ఏదో వేళప్పుడు వచ్చి ఇంత తిని పోతుండడమే అతనికి ఇంటితో ఉన్న అనుబంధంగా అనిపించింది. ఒక్కోరోజు చీకటితో పోయి, రాత్రికి తిరిగి వచ్చేవాడు. సాంబశివం పోయినప్పటి నుండి సుందరమ్మ తత్వమే మారిపోయింది. ఇంట్లో ఎవరు ఉన్నది, ఏమి తిన్నది పట్టించుకొనేది కాదు. తమ్ముడు భోజనానికి రాలేదని తెలిసి కూడా సూర్యారావు ముభావంగా ఊరుకొనేవాడు. "ఏమయ్యా, ప్రకాశం! ఇంటికి భోజనాని కైనా రావడం మానేసేవు. వదిన చేతి తిండి విసుగు పుట్టిందా?" అని నవ్వుతూ ప్రశ్నించేది కనకం.
ఆ నవ్వు వెనక దాగిన బాధను ఒక్క ప్రకాశమే అర్ధం చేసుకో గలడు. ఇంకొక రోజు అలాగే మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రా వీలు కాలేదు ప్రకాశానికి. రెండు గంటలు దాటిన తరవాత తలనొప్పిగా ఉంటె, కొట్లో అప్పన్న ను పెట్టి తను ఇంటికి వెళ్లిపోయేడు. ఇంటికి వచ్చేసరికి కనకం నట్టింట్లో కొంగు పరుచుకొని నిద్రపోతున్నది. రెండు కంచాలు, పీటలు ఓ పక్కగా పెట్టి ఉన్నాయి.
"అదేమిటి వదినా! మీరింకా భోజనం చెయ్యలేదా? ఈ వేళ దాకా నాకోసం కనిపెట్టుకొని కూర్చోడం ఏం బాగుంది?' అన్నాడు.
"అది కాదోయి. మీ అన్నయ్య భోజనం చేసి ఆఫీసు కెళ్ళేక ఇంట్లో ఈ పనీ ఆ పనీ చేస్తుంటే ఆలస్యం అయింది. ఇంక నువ్వు వచ్చే వేళయింది . ఇద్దరం కలిసి తినచ్చని ఇలా నడ్డి వాల్చేను. బాగా నిద్రపట్టేసింది " అన్నది.
నిజానికి ప్రకాశానికి అప్పుడు భోజనం చెయ్యాలని లేదు. పదకొండు గంటలప్పుడు ఏ కొద్ది గానో ఎంగిలి పడ్డాడు. కాని తనకోసం వదిన గారు అంత వరకు కనిపెట్టుకొని కూర్చున్నాక, "తినను" అనలేక పోయాడు. బలవంతంగా ఇంత తిని లేచేడు "వదినా, మీరిలా నాకోసం చూస్తూ కూర్చోడం ఏం బాగు లేదు. వీలయితే వేళకి వస్తాను. లేకపోతె ఓ గిన్నెలో ఇంత అన్నం , కూర పడేసి ఉంచండి. వస్తే పెట్టుకు తింటాను. మీరు ఉత్తి మనిషి కూడా కాదు. పస్తుండిందికి " అన్నాడు.
"ఓ యబ్బ , అదన్న మాట! ఇంకా ఈ అభిమానం అంతా నామీదే అని మురిసిపోయాను నేను" అన్నది కనకం నవ్వుతూ.
"నేను నవ్వుతాలకి అనడం లేదు, వదినా!"
"నేనూ నవ్వుతాలకి చెప్పడం లేదు, ప్రకాశం , నువ్వు వేళకి ఇంటికొచ్చి ఇంత తిని పోకపోతే నాకు బాధగా ఉంటుంది. నీ కడుపు నాకు తెలిసినట్లు హోటలు వాడికి తెలుస్తుందా?" అన్నది.
ఆ మాటలోని అభిమానానికి తలవంచేడు ప్రకాశం. "అలాగే వదినా!' అన్నాడు.
ఆ వదినా మరదుల మధ్య అది ఒప్పండంగానే నిలిచింది. అటు తరువాత ప్రకాశం కోసం కనకం కనిపెట్టుకుని ఉండవలసిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
* * * *
ఆరోజు ఆదివారం . ఏదో అవసరమైన పని ఉన్నదని జానకి ఆఫీసుకు బయలుదేరింది. జానకితో పాటే తనూ పీట వాల్చుకొని కూర్చుని, "నాకూ భోజనం పెట్టె, వదినా" అన్నది శాంత.
"అక్కకి తొందర కానీ, నీకీ రోజు కాలేజీ లేదు కదా శాంతా! ఉండు. మీ అన్నయ్యతో తిందువు గాని. ఇంకా పులుసు లో ముక్కలైనా ఉడకలేదు. నీ కిష్టం కదా అని అనపకాయ ముక్కలు గిన్నె నిండా పోసేను" అన్నది కనకం.
"పులుసు లో ముక్కలు రాత్రికి తింటాను లే, వదినా! శారదా వాళ్ళింటికి వస్తానని చెప్పెను. చాలా రోజులై వెళ్ళలేదు. భోజనం చేసి వెళ్దామని."'
భోజనం పూర్తీ చేసి అక్కతో పాటే బయటికి నడిచింది శాంత.
"తొందరగా వచ్చేయి, శాంత! ఈరోజు నేను వచ్చేసరికి కొంచెం ఆలస్యం కావచ్చు. వదిన కి సాయంత్రం వంటలో కాస్త సాయం చెయ్యి" అన్నది జానకి.
"అలాగే" అంటూ వెనుదిరిగి తమ ఇంటి వైపు ఒకసారి చూసి, ముందుకు నడిచింది శాంత.
ఆరోజు ప్రకాశం వేళకు ఇంటికి రాలేక పోయేడు. పన్నెండువరకు చూసింది కనకం. మళ్ళా ఈ కుర్రాడు మొదటికి వచ్చేడు అని తనలో తనే విసుక్కుంటూ కంచం లో అన్నం పెట్టుకొంది.
"మరేం! ఆకలితో ఉండడులే . ఆ అప్పన్న వండుకుంటాడు కదా. వాడి దగ్గర తింటుంటాడుట. ఒకరిద్దరు చూసినవాళ్ళు చెప్పేరు" అన్నాడు సూర్యారావు.
"ఎక్కడో దగ్గర తింటే ఫరావాలేదు. తిరిగి పని చేసే మనిషాయే. వేళకి తిన్నగా తిండి లేకపోతె పీక్కుపోతాడు."
"మరేం! మీరంతా వాడికిలా కొమ్ము లియ్యబట్టే ఇలా తయారయేడు."
"ఇప్పుడేమయిందని?"
"ఏమనాలి? వెధవ కూళ్ళన్నీ తింటూ; ఆ అప్పన్న జాతేమిటి? కులమేమిటి? వాడి దగ్గర వీడు తినడమేమిటి?"
'ఆ మహా ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూస్తూన్నారండీ!ఈ బ్రాహ్మణ హోటళ్ళన్నిట్లో పిడికెడు, విభూది , పట్టెడు దంజ్యాలు వేసుకొన్న బ్రాహ్మలే వంట చేస్తున్నారంటారా? ఇంట్లో కూర్చునే నాలాటి ఆదావాళ్ళ కైతే ఏ పట్టింపులు పెట్టుకొన్నా చెల్లుతాయి కాని బయట తిరిగే మగాళ్ళు ఇవన్నీ చూస్తూ కూర్చుంటే ఎలా?"
"మరీ ఇంత చేటా? మాంసం తింటూన్నారని ఎముకలు మెళ్ళో వేసుకు తిరుగుతారా ఎవరైనా ? చాటుగా, మాటుగా ఎవరేం చేసినా అదోరకం. మరీ బాహాటంగా వాడి పక్కనే కూర్చుని , ఒకే గిన్నె లోంచి తీసుకొని వడ్డించుకు తినాలా?" అన్నాడు సూర్యారావు.
అతడికి తన మాట పూర్తవుతుండగానే అదివరలో ఇటువంటి ప్రస్తావనలో ప్రకాశం అన్న మాట జ్ఞాపకం వచ్చింది.
'అన్నయ్యా! నీ ఉద్దేశం లో చెడు అనుకొన్న పని చెయ్యడం లో తప్పు లేదన్న మాట. అది నలుగురికీ తెలుస్తేనే తప్పు. రహస్యంగా ఈరోజు నేనోకరి పీక నులిపి చంపినా, అది బయట పడే వరకు, పాపం చేసెనని నేను భయపడనక్కరలేదన్న మాటేనా? నలుగురికి తెలియకపోతే ఆ పాపం నన్ను అంటకుండా పోతుందా అన్నయ్యా!" అన్నాడు ప్రకాశం.
కనకం భోజనం పూర్తీ చేసి లేచింది.
సాయంకాలం నాలుగు గంటలకు నాలుగు వందల క్షమాపణలు చెప్పుకొంటూ వచ్చేడు ప్రకాశం.
"మాట నిలుపుకోడం అంటే ఇదేనా, అబ్బాయి?" అన్నది కనకం లేని కోపం నటిస్తూ.
"కారణాలు విన్నవించుకొన్నాను కదా, వదినా! మీకింకా కోపం పోకపోతే నేనేం చెయ్యను?" అన్నాడు ప్రకాశం అతి భయస్తుడిలా.
"సరిలే. ఈసారికి మన్నించెను. ఇంద, ఈ కాఫీ తీసుకో" అన్నది - అర్ధ సేరు పట్టే కంచు లోటాతో కాఫీ ప్రకాశం ముందు పెట్టి.
"ఇదంతా నాకే! మధ్యాహ్నం భోజనానికి రానందుకు ఇది శిక్షా?" అన్నాడు ప్రకాశం ఆశ్చర్యంగా.
'అది కదయ్యా, నాలుగయింది, శాంత కూడా వస్తుందేమోనని పెట్టెను. ఇంకా రాలేదు. చల్లారి పోతుంది. నువ్వు తాగేయి."
"ఆదివారం కదా? శాంత ఎక్కడికి వెళ్ళింది?"
"ఉదయాన్నే శారద ఇంటికి వెళ్ళింది. ఇంకా తిరిగి రాలేదు."
ప్రకాశం క్షణ కాలం వదినగారి వంక చూసేడు.
"మీకు సరిగా జ్ఞాపకం ఉందా, వదినా? శాంత శారదింటికే వెళ్తానన్నదా?"
"అదేమిటోయి! మరీ అంత ముసిలిదాన్నయి పోయానా-- ఉదయం సంగతి సాయంకాలానికే మరిచి పోడానికి."
'ఆహా! అదేం కాదు. వినడం లో పొరపాటేమో అని." ప్రకాశం అప్పుడే విప్పి చిలక కొయ్యకు తగిలించిన లాల్చీ మళ్ళా తొడుక్కున్నాడు.
"మళ్ళా ఎక్కడికి ప్రయాణం?"
"ఇప్పుడే వస్తాను, వదినా. చిన్న పని మరిచి పోయెను."
