ఓ చవట కధ
వసుంధర
బస్ ఒక్క కుదుపుతో ఆగిపోయింది.
"ఏమయింది?' ఎవరో అడిగారు.
"ఇంజన్ ట్రబుల్ --" సమాధానం వచ్చింది.
నేను చేరదలచుకున్న ఊరికి ఉన్నది వొక్కటే బస్సు . ఊరు వదిలిపెట్టి పది నిముషాలైనా కాకుండా అది ఆగిపోయింది. ఆగేదేదో ఊళ్ళో నే ఆగితే నా ప్రాణం సుఖంగా వుండేది. ఇంటికి పోయి పడుకునే వాణ్ని.
డ్రైవర్ తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. కానీ పని జరగడంలేదనుకుంటాను.
ఇవి ఆర్టీసీ బస్సులు, అందువల్ల వీళ్ళు మరేదో ఏర్పాటు చేస్తారనే ఆశ కూడా లేదు. వెనక్కు పోవడమే ఉత్తమం.
ప్రయాణం ఆగిపోవడం వల్ల నాకుపెద్ద ఇబ్బందేమీ లేదు. ఇదే ప్రయాణం వచ్చేవారం చేయొచ్చు. నాలా అనుకుంటున్నవాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అంతా కండక్టర్ చుట్టూ మూగారు.
"ఈ మధ్యలో వదిలేశావ్- మేము వెనక్కు వెళ్ళే మార్గం చూడు" అన్నాను.
"కాసేపు చూడండి సార్!" అన్నాడు కండక్టర్. అక్కడ రెండు గంటలు గడిచాయి. విసుగ్గా ఉంది.
ఉత్తరోడ్డు అది. పక్కన అటూ ఇటూ పొలాలు కిళ్ళీ బడ్డీ కానీ, పాత హోటలు కానీ లేదు.
"వెధవ ఇంజను - కాస్త చూసుకుని ట్రబులివ్వద్దూ!" అని అప్రయత్నంగానే పైకి విసుకున్నాను. అది విని జోకు అనుకుని కొందరు నవ్వారు. నేను వాళ్ళ వంక సీరియస్ గా చూశాను.
కండక్టర్ డబ్బులు తిరిగి చ్చేయం మొదలు పెట్టాడు. వెనక్కు పోదామనుకునే వాళ్ళకు బస్సేక్కించడం కోసం కూడా చూస్తున్నాడతను. ఊళ్ళో కి వెళ్ళే నాలుగైదు ఆర్టీసీ బస్సులు ఖాళీ లేదని వెళ్ళిపోయాయి.
అక్కడ మొత్తం నాలుగు గంటల సేపు గడిపాక నాకు ఓ బస్సు దొరికింది. ఊళ్ళో కి వచ్చేక తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. ముందు ఓ హోటల్లో దూరి టిఫిన్ తిన్నాను. కిళ్ళీ వేసుకున్నాను.
నిజానికి నాకు ఆకలి లేదు. కానీ నాలుగు గంటల ఒంటరితనం ,దగ్గర్లో హోటళ్ళు లేకపోవడంతో ఏదో తినాలన్న కాంక్షను రగిల్చాయి.
కిళ్ళీ వేసుకున్నాక నాకు ఇల్లు , ఇల్లాలు గుర్తుకు రావడం జరిగింది.
ఇల్లాలుకు నేనీరోజు ప్రయాణం చేయడం ఇష్టం లేదు. సెలవు పూటా ఊరి కేందుకండి అంది.
వెర్రి మొహం - సెలవు పూట కాకపొతే ఆఫీసున్న రోజున ఊరికి వేడతారా?
అదే చెప్పాను. ఏం మాట్లాడలేదు. నన్ను దిగబెట్టడానికి బస్టాండు కు వచ్చింది. బస్ కదిలేదాకా ఉంది కన్నీళ్ళతో వీడ్కొలిచ్చింది. ఇంతకూ నేను తిరిగి రావడం ఎప్పుడనుకున్నారు?... రేపు ఉదయం....రేపంటే రేపు ఉదయమే!
ఈ అడాళ్ళంతే! చీటికీ మాటికీ కన్నీళ్లు. అందులోనూ నా భార్య సంగతి చెప్పక్కర్లేదు. అది కలియుగంలో పుట్టాల్సింది కాదు. దానికి నా కాళ్ళే తప్ప ముఖం కనబడదు. అలాంటి అడాళ్ళంటే నాకు చిరాకు . నాభార్యన్నా నాకు చిరాకే! కానీ ఏం చేస్తాం తప్పదు! ఈ పవిత్ర భారతదేశంలో పుట్టినందు కిలాంటి భార్యల్ని భరించక తప్పదు!
ఆ విషయమే దానికి చెప్పి మరీ భరిస్తున్నాను.
దానికి సిగ్గులేదు. ఎన్ని మాటలన్నా భరిస్తుందది. తిడితే నవ్వుతుంది. కొట్టినా బాధపడదు. కానీ నేను భోజనం మానేస్తే ఏడుస్తుంది. ఊరొదిలి వెళ్ళిపోతే ఏడుస్తుంది.
అందుకే నేను దాన్ని ఏడిపించాలంటే తిట్టను. కొట్టను. భోజనం మానేస్తాను. ఊరికి వెడతాను.
ఇప్పుడూ అలాగే ఊరికి బయలుదేరాను. కానీ ఏం లాభం? ప్రయాణం మొదట్లోనే బెడిసికొట్టింది.
వెంటనే ఇంటి కెళ్ళిపొతే దానికి నన్ను చూసిన సంతోషం కలుగుతుంది. అది నా కిష్టం లేదు. కానీ తనువూ విశ్రాంతి కోరుతోంది. దోసెలు తిన్న కడుపు మళ్ళీ కిళ్ళీ నమిలిన నోరు ...త్వరగా ఇల్లు చేరి నడుం వాల్చమని ప్రోత్సహిస్తూన్నాయి.
ఇంటికి నడిచే బయల్దేరాను. బస్ స్టాండు నించి మా యిల్లెంతో దూరం లేదు. పది నిముషాల నడక - అంతే!
ఈరోజు కాస్త నెమ్మదిగా నడిచాను, అయినా పదిహేను నిముషాలే పట్టింది.
ఇల్లోచ్చేసింది.
వీధి తలుపులు గడియ వేసి లేవు. ఓరగా తెరచి వున్నాయి.
అమ్మయ్య- దాన్ని తిట్టడానికి వస్తూనే మంచి అవకాశం దొరికింది. తలుపులు దర్జాగా తెరిచి వదిలేస్తుందా? ఇంట్లో నేను కూడా లేనే! అంత రాచకార్యమేం తగులడింది?
అయినా దాన్ని తిట్టి ఏం లాభం? ఎన్ని తిట్టినా నవ్వుతుంది. రాత్రికి భోం చేయనని చెప్పాలి. అందులోనూ ప్రస్తుతం కడుపు పోటుగా వుంది. కాసేపు దాన్ని యేడిపించి యేడిపించి నిజంగా నాకకలి వేశాక అప్పుడే తినొచ్చు.
తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాను. ముందు తలుపు గడియ వేశాను. దాన్ని తిట్టే ముందు తలుపుల పట్ల నాకున్న శ్రద్ధ నిరూపించుకోవాలి కదా!
నేను వచ్చినట్లు దానికి తెలియకూడదు. అదేం చేస్తోందో నేను చూడాలి!
ఇలాంటి అవకాశం నాకెప్పుడూ రాలేదు. అనుకోకుండా ఆఫీసు కు సెలవోచ్చినా , ఎదో అవాంతరం వచ్చి పని వాయిదా పడిపోయినా - నేనెప్పుడూ వెంటనే ఇంటికి వెళ్ళే వాడ్ని కాను. స్నేహితులతోనో, మరో విధంగానో సరదాగా గడిపి - ఇంటికి మాత్రం మాములుగానో, వేళ తప్పో వెళ్ళేవాడ్ని.
తలుపులు తట్టకుండా ఇంట్లో ప్రవేశించే అవకాశం కూడా ఈరోజే నాకు ప్రధమంగా లభించింది.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. అడుగులో అడుగు వేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళాను.
నా ఇల్లాలు సీత వంటింటి పక్షి! గిన్నెలు తోముతూనో, చింతపండు గింజలు తీస్తూనో, కూర్చోవడం దాని హాబీ. మొగుడితో సరదాగా బెడ్రూం లో పడుకోవాలని గానీ, మొగుడు లేనప్పుడు పడక గదిని అందంగా తీర్చి దిద్దాలని కానీ దాని బుద్దికి తోచలేదు. అందుకే అది బెడ్రూం లోకి వస్తే నాకు కంటగింపు.
కానీ ఇప్పుడు సీత వంటింట్లో లేదు.
నేనీసారి స్టోర్ రూంలోకి వెళ్ళాను. అక్కడ వస్తువులను రోజూ మార్చి సర్డుతుంటుంది సీత. కానీ ఈరోజది అక్కడా లేదు.
మా యిల్లు కాస్త పెద్దది. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం. పెళ్ళయి మూడేళ్ళు దాటింది. ఇంకా పిల్లలు లేరు. అదీ ఒకందుకు మంచిదే అయింది. పిల్లలు పుడితే ఇప్పటికే అదోలా వున్న సీత అసహ్యంగా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే దాన్ని ఎలాగో భరిస్తున్నాను. అప్పుడు భరించలేను.
పడకగది కి బయల్దేరాను.
అడుగులు నెమ్మదిగా వేస్తున్నాను.
చప్పుడు కాకుండా పిల్లిలా నడుస్తున్నాను.
ఇక్కడ కూడా సీత వుంటుందా , వుండదా ? అయినా ఇంట్లో , బొత్తిగా అలికిడి లేదేమిటి?
పడకగది సమీపించేసరికి కాస్త అలికిడి వినపడింది. అమ్మయ్య అనుకుని తేలికగా నిట్టుర్చాను. ఇల్లు ఇంత నిశ్శబ్దంగా వుంటే - వంటింట్లోనూ, స్టోర్ రూం లోనూ సీత లేకపోతె -- అది బహుశా ఎక్కడికో బైటకు వెళ్ళి వుంటుందని - దొంగ ఎవడో యింట్లో ప్రవేశించి ఉంటాడనీ భయం వేసింది. పడకగదిలో అలికిడి వినగానే నాకు కలిగిన తృప్తి ఇంతా అన్తాకాడు. ఆ అలికిడి సీత చేయిది. ఆ చేతిని ఎప్పుడూ నిండుగా గాజులుంటాయి. అది కాస్త కదిలినా అవి గలగలలాడుతుంటాయి. గాజుల గలగల అగకుండా వినపడుతూనే వుంది.
ఏం చేస్తోంది గదిలో సీత?గాజుల గలగల అంత ఎక్కువగా ఉందేం?
గుమ్మం లోంచి తొంగి చూశాను.
అక్కడ నేను చూసిన దృశ్యం నన్ను నిశేష్టుడ్ని చేసింది. సీతా -- అని గట్టిగా అరవాలనుకున్నాగానీ గొంతు పెగలలేదు. పెదవులు కదలలేదు.
మంచం మీద సీత మరో పురుషుడు నగ్నంగా ఒకరి కొకరు వాటేసుకుని వున్నారు.
ఇది నేనూహించని సన్నివేశం!
సీత చేతిని గాజులున్నాయి కాబట్టి చప్పుడవుతోంది.
నేను గుమ్మం లోకి వెళ్ళి నిలబడ్డాను. నానీడ వారిని తాకిందో ఏమో ఇద్దరూ ఉలిక్కిపడి నాకేసిచూశారు.
"సీతా!" అంటూ ఆప్రయత్నంగా అరిచాను.
వాడు చటుక్కున లేచి నిలబడ్డాడు. మంచం పక్కగా వున్న లుంగీ తీసి చుట్టుకున్నాడు. నేను చూస్తుండగానే మంచం మీది పరుపు కాస్త కదిపి -- అడుగున చేయి పెట్టి కత్తి ఒకటి తీసి -- నాకు చూపించి బెదిరిస్తూ -- "అరవకు, అరిస్తే చస్తావు -" అన్నాడు.
సీత మాత్రం మంచం మీద అలాగే కదలకుండా పడుకుని నా వంకా, వాడి వంకా మార్చి మార్చి చూస్తోంది. నగ్నంగా వున్న తన శరీరాన్ని కప్పుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించడం లేదు.
"ఎవర్నువ్వు?' అన్నాను.
"దొంగని. డబ్బు దోచుకుందామని వచ్చాను. కానీ అంతకన్న విలువైనదే దొరికింది -" అన్నాడు వాడు. తర్వాత వాడు సీతను ఆజ్ఞాపించి నా రెండు చేతులూ వెనక్కి విరిచి కట్టించాడు. కాళ్ళు కూడా కట్టించాడు.
"ఇంక ఉంటాను మరి - గుడ్ బై మిస్టర్ ..... థాంక్యూ సీతా!" అని వెళ్ళిపోయాడు వాడు.
అప్పుడు సీత బట్టలు కట్టుకుంది.
2
"ఎవరు వాడు?' తీవ్రంగా ఆడిగాను.
"తెలియదు. నేను వంటింట్లో పని చేసుకుంటుండగా బయట నుంచి వీధి తలుపు గెడ తీసుకుని వచ్చాడు. నన్ను బెదిరించి లోబరచుకున్నాడు--" అంది సీత.
"బెదిరిస్తే లొంగిపోవడమెనా? వాణ్ని ప్రతిఘటించవద్దూ-- బరి తెగించిన ముండా!" అని తిట్టాను.
సీత నవ్వింది. నేనెప్పుడు తిట్టినా అది నవ్వుతుంది-- "ఇప్పుడు మీరేం చేశారు చెప్పండి. నేను మీ చేతికి కట్లు కడితే చూస్తూ ఊరుకున్నారు కదా!"
కత్తిని చూసి నేను భయపడ్డాను. నిజమే! కానీ నేను మగవాణ్ణి. నా ప్రాణాలు అమూల్యం. మరి సీత? అది ఆడది -- దానికి ప్రాణం కంటే మానమే ముఖ్యం!- అదే చెప్పాను దానికి.
"మీరు చెప్పింది నిజమేనండి. వాడు కత్తి చూపించి నప్పుడా విషయం గుర్తుకు రాలేదు. ఈసారెప్పుడైనా ఇలా జరిగితే ఈ విషయం గుర్తుంచుకుంటా -- " అంది సీత.
