అలా.
వర్ధనరావు అది గ్రహించి 'రెండు తుమ్ములు మంచిదే' అన్నాడు.
తుమ్ముల గురించి వారి మాట్లాడుకున్న మాటలు నిజమైన మాటలు కావు. కోడ్ భాష ఉపయోగిస్తూ మాట్లాడుకున్న మాటలు అవి.
ఇరువురూ లేచి కొట్లచాటు నుంచీ, మనుషుల చాటునుంచీ అతనికి దూరదూరంగా నడుస్తూ అతనిని అనుసరించడం మొదలుపెట్టారు.
ఇదేమీ తెలియని అతను అలవాటు ప్రకారం ముందుగా కాఫీ హోటల్లోకి దారితీశాడు. ఎప్పటిలాగానే కాఫీ ఒక్కటీ తాగి హోటల్ లోంచి బయటకి వచ్చి గుడివైపు నడక సాగించాడు.
"ఇంక నేనిటు బయలుదేరతాను, నువ్వటు బయలుదేరు. చాలా జాగ్రత్తగా వ్యవహరించు. అతనిని నీవు వెంటాడుతున్నట్లు అతనికి ఏమాత్రం అనుమానం రాకూడదు, జాగ్రత్త" వర్ధనరావు తగ్గు స్వరంతో హెచ్చరించాడు.
'అలాగే సార్! చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను పొరబాటు చేస్తే చెడ్డపేరు వచ్చేది మీకుకదా సార్!'
'ఆ విషయం తెలుసు కదా!'
'తెలుసు కాబట్టే జాగ్రత్త వహిస్తాను. మీకెందుకు సార్. మీరూ వెళ్ళి మీ పని చూసుకోండి సార్! నేను వెళ్ళి వీడి విషయం చూస్తాను' అన్నాడు అహోబిలం.
'నువ్వు ముందు బయలుదేరు!' అన్నాడు వర్ధనరావు.
వెంటనే అహోబిలం ఆ యువకుడిని అనుసరిస్తూ బయలుదేరాడు.
అయిదు నిమిషాలు అక్కడే నుంచుని ఆ తరువాత వర్ధనరావు వెనకకి మరలాడు.
వర్ధనరావు వేగంగా అడుగులు వేస్తూ ఎంత తొందరగా వచ్చినా అతని రూముకి వచ్చేసరికి సరిగ్గా పన్నెండు నిమిషాలు పట్టింది.
అతని గది తలుపుల దగ్గర నుంచొని చుట్టూ వాతావరణాన్ని ఒకసారి పరిశీలించాడు వర్ధనరావు.
ఎవరిగోల వాళ్ళదిగా ఎవరి దోవ వాళ్ళదిగా కొన్ని కొట్లవాళ్ళు పని చూసుకుంటున్నారు. కొందరు అటూఇటూ ఎవరి మార్గాన వారు వెళుతున్నారు.
తనని ఎవరూ గమనించటంలేదని గ్రహించి "హమ్మయ్య" అనుకున్నాడు వర్ధనరావు.
అలవాటు ప్రకారం పైకే శబ్దం చేస్తూ నాలుగయిదుసార్లు ముక్కు ఎగబీల్చాడు.
వర్ధనరావు బజ్జీ ముక్కులోకి ఏ వాసనా ప్రవేశించలేదు,
ఇంక ఆలస్యం చెయ్యదలచుకోలేదు వర్ధనరావు.
"నేను గదిలోకి వెళ్ళిన తరువాత గంట మాత్రమే గదిలో ఉండి బయటకి రావాలనుకున్నాడు" అలా అనుకుంటూనే జేబులో ఉన్న తాళం చెవులగుత్తి బయటకి తీశాడు.
వర్ధనరావు సరిగ్గా ఐదు నిమిషాలు ట్రై చేసిన తరువాత ఒక తాళాల కప్ప ఊడివచ్చింది.
ఎందుకైనా మంచిదని మరీ అతి జాగ్రత్త పరుడయిన వర్ధనరావు మరోసారి నలుప్రక్కలా కలయజూసి తలుపు తీసుకుని గదిలో కాలు పెట్టాడు. లోపలికి వెళ్ళగానే గది తలుపులు మూసుకున్నాడు.
వర్ధనరావు జేబులో టార్చ్ లైటు ఉన్నది! ఇప్పుడు దాని అవసరం అనవసరం. గదిలో వెలుగుతున్న బల్బు ఉన్నది.
అతను తన గదిలో ఉన్న బల్బు స్విచ్ ఆర్పటం మర్చిపోయాడో లేక కావాలనే ఉంచాడో తెలియదుకానీ, లైటు మాత్రం వెలుగుతున్నది.
వర్ధనరావు అక్కడే నుంచుని గది నలువైపులా పరికించి చూశాడు.
గోడకి ఉన్న మేకులకి ఒక చొక్కా, లుంగీ, టవలూ, బనీను తగిలించి వ్రేలాడుతూ ఉన్నాయి.
బల్ల మీద మంచినీళ్ళ కూజా, బోర్లించిన గాజు గ్లాసూ, సగం విరిగిన చిన్న అద్దమూ ఉన్నాయి.
గదిలో మడతమంచం ఉంది. దానిమీద ఒక దిండూ, దుప్పటి మాత్రమే ఉన్నాయి. ప్రత్యేకంగా అతని సామాను గురించి చెప్పాలంటే చాలా చిన్న తోలుపెట్టె మద్దెల ఆకారంలో ఉన్న గోధుమరంగు గుడ్డతో కుట్టిన బ్యాగ్ ఉన్నాయి.
ఒక వారపత్రిక క్రిందపడవేసి ఉంది. అంతకుమించి ఆ గదిలో ఏమీలేవు.
వర్ధనరావు ముందుగా మడతమంచమూ, దుప్పటీ, దిండూ అన్నీ పరిశోధించి చూశారు.
దిండు, దుప్పటీ, మడతమంచమూ మామూలుగానే ఉన్నాయి.
ఈ తఫా,
గోడకి తగిలించిన లుంగీని షర్ట్ ని చేతిలోకి తీసుకుని వాటికి రహస్య జేబులు గానీ, మరేమైనా ఉన్నాయేమో అని తడిమితడిమి చూశాడు.
లుంగీ, షర్ట్, బనీను మాసిపోయి కంపుగొడుతున్నాయి. అంతకుమించి వాటిల్లో ఏమీ కానరాలేదు.
ఈ తఫా,
వర్ధనరావు బల్ల దగ్గరికి వచ్చాడు. కూజాలోకి లైటువేసి చూశాడు. కూజాలో నీళ్ళు తప్ప వజ్రాలూ, రత్నాలూ ఏమీలేవు. ఒక బొట్టు నీళ్ళు నాలికమీద వేసుకుని చూశాడు. అవి అచ్చం మంచినీళ్ళులాగానే ఉన్నాయి.
గాజు గ్లాసుని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ త్రిప్పి చూశాడు. గాజు గ్లాసులో కూడా ఏ ప్రత్యేకతా లేదు. అది ముమ్మూర్తులా గాజుగ్లాసు. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు.
ఈ తఫా,
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు 'నిప్పు వీరుడు' సినిమాలో లాగా అద్దం వెనుక ఏమన్నా రహస్యం ఉందేమోనని అద్దాన్ని అటూ ఇటూ త్రిప్పి చూశాడు.
