Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 31


    ఆ వెనుకే సామంత్ బయటకు వచ్చాడు.
    నిమిషం తర్వాత ఆ ఇద్దరూ మెయిన్ రోడ్ వైపు నడిచారు. ఎలాంటి వ్యక్తితోనయినా ఒక పని చేయించాలనుకున్నప్పుడు సత్యరాజ్ చాలా కిరాతకంగా వ్యవహరిస్తాడు అవతలి వ్యక్తి ఆయువు  పట్లేమిటో ముందుగా గ్రహిస్తాడు. దాన్ని తన గ్రిప్ లోకి తీసుకునే వరకు నిద్రపోడు-తన  అనుచరుల్ని నిద్రపోనివ్వడు.
    ఇప్పుడు  సత్యరాజ్  ముందున్నవి రెండుపనులు-ఒకటి సామంత్ ని లొంగదీసుకొని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలి అలా తీసుకున్నది మూడో కంటికి తెలియకూడదు.
    రెండు__భూపతిరావు పెద్ద కొడుక్కి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలి.
    రెండు దెబ్బలకు ఎన్నో పిట్టలు.
    ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే పద్ధతి సత్యరాజ్ బొత్తిగా నచ్చదు. ఒక దెబ్బకు వంద పిట్టల్ని పడగొట్టడమే సత్యరాజ్ డిప్లమసి.
    ఐదు నిమిషాల తర్వాత సామంత్ చెల్లెలు, తమ్ముడు సిటీబస్ ఎక్కారు.
    వాళ్ళు అలా ఎక్కారు__సత్యరాజ్ ఇంట్లో ఫోన్ మోగింది.
    దానికోసమే ఎదురు చూస్తున్న సత్యరాజ్. చటుక్కున ఫోన్ ఎత్తాడు.
    "ఏమిటి సంగతి?" పొడిగా వుంది సత్యరాజ్ గొంతు.
    వాళ్ళిద్దరూ న్యూసైన్స్ కాలేజీలో చదువుతున్నారు. చెల్లెలు ఫస్టియర్ డిగ్రీ, తమ్ముడు ఫైనలియర్, వారి  దినచర్య....."
    సత్యరాజ్ వింటూనే చాపక్రింద నీరులాంటి మాస్టర్ ప్లాన్ ఒకటి మెంటల్ గా ప్రిపేర్  చేసుకుంటున్నాడు.
    రెండు నిమిషాల తర్వాత సత్యరాజ్ ఫోన్ పెట్టేశాడు.
    ఎదురుగా వున్న  సరస్వతి వైపు చూస్తూ నవ్వాడు.
    సరస్వతి ఓ నెంబర్ డైల్ చేసి సత్యరాజ్ కిచ్చింది.
    "హలో.....ఎవరు కావాలి?" అవతల నుంచి వర్క్స్ మేనేజర్ ఫోన్ లో వున్నాడు.
    "నేను సామంత్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. చాలా అర్జంటు పని.......సామంత్ ని పిలుస్తారా.....?" సత్యరాజ్ గొంతుమార్చి అడిగాడు.
    సారీ సర్.......సామంత్ మధ్యలో పని వదిలేసి రాడు...."
    "సామంత్ కి మెసేజ్ వెంటనే అందించకపోతే కొంపలు మునిగిపోతాయి........." సత్యరాజ్ కంఠంలో ఆందోళన వ్యక్తపరిచాడు.
    ఫోన్ లో ఓ  నిమిషం మౌనం తర్వాత "హలో" అని వినిపించింది సత్యరాజ్ కి. అది సామంత్ గొంతుగా గుర్తుపట్టాడు సత్యరాజ్.
    "హలో.......సామంత్........సారీ..... ఈ  బ్యాడ్  న్యూస్ చెప్పాల్సి వచ్చినందుకు....." గొంతులో కొండంత బాధ నాటకీయంగా దొర్లింది.
    "హలో.......మీరెవరు? బ్యాడ్ న్యూస్  ఏమిటి......?" సామంత్ గొంతులో ఆసక్తి.
