Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 31


    "కోర్టు వరకూ వెడుతుందని నే ననుకోను."
    "అదే వద్దంటాను. నువ్వనుకున్నదే ఎందుకు జరుగాలి? అరుణ వూరుకుంటుందనే మొండి నమ్మకం ఏమిటి నీకు?"
    "సరే అరుణ కేసు పెడుతుందనే అనుకుందాం, మాధవ్ నిన్ను భార్యగా చెప్పుకోడంటావా?"
    "అయ్యో! మధ్యలో నాకేం తెలుసు? చెప్పాల్సింది నువ్వు."
    నేను మౌనంగా ఆలోచించాను. అవును. మాధవ్ నన్ను భార్యగా చెప్పుకోవాలంటే పబ్లిగ్గా రిజిష్టరు ఆఫీసులోనే పెళ్ళిచేసుకోవచ్చు కదా? ఈనాడు రెండోపెళ్ళి నిషేధం కనుకనే దైవ సన్నిధిలో ఒకరిమీద ఒకరికున్న విశ్వాసంతో భార్యా, భర్తలుగా స్థిరపడాలని అనుకోవడం.
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
    ".......... ............ ........ ............. ............"
    "ఇన్నాళ్ళూ ఆలోచించనే లేదా?"
    "ఆలోచించడానికేముంది? కేసు విషయం నా దృష్టికి రాలేదు."
    "మనసుకు మనసే సాక్షి అంటే కుదరదు. మాధవ్ నిన్ను భార్యగా అంగీకరించిననాడు వుద్యోగం వదులుకోవాల్సి వుంటుంది. లేదా నువ్వు మాధవ్ కు ఉంపుడు కత్తెగానే వచ్చానని అనుకుంటే ఫర్వాలేకపోవచ్చు, అది నీకు సమంజసమేనా?"
    "..... ...... ....... ......."
    "చెప్పు కృష్ణవేణీ! ఎందుకంత యిదిగా ఆలోచిస్తావ్?"
    "మాధవ్ మీద నాకు నమ్మకం వుంది శాంతా!
    పైకి భార్యనుగానని అంటే మాత్రం నష్టమేమిటి? భార్యా, భర్తలమనే భావం మా మనస్సులలో ఎప్పుడూ వుంటుంది."
    "కానీ లోకం ఏమనుకుంటుందో ఆలోచించావా?"
    "ఎవరేమనుకున్న నాకు లెక్కలేదు."
    "లేదంటే వీల్లేదు కృష్ణవేణీ! నీకు లోకం లెక్కలేకపోయినా, లోకానికి నీతో లెక్క వుంటుంది. తప్పుడు పనులు అనుకునేవాటిని ఎవరు చేసినా, లోకం వూరుకోదు. మనం ఎవరి ప్రసక్తీ లేకుండా వూరూ, వాడా విడిచి అందరికీ దూరంగా ఏ అరణ్యాలలోనో నివాసం పెడితే, అక్కడేం చేసినా ఎవరికీ అక్కర్లేదు. మనమూ ఎవర్నీ లెక్కచేయనక్కర్లేదు.కానీ పదిమంది మధ్య సంఘంలో బ్రతుకుతున్నప్పుడు మాత్రం విధిగా కొన్ని నియమాలకు కట్టుపడాలి. కొన్ని ఆచారాలు పాటించాలి. అలా కాకుండా నీ యిష్టమైనట్లు నువ్వూ, నా యిష్టమైనట్లు నేనూ, ఎవరి యిష్టమైనట్లు వాళ్ళే ప్రవర్తిస్తే, సంఘంలో ప్రశాంతత లోపిస్తుంది. అందుకోసమైనా మనం విచ్చలవిడిగా ప్రవర్తించ కూడదు."
    "ఇప్పుడు నా వల్ల ఎవరికీ నష్టం వస్తుంది శాంతా!"
    "ఒకరికేమిటి? అందరికీ.....ముఖ్యంగా నీ తల్లిదండ్రుల విషయం ఆలోచించావా?"
    "ఏమిటి?"
    "ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నీకు భయంగా లేదా?"
    "భయానికేమిటి? ఇంట్లో చెపితే ఎవరూ నన్ను సమర్ధించరు. అందుకే వెళ్ళి పెళ్ళిచేసు కుంటానని ఉత్తరం వ్రాసి పెడతాను. వాళ్ళకి మొదట్లో కోపం వస్తుంది. కొన్నాళ్ళకు వాళ్ళే మర్చిపోతారు."
    "ఈ వ్యవహారం అంత తేలిగ్గా మాసిపోతుందనుకుంటున్నావన్నమాట నువ్వు చేస్తున్నపని నీకు చాలా సమంజసంగా కనుపించవచ్చుగానీ, దాన్ని మన పరిభాషలో ఏమంటారో తెలుసా? లేచిపోవటం! ఫలానా నాయుడుగారి కూతురు, డాక్టరుగారి చెల్లెలు ఎవరితోనో లేచిపోయింది. అదీ పెళ్ళయిన వాడితో, మొదటి పెళ్ళాం వుండగా....."
    "శాంతా! ...... ......"
    "వినడానికే ఎందుకు భయపడతావ్? రేపు జరుగబోయేది యిదే. కలిగినవాళ్ళయినా, లేని వాళ్ళయినా, చేసిన తప్పు ఒప్పుకాదు. నువ్వు ఎందుకిలా చెయ్యాల్సి వచ్చిందో, ఎటువంటి పరిస్థితులలో చిక్కుకున్నావో, ఎవరూ ఆలోచించరు. నువ్వు చేసిన పనిమాత్రం తప్పుగా అందరి కళ్ళా పడుతుంది."
    వింటూన్న కొద్దీ నా కేమిటో గందరగోళంగా తయారైంది పరిస్థితి.
    "లేచి పోవడమంటా వేమిటి శాంతా! పెళ్ళి చేసుకుంటుంటే?"
    "ఎందుకొచ్చిన పెళ్ళి కృష్ణవేణీ? మతిలేని పెళ్ళి.పెళ్ళిచేసుకున్నామని బహిరంగంగా చెప్పు కోలేని పెళ్ళి పెళ్ళా? నలుగురినీ నమ్మించాలని మెడలో మాంగల్యం కట్టుకుంటావు. కానీ దానికెవ్వరూ విలువ నివ్వరు. దానిమీద ఎవరికీ లక్ష్యముండదు. నువ్వు మాధవ్ భార్యగా మాత్రం స్థానం సంపాదించలేవు. అనాదిగా వస్తున్న మన కట్టుబాట్లే అటువంటివి. లోకాన్ని నిర్లక్ష్యం చేసినా, ఆఖరికి చట్టంకూడా నిన్ను సమర్ధించదు. నువ్వే ఆలోచించు, కాదంటావా?"
    ఏం ఆలోచించను. నా కేమి పాలుపోవటం లేదు.
    "కూలీ,నాలీ చేసుకునే తక్కువ కులాల్లో ఎవరేం చేసినా చెలామణీ అయిపోతుంది. అప్పలమ్మకూతురు చేసుకుని మొగుణ్ణి వదిలేసి రెండోపెళ్ళి నెల తిరక్కుండానే వాణ్ణి వదిలేసి ఎటో పోయింది. కాని అది వాళ్ళకు పట్టింపే లేదు, కాని మన కుటుంబాల్లో అలా కాదే! పరువు ప్రతిష్టల్ని పాడుచేసుకుని, మనం బ్రతుకలేం. ఒకలోటంటూజరిగితే ఇక ఆ కుటుంబం గురించి అందరికి హేళనే ...... చూడు! ఒకసారైనా మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించావా? ఏ తల్లిదండ్రులైనా తాము గన్న సంతానం పెరిగి పెద్దవాళ్లై పేరు కీర్తులు తేవాలని ఆశిస్తారే! నువ్వు చేసిన పనికి వాళ్ళెంత బాధపడతారో వూహించలేవూ? కన్నకూతురు లేచిపోయిందని లోకం వేలెత్తి చూపుతూంటే ఏ తండ్రి తలెత్తు కు తిరుగుతాడు? ఏ తల్లి సిగ్గుతో కృంగకుండా వుంటూంది? నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసినదానికి వాళ్ళకి నువ్వుచేసే సత్కారమయింది? అమ్మ నిన్నెంత గారం చేస్తూందో, నాన్నగారెంత గౌరవం యిస్తారో, మర్చిపోతున్నావా? మీ యింట్లో నీకున్న స్వేచ్చ ఎంతమంది ఆడపిల్లలకుంటుంది? నీలా నిర్భయంగా ఎంతమంది అమ్మాయిలు కలం స్నేహం చెయ్యగలుగుతున్నారు? ఆలోచించు. ఆడపిల్లవని ఆలోచించకుండా నిన్ను నమ్మి నీకింత స్వాతంత్ర్యం యిస్తే దాన్నిలా దుర్వినియోగం  చేస్తావా? నీ కిచ్చిన మర్యాద నువ్వు నిలుపుకో లేకపోతే ఎందుకు కృష్ణవేణీ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS