నాగ్ చాలా మామూలుగాలేచి కూర్చుని డాక్టర్స్ మొఖంలో కనిపిస్తున్న ఆదుర్దాకి ఆశ్చర్యపోయాడు.
అంతలోనే చప్పున గ్రహించాడు- తనెవరో తెలిసే ఈ హడావుడి చేస్తున్నారని.
అది తల్చుకోగానే నాగ్ మొఖం చికాగ్గా మారిపోయింది. అదే తనకు సరిపడనిది తనకుతానుగా నిలబడాలనుకొనే నాగ్ కి తండ్రి స్టేటస్ వలన వచ్చే గౌరవమర్యాదలు, భయభక్తులు అంటే అసహ్యం.
సరిగ్గా ఈ ఆలోచన దగ్గరే భూపతిరావు, దినేష్ ఓ ప్రక్కకు, నాగ్ ఒక్కడు ఓ ప్రక్కకు అభిప్రాయపరంగా చీలిపోయి ఉన్నారు.
అందర్ని ఓ నిమిషం బయటకు పంపించి డీలర్ నాగ్ దగ్గరకు వచ్చాడు.
డిలర్ ని చూసి నాగ్ ఒకింత ఆశ్చర్యపోయాడు.
"మీరేమి అనుకోనంటే చిన్న విన్నపం పెదబాబు" అన్నాడు నీళ్ళు నములుతూ డీలర్.
"ఏమీ అనుకోను-కాని విన్నపం- పెదబాబులాంటిస్టుపిడ్ మాటలు వాడకు. నాగ్ అంటేచాలు ఇంతకీ విషయమేమిటో చెప్పండి." అన్నాడు కాని అప్పటికే ఆ డీలర్ మీద ఆసహ్యించుకుంటాడు నాగ్?
"మీ నాన్నగారు మిమ్మల్ని తక్షణం తీసుకొని రమ్మని నాకు తాఖీదు పంపించారు. ఆల్ రడీ చార్టెర్డ్ ప్లెయిట్ ఒకటివచ్చి ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తోంది......" డీలర్ తనమీద పడిన విపత్తుగురించిచెప్పుకుంటూ వెళుతున్నాడు.
తనతండ్రి ప్రతాపం, హడావుడి తెలిసినవాడు కావటంతో ఆ ఏర్పాట్లకు అంతగా ఆశ్చర్యపోలేదు కాని మొఖం చిట్లించుకున్నాడు. డీలర్ పడే ఊహించగలిగాడు నాగ్.
"చూడండి___నేను అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తినేం కాదు. చార్టార్డ్ ప్లెయిట్ లో వెళ్ళాల్సినంత గొప్పవాడ్ని అంతకంటే కాదు. అంత కొంపలు మునిగిపోయే పనులేం లేవునాకు. అయినా ఆ రకపు ఏర్పాట్లు జరిగాయంటే కేవలం ఇండస్ట్రియల్ కింగ్ శ్రీమాన్ భూపతిరావుగారి కొడుకుననే గదా? అదే.... అదే.....నాకు నచ్చనిది....?
డీలర్ గుండెల్లో రాయిపడింది.
నాగ్ ఉద్దేశంలో వ్యతిరేకత స్పష్టమవుతోంది. అలాంటిరాచరికపు మర్యాదలు ఈయనకు నచ్చవు.
అలాగే లేకుంటే అటు భూపతిరావుకు, దినేష్ కి నచ్చవు.
మధ్యలో తను ఇరుక్కుపోయాడు.
క్షణాల్లోనే ముఖమంతా చెమటలు పట్టాయి డీలర్. చిన్నగా బాడీ షివరింగ్ కూడా ప్రారంభమైంది. ఏం మాట్లాడాలో తోచక అయోమయంగా చూస్తున్నాడు.
"భయపడకండి- మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశంకాదు. మీ పిలక మా నాన్న, తమ్ముడిచేతిలో ఉండబట్టేగదా నా ఆరోగ్యంపట్లా, నా ప్రయాణంపట్ల, వాళ్ళు అప్పజెప్పిన పనిపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇదే నాకు నచ్చనిది."
"నటన వృత్తి కాబట్టి నటించే హక్కు ఒక్క నటీ నటులకే ఉండాలి. కాని ఇప్పుడందరూ నటిస్తున్నారు. ఆ నటనలో కృత్రిమమైన ప్రేమ, భయం, అభిమానం, ఆప్యాయత, ఆనందం, కృతజ్ఞత, ఆరాధన, చికాకు కోపం, వినయం, అన్నీ....అన్నీ నటనలోంచి వస్తున్నాయి."
నిర్భయంగా, నిఖ్కచ్చిగా మాట్లాడే నాగ్ అంటే భూపతిరావు ఎస్టేట్ లో అందరికి నిజమైన గౌరవాభిమానాలున్నాయి.
డీలర్ వింటూండిపోయాడు.
"అన్నింటిలోకి అతి ప్రమాదకరమైంది వినయం. అతివినయం అవతలవాడికి తనను గౌరవిస్తున్నాడనే భ్రమను కలిగించి పనులు పూర్తి చేసుకుని మొండిచేయి చూపించే బాస్టర్ద్స్ అంటే నాకసలు నచ్చదు."
అవునన్నట్లుగా తలూపటం మినహా ఏం చేయలేని నిస్సహాయస్థితి డీలర్ ది.
ఎలాగైనా నాగ్ ని ఎస్టేట్స్ కి చేర్చటమే డీలర్ కి కావల్సింది. "అన్నింటిలోకి అతి ప్రమాదకరమైంది దేశభక్తి, దేశభక్తిలో నటన- అంటూ ఓ క్షణం ఆగిపోయాడు నాగ్.
ఓ నిమిషం మౌనం తర్వాత "మీ క్షేమం కోసం నేను బయలుదేరుతున్నను."
నాగ్ మాటలు పూర్తి కాకముందే, విన్నదానికే గుండెలమీద బరువు దించినట్లుగా ఫీలయ్యాడు డీలర్.
"కాని......నేను ట్రైన్ లోనే బయలు దేరతాను." అంటూ బెడ్ మీంచి లేచి ఓసారి తనను తాను సరిచూసుకొని అడుగు వేయిబోయికళ్ళు తిరిగినట్లుగా అనిపించి ఓ క్షణం కూర్చుండిపోయాడు.
* * *
అద్దం ముందు నిలబడి చీర కట్టుకుంటున్న సాహితి దగ్గరకు వచ్చింది సోనీ.
"మమ్మీ.....మన మీరోజు ఊరికెళ్తున్నాం గదా?"
ముత్యంలా మెరిసిపోతున్న కూతురివైపు ఓ క్షణం చూసి చటుక్కున నుదుటిమీద ముద్దెట్టుకొని అవునన్నట్లు తలూపింది.
అంతలో కాలింగ్ బెల్ వినిపించింది.
సాహితి త్వరత్వరగా చీర కుచ్చిళ్ళు సర్దుకొని వెళ్ళిడోర్ తెరిచింది.
ఎదురుగా సెక్రెటరీ నిలబడున్నాడు.
"అతనికెలా ఉంది?" ఆతృతగానే అడిగింది.
"సారీమేడమ్! ఆయన వెళ్ళిపోయారు" అన్నాడు దిలదించుకొనే.
అతనేమన్నాడో ఓ క్షణం అర్థంకాక తికమక పడింది ఆమె.
హీ ఈజ్ ఆల్ రైట్. అయితే రాత్రే అతని బంధువులో, మిత్రులో వచ్చి తీసుకెళ్ళిపోయినట్లు తెలిసింది" అన్నాడు కాస్తంత భయంగానే.
చెప్పింది చెప్పినట్లు చేయకపోయినా, పెట్టిన గడువులోపు పని పూర్తికాకపోయినా సాహితి క్షమించదని గతంలో అనుభవపూర్వకంగా తెలిసినవాడు గనుకే ఆ భయం.
అతను వివరాలు కనుక్కుందామని ఓ క్షణం అనిపించింది సాహితికి......కాని ఎందుకో ఆగిపొయింది.
* * *
సామంత్ ఇంటిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు వ్యక్తులు రెండు గంటల నుంచి కాపు కాస్తున్నారు.
ఉదయం ఎనిమిది గంటల సమయం.....
సరిగ్గా 8-30కి సామంత్ తమ్ముడు, చెల్లెలు చేతుల్లో పుస్తకాలతో బయట కొచ్చారు.
