Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 30


    అంతా గోలగా నవ్వేవాళ్ళం-"నాకింకా పెళ్ళి కాలేదు తాతా! అప్పటి వరకూ నువ్వుంటే..."
    "నాకేం తెగులర్రా? నిక్షేపంలా వుంటాను. కాని నీ పెళ్ళాన్ని నీకు దూరం చేస్తే నువ్వు నా పాదాలకి బడి ఏడవ్వట్రా?"
    "ఫర్వాలేదు తాతా! పంపుతాను." అనిమాటకూడా ఇచ్చాను. ఆ తాతయ్య ఇప్పటికీ వున్నాడు. తాను స్వగ్రామానికి వెళ్ళటం లేదు కొన్నేళ్ళనుంచీ తాతయ్యని చూసి చాలా కాలమై పోయింది.
    మనపెళ్ళి అయ్యాక ఓసారి వెళ్ళి తాతయ్యని చూసి వద్దాం. తాతయ్యకి మాటిచ్చాను గనక నిన్నక్కడ వదిలేస్తాను." మాధవ్ ఉత్తరం చదివి నవ్వుకున్నాను. బలే తాతయ్యే. తాతయ్య కబుర్లు చెప్పుకోటానికి సర్ధాగానే వున్నాయిగానీ తాతయ్యవంటివాళ్ళు ప్రమాదకరమైన మనుషులు సుమా! మాధవ్ తాతయ్య గోత్రీకుడే అయినా తాతయ్య నీతులు మాత్రం ఒంట పట్టించుకోక పోవటం మెచ్చదగ్గ విషయం.
    మాధవ్ అభిమానవంతుడూ - సరసుడే కాదు. నిజాయితీపరుడు కూడా. అరుదుగా రైనా మాధవ్ వుద్యోగానికి సంబంధించిన విషయాలు అడుగుతూనే వుండేదానివి.
    అవకాశాలున్నా అక్రమంగా సంపాదించటానికి ప్రయత్నించనంటాడు మాధవ్. ఉద్యోగులలో అవినీతిని అసహ్యించుకొంటూనే కొన్ని పరిస్థితుల్ని సమర్ధిస్తాడు.
    "చిన్న ఉదహరణ చూడు - కాలవ త్రవ్వకాలకు సర్వే చేస్తున్నప్పుడు ఓ రైతు భూమిమీదుగా ప్లాను పడుతుంది. నిజానికా విషయం ఆఖరివరకూ తెలీజెయ్యకూడదు. కాని ఎలాగో రప్ గా తెలిసిపోతుంది. అక్కడినుంచి ఆ వ్యక్తి ఎలాగైనా తన భూమిని మాత్రం కాపాడమనీ- అది తప్ప వేరే దిక్కులేనివాడిననీ వందలతో బేరాలు సాగిస్తాడు. గవర్నమెంటు తాను తీసుకొనే భూమికి పరిహారం ఇస్తుంది. ఐనా ఆ వ్యక్తికి భూమి వదలటం కష్టంగా వుంటుంది. "అలాగే చూస్తాం వెళ్ళవయ్యా! ఇంకా ప్లాను నిర్ణయం చెయ్యలేదు" అంటే నమ్మడు. డబ్బు తీసుకొని జేబులో వేసుకొంటే ధీమాగా వెళ్ళిపోతాడు. లేకపోతే భూమికి గవర్నమెంటు ఇచ్చే పరిహార విషయంలో కూడా రహస్యంగా మంతనాలు సాగిస్తాడు. ఒక్కో వ్యక్తి రామబాణాలవంటి సిఫార్సులు తీసుకొస్తాడు. ఆసిఫార్సులు పాటించని పక్షంలో వుద్యోగానికే నీళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితులేర్పడతాయి. అటువంటి స్థితిలో ఏం చెయ్యాలి? అంతా నాలా మొండిగానూ - డబ్బుతో అవసరాలు లేకుండానూ వుండరు. ఎన్నోరకాల సంసార యాతనలున్నవాళ్ళు డబ్బుకో, సిఫార్సులకో లొంగిపోతారు - కొన్ని విషమ పరిస్థితులలో అక్రమంగా ప్రవర్తిచటం తప్పనిసరే అవుతుంది గానీ అంతమాత్రానికి వాళ్ళని నేను సమర్ధిస్తున్నాననుకోకు. మనిషి మానవత్వానే ప్రేమించిననాడు ఎటువంటి అక్రమాలూ చెయ్యలేడు.
    మాధవ్ చెప్పిన కబుర్లతోపాటు ఎన్నో సంగతులు మనసులో మెదిలాయి. ప్రతీవ్యక్తీ జీవితాంతం నిజాయితీగా తన బాధ్యతలు నెరవేర్చుకొంటే ఎంత బావుంటుందీ! అనిపిస్తుంది.
    మాధవ్ మాత్రం నిజాయితీపరుడు.
    పరిపూర్ణమైన పురుషత్వం నింపుకున్నవాడు
    
                              *    *    *

    ఒక్కమాటలో చెప్తాను. మాధవ్ యోగ్యుడు పరిపూర్ణమైన పురుషత్వం నింపుకున్న మాధవ్ కి మనసు సమర్పించాను. దానికి నేనెంతో గర్వపడ్డాను. రాబోతూన్న పరీక్షలకు శ్రద్దగా చదువుకోవటంతోపాటు మాధవ్ కి వుత్తరాలు రాసి విశేషాలు తెలుసుకొంటూ వుండటం కూడా తప్పనిసరైంది.
    ఆమధ్య వచ్చి మూడురోజులు వుండి వెళ్ళాక మాధవ్ మరీ సన్నిహితుడయ్యాడు. మాధవ్ కూడా చాలా విషయాలలో నా ఇష్టాలు అడుగుతూండేవాడు - "ఏదో ఫిల్మ్ షూటింగ్ ట. చాలామంది పేరుమోసిన హిందీతారలు - ఈ డామ్ ప్రాంతాల కొచ్చారు. అంతా వెళ్ళి చూసి వస్తున్నారు. నాకుమాత్రం వెళ్ళాలనిపించటం లేదు. ఎందుకు వెళ్ళాలి? అనుకున్నాను. వెళ్ళమంటావా?" అని రాశాడు. మాధవ్ ధోరణి! కొంత విస్తుబోయాను. ప్రతీదీ నేను చెప్పాలి తను వినాలి. అంత కోరిక -కాని మాధవ్ ఎప్పుడూ అలా ప్రవర్తించటం నేను మెచ్చుకోలేను. ప్రతీవ్యక్తీ స్వంతంగా కొంత ఆలోచించుకోగలగాలి. ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి. నామీద ఎంత అనురాగమున్నా దానిలో మునిగి మాధవ్ యంత్రంలా మాత్రం మారకూడదు. అదే మాధవ్ కి రాశాను. ఫిల్మ్ షూటింగు చూసిరమ్మని కూడా చెప్పాను - "అవకాశాలు దొరికినప్పుడు జీవితానికీ సంబంధించిన ఏ విషయాలనైనా స్వయంగా చూసి వాటిలో మంచి చెడ్డలూ లోతుపాతులూ తెలుసుకోవటం వివేకం అనిపించుకుంటుంది. జీవితంలో సరదాలని నిర్లక్ష్యం చెయ్యటానికి ఏ చెట్టుకిందో, పుట్టకిందో, ముక్కుమూసుకు కూర్చునే మునీశ్వరులు కారుగా?"
    నిద్రపట్టని జబ్బు కొత్తగా ప్రవేశించిందేమో అనిపించింది. లేచివెళ్ళి వరండాలో నించునే దాన్ని. వెన్నెట్లో వెచ్చదనం అనుభవమయ్యేది. జోరున వర్షం పడుతూంటే కిటికీలోంచి చూస్తూ రాత్రులకి రాత్రులే గడిపేదాన్ని. ఎంత చూసినా తనివితీరేది కాదు. ఆ వర్ష ధారల్లో ఎన్నడూ చూడని అందాలు చూస్తూ - "ఈచలి మరీ కష్టంగా వుంది వేణూ! రగ్గు కప్పుకు పడుకున్నాగుండెల్లోంచే పుట్టుకొస్తుంది. నువ్వుంటే...? అనుకుంటాను." వంటి మాధవ్ మాటలు తల్చుకొంటూ ఆదమరిచి నించుంటే రయ్యిన ఒక్క విసురు - ఈదురుగాలి - వానజడి - ఒళ్లంతా తడిసిపోయాకే స్పృహలోకి రావటం-ఆ తడిచీర విప్పాలనీ అనిపించేది కాదు. మాధవే రాత్రీ - మాధవే పగలూ అయిపోయింది.
    ఎదురు చూస్తున్న రోజులు కనుచూపు మేరలోవున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభమయ్యాయి. రేణు నేనూ మా యింట్లోనే రాత్రులు కలిసి చదువుకునే వాళ్ళం. పరీక్షలు అవుతాయి. మాధవ్ వస్తాడు. అనుకొంటే గుండెలు గుబగుబలాడేవి. చాలాసాహసం చేస్తున్నానేమో అని పించేది. గంటల తరబడి ఆలోచించేదాన్ని, నాకోరిక ఇంట్లో చెప్తే నన్ను సమర్ధించేవాళ్ళే వరూ వుండరు. స్నేహితురాలు రేణే నన్ను వ్యతిరేకిస్తుంది. కాని ఏది ఏమైనా నేను మాధవ్ ని దూరం చేసుకోలేను. కక్షలనేవి కలకాలం సాగవు. కాలక్రమేణా అంతా మర్చి పోతారు. కొన్నేళ్ళ కైనా మాధవ్ ని అల్లుడిగా ఆదరిస్తారు- అదే నా విశ్వాసం.
    శాంత పురిటికొచ్చింది. పచ్చగా, నిండుగా కొత్త అందాలని నింపుకుంది. శాంతని చూస్తున్న కొద్దీ, నేనూ అదే స్థితిలో వుండాలనీ నాపాపకి మాధవ్ తండ్రి కావాలనీ అనిపించింది.
    ఆ స్థితిలో వుంటే మాధవ్ అపురూపంగా చూసుకోడూ? శాంత క్షేమంగా బయట పడాలని కోరుకున్నాను.
    పరీక్షలు పూర్తి అయ్యాయి.
    ఆరాత్రి రేణు ఏదో నవల చదువు కొంటూంది. నేను మాధవ్ కి వుత్తరం రాయాలనుకున్నాను. నిండు మనసుతో భవానీని తలుచుకున్నాను. ఏదో దైర్యంతో మాధవ్ కి వుత్తరం పూర్తి చేశాను- "పరీక్షలు అయిపోయాయి. ఎంతో తొందరగానీ సన్నిధికి చేరాలని మనసు తహతహలాడుతూంది. మీరాక కోసం ఎదురు చూస్తాను." అని రాశాను.
    ఆ ఉత్తరం రేణుకి చూపించాను. అది చదివి రేణు నిర్ఘాంతపోయింది - "నీకేం మతిపోయిందా" అంది తీక్షణంగా.
    నేనేం మాట్లాడలేదు.
    "ఇంత సాహసానికి దిగావన్నమాట" అంది.
    "ఇది సాహసం అనుకొంటే సాహసమే మరి. అన్నాను.
    "నామాట విను కృష్ణవేణీ! ఈ వుత్తరం పోస్ట్ చెయ్యకు. మరొక్క సారి ఆలోచించు." అంది బ్రతిమాలుతున్నట్టు.
    పదిహేను నెలలనుంచీ ప్రతీక్షణం ఆలోచిస్తున్నాను రేణూ! ఇంతకన్న ఎక్కువ మరేమీ ఆలోచించలేను," అన్నాను.
    "పోనీ ఒక్కసారి శాంతతో మాట్లాడిచూడు"
    "ఒద్దు రేణూ! నన్ను పిరికి దాన్ని చెయ్యకు. నాక్షేమం కోరితే నా కోరిక తీరాలని ప్రార్దించు. నాకింకేమీ చెప్పకు." రేణు మరేమీ మాట్లాడలేదు.
    మర్నాటి వుదయం మాధవ్ కి వుత్తరం స్వయంగా నేనేపోస్ట్ చేశాను-ఒక ఒడ్డంటూ ఎక్కి నట్టు ఫీలయ్యాను. మర్నాటి నుంచీ కాలేజీకి సెలవు లిచ్చారు.
    ఉదయం శాంత తమ్ముడితో చీటీ పంపింది నాతో మాట్లాడాలి ఒకసారి రమ్మని. క్షణం ఆలోచించాను. రేణు కూడా వాళ్ళింట్లో నేవుందని చెప్పాడు శాంత తమ్ముడు. ఇక శాంతమాట్లాడేదేదో గ్రహించుకోక పోలేదు- తలనొప్పిగా వుంది. రాలేనని రాసి పంపాను. ఓ గంటలో శాంత తమ్ముడు మళ్ళా వచ్చాడు-"ఈసారి కూడా నువ్వు రాలేనని ఒంక పెడితే నేనే నీ దగ్గిరి కొస్తాను. కానీ నన్నీ పరిస్థితిలో ప్రయాస పెట్టకు నా దగ్గిరే ఇంత దాపరికం ఎందుకు చేస్తావు? ఎదట బడి మాట్లాడలేవా?" అని రాసింది. నాకు చాలా కోపం వచ్చింది. సాయంత్రం వస్తానని రాసి పంపాను. నామంచి చెడ్డలు నేనే తెలుసుకోలేని మూర్కురాలినిగానే! వీళ్ళకెందుకీ పట్టుదల? అనిపించింది.
    సాయంత్రం వెళ్ళాను. రేణు ముభావంగా వుంది గానీ శాంత నవ్వుతూ పలకరించింది. నేను అంటీ అంటనట్టు ఏదో చెప్పి వూరుకున్నాను. క్షణం ముగ్గురం మౌనంగా వుండిపోయాం. తుఫాను రాబోయే ముందు వాతావరణం ప్రశాంతంగా వుంటుందట. ఇదే కాబోలు అనుకున్నాను.
    "తల నొప్పి తగ్గిందా?" అంది శాంత నవ్వి.
    "సరేగాని నువ్వు కబురంపింది దేనికి?" -అన్నాను సంభాషణ కుపక్రమిస్తూ.
    "నీకు తెలీకే అడుగుతున్నావా?"
    "ఐనా ఏదో మాట్లాడాలని కబురంపావు కదా చెప్పకూడదూ?"
    "మాధవరావుకి వుత్తరం రాశావట?"
    "అవును".
    "ప్రయాణం ఎప్పుడు?"
    "వెళ్ళే ముందు నీకు చెప్తానులే"
    శాంత క్షణం నిశితంగా చూసింది. ఉన్న ట్టుండి అంది-" అయితే మాధవరావుకి........
    ఉంపుడు కత్తెగా వెళ్తున్నావన్న మాట?"
    "శాంతా!" నాకు అంతులేని కోపం వచ్చింది. "నేను నీకెంత చనువైనా మితిమీరి మాట్లాడకు."
    "ఉన్నమాటంటే ఎందుకంత పౌరుషం? నేను నోరుమూసు కొంటే లోకం నోరు మూసుకొంటుందా? మాధవ్ నిన్ను......."
    "పెళ్ళి చేసుకొంటాడు."
    "ఎక్కడ?" శాంత స్వరంలో హేళన!
    "భగవంతుని సన్నిధిలో మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం"
    "అయితే ఇంట్లోంచి పారిపోవటం దేనికి?'
    నేను మాట్లాడలేదు.
    "మాధవ్ నిన్ను రిజిష్టరాఫీసులో పెళ్ళిచేసుకోకూడదూ?"
    "అరుణ వుంది కదా?"
    "అయితే రేపు మీ పెళ్ళి బహిరంగంగా వెల్లడించుకోరా?"
    "దేనికి? మా యిద్దరికీ ఒకరిమీద ఒకరికి నమ్మకం వుంది."
    "అయితే అరుణ వూరు కొంటుందనే అనుకొంటున్నావా?"
    "వూరు కొక ఏం చేస్తుంది?"
    "కేసు పెట్టదూ?"
    "ఎందుకూ?"
    "ఎందుకేమిటి? మొగుడు రెండో పెళ్ళి చేసుకున్నందుకు."
    "అసలు మొగుడంటేనే యిష్టంలేని దానికి రెండో పెళ్ళి చేసుకుంటే తనకెందుకు?"
    "కృష్ణవేణీ! మతిపోయి మాట్లాడుతున్నావా? ఇష్టంలేని వాళ్ళు యిష్టంలేనట్లుగానే వుండిపోతారనుకొంటున్నావా?"
    "అయితే, అరుణ మారుతుందనా నీ వుద్దేశ్యం?"
    "మారదని నువ్వు చెప్పగలవా?"
    "మారినా, మారక పోయినా అరుణని మాధవ్ అంగీకరించడు."
    'నిన్ను దేముడి ముందు పెళ్ళి చేసుకుంటాడు. అరుణ చూస్తూ వూరుకుంటుంది అవునా?"
    "వూరుకోకపోతే ఏదో చేసుకుంటూంది."
    "ఏదో చేసుకుంటే మనం అనుకోవటం దేనికి? చెయ్యాల్సిందే చేస్తుంది."
    "పోనీ, చెయ్యనీ."
    "మాధవ్ కోర్టులో నిన్ను భార్యగా చెప్పుకుంటాడా?"
    "శాంతా! అర్ధంలేకుండా మాట్లాడుతున్నావ్" చిరాకు పడ్డాను.
    "కోపం తెచ్చుకోకు కృష్ణవేణీ! ఇది సామాన్య మైన వ్యవహారం కాదు. నీ అభిప్రాయాలేమిటో విపులంగా చెప్పు. సామరస్యంగా మాట్లాడుకోవడంలో తప్పులేదుగా? అరుణ కేసుపెడితే, మాధవ్ నిన్ను రెండోభార్యగా కోర్టులో అంగీకరిస్తాడా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS