అందువల్ల జనార్ధనరావు హత్య చేసి వుండవచ్చు కానీ చేయించి ఉండడు.
3
"హలో!" అందా అమ్మాయి.
"ఎవరు మీరు?....." అన్నాడు ఆ అబ్బాయి ఆశ్చర్యంగా.
"వయసులో ఉన్న అబ్బాయిని -- వయసులో వున్న అమ్మాయి పలకరిస్తే -- నువ్వు జవాబివ్వాలి గానీ మీరని జవాబిచ్చేవాళ్ళంటే నాకు గిట్టదు. నా పేరుతొ పిలిస్తే యింకా సంతోషిస్తాను. నా పేరు ప్రభ!" అందా అమ్మాయి.
"హాయ్ ప్రభా! నా పేరు సురేష్ కుమార్!" అన్నాడు ఆ అబ్బాయి.
"చెప్పాలంటే నా పేరు పెద్దదే. వీర వెంకట జనార్ధన లక్ష్మీ ప్రభ! మనలాంటి వాళ్ళు కలుసుకున్నప్పుడు పేర్లు పిల్చుకోదానికే సమయమంతా గడిచి పోకూడదని నా పేరు సింపుల్ గా చెప్పాను. నువ్వూ సింపుల్ గా సురేష్ అనో, కుమార్ అనో చెబితే సంతోషించేదాన్ని-" అంది ప్రభ.
"పోనీ -- నీ యిష్టం అలాగే పిలు...." అన్నాడు సురేష్ కుమార్. లోలోపల ఈ పరిచయానికి యెంతగానో ఆనందిస్తూ ప్రభ చాలా చాలా చాలా అందంగా వుంది. కావాలని తన్ను పలకరించి నర్మగర్భంగా మాట్లాడుతోంది. అసలీమే ఉద్దేశ్య మేమిటో తెలుసుకోవాలి!
"నీ పేరు నాకు నచ్చలేదు. నిన్ను నేను విజయ్ అని పిలిస్తే అభ్యంతరమా?' అంది ప్రభ.
"అభ్యంతరం లేదు. ఆ పేరంటే నీ కిష్టమా?' అన్నాడు సురేష్ కుమార్.
"ఆ పేరంటే నాకు పెద్ద యిష్టమేమీ లేదు!' అని నవ్విందామె --" నాకు అమితాబ్ బచ్చనంటే యిష్టం. అమితాబ్ బచ్చన్ పేరు సాధారణంగా అన్ని సినిమాల్లోనూ విజయ్ అనే ఉంటోంది మధ్య. అందుకని నా కిష్టమైన వాళ్ళందర్నీ ఆ పెరుతో పిల్చుకుంటాను. నువ్వు అమితాబ్ బచ్చనంత స్మార్టుగా ఉన్నావు--"
సురేష్ కుమార్ సిగ్గుతో మెలికలు తిరిగి -- "నాకంటే నువ్వే అందంగా వున్నావు--" అన్నాడు.
"మగాడి కళ్ళకు ఆడది అందంగా కనబడ్డం సాధారణం--" అని ముగ్ధ మోహనంగా నవ్వింది ప్రభ -- "మా యింటి కొస్తావా ?"
"ఆడపిల్ల పిలిస్తే కాదనకూడదని మా తాత అంటుంటాడు. నాకు మా తాత మాట వేదవాక్కు--"
"తాతగారి మాట వినే కుర్రాడివా నువ్వు -- ఇదో వెరైటీ--' అందామె.
ఇద్దరూ ఓ రిక్షా ఎక్కారు. ఇద్దరూ ఒకరికొకరు తగుల్తూ కూర్చుంటే అతడికి చాలా హాయిగా వుంది. "ఈరోజు నక్కను తోక్కోచ్చాను-- " అనుకున్నాడతను.
రిక్షా లో ఆమె చాలా సరదాగా మాట్లాడిందతనితో . రిక్షాను ఒక చోట ఆపమని ఆమె చెప్పింది. రిక్షాకు డబ్బులు అతనే ఇచ్చాడు.
ఆమె ముందుకు దారి తీస్తుంటే అతనామెను అనుసరించాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ ఒక ఏకాంత ప్రదేశంలోకి బంగళా దగ్గరకు వచ్చారు.
"ఇదే మా యిల్లు" అందామె.
అంతవరకూ ఆమె మాటల మైకంలో వున్న సురేష్ కుమార్ ఉలిక్కిపడి ఆ బంగళాను, పరిసరాలను పరీక్షగా చూశాడు.
బంగళా అందంగా వుంది. చుట్టూ మంచి గార్డెన్ కూడా వుంది. ఒక ప్రహరీ గోడ కూడా వుంది. అయితే ఆ దరిదాపుల్లో ఎక్కడా ఇళ్ళు కానీ, మనుష్య సంచారం కానీ లేవు.
"ఇంత ఏకాంతంగా వుంటున్నావా?" అన్నాడు సురేష్ కుమార్ ఆశ్చర్యంగా.
"నువ్వున్నావుగా . ఇప్పుడీ లాంటి ఏకాంతమే బాగుంటుంది" అందామె!
ఆ క్షణం లో సురేష్ కుమార్ కి మరింకేమీ గుర్తు రాలేదు. అతని ఊహలు మధురాతీమధురంగా వున్నాయి. అతని కన్నులు కలలతో నిండిపోతున్నాయి.
ఇల్లు తాళం వేసి వుంది. ప్రభ తనే తాళం తీసి లోపల ప్రవేశించి లైటు వేసింది.
"ఇల్లు చాలా బాగుంది?" అనుకున్నాడు సురేష్ కుమార్.
ప్రభ అతనికి ఇల్లంతా చూపించి "ఇంత యింట్లో నేనోక్కర్తినే ఉంటున్నానని ఆశ్చర్య పోకు. ఇలా వుండడమే నాకు ఇష్టం. నేను నాకు వరుణ్ణి వెతుక్కుంటూన్నాను. అన్ని విధాలా నాకు నచ్చిన వాణ్ని నేను పెళ్ళి చేసుకుంటాను. నీ ప్రవర్తనను బట్టి నిన్నిక్కడ యెన్ని రోజులుంచుకునేది నిర్ణయిస్తాను" అంది.
"నీ లాంటి ఆడపిల్లల సంఖ్య దేశంలో యింకా పెరగాలి!"అన్నాడు సురేష్ కుమార్.
"ఇక్కడనించి బైటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదే మాట అనుకోగలిగితే నువ్వు ఎప్పుడూ ఇక్కడే వుంటావు" అంది ప్రభ.
తర్వాత ఆమె అతన్ని స్నానం చేసి రమ్మంది. అతను స్నానం చేసి రాగానే కట్టుకునేందుకు ఉతికి ఇస్త్రీ చేసిన లుంగీ పంచ, తెల్లటి చొక్కా వుంచింది. తర్వాత తనూ స్నానం చేసి వచ్చింది. తెల్లచీర కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. జడ వదులుగా వేసుకుంది. అతని వద్దకు వచ్చి మత్తుగా చూసి "ఎలా వున్నాను విజయ్" అనడిగింది.
చటుక్కున ఆమె చేయి పట్టుకుని "నా నోట మాటలు రావింక. నన్నూరించకు. నేను నీ వాణ్ని . నీ దాసుణ్ణి. త్వరగా నన్ను కనికరించు" అన్నాడు సురేష్ కుమార్.
"ఒక్క నిముషం అగు. నాకు ఆకలిగా వుంది. ఇద్దరం కలిసి భోజనం చేశాకనే -- సరదాలు-- " అందామె.
ఒక ప్లాస్కు నిండా పాలున్నాయి. ఇంట్లో ఆపిల్ పళ్ళున్నాయి. ఒక పళ్ళెం లో స్వీట్స్ , ఆపిల్ ముక్కలు తెచ్చిందామే. అవి ఇద్దరూ కలిసి తిన్నారు. తర్వాత చెరో గ్లాసెడు పాలూ తాగారు.
భోజనం అవుతున్నంత సేపూ ప్రభ చిలిపి చేష్టలతో అతన్ని రెచ్చగోడుతూనే వుంది. పైట జార్చి సవరించుకునేది. ఉండుండి అతడి వంక కొంటెగా చూసేది. అనుకోకుండా అతణ్ణి తాకినట్లు నటించి చటుక్కున దూరంగా జరిగిపోయేది.
"మరి భోజనాలు కూడా అయిపోయాయి" అన్నాడు సురేష్ కుమార్.
"నువ్విక్కడే వుండు. నేను పడకగది కి వెళ్లి పక్కలు సరి చేసి నిన్ను పిలుస్తాను. నేను పిలిచేదాకా నువ్వక్కడకు రాకూడదు" అంది ప్రభ.
సురేష్ కుమార్ అందుకూ అంగీకరించాడు. ఆమె వెళ్ళి పోయింది. సరిగ్గా అయిదు నిముషాలు అనంతరం "విజయ్నువ్వు రావచ్చు" అన్న ప్రభ మధురస్వరం వినిపించింది.
సురేష్ కుమార్ ఆత్రుతగా పడకగది వైపు వెళ్ళాడు.
కొద్ది సేపటి క్రితం అతను ప్రభ చూపించగా ఇల్లంతా చూసి వున్నాడు. పడకగదికి ఎలా వెళ్ళాలో దారి కూడా తెలుసు అతనికి. పడకగదికీ-- మధ్య హలుకీ -- మధ్య ఓ చిన్న ఇరుకు వరండా వుంది. ఆ వరండాలో దీపం వెలగడం లేదు. సురేష్ కుమార్ వరండా లోకి వెళ్ళాడు. పడకగది అతనికి కనబడుతోంది కానీ గదంతా చీకటిగా వుంది.
"ప్రభా గదిలో దీపం లేదా?' అన్నాడు సురేష్ కుమార్ వరండాలోనే ఆగిపోయి.
"దీపముంటే నాకు సిగ్గు. కావాలంటే నువ్వు లోపలకి వచ్చి వేసుకో" అంది ప్రభ కంఠస్వరం.
ముసిముసిగా నవ్వుకుంటూ సురేష్ కుమార్ గదిలోకి అడుగు పెట్టాడు.
గది బాగా చీకటిగా వుంది. అతను తలుపు పక్కన స్విచ్ తడిమి స్విచ్ వేశాడు. ఇంతలో గది తలుపు దగ్గరగా వేసుకుంది.
గదిలో ఒక్కసారి ప్రకాశవంతం కావడంతో అతడు కళ్ళు నులుముకున్నాడు. కళ్ళు తెరవగానే ఎదుట పడ్డ దృశ్యం చూసి అప్రయత్నంగానే కెవ్వుమని అరిచాడు.
4
"వివరంగా చెప్పు!" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
"ఊళ్ళో మనుషుల మధ్య ఒక కామినీ పిశాచి తిరుగుతోంది" అన్నాడు సురేష్ కుమార్.
"కామినీ పిశాచాలు లేకపోతె మనుషుల కెలా కుదుర్తుంది? అందులో పెద్దగా భయపడవలసిందేమీ లేదు" అన్నాడు వెంకన్న.
"మీరిలా వేళాకోళం చేయవద్దు. ఆ పిశాచిని నేను స్వయంగా చూశాను. దాన్ని స్వయంగా చూసి కూడా ఇంకా బ్రతికుండడం నాకు ఆశ్చర్యంగా వుంది" అన్నాడు సురేష్ కుమార్.
"ఈ ప్రపంచంలో ఆశ్చర్యపడవలసిన విషయాలు కోకొల్లలు. అలా ఆశ్చర్యపడుతూ కూర్చంటే యింకే పని చేయడానికీ తీరుబడి వుండదు. అందువల్ల నువ్వు నాకు అసలు విషయం చెప్పు !" అన్నాడు వెంకన్న.
'ఆ కామినీ పిశాచి అందమైన ఆడపిల్లలా తయారై వచ్చి నడిబజార్లో నన్ను పలకరించింది. తన పేరు ప్రభ అని చెప్పింది. తన వయ్యారంతో నా మతి పోగొట్టి తన ఇంటికి తీసుకు వెళ్ళింది" అంటూ కరిగినదంతా చెప్పాడు సురేష్ కుమార్.
"బాగానే వుంది-- అదృష్టవంతుడీవే!"అన్నాడు వెంకన్న.
'అంతవరకూ అదృష్ట వంతుడినే -- అసలు కధంతా తర్వాతే వుంది. నేను చాలా ఉత్సాహంగా ఆ గదిలోకి అడుగుపెట్టి లైటు వేశాను. అప్పుడు నాకు ఎదురుగ్గా కనబడ్డది అందమైన ప్రభ కాదు. ఒక మానవాతీత శక్తి తన అసలు రూపంతో నా కళ్ళ బడింది" అన్నాడు వెంకన్న.
"మానవాతీత శక్తి ఏమిటి?' అన్నాడు వెంకన్న చిరాగ్గా.
'అంత వికార రూపం మనుష్యుల కుంటుందనుకోను. అందులోనూ అందమైన ప్రభ ఆ రూపం దాల్చడం మానవాతీత శక్తి కి తప్ప సాధ్యం కాదు, కాలిపోయినట్లుండె ముఖం, అదే రకం శరీరం, చింపిరి జుట్టు, ఆకలి గొన్న చూపులు....ఎంతటి ధైర్యవంతుడికీ కూడా ఒకే ఒక్కచూపులో భయం పుట్టించగల రూపమది!"
"అదేం చేసింది నిన్ను?"
"అది నన్ను రేప్ చేసింది" అన్నాడు సురేష్ కుమార్.
"ఒక ఆడది నిన్ను రేప్ చేయడమా?" వెంకన్న పకపకా నవ్వాడు.
"అది ఆడది కాదు సార్. దాని శక్తి అపరిమితం. దాని కామ కాంక్ష అనంతం. దాని స్పర్శ తలచుకుంటేనే ఒళ్ళంతా గొంగళీ పురుగు పాకినట్లనిపిస్తుంది. అలాంటిది అది నన్ను తన కోరిక తీర్చమని బలవంత పెట్టింది."
"నువ్వేం చేశావ్!"
"తప్పించుకు పోవాలని ప్రయత్నించాను. సాధ్యపడలేదు. తలుపులన్నీ వేసి వున్నాయి. దానిది పశు బలం అది నా మీద పడి రక్కింది, గీరింది. దాని స్పర్శ తగిలినప్పుడల్లా నా వళ్ళు అసహ్యంతో కంపించి పోయింది. కానీ నాకు తప్పలేదు. దాని బలానికి నేను లొంగిపోయి జీవితంలో అత్యంత అసహ్యకరమైన అనుభవం పొందాను."
"చాలా చిత్రంగా వుంది నీ కేసు...."
"మీరా కామినీ పిశాచిని పట్టుకోవాలి సార్!" అన్నాడు సురేష్ కుమార్.
