పిల్లి అడుగులు వేసుకుంటూనే తన గది లోకి వచ్చేడు. కాగితం కలం తీసేడు.
"రుక్మిణీ!
నువ్వడిగిన ప్రశ్న ఉంది. దానికి జవాబు ఇప్పుడు చెప్పలేను. జవాబు ఇవ్వలేనేమో కూడా. ఇది కృతఘ్నతే అవుతుందన్నా నేను తల వంచుకుంటున్నాను.
ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్న మిధ్యా భావపు ఉరుకే ఇన్నాళ్ళూ అది ఇంత త్వరలో నిండుజీవనం పోసుకుని క్షణాల్లో ఉందనుకో లేదు. నేను వెళ్ళుతున్నా. వెళ్ళక తీరదు.
నాకోసంమాత్రం వెతకవద్దు. ఎక్కడికి అని నిర్ణీతం లేని ప్రయాణం నాది.
సెలవు.
రాజు."
మడిచి, రెండు గుడ్డలు సంచీలో కుక్కుకునే బయటకు వచ్చేడు. ఆఖరన్నవతులోనే వాళ్ళ గదికి వెళ్ళేడు. ఓరవాకిలిగా ఉన్న తలుపు. నాన్నగారి గుర్రు వినిపిస్తూనే ఉంది. రుక్మిణి చేతుల్లో, ఎర్రగా గ్లాసులో ఉన్నదే కన్పిస్తే, కట్టే అయి చూచేడు. దాన్ని చూచి నవ్వుకుంటూంది. అక్కడ కన్పడ్డది తను ఎరిగి ఉన్న రుక్మిణి కాదు.
మైకంలో స్త్రీ శక్తి. అందులో విప్లవం. బానిసత్వం విముఖత. రౌద్రిణి .... ప్రతీకార వివాళి యత్ని.
హడిలిపోయేడు. గబగబా పరుగెత్తినట్లే అడుగులు వేసేడు. వీధి తలుపుపైన గొళ్ళెం పెట్టి, రోడ్డుమీద్జ అడుగు పెట్టేడు.
క్షణికం గిర్రున కన్నీళ్లు తిరిగేయి. ఇది తన ఇల్లు. తను లోకంలో పడ్డ ఇల్లు. 'అమ్మా' అని కెవ్వుమన్న గేహం. పెరిగేడు. పెద్దయ్యేడు. అందులో తను ఈనాటి వరకూ పొందిన పరిణామం తిరిగింది.
ఇక అది తనది కాదు. తనెవ్వరో? తన హక్కు కాదు .... ఆ లిప్తంలోనూ తలవంచి నమస్కారం పెట్టేడు. చేతుల్లో పడ్డ చినుకులు వేడిగా కాలి, తన్ను భగ్గుమనిపించేయి.
"శాంతా!" అప్రయత్నంగానే వెలువడింది - ఇక మిగిలింది అదే అన్నట్లు.
* * *
19

శివుని జటాజూటంలోంచే గంగోత్పత్తి. అది ఎండదు. నిత్యవాహిని. అది నిజంగా ఉత్పన్నం అయ్యిందో, లేదో ఎవరికీ తెలియదు. బదరీనాధ్ దగ్గర సర్వకాలాల్లోనూ వెలిగే జ్యోతి ఏమిటి? కాశీలో మోక్షద్వారం ఏమిటి? తిరుపతిలో శివపరంగా పూజ చేయించుకునే శక్తి ఏమిటి? కోర్కెలు ఈడేరుస్తారన్న ఈ ప్రజాభిప్రాయంలో గాఢ నమ్మకం ఏమిటి?
ఇవి ఎప్పుడు ప్రజల్లో కలిగేయి? ఎందుకు? నరనరాల్లోనూ ప్రజలో ప్రవహించి ఈనాటికీ వెన్నంటుతూనే ఉన్నాయి. అది చరిత్ర వీట్లకు టీకకాని, తాత్పర్యంకాని ఎవరూ చెప్పలేరు. వాట్ల మహత్తులు, అంతర్లీన ఆకర్షణశక్తులు కూడా నిర్వచించలేని అధ్యాయాలు అయ్యేయి. ఏమైనా వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. వంశానుగతంగా మానవులు వెళ్ళి అర్పించి, భౌతికంలో తృప్తి పడ్డారు. సత్యం, అసత్యం అన్న విచక్షణలేని ఆరాధన అది.
జీవితానికి ఈ అర్పణ ఎంతవరకూ ఉపయుక్తం అనేది తర్కించుకున్నా, ఓ స్వార్ధ పూరితమైన కోర్కె సఫలీకృతం కొరకు అన్న తార్కాణం కన్పిస్తుంది. కోర్కె, దాని తృప్తి కొరకు చేసే సేవకూడా, ఓ మిథ్యావాదపు ఆశయాలు. వెనకనున్న ప్రజల నమ్మకమున్నూ.
ఇది లోకంపోకడ. ఇది ఒప్పుకుంటుంది పుణ్యం క్రింద. మహత్కార్యం క్రింద మెచ్చుతుంది. శభాష్ అంటుంది. భుజం తడుతుంది. శాస్త్రాలు వల్లించేము, వేదాలు పరిపాటి అన్న కుండనాలు కూడా పుణ్యం, పాపం అన్న గోడల మధ్య అభిప్రాయాన్ని చెప్పగలరు. కాని ఇదమిత్ధంగా చెప్పలేరు. అంత క్లిష్టం అది.
మంత్రం, తంత్రం అనేవి ఉన్నాయి. ఆయాపరిణామాలు, ఫలితాలు కూడా తనకు తెలియవు. అయినా మానవుల్ని ఓ ఊపు ఊపుతాయి అవి. పతనం, ఔన్నత్యం కూడా అందులో ఉన్నాయి అన్నట్లే ఉంటాయి. తనకు దారి చూపలేని అజ్ఞానం. అవన్నీ స్నిగ్ధాలు.
గట్టిగా ఎలుగెత్తి 'నేనెవర్ని?' అని అడిగినా సమాధానం చెప్పలేని లోకం. పరిస్థితుల్లో వ్యక్తులు. కొద్దిపాటి విచక్షణలో మధు, సత్య, కొద్దిగా రావు, ఆఖరున శాంత తన్ను చదవగలిగే రేమో అనుకున్నా, అది ఎందుకో తాత్కాలిక ఉపశమనంగానే భౌతికానికి ఉండేది; తశ్శాంతి యుతం.
శాంతకు ఈ భావన ఎల్లా కలిగింది? తన్ను ఎల్లా గుర్తించగలిగింది అన్న సంశయం వచ్చేది. అది తను గిరిగీసి, ఇదీ అన్న నిర్ణయం చేసుకోలేని అనుభూతి. తను చెప్పుకోగలిగితే ఆవిడా చెప్పగలదు అన్న అపహాస్యంలోని సత్యం తిరిగేది. ఒక్కొక్కప్పుడు ఆ శాంత తన్ను పరివేష్టించి, నవ్వి, కలలు నింపి, కయ్యాలు పెట్టినట్లు భావన. అప్పుడు శాంత ఏమి చేసినా, మధుర సంబాళింపులో తొలకరిక్రింద తనకు చందనపు పూతగా ఉండేది. సత్య, రుక్మిణి, మాల వీళ్ళు తనలో రేకెత్తించలేక విఫలమైన శృంగారం, ఎందుకో శాంత చేయి తిరిగినట్లు, తన్ను తనుగా మరిచిపోయేట్లుగా, హిందోళరాగం ఎత్తినట్లు, పీయూష పానం అయినట్లు సంభూతి కలిగేది.
ఈ విభిన్న దృక్పథానికి తన వ్యక్తిత్వమే కారణమా? లేక తన్ను మైకంలో నింపి, దిగంతాలు మార్మ్రోగేటట్లున్న సృష్టిసత్యపు బడబాగ్నా? ఎంత లోతుగా సింహావలోకనం చేసుకున్నా, తన కర్తవ్యం అక్కడ ఆ రావినూతల పాడులోనే ఉందన్న ముందు అడుగే. అక్కడికి వెళ్ళాలన్నా, వాళ్ళింట్లో తన శేష జీవనం గడపడానికి ఆయత్తత. ఇది ఎందుకు అన్న ప్రశ్నలేని జవాబు.
తను అవధానిని కాని, ఆ ఇంటి యజమానురాలినికాని చూడలేదు. కాని ఛాయామాత్రంగా వాళ్ళ రూపులు తిరుగుతాయి. తను చూచేడు, తనకు గుర్తు అన్నట్లు-మరపురాలేదన్నవతులో. అటువంటి సమయంలో తన్ను గుర్తుపట్ట గలరా అన్న ఆవేదనే. ఆయనవద్ద తను ఏదో నేర్చుకోవాలి. ఆ అభిలాషే చుట్టుముట్టేది. సగం చదివి వదిలిన విద్య.
ఎప్పుడో తను అమరం వల్లెవేసినట్లు; ఋగ్వేదం వచ్చినట్లు అవి ఇప్పుడు గుర్తుకు రావు, కాని క్షుభితం అవుతుంది మనస్సు ఈతలంపుకు. ఆనాడు కణ్వుడు శకుంతలను పంపేటప్పుడు కాళిదాసు వర్ణించిన ఘట్టం ఇంకా పచ్చిగా తనలో. దుఃఖం తెప్పిస్తూనే ఉంటుందన్న భ్రమే.
రైలుదిగి, రావినూతలపాడు దగ్గరికి వచ్చే సరికి చీకటి పడింది. దారిలో అడక్కుండానే వచ్చేడు. శ్మశానం వద్దకు వచ్చేసరికి కాళ్ళు ఆగేయి. ఎందుకో ఆ తెలుపు ఛాయ చీకట్లో కళ్ళు గ్రుచ్చుకున్నట్లు నించుంది. జనవరి పద హారు, ముఫ్ఫై నాలుగో సంవత్సరం. ఇదేనిజమా? అంతవరకూ ఆ అవధానులుగారి కొడుకు క్రిందనే ఉండి, కవచం మార్చుకుని, పునహా రామచంద్రయ్య గారింట్లో తను జన్మించేడా? పునరపి జననం, పునరపి మరణం, జననీ జఠరే శయనం ఇది జరిగిందా?
క్షాలనగానే తన వయస్సు ఎంత? ఈ లోపలున్న ఆత్మ అప్పటికే వివాహమై, పెరిగినట్లయితే, యీ మార్పున్నూ కలుపుకుంటే రమారమి నలభై పైన దాటి ఉంటాయి. కాని మరణించింది రామం, తిరిగి పుట్టింది రాజుగా అయినా, శరీరపు కొలతలు ఎందుకున్నాయి?
ఇదే సత్యం అయితే, శాంత తను ఆరామగాం ఉద్వాహం ఆడినదే అయినా, ఈనాడు తన ఆత్మకు ఆవిడ చిన్నదే అన్న దృక్పథం కలిగింది. ఇది రూఢి అయితే, అమ్మా, నాన్నకూడా షష్టి పూర్తి దరిదాపుల్లో ఊగవచ్చు.
"అమ్మా!" అవ్యక్తంగానే పిలుపు నోటమ్మట వచ్చింది. చీకట్లో తారల రహదారీ వెలుగు. కాలుతున్న చితి ఎర్రగా దివ్విటీ పట్టుకున్నట్లు. ఊరిపేరు మీదన్నట్లుగానే పాడుపడిన నుయ్యి రావిచెట్టుకు దగ్గరగా. ఇవన్నీ వింటున్నట్లున్న శ్రద్ధ.
నవ్వేడు. అమ్మ కనిపెట్టుకు ఉంటుందన్న దృష్టిలోనే అడుగువేసేడు. నక్కమాత్రం ఎడంవైపు నుండి కుడివైపుకు వెళ్ళింది; ఎగాదిగా చూచినట్లు. శకునశాస్త్రం జ్ఞాపకం రానట్లు తలదిమ్ము.
ఊళ్ళోకి వచ్చేసరికి, మాటుమణిగిన నిశ్శబ్దం. గ్రుడ్డిగా వెలుగుతున్న పంచాయతీ లాంతరు. లేవలేని బద్ధకంతో ఊరకుక్కలు ఓసారి గుర్రు మని తలలు వాల్చేయి. దొడ్ల శాలల్లో ఎక్కడో 'అంబా' అన్న ఆవు అరుపు.
"ఎవరదీ?" వెనుకనుండి కేక.
"నేను."
"నేనంటే?"
"అవధానులు గారింటికి."
"ఆ సందు చివరదే."
"తెలుసు." అడుగులు వేసేడు. జోరుగానే పడ్డాయి. మెట్లు ఎక్కే "అమ్మా!" అనే చరచేడు, అప్పుడే పాలు తోడుపెట్టి చెయ్యి కడుక్కుంటున్న పార్వతమ్మ, దద్దరిల్లిపోయి నట్లు నిశ్చేష్టఅయ్యింది. చెంబు చేతిలోంచి జారిన స్పృహే లేదు.
శాంత కూడా విని ఒక్క పరుగులోనే వంటింట్లోకి వచ్చి అత్తయ్య ఉన్న స్థితికి నిర్విన్న అయినా, వెళ్ళి "అత్తయ్యా, వారు" అనేసింది మిళితంలో.
