Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 30


    ఆచార్లుగారూ బొబ్బిలి రాజ్యస్థాపన అలా జరిగింది. ఆ రాజ్యం సరిహద్దులమీద రేగులవలస (యిప్పటి విజయనగరం) రాజ్యం వుంది అది సువిశాలమయింది. వాళ్ళ మూల పురుషుడు మాధవవర్మ. చరిత్రలో వున్న నలుగురు మాధవవర్మల్లో యెవరో తెలియదు. అతనికి కుమిలి భోగాపురం ఫిర్కాలు యిజారాగా వచ్చినాయి. తరువాత అది సామంతరాజ్యం అయింది.
    బొబ్బిలికధకు యిది నాందీప్రస్థావన మాత్రమే. అసలు కథ యిహ నించీ మొదలు అవుతుంది అని చెప్పింది మిస్ మార్లిన్ ఆమె గుండెల నిండా వూపిరి పీల్చి క్షణం విశ్రాంతికోసం ఆగింది. బొబ్బిలికథ వినాలన్న ఆతృతతో ఆపాటి ఆలస్యాన్ని కూడా నేను భరించలేకపోయాను.
    
                          8
    
    రంగడు రంకు పోదామంటే రత్తి బిడ్డలు కావాలందిట. గమ్యాలు వేరయినా లక్ష్యం ఒకటే అయింది. ఒకందుకు షేర్ ఖాను లింగప్పదొరను రాజును చెయ్యాలనుకున్నాడు! ఒకందుకు లింగప్పదొర రంగారావు బిరుదుతో రాజు కావాలనుకున్నాడు. రంగవాక ఆయన రాజు అయ్యే ఘట్టానికి రంగస్థలమయింది కాబట్టి బిరుదు రంగారావు అయిందేమో రాజ్యం చిన్నదే అయినా, దాని వైశాల్యం యిరవై చదరపుమైళ్లే అయినా, వున్నవి పన్నెండు గ్రామాలే అయినా అది రాజ్యమే అయింది. లింగప్ప దొర రాజే అయ్యాడు. యే జమీందారుగానో వుండిపోలేదు. యిది ఆ పన్నెండు గ్రామాల ప్రజలకు చాల సంతోషమయింది. స్వేచ్చ వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. ఆనందంతో పండుగ చేసుకున్నారు. స్వంత పతాకం యెగురవేసుకున్నారు.
    ఇది రేగులవాక. (యిప్పటి విజయనగరం) ప్రభువులకు అంతగా నచ్చలేదు. అంతకు పూర్వమే వాళ్ళచుట్టూ చిన్ని చిన్ని రాజ్యాలున్నాయి. దేవులపల్లి, రాజమండ్రి, టెక్కలి, రాజాము, సామర్లకోట, శ్రీకాకుళం యలమంచిలి, వుదయగిరి, పాలకొండ యిలాంటివి. వీటిలో కొందరు జమీందారులు, కొందఱు రాజులే కాని అంతంతమాత్రపు రాజులు.
    వీళ్ళతో యీదుకు రావటం వారికి కష్టంగానే వుంది. కశింకోట పిఠాపురంవారికి మొదటినించి వ్యతిరేకం.
    ఈ రాజ్యాలన్నింటినీ కలిపి మహేంద్రగిరి, మలయగిరి, ఖండగిరి, వుదయగిరి, పాలకొండ, సూదికొండ, పాపికొండల వంటివి వున్నాయి. యివన్నీ కొండలు యిక నదులుకూడా వున్నాయి. ఋషికుల్య, వంశధార, లాంగుల్య, యింద్రావతి, శబరి, శారద, తెలివాడు, బ్రాహ్మణి నదులు  వున్నాయి గంజాం కళింగపట్నంలాంటి రేవు పట్నాలున్నాయి.
    ఇవన్నీ సహజ వనరులు. ఈఈ వనరుల మధ్య అనేక రాజ్యాలు. యీ వనరులు వినియోగించుకోవటానికి అందరికీ తాపత్రయం సహజం. మన అవసరాలను బట్టి ప్రకృతి తన సంపదను పంచియివ్వదు. దాని స్థితిని అనుసరించి మనం సర్దుకుపోవాలి.
    అలా సర్దుకుపోగలిగితే తగవులు యెందుకుంటాయి? యీ చిన్ని చిన్ని రాజ్యాలమధ్య లెక్కలేనన్ని కీచులాటలున్నాయి. అదే వాళ్ళ పతనానికి దారి తీసింది. వాటిమధ్య వుంది విజయనగరం.
    మిస్ మార్లిన్ చెప్పకముందు యీ విషయాలు నేను కొన్ని చదివాను. బొబ్బిలి కధ అర్ధం కావాలంటే విజయనగరం కథ పూర్వరంగం కూడా పైపైన తెలిసి వుండాలంటోంది మిస్ మార్లిన్.
    పూర్వరంగంలో విజయనగరం గురించి  నాకు తెలిసింది కొంత వుంది.
    బుందేల్ ఖండ్ నించి విజయభూస్ అనే ఆయన వచ్చాడు. ఆ వంశీయులే విజయనగర ప్రభువులు, వీళ్ళలో ఒక మాధవ వర్మ వున్నాడు. ఆచార్య నాగార్జునుల కధలాగే మాధవ వర్మల కధకికూడ చరిత్రలో స్పష్టమయిన రూపకల్పన లేదు. మొత్తం నలుగురు మాధవవర్మలు.
    ఏ మాధవవర్మ అయితేనేం కాని ఒక మాధవవర్మ విజయవాటక (విజయవాడ) వెళ్ళి కృష్ణాతీరంలో కనకదుర్గ గురించి తపస్సు చేశాట్ట. ఆమె ప్రత్యక్షమయిందిట. కనకవర్షం కురిపించిందట.
    దయగల తల్లి అటువంటి పని మళ్ళీ మరొకసారి చెయ్యకూడదూ! ఆమె కనకవర్షం కురిపిస్తే మాధవవర్మ మొనగాడయ్యాడు.
    మనం చాల వర్షాలు చూస్తాం. కాని కనకవర్షం యెన్నడయినా చూస్తామా? నాలాంటివాళ్ళు వివాదగ్రస్తమయిన చరిత్ర విషయాల్లో నా నవలలు నిర్ణయాత్మకమయిన పాత్ర సహించాలన్న తపనతో యేదో వ్రాసి విమర్శకుల అక్షయ తూణీరాల్లాంటి మాటలతో చివాట్లు పెడుతూ వుంటే అదే వరం అనుకోవచ్చు. ఆనందబికారిలా హాయి హాయి అనుకుంటూ ఆ వర్షంలో ముప్పెరలా తడవొచ్చు. నాయకులు కురిపించేది వాగ్దానాల వర్షం! జనం కురిపించేది ఓట్ల వర్షం.)
    ఇట్లా యెన్నో వర్షాలు చూస్తున్నాం కాని ఆనాటి కనకవర్షం మనం కూడాలేదు. యిదొక ఫాంటసీ కావచ్చు.
    ఉత్తి కనకవర్షం కాకుండా గుహల్లోంచి సైన్యం వచ్చిందట. గుర్రాలు, యేనుగులు, ఒంటెలు, లొట్టెపిట్టలు వచ్చాయిట బయటకు.
    అవన్నీ తీసుకుని మాధవవర్మ రాజ్యం స్థాపించాడు. ముందు కుమిలి, భోగాపురం ఫిర్కాలు వాళ్ళ అధీనం అయినాయి యిజారాకు యెత్తుకున్నారు. యెలాగైతేనేం రాజ్యం అయింది. జుల్ ఫికార్ గుర్తు ముక్కోణం జండా యెగిరింది.
    బొబ్బిలికీ, విజయనగరానికీ సరిహద్దులున్నాయి. కోడిపందాలలో విజయరామరాజు కోడి ఓడిపోవటంవల్ల యుద్ధం ప్ర్రారంభమయిందన్న వూహ. అసత్యానికి అక్కో, చెల్లెలో అవుతుంది. అది నిజానికి ఆధారం లేని సత్యమనికూడా అనుకోవటానికి లేదు. పూర్తి అసత్యం.
    వీళ్ళు సెలయేళ్ళని గడ్డలంటారు. గడ్డనీరు బొబ్బిలివారికి పుష్కలంగా వుంది విజయనగరానికి లేదు. వాటిని పంచుకోవటంలో ముందు సరిహద్దు వ్యవసాయదారులకు తగవు ప్రారంభమయింది. ఆ తరువాత అది గ్రామాలస్థాయిలో వ్యాపించి రాజ్యాలమధ్య వివాదం అయింది.
    రెండో కారణం విజయరామరాజుని గోపాలకృష్ణ రంగారావు విదేశీయుడని అవహేళన చేశాడు. తాను అచ్చమయిన ద్రవిడసంతతి వాడినని ఆయన నమ్మకం. నా రాజ్యంతో పోల్చుకుంటే నీ రాజ్యం గోచి పాత అంత లేదు, నువ్వు నన్ను కొక్కిరిస్తావా? అని విజయరామరాజు ఆలోచన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS