రాధ తల్లితో కలసి యాత్రలకి బయల్దేరుతుంది. బావగారి బంగళాలో అడుగు పెడుతుంది. ఒంటరిగా బావగారితో కారుమీద షికార్లు తిరుగుతుంది. బావగారి ఉన్నత దశని అన్ని విధాలా అర్ధం చేసుకుంటుంది.
ఓ సాయంత్రం బావ మరదళ్ళిద్దరూ బీచ్ లో కూర్చుని వున్న సమయంలో బావగారు కొన్నాళ్ళ నుంచి అడగాలనుకుంటున్న మాటలు అడుగుతాడు.
"నువ్వు దూరమై పోయినందుకు చాలా బాధపడ్డాను రాధా! ఏమీ చెయ్యలేక నాలో నేనే ఏడ్చుకున్నాను. కాని దేవుడి దయవల్ల నాకు మళ్ళా దగ్గరయ్యావు. నువ్వు పెళ్ళయిన దాని వైనా ఎటువంటి శంకలూ పెట్టుకోను. నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నన్నూ నా స్థితినీ కళ్ళారా చూస్తున్నావు కదా? నీకేమైనా అభ్యంతరమా?"
రాధ అతినిర్లక్ష్యంగా "నాకిష్టం లేదు బావా! అంటుంది. బావగారు ఆశ్చర్య పోతాడు. కారణాలడుగుతాడు. చిన్నతనం గుర్తు చేస్తాడు. ప్రాధేయపడతాడు. అన్నిటికీ మరదలు నిర్లక్ష్యం గానే నవ్వుతుంది-"నీవంటి మగవాడితో నేను సుఖపడలేను బావా! చురుకూ కరుకూ లేని వాన పాములాటి మగవాన్ని ఏ ఆడదీ కోరుకోదు. చిన్నతనం నుంచి కలిసి మెలిసి ఆడుకున్నాం. పాడుకున్నాం. ఒక్క స్కూల్లో చదువుకున్నాం. ఒక్క యింట్లో పెరిగా పెద్దవాళ్ళమయ్యాం. నేనంటే ఏదో ఇష్టమనే చెప్తావు. అయితే కావచ్చు కాని ఒక్కసారైనా మనసులో విషయం బైట పెట్టలేకపోయావు. మరదలినని ఒక్కసారైనా వేళాకోళం ఆడలేకపోయావు. తీరా పరాయి దాన్నవుతున్నానని తెలిసే వూరుకున్నావు. ఆడ దానికన్నా అధ్వాన్నంగా ఆ బాధేదో నీలోనే యిముడ్చుకున్నావు. నన్ను నీ స్వంతం చేసుకుతీరాలన్న పట్టుదలే నీకు లేకపోయింది. చేతగాని పిరికి పందలా యింట్లోనుంచే పారిపోయావు. కాని నువ్వు వెళ్ళిపోతూన్న అ సమయంలో నన్ను రమ్మంటే సంతోషంగా వచ్చేసేదాన్ని. బావా మరదళ్ళం. ఏం చేసినా తప్పు వుండేది కాదు. నన్ను పరాయిదాన్ని కానివ్వకూడదన్న ధ్యాసే నీకు లేకపోయింది.
సరే! జరిగిందేదో జరిగింది. అది యింకా చిన్నతనం. అని సరిపెట్టుకోనైనా సరిపెట్టు కునేదాన్ని కాని యిప్పుడు మాత్రం నీలో వచ్చి మార్పేమిటి? వేళా పాళా అనకుండా రాత్రింబవళ్ళూ నీకు దగ్గర దగ్గరగా నీతో ఒంటరిగా తిరుగుతున్నాను. ఒక్కసారైనా మీద చెయి వేశావా? ఒక్క ముద్దయినా పెట్టుకున్నావా? నీకు మరదలిని. చిన్నతనం నుండి నువ్వంటే యిష్టపడుతున్నదాన్ని, నాదగ్గిరా నువ్వు భయపడాల్సింది? నువ్వేం చేసినా కాదననీ, సంతోషంగా యిష్టపడతానని నీకు తెలీదా? నీకు చనువైన ఆడది- నువ్వు కావాలనుకునే ఆడది-అన్నివేళలా నీకింత దగ్గరగా తిరుగుతూంటే రాయిలా ఎలా వుండగలుగుతున్నావు. ఇక పెళ్ళంటూ అయితే ప్రేమకలాపాలు సాగిస్తావా? వద్దు బావా! కారులూ, మేడలూ కాదు నేను కోరేది. పురుషుడు రసికుడు కాకపోతే ఆ ఆడది జీవితమంతా మూగబాధ అనుభవించాల్సి వస్తుంది. నీలో నాకు కావలసిన గుణమే లోపించింది. నేనేం చేసేది?"
మరదలు అడుగుతున్న ప్రతిమాటా శ్రద్ధగానే వింటాడు బావగారు. తల దించుకు కూర్చుంటాడు. రాధాదేవి హేళనగానవ్వి లేచివెళ్ళి కార్ లో కూర్చుంటుంది. కొంతసేపటికి బావగారుకూడా లేచి వెళ్తాడు మరదలి దగ్గిరికి..
"ఆఖరిసారి ప్రాధేయపడుతున్నాను రాధా! నీ అభిప్రాయం మార్చుకుంటావా?" అంటాడు దీనంగా.
రాధ మరీ నిరక్ష్యంగా నవ్వు కుంటుంది-'నా అభిప్రాయం ఎలా మార్చుకోమంటావుబావా! కనీసం ఇప్పుడైనా దగ్గిరకు తీసుకొని గాఢంగా కావిలించుకొని ముద్దు పెట్టుకొని నీలో రసికతేదో వెల్లడించుకొంటే నా అభిప్రాయం మార్చుకొనే దాన్ని. ఆఖరి అవకాశం కూడా జారవిడుచుకొన్నావు." అంటుంది నవ్వుతూ.
కథ అయిపోయినా రాధతోపాటు నేనూనవ్వు కుంటాను ఎంతోసేపు. కోయిలకి పాడమనీ-నెమలికి ఆడమనీ ఎవరు నేర్పారు? సహజతలే మరిచిపోయిన వ్యక్తులు ఎందుకుపనికివస్తారు?
కథ చదివి మాధవ్ కూడా ఎంతో నవ్వుకున్నాడట. అవును ఎవరికైనా నవ్వు వస్తుంది. అది సహజమే.
"వయసుతో పాటు కోరికలనేవి వాటికవే పుట్టు కొస్తాయి.అవి ఒకరు చెప్తే తెలుసుకో వాల్సినవికాదు. ప్రకృతే నేర్పుతుంది.
రాధాదేవి చెప్పే రసికత తల్చుకొంటే మా తాతయ్య గుర్తువస్తున్నాడు కృష్ణవేణీ!" అంటూ మాధవ్ ఆ తాతగార్ని గురించి రాశాడు.
"ఇప్పటికీ అప్పటికీ ఆ తాతయ్య చాల సరదా మనిషి. పొరుగూళ్ళలో చదివేవాళ్ళ మంతా శెలవులకి తప్పకుండా స్వగ్రామం చేరేవాళ్ళం. రాత్రుళ్ళు భోజనాలు కానిచ్చి కాలక్షేపానికి-తాతయ్యతో కబుర్లేసుకొనేవాళ్ళం. వీధి వాకిట్లో వేపచెట్టు క్రింద వెన్నెల్లో మంచాలు వేయించే వాడు తాతయ్య. తాతయ్య చెప్పే కబుర్లన్నీ తన పడుచుతనంలో ఎంత లేసి భోగాలనభవించాడో - ఎన్ని రకాల ఆడవాళ్ళని కళ్ళ చూశాడో వాటికీ సంబంధించినవే. తన అనుభవాలకే చిలవలు పలవలూ కల్పించి కథల్లా చెప్పుకుపోయే వాడు. మధ్య మధ్యలో అడ్డ ప్రశ్నలు వెయ్యటం గోలగా నవ్వటం మాకెంతో సర్దాగా వుండేది.
"ఒరేయ్! ఆ భోగం దాని పందిరి మంచం ఈ వేపచెట్టంత ఎత్తుండేదిరా. దానికి తాటి చెట్టంత ఇనప నిచ్చెన వేసుకొని ఎక్కే వాడినిరా అనేవాడు బడాయిగా.
"అన్నీ అబద్ధాలు చెప్తున్నావు తాతయ్యా! మంచం వేపచెట్టంత ఎత్తుంటే ఇక ఆ ఇల్లెంత ఎత్తుండేది?"
"ఆ ఇంటి మాటెందుకురా నీకు? మంచం కబురు చెప్తుంటే" అక్కడతో తాతయ్య కబురు సమర్ధించేవాళ్ళు కొందరూ-ఖండించే వాళ్ళూ కొందరూ, ఎక్కువగా నేను తాతయ్యని విమర్శిస్తూ వుండేవాడిని.
"చంద్రకళ అనే దానికి ఒక్కరాత్రికి ధగధగ లాడే నక్షత్రాలమాల బహుమతి ఇచ్చానురా!
"అలా కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించి ఆస్థంతా హారతి కర్పూరంలా తగలేసు కున్నావు. నువ్వు చేసిన నిర్వాకం ఏముంది?"
"ఒరేయ్! అలా అంటే వూరుకోను. ఎవడి బాబు సొమ్ము తగలేశానురా? ఈ చేత్తో సంపాదించానేమో రాజాలా అనుభవించాను. నా కష్టార్జితం కోసం కాచుకూర్చోక పోతే మీకు కాళ్ళూ చేతులూ లేవట్రా? ఈ వెధవ జీవితంలో ఎంతటి వాళ్ళకిరా భోగాలు? పిల్లకాకివెధవ్వి- ఏవో నీతులు చెప్తున్నావ్ గానీ ఆ రోజుల్లో ఏం పరువూ! ఏం ప్రతిష్టా? మీకంటే తాతయ్యనై పోయానుగానీ ఆ కాలంలో వీడిపేరు చెప్తే తిలోత్తమగానీ, రంభేగానీ తహతహలాడుతూ కాళ్ళ దగ్గిరకుచేరేదికదూ?"
"నువ్విలాంటి కబుర్లన్నీ నూరిపోస్తున్నావ్. నీకబుర్లకి మతిపోగొట్టుకొని వీళ్ళంతా చెరువు గట్ల మీదే పడి చచ్చి పోతున్నారు. ఒక్కడికీ చదువు సంధ్యల మీద ధ్యాసే లేదు. వూళ్ళో ఆడపిల్లలంతా నిన్ను తిట్టుకుంటున్నారు. వృద్దిలోకి రావాల్సిన వాళ్ళకి ఇలాంటి కబుర్లేనా తాతయ్యా చెప్పేది?'
తాతయ్య ఫకాళించి నవ్వేవాడు.
"ఓరి పిచ్చి సన్నాసీ! ఎంత పిచ్చి సన్నాసివిరా! చదువు చదివి ఆడదాన్నేం చేస్తావురా? పొట్టచించితే అక్షరముక్క లేనివాణ్ణి నేను సంపాదించ లేదట్రా? పిచ్చి వెధవ్వి! ఆడదాని గుణం నీకేం తెలుస్తుందిరా? ఇష్టం లేని ఆడపిల్లలు సింగారించుకోని బిందె లెత్తుకొని బొమ్మల్లా ఎందుకొస్తార్రా చెరువుకి? రసికతకి ప్రసిద్దికెక్కిందిరా మన గోత్రం-ఇంత పిరికివెధవ్వి నువ్వెలా చెడ బుట్టావ్ రా?" అంటూ తాతయ్య నన్నెప్పుడూ చెడామడా తిడుతూండేవాడు.
"ఏమో తాతయ్యా! మన గోత్రం గొప్పేదో నువ్వు చెప్తావుగానీ ఈ రోజుల్లో ఏ ఆడదీ నమ్మదు"
గోత్రాన్ని తక్కువ చేసే మాత్రం తాతయ్య తాటి చెట్టంత ఎత్తు ఎగిరి పడేవాడు- "ఏడి శావ్ వెధవాని వెధవా! నీలాంటి పనికిమాలిన వెధవల్ని ఏ ఆడదీ ఒల్లదు- ఏదీ నీ పెళ్ళాన్ని నా దగ్గిరకి పంపు. మళ్ళా నీ దగ్గిరకి వస్తానంటుందేమో అడుగు."
