"మనకు పదిహేడో నంబరు గది బుక్ చేశాను. వెళ్ళి రిసెప్షన్ నడిగి తాళాలు తీసుకోవడమే!...."అంది ప్రభ.
ఒకసారి హోటల్ వంక చూసి తృప్తిగా నిట్టూర్చాడు సురేష్ కుమార్. ఇలాంటి హోటల్లో కి కామినీ పిశాచాలు రాలేవు. వచ్చినా తప్పించుకోలేవు. అనవసరపు భయాలతో తను మంచి అవకాశాన్ని పోగొట్టు కోకూడదు. తీగేలాంటి ఆడది ప్రభ. ఎక్కడో అదృష్టవంతులకు తప్ప అలాంటి ఆడదాని పొందు లభించదు. అందులోనూ ఆమె వలచి వచ్చింది.
ఇద్దరూ తమ గదికి వెళ్ళారు.
"అద్భుతం!" అన్నాడు సురేష్ కుమార్ ఆ గదిలోని యేర్పాట్లు చూసి. అతనంతవరకూ బహుశా అంత మంచి హోటల్ రూమ్ చూసి ఉండడు. ఒక్కసారిగా అలాంటి రూమ్ , అందులో -- పక్కన ప్రభ లాంటి అమ్మాయి-- ....సురేష్ కుమార్ శరీరంలోకి ఏదో మైకం అప్పుడే ఆవహించసాగింది.
ప్రభ అతడి స్నానానికి ఏర్పాట్లు చేసింది. మార్చుకునేటందుకు అతడికి బట్టలు సిద్దం చేసింది. ఆ తర్వాత తనూ స్నానం చేసి బట్టలు మార్చుకుంది.
తెల్లచీర , తెల్లని రవిక , జడలో మల్లెపూలు , మత్తు కళ్ళు....నిగ నిగలాడే వళ్ళు....మిస మిసలాడే సొగసులు....సురేష్ కుమార్ శరీరం దివ్యానుభూతికి లోనవుతోంది.
అతని అత్రుతను గమనిస్తూనే ప్రభ అతణ్ణి వూరించ సాగింది. ఇద్దరూ బ్రెడ్, ఆపిల్ ముక్కలు తిన్నారు. పాలు తాగారు.
అది విశాల మైన గది. ప్రవేశ ద్వారం దగ్గరే సోఫా లున్నాయి. కాస్త దూరంగా , మూలగా రెండు మంచాలున్నాయి. అంతవరకూ వాళ్ళిద్దరూ చెరో సోఫాలోనూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్లుండి ప్రభ లేచి - "నువ్విక్కడే వుండు--" అంది.
ఆమె తిన్నగా బెడ్ దగ్గరకు వెళ్ళింది. మంచం మీద పడుకుంది. ఆమెనే గమనిస్తున్నాడు సురేష్ కుమార్. ఆమె చేయి మంచం పక్కనే వున్న స్విచ్ బోర్డు మీద పడింది. గది చీకటయింది.
"విజయ్.....త్వరగా రా!" అంది.
సురేష్ కుమార్ లేచాడు. సరిగ్గా అప్పుడే అతనికి పూర్వానుభవం తళుక్కుమంది. అతని మైకం విడిపోయింది.....శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది....
ఇంతవరకూ అంతా ఇదివరకటి లాగానే జరిగింది. ఇప్పుడూ అంతే జరుగుతుందా?"
అందమైన ప్రభ ఇప్పుడు కామినీ పిశాచిగా మరి పోతుందా?
ఆ వూహే సురేష్ కుమార్ శరీరంలో వణుకును పెంచింది.
తనిప్పుడెం చేయాలి? మంచం దగ్గరకు వెళ్ళాలా? పలాయనం చిత్తగించాలా?
చాలాసేపు ఊగిసలాడాడు సురేష్ కుమార్. చిట్ట చివరకు అతను రిస్కు తీసుకోదలిచాడు. వనుకుతూనే మంచాన్ని సమీపించాడు. అతడి చేతులు స్విచ్ బోర్డు కోసం వెదికాయి.
గదిలో దీపం వెలిగింది.
మంచం మీద ప్రభ ముడుచుకుని పడుకుని వుంది. తన అనుమానానికి నవ్వుకుంటూ అతను ఆమెను కుదుపుతూ తన వైపుకు తిప్పాడు. అంతే!
కెవ్వుమని అరిచాడతను.
ఆమె ప్రభ కాదు. కామినీ పిశాచి!
ఆమె అతన్ని గట్టిగా పట్టుకొని బిగి కౌగిలి లో ఉంచేసింది.
సురేష్ కుమార్ కు వొళ్ళంతా తేళ్ళూ జేర్రులూ పాకినట్లయింది .
"వద్దు! ....వద్దు!....నన్ను వదిలి పెట్టు....'అరిచాడతను.
ఆమె అతడి పెదాలతో తన పెదాలు కలుపుతోంది...
అసహ్యకరమైన ఆ ముఖం, అంతకంటే అసహ్యకరమైన ఆ పెదాలు.
సురేష్ కుమార్ సర్వశక్తులు వుపయోగించి పెనుగులాడుతున్నాడు-- కానీ అతడి బలం యెందుకూ పనికి రావడం లేదు. ఏ మగవాడూ కోరుకొని అసహ్యకరమైన అనుభవం అతడికి బలవంతంగా తటస్థపడుతోంది.
సురేష్ కుమార్ తన్ను తనే నిందించుకుంటున్నాడు. ఒకసారి జరిగేక కూడా మళ్ళీ తను యెలా మోసపోయాడు? కామినీ పిశాచం మెజిస్టిక్ హోటల్లోకి రాలేదనుకున్నాడు. కానీ అది యిక్కడికి కూడా వచ్చింది. రావడమేమిటి ? తనే దానితో కలిసి వచ్చాడు. ప్రభ మనిషి కాదు. పిశాచం! ఒకసారి అనుభవమయ్యుండీ దాని తళుకు బెళుకులకు మరోసారి లొంగి పోయాడతను.
ఇప్పుడెం చేయాలి? ఇప్పుడెలా తప్పించుకోవాలి?
తప్పించుకోవడం సురేష్ కుమార్ కు సాధ్యం కాలేదు.
7
"నిన్న రాత్రి మీ హోటల్లో ఏదైనా రభస జరిగిందా?' అనడిగాడు వెంకన్న.
"నిన్నే కాదు , ఈ హోటల్ పెట్టి యిప్పటికి ఆరేళ్ళయింది. ఇంతవరకూ యెలాంటి రభసా జరగలేదు. మీరలా యెందుకు అడుగుతున్నారు?...."అన్నాడు మేనేజర్.
"ఒక్కసారి పదిహేడో నంబర్ గదిని నేను చూడవచ్చా?"
"ష్యూర్ --" అంటూ అయన రిజిష్టర్ తెరిచి -- "ఉదయమే ఆ గది ఖాళీ చేయబడింది. సాయంత్రానికి మళ్ళీ బుక్కయింది--" అన్నాడు.
"నిన్న ఆ గది యెవరి పేరున బుక్కయిందో చెప్పగలరా?" అనడిగాడు వెంకన్న.
"దానికేం ...." అంటూ ఓ క్షణం సేపు చూసి -"జనార్ధనరావు --......."అన్నాడు మేనేజర్.
ఉలిక్కిపడ్డాడు వెంకన్న. ఈ జనార్ధనరావు కీ, సురేష్ కుమార్ కి ఏదో సంబంధముంది. ఒకసారి కాదు, రెండో సరిగా యిలా జరిగిందంటే యిది కాకతాళీయం కాదు.
వెంకన్న వెళ్ళి గదిని పరిశీలించాడు. గదిలో ఎక్కడా యిద్దరు మనుషులు పెనుగులాడిన చిహ్నాలు లేవు. ఎంతో నీటుగా సర్ది వుంది. వెంకన్న గదికి సంబంధించిన బేరర్స్ ని పిలిచి ప్రశ్నలు వేసి ఆ గది ఎప్పుడూ నీటుగానే వున్నట్లు గ్రహించాడు. అనుమానాస్పదమైన సంఘటనలు జరిగినట్లు ఎవరూ చెప్పలేకపోయారు.
"పోనీ -- రాత్రి ఈ గదిలోంచి కేకలు వినబడ్డాయా?" అన్నాడు వెంకన్న మేనేజర్ని.
"మీ ప్రశ్నలు చాలా విచిత్రంగా వున్నాయి. ఇది సౌండ్ ప్రూఫ్ గది. లోపలెం జరిగినా బైటకు వినిపించదు. మా కస్టమర్స్ చాలామంది అదే కోరుకుంటారు....' అన్నాడు మేనజర్.
ఇంక అక్కడ తెలుసుకోదగ్గ విశేషమేదీ లేదనిపించింది వెంకన్నకు. అతను అక్కణ్ణించి తిన్నగా జనార్ధనరావు బంగళాకు వెళ్ళాడు.
జనార్ధనరావు బంగళాలోనే వున్నాడు.
"నమస్కారం. రండి కూర్చోండి --" అంటూ మర్యాద చేశాడు జనార్ధనరావు.
"నిన్నరాత్రి మీ రెక్కడున్నారు?'సూటిగా అడిగాడు వెంకన్న.
"మెజిస్టిక్ హోటల్లో --........" అన్నాడు జనార్ధనరావు.
"ఇంత చక్కటి బంగళా వుండగా మీకు హోటల్ రూం ఎండుక్కావలసి వచ్చింది.?'
"నా స్నేహితుడొకడు వస్తున్నట్లు వుత్తరం రాశాడు. అతనికి దెయ్యాలంటే విపరీతమైన భయం. నా బంగళాకు మాత్రం రాలేననీ తన కోసం ఒక మంచి హోటల్లో గది బుక్ చేయమనీ రాశాడు. మేజస్టిక్ హోటల్లో గది బుక్ చేశాను. కానీ యే కారణం వల్లనో అతను రాలేదు. నేను రెండాటలు సినిమాలు చూసి -- ఎలాగూ హోటల్ గది బుక్ చేశానుగా అని అక్కడకే పోయి పడుకుని తెల్లారేక లేచి ఖాళీ చేసేశాను...."
వెంకన్న అతని వంక అదోలా చూసి -- "మీ స్నేహితుడు రాసిన ఉత్తరం చూపిస్తారా?' అనడిగాడు.
"ష్యూర్!' అంటూ జనార్ధనరావు అతనికి ఓ ఇన్ లాండ్ లెటర్ అందించాడు ఆ వుత్తరంలో జనార్ధనరావు చెప్పిన వివరాలన్నీ వున్నాయి. అంతేకాదు, ఆ స్నేహితుడు సతీసమేతంగా వస్తున్నట్లు వుంది.
వెంకన్న ఆ వుత్తరం జనార్ధనరావు కు అందించి -- "మీ స్నేహితుడు సతీసమేతంగా వస్తున్నాడు. మీరేమో మీ పేరున హోటల్ గది బుక్ చేసి సినిమాకు వెళ్ళారు. ఒకవేళ అతను మధ్యలో వస్తే!" అన్నాడు.
"మధ్యలో ఎవరైనా వస్తే తాళాలిమ్మని రిసెప్షనిస్టు కు చెప్పాను...."
"అలా ఎవరైనా వచ్చారేమో అడిగి తెలుసుకున్నారా?"
జనార్ధనరావు ఒక్క క్షణం తటపటాయించి -- "మీదగ్గర దాచడమెందుకు వెంకన్న గారూ! నన్ను మొదట్నించీ వాచ్ చేస్తున్నట్లున్నారు. ఒక జంట ఈ అవకాశాన్ని చక్కగా వుపయోగించుకొని నేను హోటల్ తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోయారు...."అన్నాడు.
'అలా ఎందుకనుకోవాలి? వాళ్ళే మీ స్నేహితులని ఎందుకనుకోకూడదు?' అన్నాడు వెంకన్న.
"నా స్నేహితులయితే నేనోచ్చే వరకూ అగేవారు...." అన్నాడు జనార్ధనరావు.
'అనుకోని అవాంతరం వచ్చిందేమో...."
'అలాంటిది జరిగిన మాట వాస్తవమే. నాగదిలో ప్రవేశించన యువతీ- తన భర్త అస్వస్థతగా వున్నాడట. ఓ టాక్సీ వాలా సహాయంతో భర్త ను తీసుకుని వెళ్ళి పోయిందిట. అతడికి స్పృహ లేదుట. అయినప్పటికీ వాళ్ళు నా వాళ్ళే అయుంటే నాకు మెసేజ్ వదిలి పెట్టి వుండేవారు...." అన్నాడు జనార్ధనరావు.
"అయితే వాళ్ళను గురించి మీరు పట్టించుకోలేదా?"
"లేదు...."
"మీరు వెళ్ళేసరికి గది ఎలా వుంది?"
"మాములుగానే వుంది--" అన్నాడు జనార్ధనరావు.
"గదిలో ఏ విశేషమూ కనిపించలేదా?"
"లేదు...."
"సరే....." అంటూ వెంకన్న లేచి -- "మీ కారణంగా ఏదో పెద్ద నేరం జరుగుతోందని నాకు అనుమానంగా వుంది. నా దృష్టి మీమీద పడిందని గుర్తుంచుకొండి --" అన్నాడు.
"నేనే నేరమూ చేయనప్పుడు మీకు భయపడాల్సిన అవసరం లేదని నాకు తెలుసు....' అన్నాడు జనార్ధనరావు. అతడి కళ్ళలో కనబడే నమ్మకం వెంకన్న ను చాకితుడ్ని చేసింది.
8
"హల్లో సురేష్!" అంది దీప.
"హాయ్ దీపా-- ఏమిటి విశేషం?' అన్నాడు సురేష్ కుమార్.
"నువ్వే చెప్పాలి....చాలా కాలమైంది ....మనం కలుసుకుని...." అంది దీప.
