Previous Page Next Page 
వంశాంకురం పేజి 30


    "అమ్మా! వాడి కన్నా దగ్గరి వారెవరూ మనకు లేరు. ఆ బంధుత్వము చెబితే కొన్ని అనర్ధాలు కలుగవచ్చు. క్షమించి, వాడిని నా హృదయ పూర్వకంగా స్వీకరించు." అని మరోమాట కెదురు చెప్పకుండా వెళ్ళిపోయాడు పైకి. అతను డ్రస్ వేసుకుని వచ్చేసరికి సన్నగా రంగారావు గారి మాటలు వినిపిస్తున్నాయి. అక్కడే ఆగిపోయాడు.
    "....నాకు అదే అనుమానంగా ఉంది. స్నేహితుని కొడుకేమిటి, అచ్చు వీడి పోలికలు పుణికి పుచ్చు కోవటము యేమిటి? అతని భార్యతో........"
    "లేదండి. మనవాడు అంత తెగింపు గల వాడు కాదు." ఆనంద్ కు తల్లి నమ్మకము చూస్తె హృదయము గిలగిల లాడింది. నిజాము చెప్పేయాలని ముందుకు వచ్చాడు. అతని గొంతు పెగలలేదు. ఖిన్న వదనముతో అరుణ అతని ముందు నిలచినట్లు ఫీలయ్యాడు. వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. వారము రోజులు నిశ్చింతగా గడిచిపోయాయి. సరస్వతమ్మ ముభావంగా ఉండ బోయినా నందు ఉండనివ్వడు. ఆమె ముద్దివ్వందే బడికి వెళ్ళడు. ఆమె పూజకు కూర్చోగానే పూలు పట్టు కెళ్లి యిస్తాడు. "సత్తీ" అంటూ పిలిచి ఏదో పని చెబితే పోటీపడి చేస్తాడు. "థాంక్యూ "చెప్పేవరకూ వదలడు.
    "చూపు నాదయినా గుణమంతా రేఖదే" అని ఎన్నోసార్లు అనుకున్నాడు ఆనంద్. ఆరోజు ఆనంద్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కూడా నందును తీసుకెళ్ళాడు బడిలో వదలడానికి. అతని కారు గేటులోంచి వెళ్తుండగానే ప్లీడరు వెంకటరత్నం గారి కారు వచ్చింది. వస్తూనే ఓ విసురు విసిరాడు." మనుమడితో తీరిక లేకుండా పోయిందా మనుభావా. మా ఇంటి వైపు రావటమే మానవు."
    "ఏదో! రా' ఆహ్వానించాడు. అతనొచ్చి కూర్చున్నాడు.
    "మొన్నవరో చెబితే నమ్మలేదు. ఎవరో అనాధను పెంచుతుంది నిజమేనన్నమాట."
    "ఏదో సరదా. ఇదివరకు పెంచలేదూ? అందరూ ఉన్నారేమిటి?"
    "అది వేరు. ఇప్పుడు వేరు. ఆనంద్ ఉదయమూ, సాయంత్రము కాన్వెంట్ ముందు కనిపిస్తున్నాడట త్వరలో ఓ నిర్ణయానికి వస్తే మంచిదే. నా బాధ అల్లా ఒకటే. పేరు, ఊరు తెలియని అనాదుడిని పెంచుతున్నారు అని ."
    "అదే నయము కదా, మనకు ఆంక్షలు పెట్టి, అధికారము సాగించే వారుండరు."
    "పిచ్చి వాడివోయ్. ఏదో మోటు సామెత చెబుతారు. ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, దొంతులన్నీ విరగదోసిందని " అడిగేవారురుండరని అనాధుడిని పెంచుతారా? వాడు దొంగ కొడుకో, ఖూనీ కోరు కొడుకో నీకెలా తెలుస్తుంది? నా స్నేహితుడోకడు ఇలాగే పెంచుకుని సర్వనాశనమయ్యాడు. వాడు వట్టి రౌడీగా తయారయ్యాడు. డబ్బు , దస్కం అన్నీ పోగా, దొంగ తనాలు చేస్తూ, పెంచిన తండ్రి ని కూడా బజారు పాలు చేశాడు."
    "నేను మొదటి నుండి అదే మాటంటున్నాను అన్నయ్యగారూ. ఈయన వాదము ఈయనది. తోడూ అబ్బాయి." సరస్వతమ్మ చెప్పింది.
    "మీ మేలు కోరి చెబుతున్నాడు. వాడిని వద్దని ఇవ్వడానికి నాకు పిల్లలు యెక్కువ లేరు, ప్రతి పనికి ముందు చూపు ఉండాలి."
    "అదే నా బాధ. అబ్బాయి కేమో. ఆ కుర్రవాడంటే పంచ ప్రాణమూ."
    "అబ్బాయి యువకుడు. ఈ పెంచు కోవడాలు గట్రా తెలిసే వయసా? ఏదో భగవంతుడు చిన్న చూపు చూచి పెంచుకునే మాట వచ్చింది. అతని మంచి చెడ్డలు మీరు ఆలోచించాలి."
    'వింటున్నారా?" సరస్వతమ్మ భర్త వంక చూచింది.
    "వింటున్నాను. వేంకటరత్నము అన్నట్టు అన్నీ ఆలోచించాలి. కాని బంధువుల పిల్లల్ని తెచ్చి చూచాము కదయ్యా."
    'అంత చిత్రంగా మాట్లాడుతావేమయ్యా రంగయ్యా! ప్రపంచము లో యెందరు దత్త పుత్రులను చేసుకోలేదు. మా నాన్న మా పెద్దమ్మకు పెంపుడు కొడుకు కాదూ? కాస్త ఆలోచించాలి. మా దూరపు బంధవులతనున్నాడు. ఆర్గురు పిల్లలు బ్రతికి చెడ్డ వాడు. వారిని పోషించలేక అవస్త పడుతున్నాడు. సంప్రదాయము గల  కుటుంబము. పక్కా ఆరువేల నియోగులు. ఒక పిల్లాడిని తెచ్చి, ఓ సంవత్సరము పాటుంచుకొండి, నచ్చితే దత్తత చేసుకుందురు గాని."
    "మా బంధువులెందరో ఉన్నారులే. ఆలోచించాలి." అన్నాడు రంగారావు.
    "ఆలోచించు. అబ్బాయి అంతగా పట్టుబడితే అనాధ కుర్రాడికి ఏదో ఏర్పాటు చెయ్యి."
    "అంతే అన్నయ్య గారూ. మొదటి నుండి నేను అలాగే అనుకుంటున్నాను." అన్నది సరస్వతమ్మ. ఆమాటా, ఈమాటా మాట్లాడి వెళ్ళిపోయాడు ప్లీడరు గారు. అరుణ మాత్రం వేదాంతి లా నవ్వుకుంది.
    సాయంత్రము కొడుకుతో తమ అభిప్రాయము చెప్పారు దంపతులు. ఆనంద్ తెల్లబోయాడు. వారి కెన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. యెన్నడూ లేనిది, మాటామాటా అనుకున్నారు. ఆనంద్ ఆనాడు సహనము కోల్పోయాడు.
    "ఎప్పుడూ మీ మాటే సాగాలి. మీ ప్రేమలో ఇంత నిరంకుశత్వమున్నదని తెలియదు. ఇంకా నేను పసివాడినా? నాకు మంచి చెడు తెలుస్తాయి. ఆ విషయము మీ రెందు కాలోచించరు. మీ అధికారముతోనే నా జీవితమూ అంధకారము చేశారు....' అరుణ ఇక వినదలుచుకోలేదు. ముఖానికి చేతులు పెట్టుకుని వడిగా పెరడు లోకి వెళ్ళిపోయింది.
    'అప్పుడు ఊర్కున్నాను. బాబు విషయములో మీరు జోక్యము కల్గించుకుంటే నేను ఇల్లు వదిలి వెళ్తాను. వాడిని వదలను...."
    "బాబూ....ఆనంద్ .' బాధగా అరించింది తల్లి.
    "నీ మమత లాంటిదే నాది. మీ అభిప్రాయము రేపు తెలుపండి. వాడిని తీసుకుని దూరముగా వెళ్ళిపోతాను.' త్వరగా బయటికి వచ్చి కారు తీసుకుని వెళ్ళిపోయాడు.
    "నానమ్మా! నాన్నకు కోపము వచ్చిందా?" నందు ముద్దుగా అడిగాడు.
    "నీ వాళ్ళ ప్రళయమే వచ్చేటట్టుందీరా ముదనష్టపు పిల్లాడా?" దూరంగా తోసింది. ఆ నిరాదరణకు తట్టుకోలేక ఆరున్నొక్క రాగము తీశాడు వాడు.
    "ఎందుకే సరస్వతి వాడి మీద కోపము! వాడికేం తెలుసు? ఏ జన్మ కర్మ ఫలితమో అనుభవించాలి. ఇలారా నండూ." అతను పిలిచాడు.
    "నేను రాను...." వాడు సన్నగా రాగము తీస్తూ ఓ మూల కూర్చున్నాడు.
    "అది కాదండి. ఎన్నడయినా వాడు మన మాట కాదన్నడా? ఈ అప్రాత్యపు పిల్లవాడి మూలంగా ఎన్ని మాటలన్నాడో చూడండి. మన ప్రేమ నిరంకుశత్వంతో నిండి ఉందట. వాడిష్టమొచ్చినట్టు ఖర్చు పెట్ట నియ్యటము నిరంకుశత్వమా?" సరస్వతమ్మ కన్నీరు కారుస్తూ అడిగింది.
    "వాడి మనసు బావుండలేదు. ఏదో అన్నాడులే. వాడికిష్టమున్నట్టే కానివ్వు."
    "మీరెంత తేలికగా తీసి వేస్తున్నారు. వాడి జీవితమూ మనమా అంధకారము చేసింది?"
    "ఆవేశము లో అనే మాటలకు అర్ధాలు తీస్తే యేలాగే. విధి చేసింది. నందుకు మనవాడి కేదో తెలుపరాని బంధము ఉంది. అది వాడు బయట పెట్టలేక పోతున్నాడు. నెమ్మదిగా వాడే చెబుతాడు. వెళ్లి అమ్మాయి ఏం చేస్తుందో చూడు." ఆమె కళ్ళు వత్తుకుంటూ ఇంటి వెనుక వైపు కు వెళ్ళింది. రెండు కాళ్ళ మధ్య తల ఉంచుకుని కూర్చుంది అరుణ.
    "అరుణా." ప్రేమగా పిలిచింది.
    "అత్తయ్యా," ఆమె వెనక్కు తిరిగి ఆమె కాళ్ళకు వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
    "వారిని ఒప్పించి తిరిగి వివాహము చెయ్యండి. మీరంతా అనుభవించే మూగ వేదనను భరించలేను." అన్నది వెక్కి పడుతూ.
    "ఏమిటా పిచ్చి మాటలు . లే." చేయూత నిచ్చి లేపి ఇంట్లోకి తెచ్చింది. అందరూ భారంగా తిరుగాసాగేరు. అలసి నేలపై నిడురపోయిన నందును చూస్తె  అరుణ హృదయము బాధగా మూల్గింది. తన వల్ల అన్ని సుఖాలకు దూరమైనా భర్త, నందు ఉనికి వల్ల పొందే శాంతి సుఖాలు తను కరువు చెయ్యటము భావ్యము కాదనిపించింది. నెమ్మదిగా వాడిని లేపి, కూర్చుండ పెట్టి అన్నము తినిపించి నిదుర పుచ్చింది. ఆనంద్ వచ్చాక అందరూ యెంగిలి పడి లేచారు. మరో వారము రోజులు గడిచాయి. అరుణ తల్లి తండ్రులు దిగారు. వారు కూతురి క్షేమము కోసం వచ్చామని చెప్పినా, నందును గూర్చి తెలుసుకోవటానికే వచ్చారని తెలిసిపోయింది. బయటి నుండి ఇంట్లోకి వచ్చే ఆనంద్ అక్కడే ఆగిపోయాడు.
    "అబ్బాయి అంటే చిన్నవాడు. అతనెవరో అనాధను తెస్తే మీరెలా స్వీకరిస్తున్నారు బావగారూ?' అరుణ తండ్రి అడుగుతున్నాడు.
    "అప్పుడే దత్తత అయిందా? ఏదో సరదా కొద్ది తెచ్చాడు."
    "మీరలా తేల్చి వేయటం ఏం బావుండలేదు కుర్రవాడు అమ్మా, నాన్నా అంటూ అధికారము సాగిస్తున్నాడప్పుడే. మీకంతగా పిల్లలు కావల్సిస్తే ఇచ్చేవారేలేరా? మా వనజ పిల్లలున్నారు. వారు తెలివి వచ్చిన వారనుకుంటే వాసు భార్య కడుపుతో ఉంది. ప్రసవించగానే అరుణ వడిలో వేయిస్తాను. అనామకుడినేవడినో తెచ్చి పెంచటమేమిటి?' అరుణ తల్లి అంటుంది.
    "అడ్డాలనాడే బిడ్డలమ్మా. మేం చెప్పేది చెప్పాము. తరువాత వాడి రాత." నిష్టూరంగా తేల్చింది సరస్వతమ్మ.
    "అదేం మాట వదిన గారూ. ఇది నీ యిల్లు . నీ బిడ్డడు. మా అమ్మాయికి తెలివి లేదు, అంటే అతన్నో దారిలో పెట్టేది."
    'అవునండి. ఇప్పుడున్న ఈ మాత్రము సుఖ శాంతులు కూడా. మీ అమ్మాయి తెలివితేటలు చూసి, కరువు చేస్తే మీకు సంతోషమా? నేను మీకేం అపకారము చేశాను? నాకు ఇదివరకు చేసిన అన్యాయానికి తల వంచి , నిందించక పోవటమే పొరపాటా?' ఆనంద్ ముందుకు వచ్చి అడిగాడు.
    "అంతంత మాటలెందుకు బాబూ? ఒకరి కర్మకు ఒకరు కర్తలా? నీవంటే మాకు పగా? అలా అయితే మా సంపాదన లో ఎక్కువ భాగము అరుణ కే ఎందుకు ఇస్తాము మేలుగోరి చెబుతున్నాము, కుల గోత్రాలు లేని దరిద్రుడెందుకు....' కాంతారావు మాటలని మధ్యలోనే త్రుంచాడు ఆనంద్.'
    "అవును నా కర్మకు నేను కర్తనే. మీరు లక్ష రూపాయల కట్న మిచ్చామన్న ఆధిక్యత మాకేం చూపవద్దు. ఆ డబ్బుని, మీ అమ్మాయిని తీసుకు వెళ్ళండి. అమ్మా, నాన్నగారి సంపాదన కూడా నాకు చిల్లి పెంకు వద్దు. వారు కులగోత్రాలు సంప్రదాయాలు గల బంధువులకు దానము చేసుకోవచ్చు. నాకు నందు చాలు."
    "ఆనంద్ .....' కోపంగా అరిచాడు రంగారావు.
    "నాన్నగారు జడిసినన్ని రోజులు జడిశాను. పెద్ద పొరపాటు చేశాను. అది మీ అధికారము లోని బంధవేనో , నా పిరికితనమో , నా నిర్ణయము చెప్పాను. వాడికి స్థానము లేనింట నాకు స్థానముండదు' అనేసి చర చరా బయటికి వెళ్ళిపోయాడు.
    రంగారావు దంపతులు ముఖము నల్లబడింది. తమ ప్రాణంగా పెంచిన కుమారుడు అజ్ఞానువర్తియని అందరితో గర్వంగా చెప్పుకునేవారు. అలాంటి కొడుకు, మంచి చెడు మరిచి వియ్యాల వారి ముందు అవమాన పరచటమా? స్త్రీ కాబట్టి సరస్వతమ్మ కంట నీరు పెట్టుకుంది. రంగారావు గారు కుమిలిపోతూ , కుర్చీలో వెనక్కు జారపదినాడు.    
    "అమ్మాయ్? అతని బెదిరింపేమిటో చూద్దాము. నువ్వు ప్రయాణముకా" కాంతారావు కూతురి వంక చూచాడు.
    "బావుంది నాన్నా. సంసారమన్నాక చిన్న చిన్న కలహాలు, భేదాభిప్రాయాలు రావా? ఇల్లు విడిచి వెళ్తామా?"
    "అరుణా! నిందలు, ఈసడింపులు భరించటానికేం నువ్వు దరిద్రులురాలివి కావు."
    "అమ్మా! నిజంగా నేను దరిద్రురాలినే. డబ్బొక్కటే సుఖాన్ని యివ్వదు." అరుణకు కన్నీరు ఆగలేదు.
    "నువ్వింతగా బేలగా ఉంటావనే అతనంతగా రెచ్చిపోతాడు."
    "అమ్మా. వారన్నదాంట్లో తప్పేం ఉంది. నన్ను కన్నారు. పెద్ద చేశారు. విద్యాబుద్దులు చెప్పించారు. నాలోని అవలక్షణాన్ని కట్టిపెట్టి పెళ్ళి చేశారు. మీ బాధ్యత తీరిపోయింది. ఇంకా ఆయనను శాసించడము దేనికి?"
    "అయితే ఆ అనాధుడంటే నీకిష్టమేనన్న మాట?' తీవ్రంగా అడిగాడు కాంతారావు.
    "నా ఇష్టమన్న ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను ఆలోచించేదల్లా వారి సుఖము."
    "నిన్ను నీవెందుకు చులకన చేసుకుంటావు. నీ దురదృష్టము కొద్ది నీ అనారోగ్యము బయట పడింది. మంచిగా ఉన్న వారెంత మంది సంతాన హీనులు లేరు."
    "అది వేరు సంగతి. మీరీ విషయములో జోక్యము కల్గించు కోవద్దు." అన్నది. ఆవేశములో అత్తమామల నోరు మూయించటానికే అన్నారు గాని ఆనంద్ కు తన పట్ల నిరాదరణ లేదని ఆమెకు బాగా తెలుసు. అయితే ఆమె బాగా తెలుసు. అయితే ఆమె తల్లి తండ్రులను అన్న మాట, అత్తమామలకు సూటిగా తగులుతుందని తెలుసుకోలేదు. ఈ కోల్డ్ వార్ కు కారకులైన నందు ఆటలు చాలించి వచ్చాడు.
    "మమ్మీ! నా కాళ్ళ నిండా దుమ్ము, దులుపు అంటూ అరుణ ముందుకు వచ్చాడు. ఆమె చిన్నతుండు తీసుకుని వాడి కాళ్ళు శుభ్రంగా తుడిచింది.
    "థాంక్యూ మమ్మీ!" కూర్చున్న ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నాడు.
    "పిచ్చి వేషాలు వేస్తె నాల్గు అంటిస్తాను." సున్నితంగా వాడి బుగ్గలు గిల్లింది. కాంతారావు భార్యా ఆ దృశ్యము చూడలేక పోయారు.
    రెండవరోజు అసంతృప్తిగా వెళ్ళిపోయారు వారు. పనుల మూలంగా చాలా రాత్రి కిల్లు చేరాడు ఆనంద్. అందోరో నిదురబోతున్నా, అరుణ మేల్కొని ఉంది.
    "నందు నిదుర పోయాడా?"
    "ఆ, నాన్నగారు రాలేదని పది సార్లు గేటు వంకకు చూదాడు. వాడి తెలివి తేటలు చూస్తుంటే సంబరంగా ఉంటుంది." అతను భార్య చెప్పేది వింటూనే గదిలోకి నడిచాడు. ఒక మంచం పై సరస్వతమ్మ నిదురబోతుంది. రెండో మంచం పై నందు హాయిగా నిశ్చింతగా నిదురబోతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS