"అదిసరే - ముందు నువ్వక్కడినించి ఎలా బైట పడ్డావో చెప్పు!" అన్నాడు వెంకన్న.
"ఎలా బైట పడ్డానో నాకే తెలియదు. ఆగదిలో నేను సోలిపోయి పడిపోయాను. మెలకువ వచ్చేసరికి గది తలుపులు వేసి వున్నాయి. పిశాచం లేదు. ఒక్క పరుగున అక్కణ్ణించి బైట పడ్డాను. నా అనుభవం ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇల్లు చేరగానే ఇంటిల్లిపాదీ నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదో కుంటి సమాధానాలు చెప్పి తప్పించుకున్నాను. కాస్త తేరుకున్నాక మీ దగ్గరకు వచ్చాను..."
"నా దగ్గరకు రావడంతో ఏం ప్రయోజనమాశించావ్?" అన్నాడు వెంకన్న.
"ఈ ఊళ్ళో యిలాంటి దెయ్యం ఒకటున్నదని మీ బోటి వారికి తెలియడం అవసరమని నాకు అనిపించింది"అన్నాడు సురేష్ కుమార్.
"ఒకే మిస్టర్ విజయ్ నీ కేసంతా మా అసిస్టెంట్ కధగా వ్రాశారు. అది కధ కాక నిజమేఅయితే ఆ కామినీ పిశాచి అంతు నేను తేలుస్తాను. అది నువ్వు కన్న కలే అయితే నీ కల్పనాశక్తిని అభినందిస్తూ నా మిత్రులకిది కధగా చెప్పుకుంటాను" అన్నాడు వెంకన్న.
"విజయ్-- ప్లీజ్ -- నన్నా పేరుతొ పిలవకండి" అన్నాడు సురేష్ కుమార్ కంగారు పడుతూ.
5
నిర్జన ప్రాంతంలో వున్న ఆ బంగళా తలుపు తట్టాడు డిటెక్టివ్ వెంకన్న.
రెండు నిముషాలు పట్టింది తలుపు తెరుచుకోడానికి. తలుపు తెరిచిన వ్యక్తిని చూసి వెంకన్న ఆశ్చర్యపడ్డాడు. అతను జనార్ధనరావు.
"మీరా?" అన్నాడు వెంకన్న అప్రయత్నంగా.
జనార్ధనరావు నీరసంగా నవ్వి "చాలా కాలం తర్వాత మనం కలుసుకుంటున్నాం . అన్నీ సవ్యంగా జరిగి వుంటే మనం నా పెళ్ళిలో కలుసుకోవలసి వుండేది" అన్నాడు.
"ఇదా మీ యిల్లు !" అన్నాడు వెంకన్న.
"ఈ మధ్యనే కొన్నానీ యిల్లు !" అన్నాడు జనార్ధనరావు.
"ఎందుకని?"
"జనార్ధనరావు అదోలా నవ్వి "లోపలకు రండి అన్నీ వివరంగా చెబుతాను" అన్నాడు.
ఇద్దరూ లోపల కుర్చీల్లో కూర్చున్నారు.
"ఈ ఇంట్లో ఓ కామినీ పిశాచం వుందని చెప్పుకుంటున్నారు. అది పట్టుకున్న మగవాడ్ని ప్రాణాలు తీసేదాకా వదలదట. అందువల్ల ఈ యిల్లు అమ్ముడు కావడమే కష్టంగా వుంది. ఇంటి యజమానికి , రెండు లాభాలను దృష్టిలో వుంచుకుని ఈ ఇల్లు కొన్నాను నేను. ఒంటరితనాన్ని కోరుకుంటున్న నాకు నిర్జన ప్రాంతంలో ఉండే ఈ ఇల్లోక వరం. అందులోనూ చవగ్గా వస్తోంది. ఈ ఇంట్లో కామినీ పిశాచి నిజంగానే వుంటే నాకు దాని గురించి భయం లేదు. జీవితేచ్చ లేనివాడ్ని నేను!" అని నిట్టూర్చాడు జనార్ధనరావు.
"పట్టుమని పాతికేళ్ళు లేని మీకు జీవితేచ్చ లేదంటే ఎలా? మీరు రాదని ప్రేమించి వుండొచ్చు. కానీ ఎంత కాలమని ఆమెను తల్చుకుని బాధపడతారు?" అన్నాడు వెంకన్న.
"ఈ ప్రశ్న జవాబు కోసం నేనూ అన్వేషిస్తున్నాను వెంకన్న గారూ!'అన్నాడు జనార్ధనరావు.
"మీరలా అన్వేషిస్తూ వుండండి. మరో అన్వేషణలో నేనిక్కడికి వచ్చాను. నేను మీ ఇల్లు ఓసారి శోధించి చూడవచ్చా?' అన్నాడు వెంకన్న.
"ఎందుకు?"
"ఈ యింట్లోని కామినీ పిశాచాన్ని వెదకడానికి?"
"ఇక్కడ కామినీ పిశాచం వున్నట్లు మీ కెవరు చెప్పారు?"
"సురేష్ కుమార్!' అన్నాడు జనార్ధనరావు కళ్ళలోకి నిశితంగా చూస్తూ.
"అతనెవరు?" అన్నాడు జనార్ధనరావు ఆశ్చర్యంగా.
"కామినీ పిశాచం వాత బడ్డవాడు...."
"ఇంకా బ్రతికే వున్నాడా?"
"ఉన్నాడు...." అని వెంకన్న అగి "నిన్నరాత్రి మీరేక్కడున్నారు?" అనడిగాడు.
"ఇక్కడే ఈ ఇంట్లోనే!" అన్నాడు జనార్ధనరావు.
"అసంభవం....' అన్నాడు వెంకన్న.
'అలా అంటే నేనేం చెప్పను? రెండాటల సినిమా చూసి ఇల్లు చేరి పడుకున్నాను...."
వెంకన్న కళ్ళు మెరిశాయి. "అదే నేనడిగేది ? అంటే మీరు రాత్రి చాలాసేపు ఇంట్లో లేరన్న మాట! రెండాటల సినిమాలు అంటే ఇంటి దగ్గర సాయంత్రం అయిదింటికే బయల్దేరి వుంటారు. ఇంటి కొచ్చేసరికి కనీసం ఒంటి గంట అయుంటుంది. ఈ ఇంట్లో నిన్నరాత్రి తోమ్మిదికీ పన్నెండింటికి మధ్య కామినీ పిశాచి కధ నడిచింది. ఆమె దగ్గర ఇంటి తాళాలు కూడా వున్నాయి."
జనార్ధనరావు ఆశ్చర్యంగా -- "అసలేం జరిగిందో చెప్పండి!" అన్నాడు వెంకన్న చెప్పింది విని -" వెంకన్న గారూ -- మీరిది నమ్ముతున్నారా?' అనడిగాడు.
"ఈ కధ పై మీ అభిప్రాయం." అన్నాడు వెంకన్న.
"కధ అని మీరే అంటున్నారుగా"అని నవ్వి "నేను నెల్లాళ్ళుగా ఇందులో వుంటున్నాను. నాకే అనుభవమూ లేదు" అన్నాడు జనార్ధనరావు.
వెంకన్న జనార్ధనరావు వంక తీవ్రంగా చూసి "సురేష్ కుమార్ కధైనా చెప్పి వుండాలి. మీరు కధైనా నడుపుతూ వుండాలి. ఏ విషయం నేనెలాగూ తెల్చగలను" అన్నాడు.
జనార్ధనరావు తల వంచుకుని "వెంకన్న గారూ మీరంటే నాకు అపారమైన గౌరవం వుంది. నేనే నేరమూ చేయడం లేదు. నన్ను నమ్మండి" అన్నాడు.
6
"హలో విజయ్!"
పిలుపు విని ఉలిక్కిపడ్డాడు సురేష్ కుమార్. అల్లంత దూరంలో అతడికి ప్రభ కనబడింది. ఆమెను చూస్తూనే సురేష్ కుమార్ కాళ్ళలో వణుకు పుట్టింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగానే అతన్ని సమీపించింది ప్రభ.
"నా పేరు విజయ్ కాదు" అన్నాడతను.
"కానక్కర్లేదు , ఆ పేరు నా కిష్టం. నువ్వంటే కూడా నా కిష్టం. అందుకని నీకా పేరు పెట్టుకున్నాను. ఆ కధంతా మళ్ళీ చెప్పాలా?' అంది ప్రభ.
"వద్దు. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు" అన్నాడు సురేష్ కుమార్.
'అలాగంటావేమిటి విజయ్. ఈసారి క్రిందటి సారిలా జరగడానికి వీల్లేదు."
'అంటే?"
"నిన్నా ఇంటికి తీసికెళ్ళి కాసేపు ఊరించి తర్వాత నాదారిన నేను వెళ్ళిపోయాను.....అందుకు గానీ నీకు నా మీద కోపం రాలేదు గదా!' అంది ప్రభ.
సురేష్ కుమార్ ఆశ్చర్యంగా ఆమె వంక చూసి "నీ కధ పూర్తిగా చెప్పు. అప్పుడు నేను నా కధ చెబుతాను" అన్నాడు.
"చెప్పడాని కేముంది? చెప్పేశాను గా....నువ్వంటే మనుసు పడే నిన్నా యింటికి తీసుకు వెళ్ళాను. అయితే చివరి క్షణంలో నిన్నింకా ఊరించాలని పించింది. పడక గదిలోంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నువ్వు నన్ను చాలా తిట్టుకుని ఉంటావు. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ నాకు చాలా అలవాటు...."
"నన్ను మళ్ళీ ఆ యింటికి తీసుకెళ్ళాలని నువ్వు ప్రయత్నిస్తున్నావేమో -- అది నీకు సాధ్యం కాదు. ఈసారి నేను మోసపోను...." అన్నాడు సురేష్ కుమార్.
'ఆయింటికా -- ఆరోజు ప్రాక్టికల్ జోక్ పేరుతొ అంత రాత్రి వేళా ఆ యింట్లోంచి బైటకు వచ్చేసరికి నా కెంత భయమేసిందో తెలుసా? ఈసారి అలా జరగడానికి వీల్లేదు. అందుకే మనిద్దరి కోసం మేజస్టిక్ హోటల్లో గది బుక్ చేశాను...." అంది ప్రభ.
మేజస్టిక్ హోటల్!
ఆ ఊరికి అది త్రీ స్టార్ హోటల్!
సురేష్ కుమార్ ప్రభ వంక పరిశీలనగా చూసి - "ఎవరీమె -- ? మనిషా, కామినీ పిశాచా?"" అనుకున్నాడు. ఆమె అందం చూస్తుంటే అతడికి మనసు చలిస్తోంది.
కానీ జరిగిన అనుభవం అతన్ని అపాదమస్తాకమూ వణికిస్తోంది.
'అయితే ఏమంటావ్?" అన్నాడతను చిరాగ్గా.
"ఈ రాత్రి మనం మెజిస్టిక్ హోటల్లో -- సరదాగా గడుపుదాం. ఆ రాత్రి మిస్సైపోయిన అనుభవాలన్నీ ఈ రోజు తనివితీరా పొందాలి. అందాల అప్సరస అనిపించుకొనే యీ ప్రభ ఈ విజయ్ కు ప్రేమ దాస్యం చేయాలి...."
సురేష్ కుమార్ అలోచించి - "మెజిస్టిక్ హోటల్ కే అయితే వస్తాను...." అన్నాడు.
"కాక.... మరెక్కడికి .....రూం కూడా బుక్ చేసి ఉంచాను...." అంది ప్రభ.
సురేష్ కుమార్ లో మళ్ళీ కోర్కెలు తలెత్తసాగాయి. అతడికి ప్రభను నమ్మాలనే అనిపించింది. ఆరోజు కామినీ పిశాచిగా తనపై అత్యాచారం జరిగిన మానవాతీత శక్తి, ఈ ప్రభ ఒక్కరు కాదు. ఈ రెండు సంఘటనలు కాకతాళీయంగా జరిగాయి.
ఆమె ముందుగానే యేదైనా రిక్షా యేర్పాటు చేసి తప్పుదారి పట్టిస్తుందేమో నన్న భయంతో -- "నేను రిక్షాను పిలుస్తాను...." అన్నాడతను.
"మెజిస్టిక్ హోటల్ కు వెడుతూ రిక్షాలో వేడతామా?" అంది ప్రభ హేళనగా.
"పోనీ ...టాక్సీ నే పిలుస్తాను...."
"నీకు నచ్చిన టాక్సీనే పిలు....-----" అంది ప్రభ.
సురేష్ కుమార్ తనే టాక్సీ ని పిలిచాడు. ఇద్దరూ టాక్సీ ఎక్కి కూర్చున్నారు. ఆమె మధుర స్పర్శ కు ఆనందించడానికి బదులుగా అతను టాక్సీ వెళ్ళే దారినే జాగ్రత్తగా గమనించసాగాడు. తను ఏమరుపాటుగా ఉండగా టాక్సీ పూర్వపు బంగళా వైపు దారి మళ్ళుతుందేమోనని అతడి భయం. అయితే అలాంటిదేమీ జరగలేదు. టాక్సీ మెజిస్టిక్ హోటల్ ముందు ఆగింది.
