ఈ లోపల మహేష్ వారానికి రెండు మూడు చొప్పున ఉత్తరాలు రాస్తూనే వున్నాడు.
ఆమె ఆ వుత్తరాలు - కవర్లు కూడా చించేది కాదు. తీసి చదివితే మనసు స్వాధీనం తప్పిపోతుందని భయం. కవరు రాగానే ముద్దు పెట్టుకుని, భద్రంగా షో కేసులో దాచుకునేది.
మళ్ళీ పుస్తకాలు , చదువు.
ఎంట్రెన్స్ కు కొన్ని వేల మంది హాజరవుతారనీ, సెలక్ట్ అవటం అంత తేలిక కాదనీ ఆమెకు తెలుసు.
అందుకని ఏకాగ్రత చెదరకుండా చూసుకుంది.
ఎగ్జామినేషన్ సెంటర్ గుంటూరు ఎప్లయి చేసుకుంది.
ఎంట్రెన్స్ పరీక్ష రోజున ప్రొద్దుటే వొచ్చి తలుపు తట్టిన హరిణిని చూసి "ఏమ్మా! నా లెటర్స్ కు జవాబివ్వలేదు గానీ, అసలు మీ అమ్మాయిలు....." అంటూ కోపాన్నీ ప్రదర్శించబోయాడు మహేష్.
అమాంతం అతని మీదకు దూకి గట్టిగా పెనవేసుకు పోవాలనుకుంది. కాని ప్రక్కన చంద్రం వుండటం చూసి తమాయించుకుంది.
"అంత కోప్పడకండి సార్- నే చేసిన ప్రతిదానికీ కారణం వుంటుంది. అని చంద్రం వంక తిరిగి "ఏవండీ! కులాసాగా వున్నారా?" అని పలకరించింది.
"కులాసాగానే వున్నాను మరదలు పిల్లగారూ! ఈసారి కూడా ఏదయినా టూర్ చూసుకోమ్మంటారా కొంపదీసి" అన్నాడు తను.
ఆమె చిరునవ్వు నవ్వి, "అక్కర్లేదు లెండి. ఫ్రెండ్స్ తో వొచ్చాను. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. సాయంత్రానికి వెళ్ళిపోతాము" అంది.
మహేష్ ముఖంలోకి కళ్ళలోకి ఆర్తిగా చూసింది. "నువ్వెంత చిక్కిపోయావు మహేష్" అనుకుంది.
"నువ్వు ఎంత .....శుష్కించి పోయావు! ఈ చదువుకోసమేనా?" అనుకున్నాడు మహేష్ బాధగా.
ఆరోజు పరీక్ష బాగా రాసింది.
* * *
హరిణికి ఏమ్. బి.ఎస్ లో సీటు వచ్చింది. ఆమె ఆలోచనలు ధరించిన విధంగా - అన్నీ కలిసివోచ్చి సీటు గుంటూరులోనే దొరికింది.
అర్జునరావు గారు ఆమెను తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు.
ఇహ అక్కడ్నుంచి .....
వాళ్ళకు కాలం తెలియటం మానేసింది. మహేష్ క్లినిక్స్ లోకి వెళ్ళినా , ఎలా అయినా వీలు చూసుకుని ఆమెను కలుసుకునేవాడు. లేకపోతే యిద్దరూ కలిసి కాలేజి ఎగ్గోట్టేసేవారు. ఇద్దరికీ చదువు మీద ధ్యాస పోయింది.
కాలేజిలో అందరి కళ్ళు వీళ్ళ మీదే.
అందరి చర్చా వీళ్ళ గురించే.
అయిదారుసార్లు ఫ్రోఫేసర్లు మహేష్ ని పిలిచి మందలించారు. "మహేష్! నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ వి. బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంటువు అవుతావనుకున్నాం. రానూరానూ చదువులో నీ ఆసక్తి సన్నగిల్లు తోంది. నువ్వు మళ్ళీ పికప్ చెయ్యాలి.
మహేష్ కు కోపం వచ్చి పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చునేసరికి హరిణి వొచ్చి బుక్స్ అవతలకు విసిరేసేది - "నీకు నేనేక్కువా? పుస్తకాలేక్కువా?" అంటూ.
మహేష్ రోషం మరిచి పోయి నవ్వేసేవాడు.
ఆరోజు ఎగ్జిబిషన్ లో మహేష్ ని కలుసుకున్న వాళ్ళ వూరి మనిషి తరచూ పని మీద ఇక్కడికి వొచ్చేవాడు. అతను - వీళ్ళిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ వుండటం, అతనామెను నెత్తి కెక్కించుకుని త్రిప్పుతూ వుండటం చూసి ఆ వార్తను మహేష్ తండ్రికి చేరవేశాడు.
హాస్టల్ వార్డెన్ హరిణికి హెచ్చరికలు చేసిచేసి విసుగెత్తిపోయి, ఆమె తండ్రికి ఉత్తరం రాసేసింది.
అర్జునరావుగారు ఆ ఉత్తరం చదివి మండిపడ్డారు. "దీన్లో ఎక్కడో లోపల వుంది. ఎప్పటికప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే వుంది. చెక్ చెయ్యాలి, దీని అల్లరికి పుల్ స్టాప్ పెట్టాలి." అనుకుంటూ కారుమీద బయల్దేరాడు.
విషయం తెలిసి అర్జునరావు గారికి చాలా కోపమొచ్చింది.
ఈ పిల్లను తాను చాలా ప్రాణంగా పెంచాడు. జీవితంలో ఓ యోధుడి లాంటివాడయి ఉండి కూడా స్వానుభవం, స్వార్ధం , ప్రలోభం అనేవి మరిచి పోతూ ఆమె భవిష్యత్తు కోసం కఠినత్వాన్ని కూడా పెంపొందించుకుని, గుండెలోని కన్నీళ్ళని బయటకు ఉబకనియ్యకుండా , ఆమె భవిష్యత్తు తీర్చిదిద్దటానికి సాయపడుతున్నాడు. కాని .......తన యిష్టానికి వ్యతిరేకంగా ఆమె ప్రవర్తిస్తూనే వుంది.
ఉద్రేకం ఆపుకోలేక కారులో గుంటూరు బయల్దేరాడు - సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ.
అక్కడికి చేరుకునేసరికి కను చీకటి పడింది. హటాత్తుగా ప్రత్యక్ష మైన తండ్రిని చూచి హరిణి విస్తుపోయింది. ఏదో జరిగి వుంటుందని ఊహించింది.
"హాయ్! డాడీ! ఎప్పుడొచ్చావ్?" అంది పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ.
"హాయ్ లేదు. గీయ్ లేదు నే విన్నది నిజమేనా?" అనడిగాడు అర్జునరావు సూటిగా.
"దేన్నీ గురించి డాడీ! నువ్వు విన్నది?"
"నీ ప్రేమ వ్యవహారం గురించి."
"నిజమే అయి వుంటుంది డాడీ."
"అయి వుంటుంది. అయితే నిజమే నన్నమాట."
"అంతే కదా డాడీ?"
"ఎవర్నడిగి ఈ పని చేశావు?"
"సారీ డాడీ. ప్రేమించుకున్నవాళ్ళెవరూ ముందుగా పర్మిషన్ తీసుకుని ప్రేమించరు."
"పోనీ తర్వాతయినా పర్మిషన్ తీసుకోవాలి కదా."
"అది పెళ్ళికి , నేను ఒట్టు వేసి చెబుతున్నాను. నీ అంగీకారం లేకుండా నీ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకోను."
"అయితే పెళ్ళి గురించి అప్పుడే ఆలోచిస్తున్నావన్నమాట."
"ఆలోచించటం లేదు డాడీ. నీ ప్రతిష్ట కు భంగం కలిగించే పని చెయ్యనని చెబుతున్నాను."
"ఇది ప్రతిష్టకు భంగం కలిగించే పని కదా?"
"కాదు" అన్నది హరిణి చాలా ఆత్మ విశ్వాసంతో."
"ఎందుకని?"
"నా వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం వుంది కాబట్టి."
"వ్యక్తిత్వం. చాలా పెద్ద పెద్ద పదాలు వుపయోగిస్తున్నావే."
"నేనిప్పుడు కొంచెం పెద్దదాన్నయినాను డాడీ."
"అలాగా?' అన్నాడు అర్జునరావుగారు కోపంగా. కాని కోపాన్ని తగ్గించుకుని "ఇక్కడో పాయింటుంది" అన్నాడు.
"ఏమిటి డాడీ"