    "నీ తమ్ముడు......చెల్లెలు...."
    సత్యరాజ్ మాటలు పూర్తికానివ్వలేదు సామంత్__
    "ఆ.........ఏమయింది.....? వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు......? అసలు మీరు ఎవరు...." సత్యరాజ్ ఊహించిన రియాక్షన్ సామంత్ కంఠంలో వినిపించింది.
    ఓసారి తమాషాగా, నిశ్శబ్దంగా నవ్వుకుంటున్నాడు.....ఆ నిశ్శబ్దపు నవ్వులో విషనాగు గురక వ్యక్తమయింది.
    "నేను ఎవరన్నదానికేం గాని......దీనిద్వారా నీకు నీ చెల్లెలు, తమ్ముడు అంటే ఎంతిష్టమో తెలిసిపోయింది......."
    "నువ్వేం మాట్లాడుతున్నావో అర్థంకావటంలేదు....." సామంత్ కి ఆందోళనగా  వుంది తనవాళ్ళ కేమయిందోనని.
    ఫోన్ మౌత్ పీన్ మీద చేయి అడ్డంగా పెట్టి "ఎన్ని నిమిషాలైంది?" సరస్వతిని ఉద్దేశించి అడిగాడు.
    "సరిపడిన టైమే అన్న భావాన్ని వ్యక్తపరచింది సరస్వతి. ఫోన్ మీంచి చేయితీసి "నువ్వు త్వరలో ఓ ప్రమాదంలో పడబోతున్నావ్. ఆ ప్రమాదమే  నిన్ను పైకి తీసుకువస్తుంది. అయితే తెలివిగా  ఆ ప్రమాదాన్ని నీకు అనుకూలంగా మార్చుకోగలిగితే..బై...." సత్యరాజ్ ఫోన్ పెట్టేశాడు.
    సామంత్ ని ఫోన్ దగ్గరికి  రప్పించటంలో కేవలం సామంత్ కి అతని తమ్ముడు, చెల్లెలుమీద ఎంతిష్టమో తెలుసుకోటానికే కాదు......
    ఆ వైపు డైయింగ్ ఇంజనీర్  సహాయంతో సత్తెయ్య సామంత్ పనిచేసే మెష్ న్ పై ఓ ప్రయోగం చేస్తున్నాడు.
    అది పూర్తి చేయడానికి సత్తెయ్య సత్యరాజ్ ని అడిగిన టైమ్ నాలుగు నిమిషాలు.
    ఫోన్ దగ్గర్నుంచి సామంత్ తిరిగి రావటాన్ని దూరాన్నుంచే సత్తెయ్య కనిపెట్టి మెల్లగా అక్కడనుంచి తప్పుకున్నాడు.
    పెద్ద పెద్ద పారిశ్రామిక అశాంతులు కేవలం కార్మికుల మంచి చెడ్డలు చూడ్డానికే రాలేదు. స్వార్థపరులైన యూనియన్ లీడర్స్ తమ వ్యక్తిగతమైన పనులు సాధించుకోడానికి ఎక్కడో చిచ్చుపెడతారు. అది క్రమంగా కార్చిచ్చుళ కార్మిక వర్గమంతటా పాకిపోతుంది.
    అంటించడమేగాని ఆర్పటం ఎవరితరం కాదు. ఎవరికీ వారే మాట  పట్టుదలకు పోయి ప్రశాంతంగావున్న వాతావరణాన్ని కలుషితం చేస్తారు. ఈ కలుషితంలో ఫ్యాక్టరీలకు ఫ్యాక్టరీలు ధ్వంసం కావచ్చు కార్మికుల రక్తం కాలువలై పారవచ్చు.
    మన దేశంలో వచ్చే సమ్మెల్లో కేవలం ఉద్యోగుల బాగు కోసం జరిగేవి 27 శాతమే 525 శాతం యూనియన్ లీడర్స్ సొంత ప్రయోజనాల కోసమే అని ఓ ఆర్థిక శాస్త్రవేత్త అభిప్రాయం!


                                                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS