Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 29


                                       వేలిముద్రల మహిమ

    రాజారావు తలుపు తీయగానే ఇన్ స్పెక్టర్ చౌదరి కనిపించాడు - "నువ్వా - ఇంకా యెవరో అనుకున్నాను-" అన్నాడతను.
    "ఇంకా యెవరో కూడా వున్నారు చూడు-" అన్నాడు చౌదరి.
    చౌదరి వెనుకనున్న వ్యక్తిని రాజారావు అప్పుడు చూశాడు. అతడికి ముఫ్ఫై ఏళ్ళుండవచ్చు. పచ్చటి ఛాయ. మనిషి బాగున్నాడు.
    "ఈయన రంగారావు గారని నాకొత్త మిత్రుడు-" అన్నాడు చౌదరి.
    అంతా లోపలకు వెళ్ళి కూర్చున్నారు.
    ప్రస్తుతం చౌదరికి ఓ క్లిష్టమైన కేసు తగుల్కొన్నది. నేరస్థుడెవరో చూచాయగా తెలుస్తున్నది. అయితే అతడికి గొప్ప గొప్ప పరిచయాలున్నాయి. తిరుగులేని ఆధారాలు దొరికితే తప్ప అతడిని కస్టడీలోనికి తీసుకునే ప్రయత్నం చేయడానికి లేదు. కేసును పరిష్కరించడంలో జరిగే జాప్యం గురించి పై అధికారుల ఒత్తిడి చాలా యెక్కువగా వున్నది.
    "నీకెప్పుడూ ఇంతే-నీ మెత్తటి తనమే నీకిన్ని సమస్యలూ తెచ్చిపెడుతున్నవి-" అన్నాడు రాజారావు.
    "ఒక విధంగా నువ్వు చెప్పిందీ నిజమే-కానీ మనమిప్పుడు డిపార్టుమెంటు వ్యవహారాల సంగతి మాట్లాడవద్దు. కాసేపు వాటి గురించి మరిచిపోదామనే ఇక్కడకు వచ్చాను-" అన్నాడు చౌదరి.
    మిత్రులు ముగ్గురూ కబుర్లలో పడ్డారు. కబుర్ల మధ్యలో -"అన్నట్లు ఈయన గురించి చెప్పడమే మరిచాను. రంగారావుగారు నాస్తికుడు. నువ్వు చాలా పెద్ద ఆస్తికుడవు కదా! మీరిద్దరూ వాదించుకుంటూంటే విని ఆనందించాలనిపించి ఈయనిక్కడకు తీసుకునివచ్చాను" అని-"రంగారావుగారూ-మీరు ప్రపంచంలో యెవరి చేతనైనా దేవుడులేడని ఒప్పించగలరేమో కానీ మా రాజారావుచేత మాత్రం ఒప్పించలేరు-" అన్నాడు చౌదరి.
    "దేవుడెక్కడున్నాడండీ-" అన్నాడు రంగారావు నవ్వుతూ.
    "మీకు తెలుసుకోవాలనివుంటే చూపిస్తాను-" అన్నాడు రాజారావు తనూ నవ్వుతూ.
    "ఎప్పుడు?" అన్నాడు రంగారావు ఆశ్చర్యంగా.
    "ఇంకో అరగంటలో!"
    "ఎక్కడ?"
    "ఇక్కడే!"
    రంగారావు ఆశ్చర్యంగా-"మీరు వేళాకోళమాడుతున్నారు-" అన్నాడు.
    "వేళాకోళంకాదు రంగారావుగారూ! నాకూ జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి. దేవుడనేవాడున్నాడన్న ఒక్క ఆలోచన నన్ను ప్రశాంతంగా వుంచుతుంది. అందుకే నేను యెప్పుడూ నిశ్చింతగా వుంటాను. ఈ రోజు మా యింటికి చిదానందస్వామి అనే యోగి పుంగవుని ఆహ్వానించాను. ఆయన సాక్షాత్తూ దేవుడి అవతారం. ఆయన పక్కన ఉన్నపుడు మనం అన్ని అనుభూతులూ మరిచిపోతాం-" అన్నాడు రాజారావు.
    "దేవుడంటే ఆ చిదానందస్వామా?" అని రంగారావు నవ్వి-"మారు వేషంలో ఉన్న ఏ గూండాయో అయుంటాడాయన-" అన్నాడు.
    "ఆయన మహిమ గురించి ఎన్నో కథలున్నాయి. ఒక్కసారి ఆయన ఏ ఇంటనైనా పాదంపెట్టి మంచి తీర్ధం స్వీకరించి వెళ్ళారంటే ఆ తీర్ధంతోపాటే ఆ ఇంటి సమస్యలూ, బాధలూ, కష్టాలూ ఆయనకు కైంకర్యమైపోతాయి-"
    "అంతా మూఢనమ్మకం-" అన్నాడు రంగారావు.
    "నేను మూఢుడినని మీ అభిప్రాయమా?" అన్నాడు రాజారావు.
    రంగారావు తడబడి-"అలాగని నేననలేదే!" అన్నాడు.
    "మీరు నా నమ్మకాన్ని మూఢనమ్మకం అన్నారు. దాని అర్ధం అదే కదా!"
    "అయాం సారీ-నా అభిప్రాయం అదికాదు-" అన్నాడు రంగారావు.
    "ఒక్కసారి చిదానందస్వామిని చూస్తే మీ అభిప్రాయాలింకా మారతాయి-" అన్నాడు రాజారావు.
    సరిగ్గా అరగంట తర్వాత చిదానందస్వామి ఆ ఇంటికి వచ్చాడు. రంగారావాయన్ను వింతగా చూశాడు.
    చిదానందస్వామి బలంగా, దృఢంగా, కండలు తిరిగి వున్నాడు. కనులలో దివ్య తేజస్సు కనబడుతున్నది. పొడవాటి జుత్తును మునుల రీతిని ముడివేసుకున్నాడు. ఆయన గెడ్డంలో యెక్కడా తెల్లవెంట్రుక కనబడటంలేదు. బాగా యువకుడే అయుండాలని చూడగానే అనిపిస్తుంది.
    "నా వయసు నూటడెబ్బై-" అన్నాడు చిదానందస్వామి. ఆయన పచ్చని శరీరానికి కాషాయవస్త్రాలు కొత్త అందాన్నిచ్చాయి. రుద్రాక్షమాల చేతిలో క్రమ బద్ధంగా ఆగకుండా తిరుగుతున్నది. ఆయన గొంతులో ఒకవిధమైన గాంభీర్యం, ఆ గాంభీర్యంలో ఒకరకమైన ఆకర్షణ.
    చిదానందస్వామి కొనసాగించాడు-"హిమాలయాల్లో నా గురువు నాకు అయిదువందల సంవత్సరాల ఆయుర్దాయం నిర్ణయించాడు. అయితే నాకు అంతకాలం జీవించడం ఇష్టంలేదు. ప్రపంచంలో అందరి కష్టాలకూ నా ఆయుర్దాయాన్ని చెల్లువేసి చేతనైనంతలో ఉడతాభక్తిగా మానవసేవ చేయాలనుకుంటున్నాను...." అని-"నాయనా-మంచి తీర్ధం తీసుకునిరా-" అన్నాడాయన.
    రాజారావు భక్తి శ్రద్ధలతో ఆయనముందు ఓ పాల గ్లాసును ఉంచి-"తమరివి స్వీకరించాలి స్వామీ!" అన్నాడు. అప్పుడక్కడ అతడి భార్య, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.
    "భక్తుల యింట మంచితీర్ధం తప్ప  వేరేమీ స్వీకరించను నేను. నాకు కానుకలిచ్చేవారు నా ఆశ్రమానికి వచ్చి స్వయంగా ఇచ్చి వెడతారు-" అన్నాడు చిదానందస్వామి.
    "అదే మంచి తీర్ధం అనుకోండి స్వామీ-" అన్నాడు రాజారావు.
    స్వామి నవ్వి-"నీ యింట పాలుతాగినా నీళ్ళు తాగినా ఈ రోజుతో నీ కష్టాలు గట్టెక్కుతాయి. నీ బాధలు తీరిపోతాయి. అయితే నీ యింట నేను తాగే ప్రతి నీటిబిందువూ నాకు విషతుల్యం. నీ ఇబ్బందులన్నింటినీ ఆ నీటిలోనికి రప్పించుకుని తాగుతాను నేను. మంచి తీర్ధం తీసుకున్నాక నా ఆయుర్దాయంలో కొంత తగ్గిపోతుంది. మంచి తీర్ధానికి బదులు పాలు తీసుకుంటే నా ఆయుర్దాయం అంతకు పదిరెట్లు తగ్గిపోతుంది. నాకు తొందరగా చనిపోతానని భయంలేదు. జీవితంపైన మమకారమూ లేదు. వీలైనంతలో ఎక్కువమంది కోసం నా ఆయువునుపయోగించాలన్న అభిలాషమాత్రం ఉన్నది-" అన్నాడు.
    "స్వామీ-నా ఇబ్బందులను నాకే ఉండనివ్వండి. తమరికి నేను మంచితీర్ధం కూడా ఇవ్వను-" అన్నాడు రాజారావు కంగారుగా.
    "వెర్రివాడా! నన్ను రక్షించాలనుకోవడం నీ తెలివితక్కువతనం. నేనే యింట అడుగుపెట్టినా మంచితీర్ధం తీసుకోవాలన్నది గుర్వాజ్ఞ!" అన్నాడు చిదానంద స్వామి. ఆయన రాజారావు ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి "ఈ గ్లాసును ఒక వారం రోజులపాటు పూజామందిరంలో ఉంచుకో-నీకు శుభమవుతుంది-" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS