Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 29


    ఇప్పుడు ఆ అరుణ కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది! ఆకతాన సేతుపతి గారనుభవించిన బాధ వేరు, రఘు అనుభవించిన బాధ వేరు! వార్త తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి అరుణ గదిలో వాలాడు రఘు. అప్పటికే కన్నీరు మున్నీరై , అరుణ అన్నింటినీ సర్దు కుంటుంది. రఘును చూడగానే "రఘూ" అంటూ వెళ్లి , అతని కౌగిట్లో వాలిపోయింది.
    వెళ్ళిపోతున్నావా ఆరూ?"
    "అవును రఘూ , నేనిప్పుడు వెళ్లి తీరాలి. అప్పుడప్పుడు వస్తుంటానుగా? నేను ఉత్తరాలూ వ్రాస్తుంటాను రెగ్యులర్ గా! నీవూ వ్రాయి! నీకే మాత్రం మనసు బాగోలేకపోయినా , కారు వేసుకుని మా ఊరు వచ్చేసేయ్యి !"
    "ఆరూ, నీవు వెళ్ళినందు వల్ల , మీ నాన్నగారికీ, అమ్మగారికీ......చెల్లెళ్ళ కూ ఏం మంచి జరుగుతుందో నాకు తెలియదు ! కానీ ....ఇక్కడ జరిగే చెడు మాత్రం నాకు తెలుసు. అది ఇంతా అంతా కాదు ఆరూ!"
    "మామయ్య గారూ ఆ మాటే అని, నీవూ ఆ మాటే అంటే నేనేమై పోను రఘూ? రఘూ , నాకో వాగ్దానం చెయ్యి. నాన్నగారు మనస్సు నిచ్చుకునేలా నీవే పనీ చెయ్యకు!"
    "నేనేం చేసినా, అయన గారి మనసుకు నొప్పె కలుగుతుంది ఆరూ!"
    "అయితే నీవేమీ చెయ్యద్దు! ఇంట్లోనే ఉండు! తిను, తిరుగు , రేసులకు వెళ్ళు! ఆనందంగా నీ ఇష్టం వచ్చినట్టు కాలం గడుపు!"
    "నా జీవితంలో ఆ దశ దాటిపోయింది ఆరూ! ఎందుకో గానీ....... సుఖ పడడం వైపు ఇప్పుడాట్టె మనసు మళ్లడం లేదు. నాకున్న ఈ కొద్ది అనుభవం లోనే మానవ జాతి అనుభవిస్తున్న బాధలన్నింటి నీ చూశాను , అర్ధం చేసుకున్నాను!"
    "అందరికీ విముక్తి కలిగించడానికి నీవేం ప్రవక్త వు కాదు రఘూ! ఇది నీకొక పిచ్చి. దాని వల్ల నీవూ బాధపడి , మామయ్య గారిని బాధపెదతావు . అంతే'!"
    "నే పడే బాధలో నాకానంద ముంది ఆరూ. దాని వల్ల నాన్నగారు బాధపడితే దానికి నేను బాధ్యుణ్ణి కాను."    
    "సరే, అందరూ బాధ పడండి. నేనోక్కర్తే నూ ఈ బాధలన్నింటి నుండి విముక్తురాల నై వెళ్ళిపోతున్నాగా!"
    "కోప్పడకు ఆరూ!"
    "కోపమా, నా తలకాయా! నీదొక పిచ్చి, మీ నాన్నగారి దొక పిచ్చి. నీ పిచ్చి వల్ల ఇప్పట్లో ఎవ్వరికీ ఏ ఉపకారమూ జరగదు. మామయ్యగారి పిచ్చి వల్ల అందరికీ కాకపోయినా కొందరి కైనా ఉపకారం జరుగుతుంది. జరుగుతుంది కూడా! నువ్వు కళ్ళారా చూడ్డం లేడూ?"
    "నాన్నగారు చేసేది స్వార్ధ రహితమైన ఉపకారం కాదు. అయన ఏది చేసినా.......పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, పబ్లిసిటీ కోసం చేస్తారు!"
    "నీ చేతల వల్ల నీకు వచ్చే పబ్లిసిటీ నీకూ వస్తుందిగా! రఘూ, ముందే మన సంతా అల్లాలాడిపోతుంది. నన్నెందుకు ఇంకా బాధ పెడతావు! చెప్పానుగా? నేను రెండు రోజుల కోక ఉత్తరం వ్రాస్తాను. ఏపూట నీ మనసు బాగోలేకపోతే ఆ క్షణం బయలుదేరి నా దగ్గిరికి వచ్చేసేయ్యి! అక్కడ మనం ఎంత వితండవాదం చేసుకున్నా, ఎవ్వరూ వినరు, విన్నా బాధపడరు!"
    "అలాగే , ఇదుగో ఆరూ! ఇవి నీ కోసం తెచ్చా" అంటూ, ఒక వాచీ, ఒక ఆమె చేతికిచ్చాడు.
    "రఘూ!"
    "తీసుకో ఆరూ, మళ్ళీ ఎప్పుడు కలుసు కుంటామో!"
    "ప్రతి ఆదివారం కలుసు కుంటాం. మామయ్యగారు ఆ షరతు మీదే నా రాజీనామా అంగీకరించారు."
    "అల్ రైట్ . గుడ్ లక్ టు యూ ఆరూ."
    "సేం టు యూ రఘూ."
    ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. అంతటితో ఆగుతుందా వారి భావోద్వేగం? అమాంతంగా ఒకరి కౌగిట్లో కి ఒకరు దూసుకు పోయారు. ఇద్దరి ఎదలూ, ఆవేశంతో తూగుటూయాల లూగినాయి.
    అందరి వద్దా సెలవు తీసుకుని, అరుణ వెళ్ళిపోవలసిన ఘడియ సమీపించింది. శంకర నారాయణ గారు మాత్రం సేతుపతి తో ఒక మాట అన్నారు.
    "అయ్యా, తమరు ఆ తిరుపతి ప్రయాణమే పెట్టుకోకుండా ఉంటె ఎంత బాగుండేది!"
"శంకర నారాయణ గారూ, అన్నీ తెలిసిన వారు తమరు! అటువంటి నిస్చయాల్ని చేసే శక్తి నిజంగా మానవుల కుందంటారా?"
    "లేదు బాబూ, లేదు. కానీ....నా ,మూలాన్ని మీ మనసు ఇంత కష్ట పడుతుందే అనే నా బాధ! అరుణ మీద నాకే హక్కు లేదు!"
    "కానీ , అరుణకు మీ మీద అన్ని హక్కులూ ఉన్నాయి. పవిత్రమైన తన కర్తవ్యాన్ని ఆ అమ్మాయి నెరవేరుస్తుంది. మీరూ అడ్డు చెప్పరాదు. నేనసలు అడ్డు చెప్పను. సెలవు."
    "నమస్కారం . అమ్మా, సెలవు తీసుకుంటాను!"
    "మామయ్యగారూ...."
    "వెళ్లిరా తల్లీ....ఆ....ఇదుగో ...నీ బాంకి పాస్ పుస్తకం."
    "మామయ్య గారూ!" అంటూ అరుణ అయన గారి ఎద మీద పడిపోయింది! తన గుండెలో ఎన్ని పొగ బండ్లు పరుగెడుతున్నా లక్ష్య పెట్టక, సేతుపతి అరుణను సముదాయించడానికి ప్రయత్నించారు.
    "వెళ్ళమ్మా, మీ అత్తయ్య గారి దగ్గిరా సెలవు తీసుకో!" అరుణ వెళ్లి, చాముండేశ్వరి పాదాలకు మొక్కింది!
    "రఘును గురించే నాకు భయంగా ఉందమ్మా అరుణా. అప్పుడప్పుడు ఉత్తరాలూ వ్రాస్తూ ఉండు. నీవూ వస్తూ ఉండు. మళ్ళీ నీవు ఎంత త్వరగా వచ్చి, మా ఇంట వెలిస్తే, అంత మంచిది అరుణా!" చాముండేశ్వరీ ఏడ్చింది , అరుణా ఏడ్చింది!
    విడిపోవడం విధి నిర్ణయ మైనప్పుడు, వీడ్కోలు ఎంతసేపు జరుగుతుంది? అరుణ వెళ్ళిపోయింది. సేతుపతి గారి హృదయంతరంగం లో మాత్రం తాను భరించలేని కొందంతటి భారం ఎక్కడిడో వచ్చి, తన భుజాల మీద నిలిచిందన్న స్థిర నిశ్చయం నాటుకు పోయింది!

                                      42
    అరుణ వెళ్ళిపోయిన నాటి నుంచి రఘు తెగిన గాలిపటం ;లా తయారయ్యాడు. ఇష్టం ఉంటె ఇంటికి వచ్చేవాడు. లేనప్పుడు రోజుల తరబడి మురికి కాలవల గట్ల మీద ఉన్న తమ వర్కర్ల పూరిళ్ళ లో పడి ఉండేవాడు. వాటి మధ్యనే డెబ్బై అయిదు రూపాయలిచ్చి , దానికొక ఉపాధ్యాయినిని కూడా ఏర్పాటు చేశాడు. ఫ్యాక్టరీ నించి కారులో సరాసరి అక్కడికే వెళ్ళడం, ఆ స్కూలు నించి బైటికి వచ్చి ఆడుకుంటూన్న పిల్లల్ని జట్టు జట్లుగా తన కారులో ఎక్కించుకుని షికారు వెళ్ళడం....ఏ ఓబులేసు ఇంటిలోనో, సుందరం ఇంటిలోనో , మరొకడి ఇంటిలోనో వారికున్న తిండి తినడం.....ఆ స్కూలు పాకలోకి వెళ్లి ఏ బెంచి మీదో పడుకుని నిద్రపోవడం ....ఇది దాదాపు అతని దినచర్య అయింది!
    అరుణ వెళ్ళిపోయి పది రోజులయింది. ఈ పది రోజులకు గాను రఘు, ఏ ఒకటి రెండు పూటలో ఇంటి మొహం చూచి ఉంటారు. దానితో చాముండేశ్వరి సేతుపతి గారితో మొరపెట్టు కుంది.
    "వాడెం పసిపాపా దారి తప్పిపోయాడనుకోడానికి? వస్తే వస్తాడు లేకపోతె......వాడి స్నేహితులతో ఎక్కడో పడి ఉంటాడు. నీవేం బెంగ పెట్టుకో అక్కర్లేదు!" అన్నాడు సేతుపతి.
    సేతుపతి గారినీ, రఘునే గాక వారి కార్ల నంబరు తెలిసిన ఎందరో పెద్ద మనుషులు రఘు ఆ పేదవారి పిల్లల్ని అందరినీ కారులో ఎక్కించుకుని బీచి లో తిరగడం....బఠాణీలు కొని వారితో పాటు తినడం .....గాలి పటాలు ఎగరవేస్తూ ఆ మూకలో తానూ ఒకడై కేరింతాలు కొట్టడం ఇటువంటి వన్నీ గమనించి సేతుపతి గారి వద్దకు రాయభారం వచ్చారు.
    "రండి, రండి. ఇందరు పెద్దలు కూడా బలుక్కుని ఒక్క పెట్టున ఇలా వచ్చారు?"
    వచ్చిన పెద్ద మనుషులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. ఏం చెప్పడం? ఎలా మొదలెట్టడం?-- అదీ వారి సమస్య.
    "చెప్పండి శ్రీనివాస రాఘవన్ గారూ? ఏమిటి? ఏదైనా కొత్త కాలేజీ కడుతున్నారా? హాస్టలా? టెంపుల్ రివోనేషనా?"
    'అదేదీ కాదండీ సేతుపతి గారూ, మీ రఘును గురించి..."
    "అదే, మా రఘుకు అసలు మర్యాదస్తుల తోటి సంబంధమే లేదే? వాడి కేంతసేపు కూలీలూ ...మురికి కాలవలూ ...పూరిగుడిసేలూ ...ఇటు వంటి వాటితోనే సంబంధం!"
    "అంటే.....మీకు తెలుసా?"
    "తెలుసు! కానీ....నేను చెయ్యగలిగింది ఏమీ లేదు!"
    "మీరలా అంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి!"
    "ఏం చెయ్యమన్నారు? ఏం చెయ్యటానికి తోచక....తోచినా, చెయ్యడానికి అసమర్దుడ్నై వాడిని వాడి రాతకు వదిలేశాను."
    "పోనీ ....ఏదో ట్రెయినింగ్ నెపంతో అబ్బాయిని ఏ ఇంగ్లాండో ....అమెరికానో పంపితే.?"
    "మొదలియార్ గారూ , అన్నీ ఆలోచించాను. వాణ్ణి ఏమాత్రం కంట్రోల్ చేయగలిగినా , మా అరుణ ఒక్కర్తే చెయ్యగలదు. ఆ అమ్మాయి ఇప్పుడిక్కడ లేదు. అరుణ, మళ్ళీ మా ఇంటికి రావడానికి మరో మూడు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు. ఆలోగా ఇంతకంటే ఘోరాలు ఏమీ జరక్కుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధించడం కన్నా, నేను గానీ, మీరు గానీ చెయ్య గలిగిందేమీ లేదు."
    "నాకో సందేహం ఉందండీ సేతుపతి గారూ!"
    "ఏమిటండీ డాక్టర్ వరద రాజన్?"
    "నా అనుమానం సుమండీ...."
    "యస్...యస్?"
    "రఘు మెంటల్ స్టేట్ సరిగా లేదనుకుంటా. ఎవరికైనా బ్రెయిన్ స్పెషలిస్ట్ కు చూపించడం మంచిదేమోనని...."
    "అలోచిస్తానండీ డాక్టర్ గారూ! వాదనలు నిజంగా ఇలా తయారు కావలసిన కుర్రాడు కాదు! ఏదో ....నాకు తెలిసిన డిసిప్లిన్ నంతటి నీ వాడి నెత్తిన రుద్ది , వాణ్ణి మనిషిని చెయ్యాలను కున్నాను. మనిషి అయ్యాడు, కానీ.... మన మనిషి కాకుండా పోయాడు. ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా తీవ్రంగా ఆలోచిస్తా!"
    ఈలోగా నాయర్ కాఫీతో వచ్చాడు. సేవించి, నమస్కారాలు పెట్టి కరచాలనాలు చేసి, వచ్చిన పెద్ద మనుషులు వెళ్ళిపోయారు. వారటు వెళ్ళారో లేదో.....ఆదివారమవడం మూలాన్ని అరుణ కూడా వచ్చింది. సేతుపతి గారి ప్రాణాలు లేచి వచ్చాయి!
    "వచ్చావా తల్లీ...."
    "ఈ పది రోజులుగా అసలు నిద్రాహారాలు అనవసర మన్నంత ఇదిగా మిమ్మల్ని గురించిన ఆలోచనలతోనే కాలం గడిపానండి మామయ్యగారూ!"
    "ఉద్యోగం ఎలా ఉందమ్మా!"
    "ఉద్యోగ మంటే ...మీకు కబుర్లు చెప్పి, కాఫీ ఇచ్చీ, నెలనెలా మూడు వందల యాభై రూపాయలు డ్రా చెయ్యడం కాదండీ మామయ్యగారు! నెలంతా నిజంగా కష్ట పడితే, నూట నలబై ఎనిమిది రూపాయ లిస్తున్నారు. చౌదరి గారు పది ట్యూషన్లు ఏర్పాటు చేశారు. ఆవో రెండు వందల యాభై వస్తాయి."
    "గుడ్, వెరీ గుడ్ . ఉండడానికి ఇల్లూ అదీ....వసతి ఉన్నదే దొరికిందా ఆరూ?"
    "డేడ్ చీప్ అండీ మామయ్యగారూ . పెద్ద ఇల్లు ! ముప్పై ఏడు రూపాయలు. అంటే ఆ ఇల్లు చౌదరి గారిదే అనుకోండి...."
    "నాన్నగారూ , అమ్మా, చెల్లాయి లూ అంతా బాగున్నారమ్మా?"
    "అంతా బాగున్నారండీ! కానీ....అదేమిటి? మీరీ పదిరోజుల్లోనే ఇలా తయారయ్యారు?"
    "ఆ.........నాకేమయిందమ్మా?....ఏదో ఆదివారం కదా.....కాస్త లేజీ గా గడుపుదామను కుని , ఇంకా షేవ్ చేసుకోలేదు. అంతే!"
    "నేను వచ్చి, అంతటిని పాడు చేశాను కదూ?"
    "లేదమ్మా , లేదు! నీవు రావడం వల్ల నన్ను పూర్తిగా విడిచి పోబోతున్న సుఖమూ....సంతోషమూ....అన్నీ మళ్ళీ నన్ను చేరాయి.!"
    "అయితే....ఆదివారం ఆదివారం ఇక్కడికి వచ్చి మీకింత సహాయం చేస్తున్నందుకు కూడా మీరేదయినా జీతం ఏర్పాటు చేయవలసి ఉంటుందండీ మామయ్యగారూ!"
    "సంతోషంగా ఏర్పాటు చేస్తానమ్మా! ఇప్పుడు....ఈ క్షణం నీ చేతికి ఓ లక్ష రూపాయలిస్తాను. తీసుకు వెళ్లి నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసేసేయ్యి. అమ్మ గారికీ....నాన్నగారికీ ఏదో ఒక ఏర్పాటు చేసి, ఇక్కడికి వచ్చి, ఈ ఇల్లు నిలబెట్టు!"
    "అంటే..........నన్ను కోడలుగా కొని తెచ్చుకుంటా రన్నమాట?"
    "పిచ్చి తల్లీ, నువ్వంత మాట అనేస్తావని నాకు తెలుసమ్మా!"
    "మామయ్యగారూ , మీ అసలు సమస్య నా కర్ధమై పోయింది! రఘు గొడవ చేస్తున్నాడన్న మాట! ఉండండి వెళ్లి ఆ మొద్దబాయి గారిని నిద్ర లేపి తీసుకు వస్తా. ఈ వేళ మనమందరం కనీసం రెండు సినిమాలయినా చూదాలండీ మామయ్యగారూ!" అంటూ , అరుణ మేడ మెట్ల వైపు అందంగా పరుగు తీసింది. "
    "అమ్మా అరుణా!" ఆ పిలిచింది చాముండేశ్వరి.
    "అత్తయ్యా....అదేమిటి? కళ్ళలో ఆ నీరెందుకత్తయ్యా?"
    "ఇలారా తల్లీ....." అంటూ చాముండేశ్వరి అరుణను వంట ఇంటిలోకి తీసుకెళ్ళింది. అక్కడ కూర్చో బెట్టి , ఆ పది రోజులుగా జరిగిన గొడవలన్నీ కధలు కధలుగా చెప్పింది. ఆమె అసలు బాధ రఘును గురించి డాక్టర్ వరద రాజన్ ఇచ్చిన తీర్పు వల్ల కలిగింది. దీన్ని వివరించింది పాపం!
    "అరుణా , ఒక్కగానొక్కడు! వాడికి నిజంగా పిచ్చేనంటావా?"
    "పిచ్చి , ఆ చెప్పిన డాక్టర్ వరదరాజన్ కి! అయన పనిగట్టుకుని వచ్చి చెప్పడమూ బాగానే ఉంది. మీరు విని, గుండె బద్దలు కొట్టుకోడం ఇంకా బాగా ఉంది! ఉండండి, నేను వెళ్లి ముందు రఘును తీసుకు వస్తాను!" అంటూ అరుణ మళ్ళీ హాల్లోకి వెళ్ళింది.
    "మామయ్యగారూ , కారుతో అవసరంగా మీకేమైనా పనుందా ఓ గంట....గంటన్నర?"
    "రఘును తీసుకు వస్తావా అమ్మా?"
    "అదేనండీ మామయ్యగారూ ప్రయత్నం."
    "వెళ్లిరా తల్లీ, నీవు వచ్చాక , ఎందుకో వాణ్ణి కూడా చూడాలని ణా హృదయం తపించి పోతుంది."
    సేతుపతి గారికి తెలియకుండా అరుణ కన్నీరు కార్చింది. అరుణ కు తెలియకుండా సేతుపతి కన్నీరు కార్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS