రోజులు గడిచిపోతున్నాయి. అర్జునరావుగారు సరిగ్గా అన్నం తినటం మానేశారు. రాత్రిళ్ళు నిద్రపట్టటం లేదు.
ఎక్కడ వుంది? ఏం చేస్తోంది?
"పోనీ పేపర్లో వేయిస్తే?" అని సలహా చెప్పింది అనసూయమ్మగారు ఒకరోజు.
"దయవుంచి నాకిలాంటి సలహాలు చెప్పకండి. ఇది తండ్రీ కూతుళ్ళ మధ్య ప్రచ్చన్న యుద్ధం. నేను ఓడిపోతే నాకు నామోషీకాదు. తన భవిష్యత్తుక్కు దెబ్బ. తన పంతం మీద ఎన్నాళ్ళు వుండగలదో చూస్తాను."
* * *
"సారీ! మిమ్మల్ని మోసం చేశాను" అంది హరిణి. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండివున్నాయి ఆ పరిస్థితుల్లో...."
"చాలా అందమైన మోసం" అన్నాడు మహేష్ పెదవుల మీద చిరునవ్వుతో.
"కోపమొచ్చిందా?" అంది వ్రేళ్ళతో అతని జుట్టు సవరిస్తూ.
"కొంచెం."
"కోపం పోవాలంటే ఏంచెయ్యాలి?"
"మొరటుగా చెప్పనా, మృదువుగా చెప్పనా?"
"ముద్దుముద్దుగా చెప్పు."
ఆమె రెండు భుజాలమీదా చేతులువేసి, ముఖంలోకి చూసి "యిక్కణ్ణుంచి వెళ్ళొద్దు" అన్నాడు.
"అమ్మో!" అంది హరిణి. ఆమె యింటిని విడిచిపెట్టొచ్చి నెలరోజులు దాటిపోయింది. డాడీ పదేపదే గుర్తుకొస్తున్నాడు. పాపం ఎలా వున్నాడో! ఆయనంటే తనకు ప్రాణం, తనంటే ఆయనకీ.
"వెళ్ళి మళ్ళీ తొందరలో వచ్చేస్తాను."
"ఎలా?"
"కష్టపడి చదివి, ఎంట్రెన్స్ రాసి మెడిసిన్ లో సీటు సంపాదిస్తాను."
"నీకు మెడిసిన్ అంటే ఇష్టం లేదన్నావుగా."
"లేదు"
"మరి?"
"మీ కోసం?"
"సీటు రాకపోతే?"
హరిణి నవ్వింది. "నా పట్టుదల మీకు తెలీదు. ఒక విషయం అనుకున్నానంటే సాధించి తీరవల్సిందే."
"ఒకవేళ సీటు ఇక్కడే రాకుండా యితర మెడికల్ కాలేజీల్లో వొస్తే?"
"ఎలాగో ఓలా ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాను."
"నిజంగా....నిజంగా....తిరిగి వస్తావు కదూ" అతని గొంతు వొణికింది.
"రాకుండా వుండలేను. మీకోసం కాదు. నా కోసం."
"ప్రామిస్?"
"ప్రామిస్."
చేతిలో చెయ్యివేసింది.
* * *
సునందను కలిసింది.
"సునందా! ఐయాం వెరీ వెరీ సారీ?"
"కంగ్రాట్యులేట్ యు" అంది సునంద. ఆమె ముఖంలో కానీ, మాటల్లోకానీ ద్వేషభావం లేదు.
"కోపమొచ్చిందా?"
"లేదు. నన్ను నేను సరిదిద్దుకున్నాను." నిర్మలంగా, నిష్కల్మషంగా నవ్వింది.
హరిణి ఆమె హృదయం అర్థం చేసుకుంది. ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుని నొక్కుతూ "నన్ను మర్చిపోవుకదూ" అంది.
"ఎలా మర్చిపోతాను? నువ్విక్కడే వొచ్చి ఎప్పుడూ కళ్ళెదురుగా కనిపిస్తూనే వుంటావుగా."
సునంద గొంతులో "నువ్వనుకున్నది సాధించగలవు" అన్న నమ్మకం ధ్వనించింది.
మరునాడు ఉదయం మహేష్, సునంద కలిసి హరిణికి రైలెక్కించారు.
"ప్రియా!" అని పిలవబోయాడు.
గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది.
"హరిణీ!" అనబోయాడు. పెదవుల వెనకే ఆగిపోయింది.
అలాగే ఆమె....
"మహేష్! అనబోయింది బయటకు వినబడలేదు.
"బావా! అని పిలవబోయింది. గొంతు మూగబోయింది.
కళ్ళు తడిశాయి.
రైలు వెళ్ళిపోయింది.
"రా! మహేష్! ఇంటికేగా" అంది సునంద బయటకు వొచ్చాక కారు ఫ్రంట్ డోర్ తెరుస్తూ.
ఈ సారి అతను కాదనలేదు. కారెక్కి మౌనంగా కూర్చున్నాడు.
సునందకూ, తనకూ మధ్య ప్రమేయం లేకుండా జరిగిన కథ అతనికి తెలియదు. కారు కదిలింది.
* * *
అర్జునరావుగారు గదిలో ఒంటరిగా కూర్చుని వున్నాడు. టీపాయ్ మీద చల్లారిపోయిన టీ వున్న కప్పు, సగం సగం తిరగేసి పడేసిన పత్రికలు, చేతిలో ఆరిపోయిన పైప్.
తలుపు దగ్గర ఏదో నీడ కదిలినట్లయింది.
తలెత్తి చూసి పులకించినట్లయ్యాడు. ఎవరికోసం నిద్రాహారాలు మాని నెలరోజుల బట్టీ కలవరిస్తున్నాడో_ ఆ హరిణి. తన కూతురు, తన గారాల పట్టి.
ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేవబోయి, అంతలోనే తమాయించుకుని "ఓహో! వచ్చావన్నమాట" అన్నాడు.
ఆమె గుమ్మందగ్గరే నిలబడి తండ్రివంక చూస్తోంది. ఎంత చిక్కిపోయాడు! ఎంత దిగులు ఆ మొహంలో?
కళ్ళు చెమ్మగిల్లాయి. "డాడీ!" అంటూ వెళ్ళి ఆయన చేతుల్లో వాలిపోదామనుకుంది.
కాని....
నిగ్రహించుకుంది. "వొచ్చాను" అంది బింకంగా.
ఎంత చిక్కిపోయింది పిచ్చినాన్న! ఆ చిలిపితనమంతా ఏమయింది! కళ్ళలో కాంతంతా ఏమయిపోయింది.
"దగ్గరకు రామ్మా. ఇలా నా దగ్గర కూర్చో" అందామనుకున్నాడు. కాని అనలేదు.
"మెడికల్ ఎంట్రెన్స్ రాసే విషయం ఏం నిర్ణయించుకున్నావు" అన్నాడు గంభీరంగా.
"రాస్తాను" అని అక్కడ నిల్చోకుండా మెట్లెక్కి మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయింది.
10
ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చకచక జరిగిపోయాయి.
హరిణి మెడికల్ ఎంట్రెన్స్ కు అప్లై చేసి అహోరాత్రులూ చదివింది. కోచింగ్ కూడా తీసుకుంది. ఇద్దరి ముగ్గురి దగ్గర విడివిడిగా కోచింగ్ తీసుకుంది.
