Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 29


    'కళ్యాణి ఊ అంటే కనక వర్షం కురిపిస్తాననీ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక మేడ కట్టించి ఇస్తాననీ తాళి కట్టిన భార్య కంటే కూడా ఎక్కువగా  చూసుకుంటాననీ.....' గంగరాజు మాటలన్నింటినీ అప్పగిస్తున్న మేమమామ వంక రక్తపు జీరలు పేరుకుని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ కటువుగా అంది కళ్యాణి.
    'ఇంకెప్పుడూ ఇలాంటి రాయభారాలు తీసుకురాకు. నాకు వినటానికే అసహ్యం -- ఇవాళ మొదటిసారిగా ఇలాంటి ప్రస్తావన తీసుకు వచ్చావు కనక వూరుకున్నాను కాని లేకపోతె........'
    'లేకపోతె ఏం చేస్తావే? వాడేదో తప్పు మాట అన్నట్లు అలా విరుచుకు పడతా వేమిటి? నిన్ను అందలం ఎక్కిస్తా నన్నాడే కాని బురదలో పడి దోర్లమన లేదుగా -- ఆ మారాజు అడిగిన దానికి వూ అంటే హాయిగా మహారాణి లా బ్రతకవచ్చు. కోరిన నగ, కోరిన బట్ట, అడిగినంత డబ్బు ఎంత భోగం అనుభవించ వచ్చు ననీ! నీతో పాటు మేమంతా కూడా మరింత దర్జాగా బ్రతుకుతాం....' అమ్మమ్మ భయాన, నయాన నచ్చ చెప్తున్న కొద్ది కళ్యాణి లో కోపం దుఃఖం కట్టలు తెంచు కున్నాయి. మేనమామ నీ, ఆ గంగరాజు ని కలిపి కసిదీరా తిట్టి గదిలోకి వెళ్లి ఏడుస్తూ పడుకుంది.
    రాఘవులు చెప్పింది విన్నాక కూడా గంగరాజు నిరాశ పడలేదు. అ సంగతి ఏదో తనే స్వయంగా మాట్లాడి తేల్చు కోవాలను కున్నాడు.
    గంగారాజంతటి వాడు తన గడపలో కాలు పెట్టటం చూసి వనజాక్షి మహాదానందపడిపోయింది. అయితే అయన వచ్చిన కారణం తెలుసు కనక హల్లో కూర్చోపెట్టి అయన మద్యడకి ఏ లోటూ రాకుండా మాట్లాడుతూనే వోసారి లోపలికి వెళ్లి కాస్త మంచి చీర కట్టుకుని వచ్చి ఒక్కసారి ఆయనకి కనిపించి వెళ్ళమనీ మిగతా అన్ని విషయాలూ తాము మాట్లాడు కుంటామనీ కళ్యాణితో సంబరంగా చెప్పింది.
    'మీరంతా నన్నీవిధంగా నిర్భంధించే టట్లయితే ఈ క్షణం లోనే నేను వురి పోసుకు చచ్చిపోతాను-- ఆ గంగరాజు నా శవాన్ని తప్ప నన్ను ప్రాణాలతో చూడలేడు....' అంది కళ్యాణి.
    ఆ క్షణంలో ఆమె రూపు చూసిన అందరికీ ఏదో బెదురు పట్టుకున్నట్లయింది. ఆవాల్టి కి ఏదో చెప్పి గంగరాజుని పంపించి వేశారు. ఇంక మళ్లీ అలాంటి అనుభవం జరగకుండా ఆ మర్నాడే కళ్యాణి ఇల్లు విడిచి వచ్చేసింది.
    కళ్యాణి తన జీవితంలోని ప్రతి సంఘటన ని ప్రతి విషయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా మురళీ ముందు వెల్లడించు కుంది. అంతా విని మురళీ ఒక నిర్ణయానికి రావాలన్నదే ఆమె కోరిక. ఆవేళ ఆ కధ అంతా వింటూ నిర్వికారంగా వుండిపోయిన మురళీ మనస్సులో ఇవాళ లోతుగా దిగిపోయిన తుమ్మ ముల్లు వుండి వుండి ఖరెల్ ఖరెల్ మనిపిస్తున్నట్లుగా వుంది. తను చూడని ఆ గంగరాజు రూపానికి మనస్సులోనే వో రూపకల్పన చేసుకోటానికి ప్రయత్నించ సాగాడు. నల్లగా వికృతంగా వుండే మొహం, దుబ్బు మీసాలు కాంక్షగా కళ్యాణి ని చూస్తున్న ఎర్రటి కళ్ళు ...మురళీ ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు ఉడుకుష్టంగా అటు నించి యిటు వత్తి గిల్లాడు. 'ఏమిటిది? ఇవాళ నాకేమయింది? నా మనస్సేందుకు ఈ ధోరణి లో ఆలోచిస్తోంది. ఈ ఆలోచనల పర్యవసానం ఏమిటి? నా అంతరంగపు అట్టఅడుగు పొరలో ఎక్కడో ఏమూలో కళ్యాణి మీద శంక లాంటిది  వూపిరి పోసుకుంటుందా-- తను యదార్ధం మరుగు పరిచి వుంటుందని , ఆనాడు వచ్చిన గంగరాజు వచ్చినట్లే తిరిగి వెళ్లి వుండడని నాలో ఏమైనా అనుమానం పొడ సూపుతోందా?' తన ఆలోచనలకి తనే తట్టుకోలేనట్లు అతని గుండెలు విలవిల లాదిపోయాయి.
    ' ఆ గంగరాజు భాగ్యవంతుడే -- బ్లాకు మార్కెట్టు తో సంపాదించిన డబ్బే పది లక్షల పైగా వుందని వూరంతా ప్రతీతి . అతన్ని ఒక్కడ్ని నమ్ముకుని అతను అడిగిన దానికి ఔనంటే అతనికి నా మీద మోజు తీరే లోపినే నా యిల్లు బంగారంతో నింపుకోవచ్చు. మరి ఎవరి ప్రాపకం కోసం ప్రాకులాడ కుండానే జీవితం అంతా సుఖంగా గడిపేయవచ్చు. నావల్ల వాళ్ళందరూ కూడా డబ్బులో మునిగి తేలుతారు.....కాని...కాని నా మనస్సు చూపు వాసి అంత కూడా అటు వేపుకి మొగ్గలేదు-- అందచందాలు భోగభాగ్యాలు చదువులూ డిగ్రీలూ ఏమీ లేని మనిషయినా సరే, వారు మావారు నా భర్త , ఇది మా సంసారం , వీళ్ళు మా బిడ్డలు అని సంతోషంగా, నిస్సంకోచంగా చెప్పుకోగలగాలనేదే నా కోరిక కాని, భార్య బిడ్డలు వున్న మనిషి అండన చేరి, వాళ్ళందరి ప్రాణాలూ వూసూరు మనిపించే లా చేయటం, చివరికి యింత జరిగినా ఉంపుడు కత్తే అన్న పేరు తప్ప తాళి కట్టించు కున్న భార్య అనే గుర్తింపు కాని తృప్తి కాని లేని అలాంటి బ్రతుకు నేను ఎప్పుడూ వాంచీంచ లేదు.' ఆనాడు కళ్యాణి చెప్పిన మాటలు చెవుల్లో గింగురు మన్నాయి.
    'ఒక సంసారం కూలదోసి ఒక యిల్లు గుల్ల చేయాలనే నీచబుద్ది లేదు కళ్యాణి లో -- ముందు ముందు తమ మధ్య ఎలాంటి అపోహలకి తావు వుండ కూడదనే వుద్దేశ్యంతోనే ఆమె తన జీవితంలో ప్రతి సంఘటనా, ప్రతి మలుపు యధాతధంగా చెప్పుకుంది. ఆవాళ అది అంతా సత్యమే అని నమ్మిన నేను ఇవాళ వాటికి మరేమో అర్ధాలు వెతకటం వివేకం అనిపించు కొదు!' అని మనస్సుకి నచ్చ చెప్పుకొటం ప్రారంభించాడు మురళీ.
    అయినా అతని మనస్సంతా కలకబారి పోయినట్లే వుంది. బలవంతాన నిద్ర పట్టించుకోవాలని కళ్ళు మూసుకున్నా నిద్ర రాలేదు కాని మరో దృశ్యం మనస్సులో మెదిలింది.

                                  12
    ఓ రోజు మురళీ, కళ్యాణి బట్టల దుకాణానికి వెళ్ళారు. తమ ముందు పెట్టిన బట్టల రకాలనీ చూస్తూ, ఇంకా బీరువాల లో వున్న రంగులనీ పరికిస్తూ, ఆ షాపులో కుర్రాడినీ ఏదేదో అడుగుతూ ఇటూ అటూ చూస్తున్న కళ్యాణి హటాత్తుగా ఏ భూతాన్నో చూసినట్లు ఒక్కసారి భయపడిపోయి తల తిప్పెసుకుంది. ఆ మార్పు ఆమె కళ్ళల్లో స్పష్టంగా చూడగలిగిన మురళీ అటు వేపుకి తల తిప్పి చూశాడు. అక్కడ వున్న మరో వ్యక్తీ మొహంలో కళ్యాణి ని గుర్తు పట్టిన భావాలు ముద్ర వేసుకుని కూర్చోటమే కాకుండా అదొక లాంటి వెకిలి నవ్వు అతని పెదవుల మీద తారట్లాడింది. మురళీ ని చూడగానే ఆ నవ్వూ, అతను గుచ్చి గుచ్చి చూస్తున్న తీరు మురళీ కి ముళ్ళ మీద వున్నట్లుంది.
    'ఇవాళ ఏమీ వద్దు. మరోసారి వద్దాం. అసలు ఎప్పుడూ లేనిది నేనివాళ ఇంతసేపు కూర్చుని ఏరటం ఏమిటి?' మురళి కి వినిపించేలా మెల్లిగా అంది కళ్యాణి.
    ఇద్దరూ ఇవతలకి వచ్చేస్తుంటే మధ్యలో ఒక్క క్షణం ఆగి 'వీరు మా వారు' అని అవతలి వ్యక్తీ కీ 'అయన వెంకటేశ్వర్లు గారని-- వీళ్ళింట్లో నేను కొన్నాళ్ళు అద్దెకు వున్నాను' అని మురళి కి చెప్పింది. గొంతులో ఎలాంటి వణుకూ బెదురూ లేకుండానే ------
    వెంకటేశ్వర్లు పేరు వినగానే మురళీ కి అర్ధం అయిపొయింది. కాస్సేపటి క్రితం కళ్యాణి అలా ఎందుకయి పోయిందో --
    చేతులు జోడించి నమస్కరించటానికి కూడా మనస్కరించక ఆహా అన్నట్లు వోసారి కళ్ళతోనే పలకరించి వచ్చేయ బోతుంటే ఆ వెంకటేశ్వర్లు మురళీ వంక చూసిన చూపు మాత్రం అతను జన్మలో మరిచిపోలెడు. 'వో చక్కని చుక్క దొరికింది అని పొంగి పోకు-- దారి ప్రక్కన పడి వున్న గడ్డి పువ్వుని చూసి పవిత్రమైన పూజా పుష్పం అనుకుని నెత్తిన పెట్టుకున్నావు-- ఆ సంగతి నువ్వే గ్రహిస్తావులే-- ఈ భోగం ఎన్నాళ్ళో నేనూ చూస్తాను' అన్నట్లుగా వుంది అతని కోర చూపు , తల పంకించటం అదీ --
    అసలే ఎలాగో అయిపోయిన ము రళీ కి ఇంటికి రాగానే 'ఛ, ఛ. ఇవాళ ఆ దుకాణానికి ఎందుకు వెళ్ళామో అసలు.' అంటూ కళ్యాణి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటుంటే పుట్టెడు జాలి  ముంచుకు వచ్చింది.
    'భలే దానివే , దీనికే ఇంత ఇదయి పోతుంటే ఇంక జీవితంలో నువ్వు వేటిని ఎదుర్కో గలవు-- మనకి ఎంతో మంది వ్యక్తులు పరిచయం అవుతూ వుంటారు. కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డ వాళ్ళు, సహజంగానే మంచి వారితో స్నేహం పెంచుకుంటాం. చెడ్డ వారికి దూరంగా వుంటాం -- అయినా అనుకోకుండా ఒక్కొక్కసారి వాళ్ళు మళ్లీ తటస్థపడటం సంభవిస్తుంది మరి-- ఇష్టం లేకపోయినా ఆ కాస్సేపు ఏదో మాట్లాడక తప్పదు-- దీంట్లో ఇంత బాధ పడటానికేముంది' అన్నాడు కళ్యాణి చెంపల మీది కన్నీళ్లు తుడుస్తూ.....ఆదృశ్యం అలా మనోనేత్రం ముందు కదిలి పోతుంటే కళ్ళు మూసుకునే చూస్తున్న మురళీ మనస్సు ఎందుకో కలుక్కు మంది ఇప్పుడు.
    'హు-- వాడికి, ఆ వెంకటేశ్వర్లు కి ఎన్ని గుండెలు నా వంక అలా చూడటానికి--- ఇదంతా కళ్యాణి వల్లే కదా --' అనుకున్నాడు.
    అంతలో అతనికి అనసూయమ్మ చంద్రశేఖరం గుర్తు వచ్చారు. 'మావారి గుణం మంచిదే -- అయితే మాత్రం ఆడది అందులోనూ బోగం పాప వల విసిరితే అందులో ఇరుక్కోకుండా తప్పించుకోటం వారి తరం అవుతుందా' అని ఆ అనసూయమ్మ ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లుంది.
    అతని గుండెలు బరువెక్కి పోతున్నాయి. ఆ గంగరాజు, వెంకటేశ్వర్లూ, చంద్రశేఖరం వాళ్ళంతా వచ్చి తన గుండెల మీద కూర్చున్నంత బరువుగా వుంది . ఊపిరి సలపటం లేదు . నుడురంతా ముత్యాలలా చెమటలు పోసేశాయి.
    'ఏమిటిది ఇవాళ నాకేమయింది.ఎందుకీ చిత్రవధ నేను అనుభవించాలి.' అని తన కతనే లెక్క లేనన్ని సార్లు ప్రశ్నించు కోగా అతనికో సమాధానం స్పురించింది.
    'ఈ లోకంలో కొందరు అదృష్టవంతులు వుంటారు. వారికి జీవితంలో ఎప్పుడు ఏ క్షణంలో గుర్తు చేసుకున్నా మనస్సంతా శాంతితో నిండిపోయి శరీరం లోని ప్రతి అణువు సంతోషంతో పులకించి పోయే మధురమైన అపురూపమైన సంఘటనలు వారి అనుభవంతో వుంటాయి....
    కొంతమంది దురదృష్ట వంతులుంటారు....కొన్ని సంఘటనలు కొంతమంది వ్యక్తులు గుర్తు వస్తేనే భయంతో ఒళ్లు జలదరించి, జీవితం నుంచే పారిపోవాలాన్నంత భీతిని కలిగిస్తూ, అలాంటి వాటిని మరిచి పోవాలని ఎంత ప్రయత్నించినా వెంట తరుముతున్నట్లు మాటిమాటికి గుర్తు వచ్చి మనస్సంతా జుగుప్సతో నిండి పోయి భయంతో మనిషి గజగజ వణికి పోయే సంఘటనలు అలాంటి వారి జీవితాలతో ముడిపడి వుంటాయి-- అలాంటి వ్యక్తులతో పరిచయం కాని స్నేహం కాని వున్నప్పుడు ఎంత వద్దనుకున్నా వారి అనుభవాల ప్రభావం ఇవతలి మనుష్యుల మీద కూడా కొంతైనా వుండటం సహజం ....నాది కేవలం పరిచయం కాదు. స్నేహం అంతకన్నా కాదు. అలాంటి వ్యక్తీ తో నా జీవితమే పెన వేసుకు పోయింది. అందుకే ఆమె అనుభవాలు నన్ను ఇంతగా కదిలించి వేస్తాయి.' అనిపించింది.

                                      
    తలతిప్పి ప్రక్కకి చూశాడు. ప్రక్క మంచం మీద పడుకున్న కళ్యాణి గాడ నిద్రలో వున్నట్లు ఉచ్చ్వాస నిశ్వాసాల వల్ల తెలుస్తోంది. నిద్రలోఎదో తియ్యటి కల వచ్చింది కాబోలు ఆమె పెదవులు ఒక్కసారి విడివిడనట్లు మనోజ్ఞంగా కదిలాయి.
    కళ్యాణి అలా నిశ్చింతగా నిద్రపోతున్న తీరు, ఆమె మొహంలోని ఆ చిరునవ్వూ చూస్తుంటే మురళీ గుండెల లో నుండి అవ్యక్తమైన అనుభూతి తో కూడిన నిట్టుర్పు వెలువడింది---
    ఏదేదో ఆలోచిస్తూ చాలా సేపటి దాకా నిద్రకి దూరమైనా అతను చాలా రాత్రి గడచి పోయిన తరువాత ఎప్పటికో కన్ను మూయ గలిగాడు ,--
    ఉదయం అతను కళ్ళు తెరిచేసరికి, అప్పుడే స్నానం అలంకరణ ముగించుకుని, పెరట్లో పూసిన తెల్ల గులాబీలు తలలో ముడుచు కుంటున్న కళ్యాణి ఎదురుగా కనిపించింది.' అతన్ని చూసి మృదువుగా నవ్వింది.
    'బాగా పోద్దుపోయినట్లుంది కదూ.' అతని మొహం ప్రశాంతంగా మారి ఆప్యాయంగా వుంది.
    'మీరెప్పుడు ఆలశ్యంగా నే లేస్తారుగా .' తలలో పువ్వులని చేత్తో తడిమి చూసుకుంటూ మురిపెంగా నవ్వింది కళ్యాణి.

                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS