Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 29


    కవిత ఆలోచనలో పడింది. ఈ యువకుడు తన వెంట బడడానికి ఏదో కారణముంది. ఇతడు తన గతం ప్రసక్తి తెస్తున్నాడు. ఏమిటా గతం?
    ఆకుపచ్చ చీర....గతం.....
    తనకు వివాహమైంది......వివాహానికి ముందు......
    ఉలిక్కిపడింది కవిత. అదే నా గతమంటే? అప్రయత్నంగా తలెత్తి అతడి ముఖంలోకి చూసిందామె.
    అతడు నవ్వి-"మీకు శామ్యూల్ గుర్తుకొచ్చాడు కదూ-నేనతడి స్నేహితుణ్ణి!" అన్నాడు.
    కవితకు ఒక్కక్షణం నోటమాటరాలేదు. తర్వాత నెమ్మదిగా-"నాకు శామ్యూల్ గుర్తుకొస్తాడని మీకెలా తెలుసు?" అంది.
    "చాలా తెలుసు నాకు. అయితే అన్నీ ఒక్కసారిగా చెబితే మీరు భరించలేరు. అందుకని ఒక్కటొక్కటిగా చెబుతాను. ఈ రోజుకిది చాలు. మనం మళ్ళీ కలుద్దాం" అని లేచి వెళ్ళిపోయాడతడు.

                                    3

    కవిత యింట్లో కూర్చుని శామ్యూల్ గురించే ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆమె మనసేమీ బాగాలేదు.
    శామ్యూల్ యువకుడు. అందగాడు. ఓ సినిమాహాలు వద్ద తమకు పరిచయమైంది. పరస్పరాకర్షణ బయల్దేరింది. పరిచయం ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి ప్రేమ విహారాలు చేశారు. దూరంగా వున్నప్పుడుత్తరాలు వ్రాసుకున్నారు.
    తర్వాత ఈ ప్రేమ వ్యవహారం కవిత తల్లిదండ్రుల వరకూ వచ్చింది. కవిత తండ్రి మండిపడ్డాడు. ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదన్నాడు. ఈ పెళ్ళి చేసుకుంటే మళ్ళీ కవిత ముఖం చూడనన్నాడు. ఆమె అన్నింటికీ సిద్దపడింది.
    అయితే శామ్యూల్ నిరుద్యోగి. ప్రేమించుకొనడం వరకూ బాగానే వుంది. కానీ ఆ తర్వాత బ్రతకాలికదా! ఏదైనా మంచి ఉద్యోగం దొరికేవరకూ పెళ్ళిచేసుకునే ఉద్దేశ్యమతడికి లేదు. అదీగాక అతడికి చాలా ఇంటి బాధ్యతలున్నాయి. అతడికి దండిగా కట్నమిచ్చి, ఉద్యోగం కూడా వేయించడానికి ఓ ఆడపిల్ల తండ్రి సిద్దంగా వున్నాడు. కవిత తండ్రి కూడా తనకలాగే సాయపడగలడని శామ్యూల్ ఆశించాడు.
    "మన కొద్ది నెలల ప్రేమ, కానీ మనవాళ్ళది ఎన్నో సంవత్సరాల ప్రేమ మన ప్రేమ పేరు చెప్పి మన వాళ్ళను మనం దూరంచేసుకోరాదు-...." అని తీర్మానించాడు శామ్యూల్.
    కవిత అతడిని  ఎంతగానో ప్రాధేయపడింది. అతడంగీకరించలేదు. ఈలోగా కవిత తండ్రి త్వరపడి చలపతిరావు సంబంధం నిశ్చయం చేశాడు.
    కవితకు పెళ్ళయిపోయింది. ఆరంభంలో ఆమె అదోలా వుండేది. కానీ చలపతిరావు మంచితనం, ప్రేమాభిమానాలు క్రమంగా ఆమెను ఆకట్టుకున్నాయి. ఆమె శామ్యూల్ ను మరిచిపోయింది.
    ఇన్నాళ్ళకు మళ్ళీ తను శామ్యూల్ ను గుర్తుచేసుకొనవలసి వచ్చింది.
    శామ్యూల్ కు ఆకుపచ్చ రంగంటే ఎంతో ఇష్టం.
    "ఇదివరలో నాకారంగంటే మక్కువలేదు. నీతో కలిపి చూశాక ఆరంగంటే మోజు బయల్దేరింది-" అనేవాడు శామ్యూల్!
    అతడామెకు ఏదైనా బహుమతి ఇస్తే ఏదో విధంగా ఆకుపచ్చరంగు దానితో ముడిపడి వుండేది. ఏదీలేకపోతే ప్యాకెట్ కట్టడానికి ఆకుపచ్చరంగు రిబ్బన్ వాడేవాడు. అతడామెకు ఆకుపచ్చరంగు పెన్ను, ఆకుపచ్చ కాగితాల లెటర్ ప్యాడ్ ఇచ్చి-ఉత్తరాలు వ్రాయడానికి వాటినే ఉపయోగించుకోమని కోరాడు. అన్నింటికీ మించి ఆ రోజు......
    ఆ రోజు ఇద్దరికీ అనుకోని ఏకాంతం లభించింది.
    శామ్యూల్ తో సినిమా చూసి అతడితో పాటు అతడి గదికి వెళ్ళిందామె. అలా చాలాసార్లు చేసింది గతంలో.
    శామ్యూల్ ఓ గవర్నమెంటు క్వార్టర్లో వుంటున్నాడు. అది ఒక ఆఫీసరుది. ఇల్లు చాలా పెద్దది, అందుకని ఆయన అందులోని ఒక గదిని శామ్యూల్ కి అద్దెకిచ్చాడు. అలా చేయడం నేరం కానీ ఇలాంటి నేరాలు ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు.
    శామ్యూల్ కవితను ఆ యింట్లోని వారికి కూడా పరిచయం చేశాడు. వాళ్ళంతా స్నేహపాత్రులు విశాల భావాలు కలవారు. కవిత రాకకు వారెటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. అసలామె రాక గురించి వాళ్ళు పట్టించుకోనేలేదు. వీలున్నప్పుడు వాళ్ళూ వీరి మధ్యకు వచ్చేవారు.
    అయితే ఆ రోజు ఆ యింట్లో శామ్యూల్, కవిత తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇల్లంతా శామ్యూల్ కు అప్పగించి ఇంటివారంతా ఊరికి వెళ్లారు.
    గదులన్నింటికీ తాళాలు వేసి వున్నా అది శామ్యూల్ మీద అపనమ్మకంతో కాదు. ఆ తాళాలన్నీ వారతడికే ఇచ్చి రెండేసిరోజులకోసారి ఇల్లు ఊడ్పించమని చెప్పారు.
    ఆ రోజు శామ్యూల్ తాళాలన్నీ తీసి కవితకు గదులన్నీ చూపిస్తూ ఆఖరున పడకగదికి తీసుకుని వెళ్ళాడు.
    ఆ గది ఎంతో బాగున్నది. గదిలో దగరగా జేర్చబడిన రెండు మంచాలు, వాటిమీద ఫోంబెడ్లు-మంచానికి దగ్గర్లోనే డ్రస్సింగ్ టేబుల్-ఆ టేబుల్ కు అందమైన నిలువెత్తు అద్దం......గోడలకు శృంగారాత్మకమైన పెయింట్సు....
    కవిత ఆ బొమ్మలను చూస్తూ పదిమంది తిరిగే ఇంట్లో అలాంటి బొమ్మలనెలా వుంచారా అని ఆలోచిస్తోంది. తమ యింట్లో పడక గది చాలా సింపుల్ గా వుంటుంది. ఆ గదిలోనూ మంచాలున్నాయి. డ్రెస్సింగు టేబులు వుంది. అయితే పడుకునేందుకు మంచాలవసరం కాబట్టి మంచాలున్నాయనీ, ముఖం చూసుకునేందుకు అద్దం అవసరం కాబట్టి అది వున్నదనీ అనిపిస్తుంది తప్పితే వాటి ప్రత్యేకత కనిపించదు.
    ఈ గదిలో అలాకాదు. ప్రేయసీప్రియులు తమకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రేమ మందిరంలా వున్నదది.
    కానీ ఆ ఆఫీసరుకు వయసు నలభై అయినా వుంటుంది. అతడి భార్య ముప్పయ్యో పడిలో వుంది. ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారు.
    శామ్యూల్ ఆమె ఆలోచనలను చదివినట్లే వున్నాడు.
    "ఈ గది పూర్తిగా భార్యాభర్తలది. పిల్లలకిందులో ప్రవేశం నిషిద్ధం. ఆఫీసరుగారు క్రమశిక్షణ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటాడు. అయినా పిల్లలక్కూడా ఒక్కసారి చెబితే చాలు....."
    ఆ బొమ్మలు తను చూస్తున్నట్లు అతడు గ్రహించాడని తెలియగానే కవిత సిగ్గుపడింది.
    "సిగ్గెందుకు?" అన్నాడు శామ్యూల్.
    "సిగ్గు కాదా మరి!" అంది కవిత.
    శామ్యూల్ నవ్వుతూ-"రేపు నాకుద్యోగం వచ్చాక మన పెళ్ళి అయినాక-మన పడక గదిని ఇలాగే అలంకరించుకోవాలని వుంది నాకు. నీ అభ్యంతరమేమీ వుండదని ఆశిస్తాను-" అన్నాడు.
    "ఛీ!" అంది కవిత.
    "సరదాగా ఒక్కక్షణం మనమిద్దరమూ ఆ మంచం మీద కూర్చుందామా-" అన్నాడు శామ్యూల్.
    "ఎందుకు?"
    "జంటగా మంచంమీద కూర్చుని-మంచంమీద మన జంట ఎలా ఉంటుందో అద్దంలో చూసుకోవాలని వుంది-" అన్నాడు శామ్యూల్.
    అతడలా అనగానే అదే కోరిక ఆమెలోనూ పుట్టింది. అయితే స్త్రీ సహజమైన అభ్యంతరాన్ని తెలియజేసినాకనే ఆమె అతడి కోరిక తీర్చింది.
    ఇద్దరూ మంచంమీద కూర్చున్నారు. ఒకరి పక్కన ఒకరు. ఎదురుగా అద్దంలో ఒకరి పక్కన ఒకరు.
    అప్రయత్నంగా శామ్యూల్ అన్నాడు-"మన జంట ఎంత బాగుంది?"
    కవితకూ అదే అనిపించింది. తమ వివాహం త్వరగా జరిగిపోతే బాగుండునని ఆ క్షణంలో ఆమెకు అనిపించింది.
    "అయితే జంటగా మనలో కొన్ని లోపాలున్నాయి" అన్నాడు శామ్యూల్.
    "ఏమిటి?" అంది కవిత.
    "జంటకుండవలసిన చనువు మనలో కనిపించడం లేదు-...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS