Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 30

 

    ఆర్మీలో గొప్ప డాక్టరుగా అతనికి మంచి పేరుండేది.
    జీవితంలో ఎన్నడూ కంటతడి పెట్టని అతని కళ్ళనుండి ఒకటి రెండు నీటి బిందువులు రహస్యంగా రాలాయి.
    "ఛీ! ఏడుస్తున్నారా - అంత గొప్ప డాక్టరై వుండీ."
    "లేదు" అనాలనుకున్నాడు. అతని కవళికలు దాచలేకపోయాయి.
    "ఒక కోరికండీ" అన్నదామె.
    "ఏమిటి?"
    "అమ్మాయిని మీలాగే - ఊహు మీకన్నా గొప్ప డాక్టర్ని చెయ్యాలి. "
    "నేను గొప్ప డాక్టర్నేం కాదు. నిన్ను కాపాడుకోలేకపోతున్నాను." అతని హృదయం ఘోషించింది.
    "మాట్లాడరేం?"
    "అలాగే."
    "ప్రామిస్"
    "ప్రామిస్" ఆమె చేతిలో చెయ్యి వేశాడు.
    "అమ్మాయి చాలా పెంకిది. మీ మాట వినకపోతే?"
    "వినేటట్లు చేస్తాను."
    కృశించిపోయి వున్న ఆమె ముఖంలో ఓ సంతోష రేఖ మెరిసింది.
    ఆ తర్వాత కొద్ది రోజులుకే ఆమె చనిపోయింది.
    అర్జునరావుగారికి ఆ షాక్ నుంచి కోలుకునేందుకు చాలా రోజులు పట్టింది.
    హరిణి మొదట్నుంచి చురుకైన పిల్లే. చదువులో ఫస్ట్. ఆటపాటల్లో అగ్రశేణిగా నిలిచేది. తండ్రి ఆమెకు నాట్యం కూడా చెప్పించసాగాడు.
    టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో డిస్టెన్ క్షన్ మార్కులతో ప్యాసయింది.
    కూతుర్ని ఎంత ప్రేమగా చూసినా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వుండేవాడు. క్రమశిక్షణలో వుంచుతూ వుండేవాడు. తాను అనుకున్న ప్రకారం ఆమెతో చేయించాలనుకున్నప్పుడు మనసులోని ప్రేమను బయటకు కనపడనిచ్చే వాడు కాదు.
    హరిణి యింటర్ లో మేధామేటిక్స్ తీసుకుంటానంది.
    "బయాలజీ తీసుకో" అన్నాడు అర్జునరావుగారు.
    హరిణి కళ్ళముందు ఫ్రాగ్స్. కక్రోచేస్ ఎర్త్ వర్మ్స్ కదలాడాయి. "డాడీ! ప్లీక్. వొద్దు నాకా సబ్జక్ట్ యిష్టం లేదు " అంది జాలిగా.
    "నో మైడియర్ యాంగ్ గర్ల్. డాన్స్ లో , గేమ్స్ లో నువ్వు చెప్పినట్లు ఒప్పుకున్నాను. ఈ విషయంలో నువ్వు కాదనటానికి వీల్లేదు."
    తండ్రీ కూతుళ్ళకు చాలా సేపు వాదులాట జరిగింది. అర్జునరావుగారు తనపట్టు కొంచెం కూడా సడలించలేదు. చివరకు హరిణి నిస్సహాయంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది.
    "అమ్మాయి కంత యిష్టం లేనపుడు ఎందుకంత బాధపెట్టడం బాబుగారూ!" అంది అనసూయమ్మ గారు. ఆమె ప్రపంచంలో ఎవరూ లేక, అర్జునరావుగారి భార్య వ్యాధి గ్రస్తురాలాయినప్పట్నుంఛి ఆ యింటిని కనిపెట్టుకుని ఉంటోన్న వృద్దురాలు. హరిణి ఆలనాపాలనా ఆమె చూస్తూ వుంటుంది.        
    కొన్ని విషయాల్లో పిల్లలు తప్పొప్పులు తెలుసుకోలేరు  అనసూయమ్మగారూ. మనం కఠినంగా వున్నట్లు కనిపించినా వాళ్ళ జీవితాలు తీర్చి దిద్దవలసిన బాధ్యత మనకుంది" అన్నాడు అర్జునరవుగారు.
    రెండు మూడు రోజులు పోయాక హరిణి బయాలజీ గ్రూప్ తీసుకునేందుకు అంగీకరించింది విధిలేక.
    రెండేళ్ళు ఏ గొడవలూ లేకుండా జరిగిపోయాయి.
    సహజంగా చాలా చురుకైన పిల్ల కాబట్టి - యింటర్ ఫస్టు క్లాసులో ప్యాసయింది. అదీ చాలా మంచి మార్కులతో.
    మళ్ళీ తండ్రి కూతుళ్ళ మధ్య యుద్ధం ప్రారంభమయింది.
    "నువ్వు మెడికల్ ఎంట్రెన్స్ కి ప్రిపెరవ్వాలి" అన్నాడు అర్జునరావుగారు.
    డేడ్ బాడీస్, యింజక్షన్లూ, అపరేషన్లూ .....హరిణికి కడుపులో దేవినట్లయింది.
    "సారీ డాడీ! నే మిడికల్ ఎంట్రన్స్ రాయను" అంది.
    నువ్వామాట అంటావని నాకు తెలుసు. కాని యీ విషయంలో నువ్వు నా మాట అంగీకరించి తీరాలి" అన్నాడాయన. అయన మాటల్లోని పట్టుదలకు హరిణి కొంచెం భయపడింది.
    "ఒకవేళ నేను లాంచన ప్రాయంగా ఎపియరాయి ఎగ్జాం సరిగ్గా రాయకపోతే " అనడిగింది.
    "నా శిక్షణలో పెరిగిన పిల్లగా - నీ మనస్సులోని అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చెయ్యటం నీకు వొస్తే వొచ్చు గానీ, అంత చౌకబారు పన్లు చెయ్యవని నాకు తెలుసు."
    "పోనీ ఎంత కష్టపడి చదివినా నాకు సీటు రాకపోతే?"
    "లక్షా, లక్షాన్నర రూపాయలు వెచ్చించయినా డొనేషన్ కట్టి ఎక్కడో అక్కడ నీకు సీటు సంపాదిస్తాను."
    తండ్రి కూతుళ్ళు ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు. ఈసారి హరిణి రాజీ పడదల్చుకోలేదు. తన జీవితాన్ని తేలిగ్గా, ఆడుతూ, పాడుతూ , ఎక్కువ బరువు బాధ్యతలు లేకుండా గడిపెయ్యలని ఆమె ఆకాంక్ష. డాక్టరు వృత్తి స్వేకరిస్తే - ఒక బాధ్యతకు అమ్ముడయిపోయినట్లు. టైము తన అదీనంలో లేకుండా, కేవలం యితరుల కోసం గడుపుతున్నట్లు ఆవృత్తికి అంకితమైపోయి జీవించటం ఆమె కిష్టం లేదు.
    తండ్రీ, కూతుళ్ళ మధ్య ఘర్షణ పెరిగింది. ఎవరూ దిగి రావటం లేదు.
    చివరకు అర్జునరావు గారికి కోపమొచ్చి అల్టిమేటం యిచ్చాడు.
    హరిణికి అంతకన్నా కోపమొచ్చింది. తన బాధ చెప్పుకునేందుకు తల్లి వుంటే? ఆ కోపంలో ఆమె తలుపులు బిడాయించుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది . బయటకు ఎంత చిలిపిగా కనిపిస్తుందో ,ఆమెకు అంత పట్టుదల, ఆవేశం వున్నాయి. ఆ వుద్రేకంలో ఏం చేస్తున్నదీ తెలుసుకోకుండా , బ్రీఫ్ కేసులో కొద్దిగా సామాను సర్దుకుని రాత్రికి రాత్రి రహస్యంగా యింట్లోంచి బయటకు వొచ్చి , ఊరు విడిచి పెట్టింది.


                                                                  *    *    *

    "చూశారా బాబుగారూ! మీ యిద్దరి పంతాల వల్ల చివరకు ఏ పరిణామానికి వొచ్చిందో" అంది అనసూయమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ.
    అర్జునరావుగారూ మాట్లాడలేదు. లోపల - ఊహించని యీ సంఘటన ప్రేవుల్ని తొలిచేస్తున్న బయటకు బింకంగా వున్నాడు.
    "ఎండకన్నేరుగని పిల్ల క్షణం అన్నం తినడం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేకపోయేది. ఏం ఇబ్బందులు పడుతుందో ఏమో."
    అర్జునరావుగారు తొణక్కుండా అలానే కూర్చున్నాడు.
    "కొంపదీసి .....ఏ అఘయిత్యమైన...."
    "అనసూయమ్మగారూ! అన్నాడు అర్జునరావుగారు. దృడ స్వరంతో "హరిణి నా కూతురు. డీ అంటే డీ అంటుంది గాని పిరికిదాన్లా అఘాయిత్యాలు చెయ్యదు.


                               *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS