Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 29

 

    "ఏమిటి నీ పని!"
    'చెప్పానుగా హత్యలు చేయడం!" అన్నాడాగంతకుడు. "నేనేం చేస్తున్నానో నా పనులేమిటో మీరు పట్టించుకోకూడదు. నాకోసం ఒక గది మీరు కేటాయించాలి. రోజూ ఉదయం పూట శుభ్ర పర్చడానికి తప్పితే ఆ గదిలోకి మీరెవ్వరూ రాకూడదు."
    జనార్దనం నిట్టూర్చాడు. ఇలా ఒక ఆగంతకుడు వచ్చి తనింట్లో ఏకు మేకై కూర్చుంటాడని అతనెన్నడూ అనుకోలేదు. అతను నిస్సహాయంగా ఆగంతకుడ్ని చూసి "లలితా రాణి కధ నీకెలా తెలుసు!' అన్నాడు.
    "నాయనా మాకూ యూనియన్ వుంది. ఆ యూనియన్లో ఇలాంటి రహస్యాలు కొన్ని లక్ష లుంటాయి. అవసరానికి వాడుకుంటుంటాం."
    "ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావ్!"
    'కోటేశ్వర్రావు తెలుసుగదా నీకు ...."
    "ఏ కోటీశ్వరరావు ...."
    "రైస్ మిల్ ఓనర్...."
    "ఓహ్ ఆయనా?" ఉలిక్కిపడ్డాడు జనార్దనం. 'అయన హత్య చేయబడి ఇంకా వారం రోజులు కాలేదు."
    "ఆ అదే , ఆ హత్య నేనే చేశాను" అన్నాడు ఆగంతకుడు తాపీగా. "కానీ, దురదృష్టవశాత్తు . అది ఒకడి కళ్ళబడింది. వాడు నన్ను చూశాడు. కోటీశ్వరరావు హత్య కేసులో అనుమానం మీద ఒకణ్ణి అరెస్టు చేశారు. వాడు పాత నేరస్తుడే . రెండు మూడు హత్యలు చేసి తప్పించుకో గలిగాడు. ఎప్పటికైనా ఉరికంబం ఎక్కవలసినవాడె. ఇప్పుడిలా ఎక్కితే కనీసం నన్ను రక్షించినట్లవుతుంది గదా అని అనుకున్నాను. అయితే, నన్ను చూసినవాడోకడున్నాడు గదా - వాడి పని పూర్తీ చేస్తే కానీ నాకు తృప్తిగా వుండదు. ధైర్యం చేసి నన్ను హంతకుడిగా నిరూపించడానికి వాడు ప్రయత్నిస్తాడని నేననుకోవడం లేదు. కానీ ఋణ శేషం , శత్రు శేషం వుండకూడాదని పెద్దలంటారు. నీ యింట్లో మకామ పెట్టి నేను చేయబోయే మొదటి హత్య అదే!"
    జనార్దనం కంగారుపడ్డాడు. ఆ మనిషి చాలా ప్రశాంతంగా వున్నాడు. పిడుగులాంటి మాటలు చాలా సావధానంగా అంటున్నాడు. "మొదటి హత్య అంటే -- ఇంకా ఎన్ని హత్యలు చేద్దామని !"
    "లెక్క వేసుకోలేదు. ప్రస్తుతానికి మరో మూడున్నాయి లిస్టులో. కానీ, అవసరాన్ని బట్టి మరికొన్ని చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు కోటీశ్వరరావుని చంపినపుడు ఆ హత్య ఇంకొకరు చూస్తాడని నేననుకోలేదు. కానీ, ఇంకొకడు చూశాడు. ఒకటనుకున్నది - రెండు హత్యలు చేయాల్సోచ్చింది!" జాలి పడుతున్నట్లుగా అన్నాడాగంతకుడు.
    జనర్ధనానికి గుండెలవిసాయి. తన జీవితం ప్రమాదంలో పడినట్లతనికి తోచింది. అతనాలోచిస్తుండగా సీత ఉప్మా ప్లేట్లతో వచ్చింది. ఇద్దరూ టిఫిన్ నారగించారు.
    'చెల్లాయింత రుచిగా చేసే మాటయితే, నేనిక్కడే ఏళ్ళ తరబడి వుండి పోవాల్సుంటుంది" అన్నాడతను.
    జనార్దనాన్ని ఆ మాటలు మరింత భయపెట్టినా అతను తరచుగా సీతను చెల్లాయి అనడం కొంత ధైర్యాన్నిచ్చింది. కనీసం ఈ వరసైనా కొంత ఆత్మీయతను కలిగించి  ఈ హంతకుడు తమ జోలికి రాకుండా చేస్తుందని ఆశ కలిగిండతనికి.
    
సీతా - మీ అన్నయ్యకి ఓ గది ఖాళీ చేసివ్వాలి. ఆ ఏర్పాట్లు చూస్తావా ?" అందుకు నా సాయమేదైన కావాలా?" అన్నాడు జనార్దనం.
    ఆగంతకుడు లేచాడు. "నేను మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నరకు వస్తాను. అప్పటికన్నీ సిద్దంగా వుంచండి. నేను కూడా అట్టే సామాను తీసుకురావడం లేదు. అందుకని నిత్యావసర వస్తువుల కోసం పదేపదే మీ గదుల్లోకి రావలసిన అవసరం లేకుండా , హోటల్ గదిలా అన్ని ఏర్పాట్లు చేయండి. ఒక మంచం, దుప్పటి, వుంటే పక్కకు సంబంధించినంతవరకూ ఏర్పాట్లు చాలు. ఓ కూజా, నిండా నీళ్ళు , పక్కనే ఒక గ్లాసు, ఇవి కాక అడ్డం, దువ్వెన, కొబ్బరి నూనె సీసా, సబ్బు, తువ్వాలు ప్రస్తుతానికి నాకు గుర్తున్నవివే...."
    "బ్రష్, పేస్టూ ...." అంది మంటగా సీత.
    'అవసరం లేదు. అవీ, టంగ్ క్లీనర్ కూడా నేనే తెచ్చుకుంటున్నాను. రాత్రికి భోజనం కూడా చేసి వచ్చేస్తాను. నాకోసం మీరింకే ఏర్పాట్లు చేయనవసరం లేదు. వచ్చి తిన్నగా గదిలోకి వెళ్లి పడుకుంటాను. కానీ, ఒక చిన్న హెచ్చరిక, నా గురించి పోలీసులకి చెప్పడానికి ప్రయత్నించినా , ఏదో విధంగా నన్ను పట్టించడానికి నామీద డిటెక్టివ్ లని నియమించినా మీ చావు మీరే కొని తెచ్చుకున్నట్లవుతుంది. కోపం వస్తే దయా దాక్షిణ్యాలుండవు వస్తాను మరి" అంటూ వెళ్ళిపోయాడతను.

                                      4
    
    గది ఒకటి ఖాళీ చేసి ఏర్పాట్లు చేస్తున్నంత సేపు సీత విసుక్కుంటూనే వుంది. "మనం పెద్దిల్లు తీసుకున్నది వీడి కోసమేలాగుంది" అందామె కసిగా.
    "బాగుంది ,వీడి కొసమెందుకవుతుంది. కోరి నాకు అర్ధాంగిగా వచ్చిన కోటీశ్వరుడి పుత్రికను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నాకు తెలిసిన విధంగా చూసుకునే స్తోమత నాకుంది. ఈ ఇల్లు నీ భర్త జీతాన్ని, హోదాను చెప్పక చెబుతుంది" అన్నాడు జనార్దనం గర్వంగా.
"మీరు మీ హోదాని గుర్తు చేసుకుని సంబరపడతున్నారు. నా ఆలోచనలన్నీ వాడి గురించే -- వాడు మనింట్లో కొన్ని మసాలుంటాడంటే నా ఒళ్ళు కంపర మెత్తి పోతోంది. క్షణం కూడా వాణ్ని నేను భరించలేను. పైగా చెల్లాయంటూ పిలుపోకటి. నా కన్నయ్యలు లేకపోవచ్చు కానీ ఇలాంటి వెధవని అన్నయ్యగా భరించడం నావల్ల కాదు. పైగామీరు  కూడా ఆ వెధవతో చేతులు కలిపి మీ అన్నయ్య మీ అన్నయ్య అంటున్నారు" అంది సీత ఉక్రోషంగా.
    జనార్దనం సీత వంక బాధగా చూశాడు. 'చూడు సీతా మనం విధి చేతిలో కీలుబొమ్మలమన్న సంగతి నీకు పదేపదే గుర్తు చేయనవసరం లేదు. వాణ్ణీ మనం ఏమీ చేయలేము. వాడొక నరరూప రాక్షసుడు. నర హంతకుడు. వాడితో గొడవ పెట్టుకుంటే మనని బ్రతకనివ్వడు. ఇలాంటి వాళ్ళను తెలివిగా వదుల్చుకోవాలి."
    "పోనీ పోలీసులకి చెప్పేస్తే ....'
    "విన్నావుగా ---వెళ్ళేముందు వాడి హెచ్చరిక " అన్నాడు జనార్దనం .'అన్నంతపనీ చేస్తాడు వాడు."
    "బాగుంది.... అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలన్నాడు. వీణ్ణిప్పుడు నెత్తి కెక్కించుకుంటే తర్వాత వదుల్చుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి వాడితో కల కాలంవేగడమూ కష్టమే. కాబట్టి ఏదో క్షణంలో వీడితో గొడవ పడకా తప్పదు. అప్పుడైనా వీడు మనల్ని చంపుతాననకా మానడు. అందుకని బాగా అలోచించి ఇప్పుడే వీణ్ని వదుల్చుకునే సాధనం చూడండి" అంది సీత.
    "నువ్వు చెప్పింది నిజమే" అన్నాడు జనార్దనం. కొతీశ్వర్రావు హత్యను చూసిన నేరానికి ఒకణ్ణి చంపబోతున్నట్లు చెప్పాడు వాడు. అలాగే తనకూ కొన్ని రహస్యాలిప్పటికే తెలిశాయి. ముందుముందింకా తెలియవచ్చు. అటువంటప్పుడు తమకు మాత్రం వదిలి పెడతాడన్న గ్యారంటీ ఏమిటి? తలచుకుంటేనే జనర్ధనానికి గుండెలు జరదరించాయి. అతను క్షణం ఆలోచించి "సీతా! వీడిని వదుల్చుకావాల్సింది, కానీ అ పని ముంచిగానే చేయాలి. ఇలాంటి సమయంలో  మీ నాన్న గారిలాంటి వాడు మన కండగా ఉండి ఉన్నట్లయితే చాలా బాగుండేది!" అన్నాడు.
    సీత కనుకొలనుల్లో నీళ్ళు నిలిచాయి. "దయవుంచి అయన ప్రసక్తి తీసుకు రాకండి. నాకో తండ్రి వున్నాడని గుర్తు చేయకండి. ఇంకే ఉపాయాలైనా ఆలోచించండి" అంది.
    జనార్దనం నిట్టూర్చాడు. సీత తండ్రి శంకర్రావు కోటీశ్వరుడు. సీత అయన ఏకైక సంతానం. సీత తనను ప్రేమించడం అయన కేమాత్రమూ ఇష్టం లేదు. కానీ అయన ఇష్టాన్ని వ్యతిరేకించింది సీత. తనమాట కాదంటే ఇంట్లోంచి పోమ్మన్నాడాయన. అలాగేనని తనతో వచ్చేసింది సీత. గుళ్ళోనే అయినా తమ వివాహం వైభవంగా జరిగింది. వివాహమైన ఆర్నెల్లకు సీత తండ్రి ఆమె దగ్గరకు వచ్చి ఆమె జీవితం చూసి బాధపడ్డాడు. జనార్ధనానికి విడాకులిచ్చేస్తే ఆమెకు ఒక గోప్పవాడితో మళ్ళీ వివాహం జరిపిస్తానన్నాడు. ఆమె జీవితాన్ని సుఖమయం చేయాలన్నది తన తపన అన్నాడు. ఆమె అయన మాటలు వినకపోయేసరికి జనార్ధనాన్ని దంపెస్తానని బెదిరించాడు. సీత రెచ్చిపోయి "నా భర్త మరణించిన మరుక్షణం నేనూ శవంగా మారుతనన్న సంగతీ మీరు గుర్తుంచుకోండి. మిమ్మల్ని....ఈ మాటలన్న మిమ్మల్ని....ఇంక నాన్నా అని పిలవలెను. వెళ్ళిపొండి. ఇంకెప్పుడూ నన్ను కలుసుకునేందుకు ప్రయత్నించకండి" అనేసింది.
    అప్పటికి జనార్దనం సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నాడు. కానీ శంకర్రావు సీత జీవితం చూసి జాలిపడడం అతనికి తల తీసినట్లయింది. అతను కష్టపడి మంచి ఉద్యోగం కోసం నానా ప్రయత్నాలు చేయసాగాడు. అ సందర్భంలోనే అతనికి లలితారాణి పరిచయమైంది. పరిచయం ఊరికే పోలేదు. అతానికొక పెద్ద కంపెనీలో పదిహేను వందల రూపాయల జీతం మీద ఉద్యోగం దొరికింది. అప్పట్నించీ అతను సీతను సుఖ పెట్టడమే ధ్యేయంగా ఉంటున్నాడు. ఇది జరిగి సంవత్సరానికి పైగా అయింది.
    సీత కోటీశ్వరుడి ఇంట పుట్టినప్పటికీ , ఆమె విలాసవతి కాలేదు. ఆమెకు చెడు అలవాట్లు లేవు. ఆమె కోరుకునేది మనసారా ప్రేమించే మనుషులను, మోసం, ద్వేషం అన్న పదాలామే కామాడదూరంలో ఉంటాయి. ఆమె దుబారా ఖర్చులు చేయదు, అవసరానికి మించిన పనివాళ్ళను పెట్టుకోలేదు. చిన్నతనం నుంచీ అలవాటైన కారణంగా ఆమె తనకో రకమైన యిల్లు కోరుకుంది, ఆ యింటి నామె స్వయంగా అందంగా అలకరించి ఉంచుకుంది.
    జనార్ధనానికి సీతతో కాపురం చాలా హాయిగా వుంటోంది. బౌతికంగానూ, మానసికంగానూ అందమైన భార్య లేంతో మంది మగవాళ్ళకు లభించరు. చక్కగా నడిచి పోతుందన్న జీవితంలోకి, ఈరోజే ఒక దుర్మార్గుడు ప్రవేశించాడు. వాడి పీడ ఎలాగో అలా వదిలించుకోవాలి?
    "ఈ రాత్రికి వాడెలాగూ ఇక్కడుండడం తప్పదు" రెండు మూడ్రోజుల్లో ఏదో ఒక పధకం చెయ్యాలి. తెలివిగా వాడిని బయటకు పంపించాలి ...." అన్నాడు జనార్దనం.
    జనార్దనం ఆలోచనలు ఒక రూపానికి వస్తున్నాయి.
    ఇద్దరూ భోజనాలు చేసి హంతకుడి రాకకోసం వీధి గదిలో కూర్చుని వెదురు చూస్తున్నారు. అన్న టైముకి టంచనుగా వచ్చాడు హంతకుడు. అతని చేతిలో ఒక సూట్ కేస్ మాత్రం వుంది. లోపలికి వస్తూనే అతను వుత్సాహంగా "చెల్లాయ్ మీ భోజనాలైపోయాయా? నీచేతి ఉప్మా రుచి చూసాక భోజనం కూడా ఇక్కడే చేయాలనిపించిందమ్మా! కానీ ఈరోజుకు నాకా అదృష్టం లేదు" అని అతను హటాత్తుగా దీనంగా అయిపోయాడు.    "జీవితంలో నాకెవ్వరూ లేరు. అభిమానాలకూ, ఆప్యాయతలకూ నోచుకోలేదు. ఎందుకో నిన్ను చెల్లాయని పిలుస్తుంటే అంతులేని ఆనందం కలుగుతోంది. ఏదో జన్మానుబంధముండి ఉండాలి మనిద్దరకూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS