Previous Page Next Page 
వంశాంకురం పేజి 29


    "తరువాత మాట్లాడుదువు ముందర అన్నం తిను." మృదువుగా కసురుకుంది అరుణ.
    'ఆనంద్ వచ్చినట్టున్నాడే." బయట నుంచే అడుగుతూ వచ్చాడు రంగారావు గారు. సరాసరి భోజనాల గదిలోకి వచ్చాడు.
    "అరె వీడెవడు? అచ్చు ఐదో యేట బడి కెళ్ళనని మారము చేసే ఆనంద్ లా వున్నాడు." సంబరంగా అడిగాడు.
    "నేనేం మారాము చెయ్యను. కావాలంటే అమ్మ....కాదు అయాని అడుగు .' వాడు బుంగ మూతి పెట్టాడు.
    'అరె పిడుగా!' రంగారావు గారి హృదయం ఏదో తెలియని ఆప్యాయత అంకురించిందా కుర్రవాడి పట్ల. ముందుకు వంగి వాడి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. వాడు యెంగిలి మూతి తోనే అయన బుగ్గలు తిరిగి ముద్దు పెట్టుకున్నాడు.    
    "ఒరేయ్ తాతా! నీ పేరేమిటన్నావు?"
    "నువ్వే నాకు తాతవు. నేను నాపేరు చెప్పలేదు."
    "అసాధ్యుడివిరా . పోనీ నీ పేరు చెప్పు
    "నా పేరు నందు...నంద కుమార్" కళ్ళు మిటకరిస్తూ చెప్పాడు.
    "ఎవరు ఆనంద్ ఈ కుర్రవాడు.?"
    "ఓయ్....తాతయ్యకేం తెలియదు" వాడు నవ్వును చూచి మురిసి పోయిందరుణ. తండ్రీ కొడుకులు ఇవతలికి వచ్చారు. ఆనంద్ హృదయము కుచించుకు పోయింది. స్వంత కుమారుడిని తన వాడని చెప్పుకునే ధైర్యము లేదు. నిజాము చెప్పటము వల్ల కలిగే అనర్దాలనే ఆలోచించాడు గాని, అసత్యము వల్ల సంభవించే అనర్ధాలను అపార్ధాలను అతను యోచించ లేకపోయాడు. తల్లికి చెప్పినట్టుగానే తండ్రితో చెప్పాడు.
    "మరి వాడి తల్లి లేదురా?"
    "లేదు....వాడిని సాకలేక ఎప్పుడో మరణించింది....మానసికంగా మరణించింది." అతని కంఠం వణికింది. అతని మాటలోని మరణమన్న మాటే వినిపించుకున్నాడు. మిగిలినవి అంతగా పట్టించు కోలేదు. సరస్వతమ్మ కూడా వచ్చింది.
    "వాడి పసిమనసు గాయపడుతుందని చిన్న అబద్దం అడానమ్మా. నేను అరుణా , వాడి నిజమైన తల్లి తండ్రులమని, దూరంగా వెడుతూ హాస్టల్లో వదిలామని చెప్పాను. మీరు అలాగే చెప్పాలి."
    "నాన్నా! నేను అన్నము తినేశాను" గెంతుతూ వచ్చి ఆనంద్ ను కౌగలించు కున్నాడు నందు. వెనుకాలే అరుణా కూడా వచ్చింది. రంగారావు వాడికి వచ్చిన రైమ్స్ , కధలు వింటున్నాడు.మధ్య మధ్య వాడు చేసే నటనకు అరుణ నవ్వుతుంది. సరస్వతమ్మ మాత్రమూ గంబీరంగా ఉండిపోయింది . అందరి భావాలు గమనిస్తూ కూర్చున్నాడు ఆనంద్. తొమ్మిది దాటాక వాడు నిదుర బోయాడు. ఆనంద్ వాడిని భుజాన వేసుకుని గదిలోకి వెళ్ళాడు. వెనకాలే అరుణ వెళ్ళింది.
    "ఆరూ! వీడు నా ప్రాణము. ప్రపంచము లో నాకేదైనా సంతోషముందంటే వీడి వల్లే. వాడిని ప్రాణంగా చూచుకుంటావు కదూ?" అతని కళ్ళు ఎందుకు చేమర్చాయో అర్ధం కాలేదు. అబ్బాయి నందుకుని తన మంచం మీద పడుకో బెట్టింది.
    "మాట్లాడవేం అరుణా! నీ కిష్టము లేదా? వాడు....వాడు మన కులదీపకుడు ఆరూ! ఆవేశంగా ఆమె భుజాలు పట్టి ఊపాడు.
    "నేనివ్వలేని సంతోషము వాడు మీకిస్తున్నాడంటే నాకెంతో తృప్తిగా ఉంది. వాడిని నా ప్రాణంగా చూచుకుంటాను. కాని మమకారాలు పెంచుకున్నాక ఇదివరకటి లా......"
    "లేదు. వాడి విషయములో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఎవరూ వాడిని గూర్చి నీతో పోట్లాడరు. అటువంటి సందర్భము వస్తే నావల్లే రావాలి."
    "మీకు కోపము కూడా వస్తుందేమిటి?" నవ్వుతూ భర్త వంక చూచింది. నందుకు దుప్పటి కప్పి వాడి ముంగురులు ప్రక్కకు త్రోసి నుదురు ముద్దు పెట్టుకుంది. సత్తిని గదిలో ఉంచి ఇరువురూ బయటకు వచ్చారు. భోజనాల వద్ద పురుషులే మాట్లాడుకున్నారు గాని స్త్రీలు గంబీరంగా ఉండి పోయారు. తరువాత యెవరి దారిన వారు పడకలు చేరినారు.
    యేనాడు ఏడు దాటాక పూర్వమే లేవని ఆనంద్ ఆరోజు అయిదు న్నరకే లేచాడు. అప్పటికే సరస్వతమ్మ లేచి పనిలో లీనమయింది. గదిలోకి అడుగు పెట్టి ఆనంద్ తెల్లబోయాడు. నందూ యెక్కడా కనిపించలేదు. అరుణ ఓ ప్రక్కకు తిరిగి నిశ్చింతగా నిదురపోతుంది. లేచి తల్లి వెనకాల వెళ్ళాడెమోనని బయటికి రాగానే , హాయిగా క్యాంప్ కాట్ లో నిదురబోతూ కనిపించాడు నందు కప్పిన బట్టలు దిండు యెప్పుడో క్రిందన పడిపోయాయి.
    'అరుణా!" పిలుపు కాదు గర్జింపు. అరుణ ఉలిక్కిపడి లేచింది.
    "ఏమిటండి?"
    "బాబెక్కడ?"
    "హల్లో పడుకున్నాడు." అపరాధిలా చెప్పి, తల వంచేసింది.
    "మీరు పైకి వెళ్ళగానే వాడిని వరండా లో తగలేస్తానని ఎందుకు చెప్పలేదు?"
    "మీరు కోపంలో ఉన్నారు. నేను ఏం చెప్పినా అపార్ధం చేసుకుంటారు?' మంచము దిగి హాల్లోకి వచ్చింది.
    "నాకోపమే తెలిసి వచ్చింది కాని, నా ప్రాణమని చెప్పిన బిడ్డడిని అలా గాలికి వదిలి వేయటము బావుందా?"
    "అతి ప్రేమాభిమానాలు కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తాయి. రాత్రి యెంత చెప్పినా వినకుండా అత్తయ్య పడుకో బెట్టారు. వాడు దొర్లుతూ కాళ్ళతో నెడతాడని...."
    "మీ గదిలో మంచము వేస్తె కూడా ప్రమాదమని చెప్పిందా అత్తయ్య."
    "నాకా ఆలోచన రాలేదు. క్షమించండి." నందు తల క్రింద దిండు పెట్టింది. వంటింటి గుమ్మము లో నిల్చుని వారి సంభాషణ అంతా విన్నది సరస్వతమ్మ . కాలకృత్యాలు తీర్చుకు వచ్చేసరికి కాఫీ తెచ్చింది అరుణ.
    'అరుణా! నందు చాలా చురుకైనవాడు. వాడెన్నో ప్రశ్నలు వేస్తాడు. జాగ్రత్తగా జవాబు చెప్పాలి. వాడికి తల్లి దండ్రులము మనమే నని చెప్పాను. దూర దేశం వెడుతూ అయన దగ్గర వదిలామని చెప్పాను." భార్యతో అతను చెబుతుండగానే పరుగున వచ్చాడు.
    "గుడ్ మార్నింగ్ మమ్మీ....అండ్ నాన్న గారు." అరుణను వాటేసుకున్నాడు. ఏదో తెలియని అనురాగ స్రవంతి ఆమె హృదయం లో ఉద్భవించింది.
    "మమ్మీ! నీకేం తెలియదు. మా హాస్టల్లో అంటి యేమో గుడ్ మార్నింగ్ అంటే కిస్ చేస్తుంది."
    "సారీ' నవ్వుతూ వాడు బుగ్గలు తడిమింది. ఆమె నుండి వదిలించుకుని వెళ్ళి ఆనంద్ కు బుగ్గ అందించాడు. అత్యంత ఆప్యాయంగా, వాడిని లేపి తన ఒడిలో కూర్చో బెట్టుకుని ముద్దిడుకున్నాడు.
    "మరి నేను బడికి వెళ్ళద్దా?"
    "ఈ పూట వెళ్ళి మంచి బడి చూచి వస్తాను. అమ్మను, నాన్నను విసిగించకేం?"
    "ఓ యస్. అత్తయ్య ను విసిగించవచ్చుగా!"
    'అల్లరి వాడా? మృదువుగా వాడి బుగ్గపై చిటికే వేసింది అరుణ. ముఖము కడిగి పాలు త్రాగుదువు గాని ." ఆమెచెయ్యి పట్టుకుని లేచాడు. వారిద్దరూ పోతుంటే సంబరంగా చూచాడతను.
    సాయంత్రము వాడి కోసమే కొన్న వస్తువులు చూచి అందరూ విస్మితులయ్యారు. వాడు సంతోషంగా సైకిల్ యెక్కి సవారి ప్రారంభించాడు. ఎవరికి అతన్ని విమర్శించే ధైర్యం లేకపోయింది. వెయ్యి రూపాయల దాకా ఖర్చు పెట్టాడు.చూస్తుండగానే వారము రోజులు గడిచి పోయాయి. నందును కాన్వెంట్ లో చేర్పించారు. అప్పుడు తీసుకోనని గొడవ చేసినా, ఆనంద్ పలుకుబడి చూచి ముగ్దురాలాయి పోయింది సిస్టర్. అరుణ పూర్తిగా వాడి సంరక్షణలో మునిగిపోయింది. రంగారావు గారి మనసులో ఏముందో గాని, పైకి పిల్లాడి పై ప్రేమ కనబరుస్తున్నాడు. అంటీ అంటనట్లు తిరిగే తల్లిని చూస్తె, ఆనంద్ కు బాధ వేసింది. ఆమె ముభావానికి కారణం కనిపెట్ట లేకపోయాడు.

 

                                   
    ఆమె యెన్నో సార్లు యెవరి పిల్లాలలైనా పెంచుకుందామన్నది. మరిప్పుడు కోపము దేనికి? తనకు చెప్పి పిలుచుకు రాలేదనా? అరుణా నందు పత్తి మొక్కలో కూర్చున్నారు. వాడేదో చెప్తుంటే వారు నవ్వుతున్నారు. అతను వారిని చూచి, తృప్తిగా వెనక్కు తిరిగి తల్లిదండ్రులున్న చోటికి వచ్చాడు.
    "అమ్మా! నందు అంటే నీకిష్టము లేదా? సూటిగా ప్రశ్నించాడు.
    "లేదని ఎవరన్నారు?"
    "వేరే అనాలా? వాడికి దూరంగా తిరుగుతున్నావు."
    "మరేది పిల్లలపై మమకారము పెంచుకుని, త్రెంచు కోలేక బాధపడాలి."
    "త్రెంచు కోవాల్సిన అవసరమేం వచ్చిందమ్మా?"
    "తెలియకే అడుగుతున్నావా?"
    "ముందు పెంచిన పిల్లలను తీసుకు వెళ్ళి నట్టు యెప్పుడో తీసు కెల్తారనే నీ భయము కదా. అలాటి భయము వద్దు. వాడు నా కొడుకే అనుకో."
    "అంత అదృష్టముంటే లెందేమిటి? అలాంటి భయము, లేదు కులము , గోత్రములేని అనామకుడిని పెంచలేను, నీ స్నేహితుని కొడుకని అభిమానముంటే చదువు చెప్పించు, సాయము చెయ్యి. ఈ ఇంటికి వాడు వారసుడు కాలేడు....కానివ్వను." అమెస్వరము తీవ్రంగా ఉంది.
    "అమ్మా!" దెబ్బతిన్నట్టు చూచాడు.
    "ఎందుకా అరుపులు, నా అభిప్రాయము చెప్పాను. ఎదిగావు స్వతంత్రుడివు. నీ ఇష్టము వచ్చినట్టు చేసుకో."
    "వాడికి కులము, గోత్రము లేదని ఎవరన్నారు?"
    'అయితే ఇంత అధ్వాన్నంగా వెళ్లి తీసుకు వస్తుంటే అడ్డుపడే బంధువులే లేరా? వాడు యెవరున్నారంటే , మా అమ్మ, కాదు ఆయా అంటాడు. అదంతా యేమిటి? కావాలనుకుంటే యెంతో మంది బంధువులున్నారు . వారి పిల్లలను తెచ్చుకుందాము. అందరూ ఒకేలాగా ఉండరు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS