Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 29


    క్లాసులో సురేఖను చూస్తూనే కుంచించుకు పోతుంది పద్మావతి. ఆ ముందురాత్రి నించీ తాను అనుకున్నదంతా మరిచి పోయింది. విశాల హృదయంలో, పిక్ నిక్ లో జరిగిన్ సంగతిని మరిచి పోవాలి. భాస్కరం స్నేహం దక్కించుకోవాలీ అనుకుంటూ రెండుసార్లు బస్సుహారన్ కి ఉలిక్కి పడి మూడు సార్లు సైకిళ్ళకు అడ్డంపడి ఆలోచిస్తో వచ్చిన పద్మావతి సురేఖను మామూలుగా కలుపుగోరుతనంగా పలకరించింది. -ఆమె నవ్వు నిర్మలంగానే ఉన్న అందులో వెటకారం అగుపించింది పద్మావతికి.
    "ఏవోఁయ్? క్లాసుకి రాలేదు?" సురేఖ బెంచీమీద కూచుంటూనే అడిగింది.
    "నా కర్మ" అంది పద్మావతి.
    "కాదు నీ క్రియ...... అసలు నీ సంగతి నాకేం బాగోలేదు" సురేఖ నవ్వడానికి ప్రయత్నం చేసింది.
    పద్మావతి మొహం ముడుచుకుంది తప్ప ఏం మాటాడలేదు. అంతలో చేతినిండా గుప్పెడు సుద్ధముక్కలతో లెక్చరర్ ప్రవేశించాడు.
    
                                     38

    క్లాసునించి విశ్రాంతి భవనానికి వెళ్ళేటంత వరకూ సురేఖ పద్మావతిని ఆవేశంగా కూకలేయసాగింది.
    "నువ్వు మనుషుల్ని నీచంగా చూడకూడదు. పరిస్థితులను అర్ధం చేసుకో గలగాలి..... పద్ధతుల ను వీలైతే మార్చుకోవాలి...... మనం అనుకున్న వన్నీ అలాగే అవుతాయనుకో కూడదు......భాస్కరంగారి స్నేహాన్ని గాని నా తత్వాన్నిగాని అపార్ధం చేసుకోగూడదు...... నీకా హక్కు లేనేలేదు."
    "పద్మావతి ముక్కు పుటాలు పొంగుతున్నాయి కాని ఆవేశం చాత ఏమీ అనలేదు. ఎట్టకేలకు 'నీ ఉపన్యాసం అయితే ఇక నోరు మూసుకో" మంది.
    "చిత్తం" అన్నది సురేఖ.
    నోరు మూసుకుని- స్నేహితురాలి అలక తీరిందనే భావించింది కనుక నవ్వేసింది. పద్మావతి భుజంమీద చరిచింది.
    పద్మావతి కూడా నవ్వడానికి ప్రయత్నం చేసి "బహుశా, నేను భాస్కరంగారిని సరిగ్గా అర్ధం చేసుకోలేదేమోనే...... గుడ్ లక్! ఐయామ్ సారీ" అంటూ గిరుక్కున తిరిగి చెకచెకా విసవిసా వెళ్ళిపోయింది పద్మావతి.
    చకిత ఐపోయింది సురేఖ్ 'విద్యుతాఘాతం' తగిలిన ట్లుందా "గుడ్ లక్" అన్నమాట.పద్మావతి "తీసిపెట్టి ఒక చెంప దెబ్బవేసినా" ఇంత ఆశ్చర్యపడకపోను గని ఇలా ఈటెల్లాంటి మాటలతో 'దెప్పి పొడిచి' వెళ్లిపోవడంతో, నాలుగైదు క్షణాలు అట్టే నీరై పోయి నిలిచి పోయింది!

                                 *    *    *

    పద్మావతికి అటుతర్వాత క్లాసులకు వెళ్ళబుద్ధి కానేలేదు. లైబ్రరీకి వెళ్ళింది. తెలిసిన వారెవరి కంట పడకుండా ఆఖరి వరుసలో బల్లకి పెడ మొహంగా కూచుని రెండు పెద్ద పుస్తకాలు ముందు పడేసుకుంది.
    పేజీలు  కాని అక్షరాలు గాని అగుపించడంలేదు.
    నిమిషాలే గడుస్తున్నాయి. గంటలే తిరుగుతున్నాయి. ఆ పిల్లకి తెలియలేదు.
    "భాస్కరం మంచి వాడని కొంచెం సేపూ దగాకోరు, చంచల హృదయుడు అని కొద్దిసేపూ ఆమె మనసు ద్వందాను భూతులకు లోనై వ్యాకుల పడసాగింది.
    అంతలో ఆమె ప్రక్కనే ఎవరో కదిలి నట్లైంది ఉలిక్కిపడి చూసింది. భాస్కరం కన్నీళ్ళొక్కటే తక్కువ పద్మావతి మొహంలో!
    "నీకు....... నీకు...... క్లాసులేదూ?" భాస్కరం సంకోచంగా అడిగాడు.
    "ఉంది" లేచి పైట సరిగ్గా వేసుకుని నోట్ పుస్తకం తీసుకుని అతనికి తన మొహం చూడగల అవకాశం ఇవ్వకుండా అటు తిరిగి వెళ్ళిపోసాగింది.
    భాస్కరం నలుగురి మధ్యా- అందులోనూ లైబ్రరీలో "నిశ్శబ్దము" అనే ఇంగీషర్ధం బొద్దులను చూస్తూ - ఆ పిల్లను పిలవడం గని అనుసరించడంగానీ చేయలేక పోయాడు.
    కాని నాలుగు క్షణాల తేడాలో ఇవతలకు వచ్చి ఆమె ఎటు వెళ్ళిందాని నలు దిక్కులా కలియజూశాడు. కాని పద్మావతి జాడ అగుపించలేదు.
    క్లాక్ టవర్ చూశాడు - ఒంటి గంటా ఇరవై నిమిషాలు!
    "క్లాసు? ఇప్పుడా? నాన్ సెన్స్" అనుకున్నాడు. పద్మావతికి ఇంకా 'కోపం తగ్గలేదు అనుకున్నాడు.'
    'షష్టి పూర్తి హాలు'కేసి ఆశగా చూశాడు శైలజ వస్తోంది అటునించి. కాని భాస్కరం ఎటో చూస్తున్నట్లు ఆ పిల్లను తప్పించుకు వెళ్ళిపోయాడు-
    భాస్కరానికి మధ్యాహ్నం ప్రాక్టికల్ క్లాసుంది!
    పద్మావతి కోసరం వెళితే మధ్యాహ్నం "క్లాసు" వదులుకోవాలి. అదీగాక పద్మావతి యూనివర్శిటీ ఆవరణలో ఉందో? ఇంటికే వెళ్ళిపోయిందో.....
    ఎండ తీక్షణంగా కాస్తోంది.
    అలాగే పదినిమిషాలు ఎటూ నిర్ణయించుకో లేక నిలబడిపోయాడు.
    "సరే! క్లాసుకి వెళ్తాను........సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్తాను" అనుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు, కాలేజీకేసి గబగబా నడిచాడు.
    ఆ మద్యాహ్నం అతని ప్రయోగం పూర్తిగా దారి తప్పింది. ఏసిడ్ ఫ్యాంటుమీద పోసుకున్నాడు. "టెస్టు ట్యూబ్ లు " వరసగా పగలగొట్టుకున్నాడు. ఆ సాయంకాలం కూడా నేరుగా "రూమ్ కి" వెళ్ళి పక్కనే ఉన్న సోమసుందరాన్ని పిలిచి నీకు నచ్చిన సినిమాకి తీసికెళ్ళమన్నాడు.
    సోమసుందరం సంతోషంగా 'నీ మనీపర్సా? నా మనీపర్సా? ఏది తేవాలి?" అన్నాడు.
    "నాదే" -భాస్కరం మొహంకూడా 'రుద్దుకో' లేదు. బయలుదేరాడు.
    "వో. కే. దెన్ యిట్స్ యువర్ పార్టీ లీడ్" అన్నాడు సోమ సుందరం.
    "వోయ్! సోమ్స్....... తిన్నగా పద...... నీ ఇష్టమైన సిన్మాకి పద. నా పార్టీయే ఐనా నీదీ ఇష్టం." విసుక్కున్నాడు భాస్కరం.
    పద్మావతి ఇంటికి వెళ్దామనుకున్న భాస్కరం ఆ విధంగా ఓ "మర్కట మల్లయుద్ధం" లాంటి సినీమాకి వెళ్ళాడు.
        
                                 *    *    *

    ఐతే భాస్కరం కన్నా సున్నితమో అభిమానమో ఎక్కువగా గల సురేఖ మాత్రం కాలేజీ నించి ఆఖరి "గంట" కాగానే "అప్ రాండ్స్" కేసి నడిచి వెళ్ళింది. పద్మావతి ఇంటిని సుళువుగానే గుర్తు పట్టింది.
    అధివరకు ఒకసారి చూసి ఉన్నందున జయమ్మ గారు సురేఖను "అనుకోకుండా వచ్చావమ్మాయ్! రా! రా!" అంటూ ఆహ్వానించింది.
    "పద్మావతి నోట్సు ఇస్తానందండీ" అంటూ ఆమెకు నమస్కరంగా చేతులు జోడిస్తూనే అన్నది సురేఖ.
జయమ్మగారు 'పద్మా'ని పద్మావతిని కేకవేసి ఈ ఇద్దరికీ కాఫీ కలిపి ఇద్దామని వంటగదిలోకి వెళ్ళింది.    
    "కూచో" మన్నది పద్మావతి సురేఖను తెచ్చి కోలునవ్వుతో ఆహ్వానించింది.
    "నీకు ఒంట్లో బాగోలేదా?" సురేఖ మంచం అంచున కూచుంటూ అడిగింది.
    జయమ్మగారు కాఫీలు కప్పులో పోసి "అమ్మాయ్!" అని కేకేసింది. గది వంటగది అన్నీ ఒక చోటే గనుక, ఆమె ఇటుతిరిగి చూసి, మంచం అంచున అంటీ అంటనట్లు కూచున్న సురేఖను చూసింది.
    "అమ్మాయ్! చాపవేసి కూచో పెట్టుకోరుటే" అన్నది కూతురికి మర్యాద ఎలా చెయ్యాలో తెలియనందుకు నొచ్సుకుని.
    "ఫర్వాలేదండీ? అది కూడా కాస్త ముస్తాబవుతే మేం బీచ్ కి వెళ్తాము" సురేఖ నవ్వుతూ అన్నది.
    పద్మావతి ఆశ్చర్యపోయింది. వస్తావా? రావా? అని కూడా తననడగకుండా సురేఖ హుకుమ్ వేసి నట్లు అనడంతో "నాకు తలనొప్పిగా ఉందే" అన్నది. మెల్లిగా.
    "సరిలే నాకూ ఉందిలే లేపద" సురేఖ లేచి స్వయంగా జయమ్మగారు తెచ్చిన కాఫీ అందుకుని.
    "ఎందుకండీ ఇంతశ్రమ..... మేం మీకు పెట్టి ఇవ్వడం పోయి మీరేమాకు ఇవ్వడం" అన్నది.
    "అమ్మాయ్! మీరు ఈ పనులన్నీ చేస్తే డిగ్రీ లెలావస్తాయి? ..... అదీగాక ఈ పనులు అవసరమైనప్పుడు మీరు చేస్తారు...... అదీ ఆడజన్మలోనే ఉన్నది" అన్నదామె.
    పద్మావతి ప్రత్యేకించి ముస్తాబవలేదు. సురేఖ వెనకనే యాంత్రికంగా బయలుదేరింది.
    "సురేఖను కూడా భోజనానికి తీసుకురావే అమ్మాయ్! మీరెల్లాగూ "టౌన్"లోకి పోరుగా" జయమ్మగారు కేకేసింది.

                                       39

    సాయంకాలం సంధ్య కాంతులు కరిగి మెల్లి మెల్లిగా చీకట్లు వాలుతున్నాయి. స్నేహితురాండ్రిద్దరు ఒకరి నిశ్శబ్ధాన్ని ఇంకొకరు భంగం చేయటం ఇష్టం లేనట్లు తాపీగా నడుస్తూ "పామ్ బీచ్" కి చేరుకున్నారు.
    సందడిలేదు. సదుపాయం లేదు. సంద్రం హోరున గోలచేస్తున్నది అక్కడా అక్కడా కొందారు "దొరలు దొరసానులు!"
    కొంచెం మంది యూనివర్శిటీ క్వార్టర్స్ లోని కుటుంబాలు తప్ప నగరంలోని బీచ్ కి దీనికీ చాలా తేడా ఉన్నది.
    "ఇవాళ క్లాసులన్నీ జరిగాయా?" ఇద్దరూ కాస్త రోడ్డూ సందడి అగుపించే చోట కూచున్నాకా అడిగింది పద్మావతి.
    "నువ్వు మధ్యాహ్నం రాకపోవడం బాగులేదు. పోనీ అంత అత్యవసరమూ తప్పనిసరీ ఆవితే..."
    సురేఖ మాటలను మధ్యలోనే అందుకొని "అసలు ఇప్పుడీ వూరు ఎందుకొచ్చారా? అని ఏడుస్తున్నాను" అన్నది పద్మావతి అక్కసుగా.
    "నీకు నిజంగా 'ఎమ్మే' అవ్వాలని లేదా?"
    "మా అమ్మకి నేను బియ్యీడీ అవ్వాలనీ ఉంది. అది నీకు తెలుసు." పద్మావతి సురేఖను తలఎత్తి చూసి మళ్ళీ మొహం అటు తిప్పుకుంది.
    "ఎమ్మే చదివినా నీకు వెంటనే ఏ అమ్మాయిల కాలేజీఐనా కళ్ళకద్దుకుని ఉద్యోగం ఇస్తారుగా....." సురేఖకు ఏం మాట్లాడాలో తెలియడంలేదు.
    "ఏమో మరి నాకు మాత్రం బుద్ధమతంలో చేరాలనుంది." అంది పద్మావతి.
    "ఎందుకని?"
    "మనశ్శాంతి కోసరం."
    "అది బుద్దుడికి చిక్కిందా? పిచ్సిదానిలా ఉన్నావు? బుద్ధ భగవనుడు ఏ మూడు రకాల శోకాలను చూసి అడవుల్లోకి పారిపోయి తపస్సు చేశాడో ఆ మూడు శోకాలూ ఇప్పుడూ ఉనని అప్పుడూ ఉన్నాయ్! అతను మరణిస్తే అతణ్ణి నాలుగువందలమార్లు కాబోలు పుట్టించారు అతని శిష్యకోటి...."
    "నీకు బుద్దుడంటే అంత కోపమెందుకూ?" పద్మావతికి మరో విధంగా సురేఖ మీద కోపం ప్రదర్శించగల అవకాశం దొరికింది.
    "నాకా? బుద్దుడి మీద ఇంత పిసరు కోపంలేదు కాని..... బుద్ధ భగవానుడు నీ మనశ్శాంతికి ఎలా ఉపకరిస్తాడో నన్నదే నా జిజ్ఞాస" నవ్వింది సురేఖ ఇసుకలో వ్రేళ్ళతో బుద్దుడు.....అని వ్రేలితో రాస్తూ.....
    "మరేం చేసేది? నువ్వు అదృష్టవంతురాలివి గనుక బుద్ధుడు.. వెంగళప్ప అంటావు?" అన్నది పద్మావతి.
    "అదిపోనీగాని- నువ్వు మీ అమ్మగారికోసమేనా చదువుకొని తీరాలిగా-అమ్మకన్నా బుద్దుడు గొప్పవాడా?" సురేఖ అడిగింది. పద్మావతి పొడిగా నవ్వింది. "థాంక్స్" అన్నది.
    "చూడు పద్మావతీ, నీకు ఒక అమ్మే కాని నాకు మా దొడ్డమ్మ ఒక అమ్మ ప్లస్ కనుక్కున్నా అమ్మా నాన్నా ఈజీక్వల్టు మొత్తం ముగ్గురున్నారు" సురేఖ సరదా తెచ్చుకుని చెప్పింది "వీళ్ళల్లో ఏ ఒక్కరి మాట కాదన్నా పెంచి ఇంత పెద్దదాన్ని చేస్తే ఇవాళ విశ్వాస ఘాతకీ నయ్యానంటారు తెలుసా? నన్నేమఠంలో చేరమంటావు?"
    "పోనీ వాళ్ళ ఇష్టప్రకారమే నడుచుకో రాదూ?"
    "అబ్బ! ఎంత సింపుల్ గా టూకీగా ఉందీ నీ ప్రశ్న! కానీ ఆ ప్రశ్న నువ్వే నీకు వేసుకుంటే ఎంత క్లిష్టంగా ఉంటుందో ఆలోచించు!"
    "నన్నేం చెయ్యమంటావు? నువ్వు నాకు స్నేహితురాలివిగాకపోయినా బాగుణ్ణు" మొహం అటు తిప్పేసుకుంది పద్మావతి.
    "ఏం లేదు - నీకు నేస్తాన్ని అయ్యాను గనుక ఆ అపరాధానికి మింజుమలే ఒక కోర్కె ! ఈ చదువును నిర్పూచీగా, బేఫికర్ గా చదవుకోమంటాను" సురేఖ స్నేహితురాలి దగ్గరగా జరిగి బుగ్గమీద చిటికె వేసింది.
    ఒళ్ళు మండిపోయింది పద్మావతికి.
    "ఇంతకీ భాస్కరంగారు ఏమంటాడు?" అన్నది గభిక్కున ఏదో స్ఫురించినట్లు-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS