Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 29


    "అవును, ఈ అధికారం నా పాలిట బంగారు పంజరం అయింది. నాకు స్వేచ లేదు. సంతృప్తి లేదు. సంతోష, లేదు. ఈ పంజరంలో బంధించబడ్డ చిలకను నేను. నాకు విముక్తి లేదు."    
    రాజగోపాలం మాట్లాడలేక పోయాడు.
    రవిచంద్ర లేచాడు. "ఇక వెళ్తాను" అంటూ కారు దగ్గిరికి వెళ్ళాడు.
    కారు స్టార్టయిన తరవాత రాజగోపాలం, "రవీ, నా కోసమైనా మీరు కులాసాగా ఉండడానికి ప్రయత్నించక తప్పదు. ప్లీజ్.' చిరునవ్వుతో అతణ్ణి చూస్తూ అన్నాడు. ఆ చిరునవ్వులో ఎదటి వాణ్ణి శాసించే శక్తి ఉంది. ఆ చిరునవ్వులో ఎదటి వాడి గుండెల్లో పన్నీటి జల్లులు చల్లే  శక్తి ఉంది.
    అందుకనే రవి "ప్రయత్నిస్తాను" అని అనక తప్పలేదు.
    రవిచంద్ర బంగళా నిర్మానుష్యంగా ఉన్నట్లు గోచరించింది. తోట మొత్తం కళా విహీనమయినట్లు, ఆ ప్రదేశమంతా బోసి పోయినట్లు రవికి అనిపించసాగింది. ఈ బంగళా లో తను, సురేంద్ర గడుపుదామను కున్నారు. ఈ తోట, ఈ అందమైన డ్రాయింగు రూము, ఈ అధికారం -- ఇవన్నీ ఇద్దరివి అనుకున్నాడు.
    ఏడీ సురేంద్ర? తనను మోసం చేసి వెళ్ళిపోయాడు. సురేంద్ర కాదు జైలు శిక్ష అనుభవిస్తున్నది-- తను. ఈ సంగతి ఎవరూ గుర్తించరేం?
    "ఎవరూ లేరా?' విసుగ్గా బిగ్గరగా అరిచాడు. బంట్రోతు భయంభయంగా వచ్చి నిల్చున్నాడు. "భోజనం తయారయిందా?"    
    "ఆ కంఠస్వరంలోని కర్కశత్వానికి బంట్రోతు వణికి పోయాడు.
    'అయింద'న్నట్లుగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తల ఊపాడు.
    "మరి కనుక్కోరేం? ఆ సురెంద్రతో అన్నీ పోయినననుకంటున్నారా? సురేంద్ర కాదు ఈ ఇంటికి అధికారి.....నేను. తెలిసిందా?...వెళ్ళు." ఎవరి మీదనో విరుచుకొనిపడాలి. ఎవరి మీదనో కసి తీర్చుకోవాలి . తనను ఇంత ఘోరంగా హింసిస్తున్న ఎవర్నో ఏమో చేయాలి! అతను దాదాపు పిచ్చి వాడయి నట్లుగా అరిచాడు.
    బంట్రోతు అయిదు నిమిషాల తరవాత సవినయంగా వచ్చి, "వడ్డించటం అయింది" అన్నాడు.
    "అక్కర్లేదు. నేను భోజనం చేయను." అతనేదో దీర్ఘాలోచనలో పడిపోయి అన్నాడు.
    బంట్రోతు క్షణకాలం బిత్తర పోయాడు! రవి వింత ప్రవర్తన అతనికే మాత్రం అర్ధం కాలేదు.
    "నా ముందు అలా నిల్చుంటే అసహ్యం, వెళ్ళిపొండి,... వెళ్ళండి!" బిగ్గరగా అరిచాడు. ఆ బంగళా వణికిపోయింది.
    రవికి టక్కున ఏదో తట్టినట్ల యింది. గభాల్న లేచి ఇంతకూ పూర్వం సురేంద్ర ఉండిన గదిలోనికి వెళ్లి గబగబా దేని కోసమో వెతక సాగాడు. చివరకు బీరువాలో కింది తంతే లో కాగితాల అడుగున మూడు సీసాలు కనపడ్డాయి.
    అతని కేందుకనో తెలియని ఆనందం కలిగింది.
    గభాల్న వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గిర కూర్చున్నాడు. బంట్రోతు బిక్కచచ్చిపోయి నిల్చుని ఉన్నాడు.
    "అలా చూస్తావేం? మంచినీళ్ళు తీసుకుని రా!"
    రవి చేతిలోనివి చూసిన బంట్రోతు కు ఆశ్చర్యం తో నోట మాట రాలేదు! క్షణం లో సగం సేపు అలా చూసి, గభాల్న ఉరికి వెళ్లి నీళ్ళు తీసుకొచ్చాడు.
    రవి సీసాలోంచి గ్లాసు లోకి వంచుకొని , కాసిని నీళ్ళు పోసుకున్నాడు. అతని చేతులు వణికాయి గ్లాసు ఎత్తు తున్నప్పుడు.
    ఏమిటిది?
    తన నిగ్రహం తన మంచితనం తన వివేకం అన్ని మంట గలిసి పోతున్నాయా?
    ఆలోచన ముందు వెనకలు చూడసాగింది.
    బాధ ఆత్రత చెందసాగింది. తను మరిచిపోవాలి. పాత జ్ఞాపకాలను, పాత బ్రతుకును మరిచి పోవాలి. ఎలా? ఎలా?
    గభాల్న గ్లాసు ఎత్తుకొని, గట్టిగా కళ్ళు మూసుకుని గడగడా తాగేశాడు!
    అయిపొయింది! తనకు స్వేచ్చ లభించింది! తను చెడ్డ వాడుగా మారిపోతున్నాడు. తనూ తాగుబోతు అయ్యాడు!
    గుండెల్లో మంట. గొంతులో ఏదో కాలుతున్నట్లుగా ఉంది. ఎవరి మీదనో కసి! తను మంచివాడుగా ఉండగూడదు. ఎందుకు? ఎవరి కోసం తన మంచితనం? ఎవరికోసం తన సత్ప్రవర్తన? ఎవరి కోసం తన నిగ్రహం?
    తనకేమీ అక్కర్ల్దేదు. తను ఇప్పుడు ఏకాకి. ఒంటరి. జీవితం పదేపదే తనను మోసగించింది.
    స్వర్గం తనకు ఇట్టే అందించినట్లు అందించి నిర్దాక్షిణ్యంగా , క్రూరంగా తన చేతిలోంచి గుంజుకోసాగింది.
    ఈ ఎదురు దెబ్బలు తను తినలేడు.
    ఈ జీవిత ప్రవాహానికి ఎడురీదటం తన చేత కాదు.
    తనూ చెడ్డవాడుగా , క్రూరుడుగా, హీనుడు గా , నీచుడుగా మారిపోవాలి. అప్పుడే తనకు విముక్తి!
    అదే తనకు శిక్ష!
    మళ్ళీ సీసాలోంచి గ్లాసులోకి వంచుకొని గబగబా తాగాడు.
    "సూరీ, నిన్ను కోర్టు శిక్షిస్తే , నన్ను నేను శిక్షించు కుంటాను. నిన్ను న్యాయం శిక్షిస్తే , నన్ను నేనే శిక్షించు కుంటాను.' సీసాను హృదయానికి ఆనించుకొని అనుకోసాగాడు.
    తన కిప్పుడు మంచీ ,చెడ్డ , నీతి అవినీతి ,దయా , నిర్హయా అన్నీ సమానమే. తను ఇప్పుడు చెడిపోయిన వాడు. పతితుడు!
    ఓహ్, ఎంత ఆనందంగా ఉన్నది! ఏమి టిలా తను తెలిపోతున్నాడు? ఎక్కడికి? స్వర్గం అంటే ఇదా? తనిన్నళ్ళూ నరకంలో అంత యమయాతన ఎందుకనుభవించాడు? ఇంత సుఖం, ఇంత సంతోషం , ఇంత ఆనందం ఇక్కడ ఈ విధంగా ఉంటె తను ఎందుకలా అవివేకిలా , అసమర్ధుడి లా మంచితనం ముసుగు వేసుకొని నిస్సారమైన బ్రతుకు బ్రతికాడు?
    తను ఇదివరకు పిచ్చివాడు. నిజంగా పిచ్చివాడు. ఇప్పుడే తనకు వివేకం వచ్చింది. కళ్ళు తెరుస్తున్నాడు.
    అతను మత్తులో తూగి పోతున్నాడు. అతని హృదయం, మాట, శరీరం అన్నీ తెలిపోసాగాయి. అతనికి ఇంతకూ పూర్వం నీతి అంటే అన్న భయం , ధర్మం అంటే ఉన్న గౌరవం , మంచితనం అంటే ఉన్న మమకారం -- అన్నీ అతనితో తెలిపోసాగాయి.
    అతను తెల్లవార్లు అలాగే కూర్చుని తాగసాగాడు. అతనేదో కొత్త ప్రపంచం లోకి , సుఖదుఃఖాలకు అతీతమైన, ఈ లౌకిక బాధలకు భయపడని, ఈ ప్రపంచం తాలుకూ ఆవేదనకు అందని ఏదో ప్రపంచం లోకి వెళ్ళిపోయాడు.
    ఈ బాధల నుండి విముక్తుడయినట్లుగా , ఈ నరకం నుండి దూరమయినట్లుగా, అతని కోక చిత్రమైన అనుభూతి కలిగింది.
    తాగి తాగి, అలిసి, అలిసి బల్ల మీదనే చేరగిల బడ్డాడు.
    నెమ్మదిగా ఇద్దరు బంట్రోతులు వచ్చి అతణ్ణి మంచం మీద పడుకోబెట్టినప్పటి కి అతనికి తెలివి రాలేదు!

                                 19
    బద్దకంగా లేచాడు రవిచంద్ర. సమయం ఉదయం పది గంటలయింది. అతను లేవటం చూసి బంట్రోతు లు కాలకృత్యాలు తీర్చుకోటానికి అన్నీ చకచకా అమర్చారు.
    రవికి తల దిమ్మెక్కి పోయింది. స్వర్గం నుంచి గభాల్న కిందికి పడదోసినట్లయింది.'రాత్రి నేను తాగాను. రాత్రి నేనుచేడిపోయాను' అనే భావన పదేపదే అతని మనసులో మెదిలి ఏమిటో అసంతృప్తి ని కలగ జేసింది. జీవితం అంటే విరక్తి , చికాకు , ఎందుకో తెలియని చింత అతనిలో కమ్ముకొని అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి.
    కాలకృత్యాలు తీర్చుకొని ఆఫీసు కు వెళ్లేసరికి పదకొండు గంటలయింది. యాంత్రికంగా అతడు అభినందనలు స్వీకరిస్తూ తన గదిలోకి నడిచాడు.
    అతను కుర్చీ లో కూర్చునే సరికి బంట్రోతు వచ్చి ఫాను స్వేచ్ వేశాడు. బల్ల మీద ఉన్న కాగితాల చివర్లు పేపర్ వెయిట్ కింద రేపరేపా కొట్టుకోనసాగాయి. అతని హృదయం లో కూడా అలాంటి రేపరేపే! అయినా పేపర్ వెయిట్ లాంటి దేదో గుండెల మీద పెట్టబడిఉండటం చేత మాటల కందని ఆవేదన బయటకు రాలేక పోతున్నది!
    ఏదో ఫైలు తీసుకొని చదవటానికి ప్రయత్నించాడు. ఒక్క అక్షరం కూడా అర్ధం కాలేదు. అక్షరాలన్నీ గజిబిజిగా , కళ్ళ ముందు చిందులు తోక్కుతున్నట్లుగా అనిపించింది. ఫైలు మధ్యలో సురేఖ ప్రత్యక్ష మయింది. వెను వెంటనే సురేంద్ర....కటకటాల మధ్య సురేంద్ర....నాలిక బయటికి వచ్చి భయంకరంగా ఉన్న సురేఖ.....గొంతు పిసుకుతున్న సురేంద్ర......తాగుతున్న తను.
    గభాల్న ఫైలు వెనక్కి నెట్టేశాడు.
    రెండు క్షణాలు కళ్ళు మూసుకొని ఫాల భాగాన్ని నొక్కుకుంటూ అలాగే కూర్చుని, ఆప్రయత్నంగా లేచి కలెక్టరు గదిలోకి వెళ్ళాడు.
    దరహాస వదనంతో కలెక్టరు ఆహ్వానించాడు.
    తల వంచుకొని రవి చెప్పాడు: "క్షమించండి.....ఈ మధ్య నా ఒంట్లో బాగుండటం లేదు.....ఏమీ పని చేయలేక పోతున్నాను.."
    ధర్మరాజ్ సానుభూతితో అతణ్ణి పరికించాడు.
    తలఎత్తి "మీరనుమతిస్తే ఒక పది రోజుల పాటు నేను సెలవు తీసుకుంటాను" అన్నాడు రవి పేలవంగా.
    "ఓ. యస్! టెక్ ఫుల్ రెస్ట్ అండ్ దెన్ కమ్." కలెక్టరు ఆప్యాయంగా అన్నాడు.

                         *    *    *    *
    రాజగోపాలం ఇంటి ముందు కారాగింది.
    గేటు తెరుచుకొని లోనికి నడిచాడు. బయట ఎవరూ లేరు. నెమ్మదిగా మధ్య వసారా లోకి వెళ్ళాడు. ఎవరూ కనిపించలేదు. పక్క గది తలుపు తెరవబోతుండగా "ఎవరూ?" అన్న ప్రియంవద కంఠం వినిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS