"మరో అవకాశం లేదు నీకు. ఒకసారి మానం పోగొట్టుకున్న స్త్రీని నేను ఆదరించలేను. నువ్వు చావనైనా చావు. ఎక్కడికైనా పో -- నా కక్కరలేదు -- నేను రెండో పెళ్ళి చేసుకుంటాను-" అన్నాను కోపంగా.
"నన్ను పొమ్మనకండీ -- మీరు రెండో పెళ్ళి చేసుకోండి. అందువల్ల లాభం కూడా వుంది. ఏ దొంగైనా వస్తే ఇద్దరుంటాం కాబట్టి ప్రతిఘటించడానికి సులభంగా వుంటుంది--" అంది సీత.
హటాత్తుగా నాకో విషయం గ్రహింపయింది. సీత తెలివిగా మాట్లాడుతోంది. నన్ను వేళాకోళం చేస్తోంది. తనకేదో అయిందన్న బాధ గానీ, తన భవిష్యత్తు గురించిన భీతి గాని దాని మాటల్లో గోచరించడం లేదు.
నాకోపం తారాపధం చేరుకుంది -" నేనే నిన్ను చంపేస్తాను!" అన్నాను.
సీత భయపడలేదు -- "వద్దండీ ! నన్ను చంపి మీరు సుఖపడలేరు. అనవసరంగా జైలు పాలవుతారు. మిమ్మల్ని ఉరి కూడా తీస్తారు..."అంది.
"ఏ పరిస్థితుల్లో నిన్ను చంపానో కోర్టులో చెప్పుకుంటాను. ఆవేశంలో చేసిన హత్యకు శిక్ష అట్టే వుండదు-" అన్నాను నిరసనగా.
"మీ మేలు కోరేదాన్ని కాబట్టి ఇంతగా చెబుతున్నాను. నన్ను చంపేక కూడా మీకు ఉరి శిక్ష పడక పోయినా భార్యను చంపిన మగవాడైనందున మీకు ఎవరూ పిల్లనివ్వరు. ఇంకో పెళ్ళాం దొరకదు" అంది సీత.
ముందడుగు వేస్తున్నవాడినల్లా ఆగిపోయాను.
ఎంత తాపీగా మాట్లాడుతోంది! అది చెప్పే ఒకోమాటా నా గుండెల్ని పిండిచేస్తోంది. తను మాత్రం ఎక్కడా చలించడం లేదు.
"సీతా- అట్టే వాగకు. నిన్ను నేను చంపి నా చేతులు కళంకం చేసుకోలేను. పాపిష్టి దానా -- ఎక్కడికీ వేడతావో వెళ్ళిపో -" అన్నాను.
"నేను వెళ్ళిపోతే నలుగురూ మిమ్మల్ని చూసి నవ్వుతారండి- పెళ్ళాం వదిలిపెట్టిన మగాడ్ని చూసి సమాజం వెటకారం చేస్తుందండీ - అసలే మీది సున్నిత హృదయం అది మీరు భరించలేరు...."
'అలాగా- అయితే పోనీ నీది పాషాణ హృదయం కదా! మొగుడు వదిలిపెట్టిన పెళ్ళాం గా వెధవ బ్రతుకు బ్రతుకుదువు గాని...." అన్నాను.
"మీరు నన్ను వదిలేస్తానంటే నాకు భయం వేస్తోంది. అప్పుడు నేను వాడితో వెళ్ళక తప్పదు" అంది సీత బెదురూ కళ్ళతో.
ఉలిక్కిపడ్డాను. "యేమిటన్నావ్?"
సీత వివరంగా చెప్పింది.
ఏకారణం చేతనైనా నేను సీతని వదిలి పెడితే వాడు పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాట్ట!
సీత ధైర్యం నాకర్ధమైంది -- " వాడితో పోవడం సీత కిష్టమేనా?" అన్నాను తీవ్రంగా.
"ఇష్టం లేదండి -- వాడంటే నాకసలు ఇష్టం లేదు. తాళి కట్టిన భర్త మీరు - మీరే నా దైవం. కత్తి చూపించి బెదిరించాడు. అరిస్తే చంపేస్తానన్నాడు. తను చెప్పినట్లు వినమన్నాడు. ప్రాణభయంతో లొంగిపోయాను. ఇది తెలిస్తే నా భర్త నన్ను వదిలి పెట్టేస్తాడన్నాను. వదిలేస్తే నేను పెళ్ళి చేసుకుంటానన్నాడు. భయపడవద్దన్నాడు. తప్పంటూ జరిగితే అది తనదే కానీ నాది కాదన్నాడు--" అంది సీత.
ఇప్పుడు నేను సీత మాటలు విని కాస్త ఆనందించగలుగుతున్నాను.
"ఒకవేళ నేను పొమ్మంటే ఏం చేస్తావ్?'
"మీరే మెడపట్టుకుని గెంటినా -- మీ పాదాలు వదలను. కానీ వాడు బలవంతంగా నన్ను తీసుకుపితే ఏం చేయను? ఆడదాన్ని -- అబలను-- అసహాయురాలను...."
అసహయురాలు సీత కాదు ....నేను.
"నువ్వు ....పూర్తిగా వాడికి లొంగి పోయావా?"
"ఊ" అని సీత తలవంచుకుంది.
"ఛీ -' అనుకున్నాను. ఏం చేయాలో నాకు తోచలేదు. నేనిప్పుడు పూర్తిగా అసహయుడ్ని. నా భార్య నో దొంగ వెధవ చెరిచాడు. దాన్ని వదిలేడ్డామా అంటే అది వాడితో పోయేలాగుంది. అది లేచిపోయిందని చెప్పుకుంటారంతా! అలా కాక దాన్ని చంపేద్దామా అంటే సుఖాన వున్న ప్రాణాన్ని దుఖాన పెట్టుకోవడం అవుతుంది. నా శరీరానికింకా ఎన్నో కోర్కేలున్నాయి. అవన్నీ తీరకుండా దాన్ని జైలు పాలు చేయడం నాకిష్టం లేదు.
కాసేపు ఆలోచించాను. ఇందులో సీతదేమీ తప్పు లేదు. ఆ వెధవని నేనే ఏమీ చేయలేకపోయాను. తనేం చేస్తుంది? ఎన్ని కబుర్లు చెప్పినా ప్రాణం తర్వాతే ఏమైనా? జరిగింది సీత కిష్టం లేదని చెబుతోంది. జీవితాంతం నా పాదాల దగ్గరే పడి ఉంటానంటోంది . అలాంటి దాన్ని దెబ్బలాడి ఏం ప్రయోజనం?
కానీ -- దాన్ని మరో పురుషుడనుభావించాడన్న ఆలోచన నా మనసునుదహించేస్తోంది. నేను మామూలు మనిషిని కావడానికి చాలాసేపు పట్టింది.
ముందు కాసేపు బైటకు పోదామనుకున్నాను. కానీ -- నేనలా బైటకు వెళ్ళగానే ఆవేధవ మళ్ళీ వస్తాడేమోనని భయం వేసి ఇల్లు కదలలేదు. కానీ ఇల్లాల్నీ తప్పించుకు తిరిగాను. అది ఎంతో బ్రతిమాలగా రాత్రి పదింటికి భోం చేశాను. తర్వాత మంచ మెక్కి పడుకున్నాను. తనని నాదగ్గర పడుకోవద్దని శాసించాను.
అన్నీ తను మౌనంగా సహించింది. నా గదిలోనే ఓ చాప వేసుకుని పడుకుంది.
ఓ రాత్రి వేళ నాకు మెలకువ వచ్చింది. బెడ్ స్విచ్ నొక్కాను. గదంతా ప్రకాశవంతమైంది. ఓసారి కళ్ళు నులుముకుని చూశాను.
సీత చాప మీద పడుకుని వుంది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాసేపు నా చూపుల్నామేనుంచి మరల్చుకోలేక పోయాను. సీత చాలా అందగత్తె -- అనిపించింది ఆ క్షణం లో.
చటుక్కున మంచం దిగి దగ్గరగా వెళ్ళాను. కుదిపి లేపాను.
మొద్దు నిద్ర పోతోంది. ఓ పట్టాన లేవలేదు.
కాస్త వళ్ళు మండింది నాకు. అసలు దీని కింత నిద్రెలా పడుతోంది? ఓ పరాయి మగాడు - కత్తి చూపించి తన సర్వస్వమూ దోచుకు పోయాడే -- అందుకు -- ఇసుమంతైనా బాధ లేదా?" ఎంత హాయిగా నిద్రపోతుంది?
కళ్ళు నులుముకుంటూ "యేమిటండీ!" అంది.
"సీతా-- నిన్ను నేను క్షమిస్తున్నాను--" అన్నాను.
"ఎందుకు?" అంది మత్తుగా వళ్ళు విరుచుకుంటూ. తనలా వళ్ళు విరుచుకుంటుంటే నేను మరికాస్త అవేశాపడ్డాను. ఎందువల్లనో అప్పుడు నాకామెపై కోపం కలగడం లేదు.
"జరిగినదంతా మర్చిపోదాం, మనిద్దరం ఎప్పటిలాగే ఉందాం--" అన్నాను.
సీత నిర్లక్ష్యంగా చాప మీదకు వాలి --" ఇది చెప్పడానికి ఇప్పుడు లేపారా?' అంది.
సీత నిర్లక్ష్యం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ ఒక విషయం ఒప్పుకోవాలి. నిర్లక్ష్యానికి బదులు అది నా కాళ్ళు పట్టుకుని ఉంటే ఎప్పటికీ లొంగి ఉండే వాణ్ని కాదు. దాని నిర్లక్ష్యం నాలో ఏదో భయాన్ని సృష్టిస్తోంది. దాన్ని పోగొట్టుకుంటానేమోనని భయం వేస్తోంది. అదే దాని పట్ల నా ఆకర్షణను పెంచుతోంది.
సంభాషణ పెంచే ఉద్దేశ్యం నాకు లేదు --" పద మంచం మీద పడుకుందువు గాని....' అన్నాను.
సీత మాట్లాడలేదు. అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయింది. తట్టి లేపాను, లేవలేదు.
నిద్రపోతుందా, నిద్ర నటిస్తోందా? ముఖం చూస్తుంటే నిద్ర పోతున్నట్లే ఉంది....నటనలా లేదు.
'అబ్బ.....నిద్ర పోనివ్వండి!" అంటూ గునిసింది.
"నిద్రపోదువు గాని -- ముందు మంచం మీదకు రా--" అన్నాను.
"నేను లేవలేను-- ఇక్కడే పడుకుంటాను -" కాస్త ముద్దగా అంది.
నేనెంత ప్రయత్నించినా తను లేవడం లేదు.
అప్పుడు నేనూ చాప మీదే పడుకున్నాను.
3
సీతప్రావర్తన చాలా మాములుగా ఉంటోంది. తన వల్ల తప్పు జరిగిందన్న విషయం నేను తప్ప -- తను గుర్తించినట్లు లేదు. అది నాకు చాలా బాధగా ఉంది.
అయితే నాకిప్పుడు సీతను వదిలిపెట్టి ఉండటానికి భయంగా ఉంటోంది. వేళకు ఆఫీసుకు వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాను. సాయంత్రాలు తనను షికారుకు కూడా తీసుకు వెళుతున్నాను. ఓరోజున ఇద్దరం కలిసి సినిమా క్కూడా వెళ్ళాం. పెళ్ళైన మూడేళ్ళ లోనూ మేం కలిసి చూసిన అయిదో సినిమా అనుకుంటానది! పెళ్ళానితో కలిసి సినిమా చూడ్డమంటే మహా చిరాకు నాకు.
సీతతో మాట్లాడినప్పుడల్లా -- ఒకే ఒక తప్పు చేసి పతనమైపోయిన ఆడవాళ్ళ కధలు చెబుతుండేవాడిని. సమాజం వాళ్ళనేలాంటి చిన్నచూపు చూస్తుందో -- వాళ్ళే లాంటి నికృష్టపు చావు చస్తారో వివరించాను.
ఈ కధలన్నీ తను కుతూహలంగా వింది. వారిపట్ల జాలి చూపింది. తప్పితే అలాంటి స్థితికి చేరుతుందన్న భావాన్ని కళ్ళలో చూపలేదు. నా విశాల హృదయాన్ని గుర్తించనూ లేదు.
ఆమె నా ప్రవర్తన నాకు అర్ధం కావడం లేదు. ఈ మార్పు ఆమెలో కొత్తగా వచ్చిందని మాత్రం నాకు అనిపిస్తోంది. నాకు నచ్చని మార్పు అది.
సీత గురించి ఆలోచించినప్పుడల్లా నాకు తలనొప్పి వస్తోంది. ఒకోసారి ఆ తలనొప్పి భరించలేనిదవుతోంది. రోజులు గడిచే కొద్దీ తలనొప్పి పెరుగుతోంది తప్పితే తరగడం లేదు.
నేను అసహయుడ్ని , అసమర్దుడ్ని , అయ్యానని నా మనసు నన్ను వేళాకోళం చేస్తోంది. అది నిజమేనని నాకూ అనిపిస్తోంది.
ఒకరోజు మధ్యాహ్నం ఆఫీసులో అలాంటి పరిస్థితే ఏర్పడి -- మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి పోయాను. ఇంటికి వెళ్ళగానే నా మొదటి అనుమానం -- తలుపు గడియ వేసి వుండదని!
తలుపు తోశాను. గడియవేసి ఉంది. తృప్తిగా నిట్టూర్చి కాలింగ్ బెల్ మ్రోగించాను.
ఒక్క నిముషం ఆగాను. అడుగులచప్పుడు ఇంకా వినిపించలేదు. అసహానంగా మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగించాను. మరో నిముషం గడిచినా ఎవరూ వస్తున్న చప్పుడవలేదు.
అలా ఆగకుండా కాలింగ్ బెల్లు మ్రోగిస్తూనే వున్నాను. అయిదు నిముషాలలా గడిచాక అడుగుల చప్పుడు వినిపించింది.
ఆలస్యానికి సీతను మన్నించకూడదు చెడామడా తిట్టాలి -- అనుకున్నాను.
"పాపం -- నిద్ర పోతుందేమో -- " అనిపించింది మళ్ళీ! మనసేమో వేళాకోళం చేసింది -- ఈమధ్య నువ్వు సీతను తిట్టడానికి భయపడుతున్నావు-- అంటూ!
తలుపు గడియ తీసిన చప్పుడయింది. తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా....
కాసేపు నా గుండె వేగంగా కొట్టుకుంది. మెదడు పని చేయలేదు. కళ్ళు మసకలు కమ్మేశాయి. సర్వేంద్రియాలూ స్తంభించిపోయాయి! ఒక్క మాటలో చెప్పాలంటే నేను నిశ్చేష్టుడినయ్యాను.
