"మేడమ్.....మీరేమీ అనుకోనంటే ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను....." సెక్రటరీ మిగతా మాటల్ని మింగేశాడు.
సాహితి చూస్తున్న ఫైల్ లోంచి ఓసారి తల పైకెత్తి చూసి చెప్పమన్నట్లు మౌనంగా తలూపింది.
"మనం ప్రీమియర్ మిల్స్ కి పైనాన్స్ చేయటం కొందరికి ఇష్టం లేదు....."
"తెలుసు......."పొడిగా అంది.
"దానిలో భాగంగానే మీమీద దాడి జరిపించారు"
"పిరికి వెధవలు_"
"కావచ్చు. పిరికివాళ్ళయినా తక్కువ అంచనా వేయకూడదుకదా మేడం___?"
సాహితి ఓసారి తలెత్తి సెక్రటరీవైపు చూసింది. తన భద్రతపట్ల సెక్రటరీ పడే ఆందోళనను గమనించింది. అభిమానంగా చూస్తూ___
"అయితే భయపడి వెనుకడుగు వేద్దామా?" మామూలుగానే అడిగింది.
"రాత్రి నాకు రెండుసార్లు ఫోన్స్ వచ్చాయి"
త్రుళ్ళిపడింది సాహితి
"ఎక్కడి నుండి వచ్చాయి__?" అనుమానిస్తూనే అడిగింది.
"ఎక్కడినుండి- ఎవరు చేసింది స్పష్టంగా తెలియదు. తగిన ఆధారాలు లేకపోయినా, చేసింది మాత్రం సత్యరాజ్ మనుష్యులు చేయించింది భాగ్యరాజ్ మనుషులు. అవసరం వుంది ప్రీమియర్ మేనేజ్ మెంటుకి అని ణా అనుమానం_"
ఆమె మౌనంగా వుంది.
సెక్రటరీ ఫర్ దర్ గా మాట్లాడాలో లేదో తెలియక గుంజాటనలో పడ్డాడు.
"చూద్దాం....ఇదెక్కడికి దారితీస్తుందో...." ఇన్వెస్ట్ చేసి తీరాల్సిందే.....ఆ ఇండస్ట్రీయల్ బాస్టర్డ్స్ కొన్ని వేల కుటుంబాల్ని దారుణంగా ముంచేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. డానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి" అంటూనే లేచింది.
సెక్రటరీకి భయంగా ఉంది.
సత్యరాజ్, భాగ్యరాజ్ సత్తా తెలిసే ఈ నిర్ణయం తీసుకుందా?
ఒక ఆడదానికి ఇంతటి తెగువ అంత మంచిది కాదని సెక్రటరీ అభిప్రాయం. అది ఆమెతోటే పోదు.....ఆమె దుట్టూ బ్రతుకు తెరువు కోసం చేరిన తనలాంటి వాటి పీకలకు కూడా చుట్టుకుంటుంది.
భాగ్యరాజ్ తనకు అడ్డువచ్చినవార్ని పట్టపగలు నడిరోడ్డు పై నరికి డ్రైనేజిలోకి విసిరితే చర్య తీసుకునే నాధుడు లేడు.
ఐదారేండ్ల క్రితం తన కొత్త ఫ్యాక్టరీ శంఖుస్థాపనకోసం ఒక వ్యక్తిని ఐదు లక్షలకు కొని బలి ఇస్తే, చుట్టూ అది చూసినవారు వేల మంది ఒక్కడు నోరు మెదపలేదు సెక్రటరీ మనస్సులో ఉన్న ఈ సంఘటన బయటకు వస్తే తన బాస్ సాహితి ఏ రూపం ఎత్తుతుందన్నది అనూహ్యం.
అయినా గంధర్వ కన్యలా ఉండే ఈమె, ఇంత చిన్నవయసులో మరలా పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతోంది? కోట్లకు కోట్లు ఆస్తులున్నా ఏం ప్రయోజనం ? అనుభవించే వయస్సు పోతే తిరిగి వస్తుందా? పిచ్చిది కాకపోతే!
తనకా ఛాన్స్ ఇస్తే బావుండు....ఎంతమంది కోటీశ్వరులు తనను అప్రోచ్ అయ్యారు......ఎలాగయినా ఆమెను పెళ్ళికి ఒప్పిస్తే లక్షలు కురిపిస్తామని.
భాగ్యరాజ్ అయితే ఏకంగా ఓ చిన్న ఫ్యాక్టరీ రాసిస్తానన్నాడు.
ఈమె కసలు ఆ ధ్యాసే ఉన్నట్లు కనిపించదు.
ఒకవేళ ఏదయినా సీక్రెట్ సెటప్ ఉందా? ఏమో పెద్దవాళ్ళ లింక్స్ అన్నీ దేవ రహస్యాలుగానే మిగిలిపోతాయి.
బహుశా ఈమెను తొలిసారి ముట్టుకునే అదృష్టం ఆమెను రక్షించే సందర్భంలో, ప్రీమియర్ కంపెనీలోకి ఎంటర్ అయిన యూనివర్శిటీ స్టూడెంట్స్ లీడర్ కే దక్కి వుండవచ్చు-
ఎంత అదృష్టవంతుడు......
సెక్రటరీకి ఓ తమాషా చేద్దామనిపించింది. "మేడమ్____ఈ మధ్య మిమ్మల్ని రక్షించిన యువకుడు ఎవరో తెలుసా మీకు?"
సాహితి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న ఫైల్ సడన్ గా ఆపేసి తలెత్తింది.
సెక్రటరీ వైపు మెరుస్తున్న కళ్ళతో చూసింది.
గోతికాడ నక్కలాంటి సెక్రటరీకి, ఆమె మొహంలో కనిపించిన ఆతృత చాలు పసిగట్టేందుకు.
తనకెలాగు దక్కదు. మరొకరికి దక్కించే సందర్భంలో లాభపట్టమే మంచిదనుకున్నాడు.
"మీకు తెలుసా?" ప్రశ్నలో జన్మ జన్మలుగా ఎదురు చూసే వ్యక్తికోసం పడే తపన ధ్వనించింది.
"నిన్ననే తెలిసింది......" సెక్రటరీ చూపులు పాల మీగడల్లాంటి ఆమె చెక్కిళ్ళపై ఉన్నాయి.
ఆమెకు తనను చూస్తున్నట్లు తెలియకుండానే ఆమె అణువణువు కసిగా వీక్షిస్తుంటాడు.
"ఎవరతను____?" బుల్లెట్ లా వచ్చిందా ప్రశ్న ఆమె నోటినుంచి.
"భూపతిరావుగారి పెద్దబ్బాయి___"
షాక్ తింది సాహితి.
ఆ నిజాన్ని నమ్మలేక అదే భావాన్ని కళ్ళతో స్పష్టపరచింది.
"నిజం మేడమ్. అయితే మీరు నమ్మలేకపోవటానికి రీజన్ ఉంది. భూపతిరావుగారు, ఆయన చిన్న కొడుకు దినేష్ ఒక పద్ధతి. పెద్ద కొడుకు నాగబాబు ఒకపద్ధతి........"
అప్పుడు తెలుసుకో గలిగింది___తనను రక్షించిన యువకుడి పేరు నాగబాబు అని.
"ఎలాగయినా అతన్నోసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అంది ఎలా అన్న ప్రశ్నను నిర్ణయంలోనే జత పరుస్తూ.
మేడమ్ గాలానికి చిక్కిందనుకున్నాడు సెక్రటరీ.
"మీకు, భూపతిరావుకి ఓ కంపెనీకి ఫైనాన్స్ చేసే సందర్భంలో మనస్పర్థలు వచ్చాయి కదా? మరి........." సెక్రటరీ ఆపై నసిగాడు.
ఆమె ఓ క్షణం ఆలోచించింది.
