Previous Page
వంశాంకురం పేజి 31


    "మమ్మీ ! నాన్న వచ్చారా?' నిదుర లో కలువరిస్తున్నాడు. ఆనంద్ ముఖము దేదీప్యమానంగా వెలిగిపోయింది.
    "వాడికి నిదురలో కూడా మీధ్యాసే రండి." అప్పటికే పది దాటింది. అతను నందు నుదురు చుంబించి వచ్చాడు.
    "నిదురలో పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే ఆయుష్షు క్షీణమంటారు." అనుకుంటూ వడ్డించింది. ఇరువురూ భోజనము చేశారు. అతను పైకి వెళ్ళిపోయాడు. అలవాటుకు విరుద్దంగా అతని వెనకాలే ఆమె ఆకుల పళ్ళెం తో వెళ్ళింది.
    "క్షమించు ఆరూ, నిన్ను ఆవేశములో ఏదో అన్నాను." ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.
    "నన్ను కాదూ, క్షమార్పణ అడిగేది? మీ అమ్మా నాన్నని. నిన్న మీ మాటలకి వారికి కోపము వచ్చింది. "మీ జోక్యము అనవసరమని మా వారితో నేనన్న మాటలు కూడా. వారు సీరియస్ గా తీసుకున్నారు. యెంత చెప్పినా వినకుండా రేపు సాయంత్రము యాత్రల కేల్తామంటు అన్నీ సర్దుకున్నారు. బీరువాలోని నగల వివరాలు నాకు చెప్పారు. వారు తిరిగి రామన్న అభిప్రాయము వెలిబుచ్చారు."
    "నిజమా? అదిరిపడి ఆమెను వదిలాడు.
    "నిజమే. యెన్నడూ లేనిది నిష్టూరంగా మాట్లాడినారు. అసలే వారి మనసు బావుండలేదంటే ప్లీడరి గారి భార్య వచ్చి మరింత అజ్యము పోసింది."
    "నువ్వు నచ్చ చెప్పలేక పోయావా?"
    "చెప్పాను బ్రతిమాలినాను. వాడికి కావల్సివాడు కుర్రవాడు. వాడున్నాడు చాలు. నీవు భర్త అడుగు జాడలలో నడిచే భార్యవు. మా దారిన మేం వేడతాము అన్నారు. నేనేం చేయాలి?"
    "ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారా?"
    "అవును చేయవల్సిన ప్రయత్నమూ చేశాను. మీరు చెప్పి చూడండి." అరుణ లేచింది. ఆమె క్రిందికి దిగి పోయాక ఒంటరితనము అతన్ని బాధించసాగింది. తనేదో, తన పంతము సాగించాలని అన్నాడుగాని తల్లితండ్రులంటే నిరసనా? అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదలాడసాగేయి. కాలము గడుస్తుంది. ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. వారొక నిర్ణయానికి వచ్చారంటే మాన్పించటము తన తరము కాదు. ఎలా? నందును వదులు కుంటాడా? తనపై నమ్మకముతో రేఖ సేవా సదనమునకు ప్రయానమవుతుంది. అంతా నిర్ణయమయి పోయింది. అతనికి ఒకే మార్గము కనిపించింది తృప్తిగా నిట్టూర్చి నిడురబోయాడు.

                                   13


    భారంగా లేచింది సరస్వతమ్మ . ఆమె హృదయమంతా ముళ్ళతో గ్రుచ్చినట్టు అవుతుంది. తన ప్రేమనంతా రంగరించి పోసిన కుమారుడు నిర్లక్ష్యంగా మాట్లాడటమా? తను ఎండమావుల్ని చూచి భ్రమపడింది. తానిన్నాళ్ళు మమకారము పెంచుకొని చేసిన సంసారమంతా మాయేనా? తలుచుకున్న కొలది దుఃఖము వస్తుంది. మరో పది గంటలలో ఇవన్నీ విడిచి పోతుంది. తాను, రోజు ఏపని చేయలేక పోతుంది. రోజూ కంటే ముందుగా మేల్కున్నది. ఆమె కోడలిని ప్రాణ ప్రదంగా ప్రేమించింది. ఆ కోడలయినా తమకు అనుకూలంగా మాట్లాడక పోగా మరో మూలపడి వుండమని ఆజ్ఞాపించింది పరోక్షంగా. ప్రపంచమంతా ఇంతేనా? ఆనంద్ పుట్టినవాడు తానో రాజ్యానికి మహారాణి అయినట్టు గర్వంగా చూచుకుంది.
    అక్కడే పొరపాటుగా ఆలోచించింది సరస్వతమ్మ. ప్రేమలో బంధించే కన్న, స్వేచ్చగా వదిలితేనే సుఖమని ఆమె ఆలోచించ లేకపోయింది. యెంతో మంది కన్నపిల్లలే పాదవుతారు. తల్లి తండ్రుల గుణాలు రావు. అసత్యం గ్రహించలేదు. మాటి మాటికి చీర కొంగుతో కళ్ళు ఒత్తుకోసాగింది.
    "సరస్వతీ! విచారించి లాభమేమిటి? రాత్రంతా ఎడ్చావులా వుంది. కొన్నాళ్ళు తిరిగి వద్దాము. మనసు కుదుట పడుతుంది.'  రంగారావు గారు చెప్పారు.
    "మీరు లేచారా?"
    "నిద్రపట్టలేదు." అతను పళ్ళ పుల్ల తీసుకుని పెరటి వైపు మెట్ల పై కూర్చున్నాడు. ఇంకా నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నాయి. ఆమె లేచి పండ్ల పోడికని లోపలికి వచ్చింది. ఆనంద్ మేడ దిగి వచ్చాడు.
     'అమ్మా!"
    "అంత కోపము దేనికమ్మా! సరే నా పిరికి తనమే ఈ అనర్దాలన్నింటికి కారణము. నీ యెదురుగా నిలబడి ఏమీ చెప్పలేను. ఈ ఉత్తరములో అంతా వ్రాశాను. చదువు. నీకు ఉచితమనిపిస్తే అరుణ కు చెప్పు. లేదా నీ హృదయము లోనే దాచుకో. నేనో స్నేహితుడిని కలుసుకోవాలి. వస్తాను." ఆమె ముందో కాగితము ఉంచి, తొందరగా తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు. అతన్ని పిలువబోయి ఆగిపోయింది. ఉత్తరము విప్పి చదివింది. వణుకుతున్న చేతులతో మరోసారి చదివింది. ఆమె ఉక్కిరిబిక్కిరి అయింది. పెరటి వరండాలోని లైటు వేసింది.
    "ఏమండీ!" రంగారావు ఇటు తిరిగాడు భార్య అరుపుకు అడుర్ధాకు అచ్చెరువు నొందాడు. ఏమిటన్నట్టు చూచాడు.
    "ఇది చూచారా?' కాగితము అతని ముందుకు చాపింది.
    "ఎక్కడదే? యెవరు వ్రాశారు? మనకంటే ముందు వీడు ఇల్లు వదిలాడా ఏం?"
    "చదువండి, నాకేం తోచడము లేదు. అది నిజమా. అబద్దమా తేల్చుకోలేకుండా ఉన్నాను. నా కాళ్ళు వణుకుతున్నాయి." ఆమె క్రింద కూలబడింది. అతను కళ్ళ దగ్గరగా పెట్టుకుని చదివాడు. ముడిపడిన అతని బొమ్మలు విచ్చుకున్నాయి. అతను మరోసారి చదివి దీర్ఘశ్వాసవదిలాడు. ఉత్తరము తిరిగి భార్య కిచ్చాడు.
    "నా అనుమానము నిజమైంది. అబద్దము  యెందుకు చెప్తాడు. వీడి పిరికి తనము కూల ఎంత పని చేశాడు."
    "ఆ మాటే మొదట చెప్పకూడదు?"
    "వయసు ఇప్పుడైనా చెప్పాడు. అమ్మాయితో చేబుదామంటావా?"
    "అవసరమొస్తే చూద్దాము. ఇప్పుడెం చెప్పొద్దు. యెవరి మనసు యెవరి కెరుక! మనవాడిలా చేశాడంటే నమ్మకము కల్గటము లేదండి."
    "వాడే స్వయంగా చెప్పాడు. నందు అచ్చు వాడిలాగే లేడూ? నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది. పాపమూ మధ్యనా అమ్మాయి జీవితం నాశనమయింది. పోనీ వచ్చి ఉండమంటే!"
    "అంగీకరించలేదని వ్రాశాడుగా. మన వంశము నిలబెట్టిన ఆ అమయాకురాలిని ఒకసారి చూడాలి" తల పంకించారాయన. అంతవరకు గూడు కట్టిన ఆవేదన హరించుకు పోయిందా వృద్ద దంపతులలో , ఏదో నూతనోత్సాహము వారి కళ్ళల్లో కాంతి రేఖలు వెలిగాయి.
    "సరస్వతీ! నేను చేసిన కర్మల నెప్పుడూ చర్వితచర్వణము చేసుకునే వాడిని. నిజంగా మనమ దృష్టవంతులము."
    "నిజమేనండి." ఏమనుకుందో యేమో, ఆమె వంగి భర్త పాదాలు కళ్ళకద్దుకుంది.
    "లే, పిచ్చిదానా." లేచి ఆనందాశ్రువులు ఒత్తుకుంది. ఆమె లోపలికి పోబోయే లోపలే అరుణ యెదురు వచ్చింది. చేతిలో వున్నా ఉత్తరము బొడ్లోదోపుకుంది. అత్తగారి వంక దీనంగా చూచిందామె. సరస్వతమ్మ గంబీరంగా మందహాసము చేసింది.
    "అత్తయ్యా , క్షమించి మీ ప్రయాణము మానుకోండి. ఈ ఇల్లు చూచుకోవడము నాకు చేత కాదు. మీ అండన నిశ్చింతగా ఉన్నాను. ఆయనేదో ఆవేశములో అన్నారు. అత్తగారిని ప్రార్ధించింది.
    "ఛీ, ఊర్కో . పిచ్చిదానిలా ఏదో శని నెత్తి నుండి అందరమూ ఆవేశ పడ్డాము. జరిగింది మరిచి పోదాము." అరుణ నమ్మలేనట్టుగా అత్తగారి వంక చూచింది.
    "ఇంత పెందలాడే ఏం పని ఉందని లేచావు? పడుకో" అన్నది భుజము తడుతూ. అరుణ నిశ్చింతగా గదిలోకి వచ్చి పడుకుంది. గారాల కొడుకేం మారాం చేశాడోనని నవ్వుకుంది.
    "ఈ అల్లరి భడవ రాత్రి యేమో కావాలన్నాడెమో."
    "చక్కిలాలు." అని పడుకుంది. అరుణ ఫలహారము చేస్తూ మరీ ఆశ్చర్యపోయింది. తనను పడుకోమని చెప్పిన అత్తగారు చక్కిలాలు వత్తిందా! నందు చేసే అల్లరికి రోజులా విసుక్కోవటము లేదు. ఆమెకేం అంతు పట్టలేదు.
    రెండవరోజు సాయంత్రము అరుణను సత్తిని ఇంట్లో వదిలి అందరూ బజారు కని బయలుదేరారు. అమ్మ కూడా రావాలని నందు పట్టుపట్టాడు. ఆనంద్ విసుక్కోవటముతో ఊర్కున్నాడు . కారు కదిలింది.
    "అరుణ అనుమానిస్తుందేమోరా." సరస్వతమ్మ అనుమానాన్ని వెలిబుచ్చింది."
    "తనకేం తెలుసు? మనమెన్నిసార్లు ప్లీడరు గారింటికి తనను వదిలి వెళ్ళలేదు!" సమర్ధించాడు రంగారావు. అందరూ వెళ్ళి స్టేషను లో  సురేఖ ను కలుసుకున్నారు. ఆమె దూరము నుండే అందరికీ నమస్కరించింది. పరుగెత్తుకు పోయిన నందు ను కన్నీటితో హృదయానికి హత్తుకుంది.
    "అమ్మ చాలా మంచిది. నీకు చూపాలంటే నాన్న వద్దన్నాడు." నందు ఫిర్యాదు.
    "అలాగే మీ అమ్మ మంచి మనసుతో కలకాలం వర్ధిల్లు నాన్న. ఈసారి వచ్చినప్పుడు చూస్తాను." ముద్దు పెట్టుకుంది. రంగారావు గారు ఆమె వంక పరీక్షగా చూచాడు. ఆనాడు మద్రాసు లో తమకు కాఫీ అందించిన నాటి చిలిపి చూపులకు బదులు గంబీరమైన చూపులు మమకారముతో నిండి ఉన్నాయి. సరస్వతమ్మ యెన్నో మాట్లాడాలను కుంది. ఆమె కళ్ళు నిండుకున్నాయి. సాటి స్త్రీ అమృతభాండము వంటి జీవితమూ నేల పాలు చేసుకుంది.
    "అమ్మాయీ! నీ నిర్ణయము మార్చుకుంటే మాకు శాంతిగా ఉంటుందమ్మా."
    "అభిమానముతో అలా అంటున్నారు. మీ హృదయము అమ్రుతమని తెలుసు. ,మీలాంటి వారి నీడన బ్రతికే అర్హత కోల్పోయాను . మీ ధనము మీకు చేరింది. మీ ఆశీర్వాదాలు నాకుంటాయి. ఆనాధ బాలుర సేవ చేస్తూ మిగిలిన జీవితమూ గడుపుతాను. ఈ విషయములో నన్ను బలవంత పెట్టకండి. అన్నది.
    "పోనీ డబ్బు కావాల్సినప్పుడు వ్రాయమ్మా." రంగారావు అర్ధించాడు.
    "తప్పకుండా .' రైలు వచ్చింది. మరోసారి పెద్దవారికి పాదాభివందనము చేసింది. నందు చేయి పట్టి ఆనంద్ చేతిలో ఉంచింది. ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి. నీతితో నిండి ఉన్నాయి.
    "బాబు పుట్టిం రోజుకు రావాలి. " మాటలు పెగల్చుకుని అన్నాడు.
    "మంచిది. "క్రింది పెదవిని అదిమి పట్టి బండిలోకి ఎక్కింది.
    "నీ సంతోషాన్ని, సర్వాన్ని మా దగ్గర వదిలి పోతున్నావు. ప్రతిగా మేము నీకేం ఇవ్వగలము?' బాధగా అడిగింది సరస్వతమ్మ.
    "నాకే మిచ్చారో మీకు తెలియదా అమ్మా, ప్రపంచంలో నేను యేనాడు ఆశించనిది ఇచ్చారు." వారి మాటల్లో ఉండగానే వగరుస్తూ అరుణ వచ్చింది. కన్నీటితో తెల్లని చీర, తలపై కొంగు వేసుకుని కిటికీ దగ్గర కూర్చున్న రేఖ దగ్గరకు వచ్చింది.
    "అరుణా!' అందరూ ఒకేసారి అరిచారు.
    'అమ్మా....నేను చెప్పానే ఆయా అని ఊరేడుతుంది. " నందు వచ్చి వాటేసుకున్నాడు. దమ్ము తీసుకుని వాడిని యెత్తుకుని , ఆయాస పడుతూ రేఖ ముందు నిలిచింది.
    "వీళ్ళు చాలా....చాలా నిర్దయగా ప్రవర్తించారు. నా ఇంటి దీపము నిలిపిన మహనీయురాలిని చూచేదానను కాదు."
    "అమ్మా అంత పెద్ద మాటలు వద్దు" మధ్యలో ఆపింది రేఖ.
    "పెద్ద మాటలు కాదు....మీరురండి ..." అంటుండగానే గార్డ్ ఈల వేశాడు.
    "అది అసంభవము. ఇక బాబు నీవాడు...." బండి కదిలింది. కన్నీటితో మరోసారి అందరికీ నమస్కరించింది రేఖ. బండి కనిపించినంత వరకూ చూచారు.
    "అమ్మా? అందరూ ఎందు కేడుస్తున్నారు?"
    "లేదు కళ్ళల్లో బొగ్గు పడింది." వాడిని హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టుకుంది.
    "ఎలా వచ్చావు అరుణా?"
    "టాక్సీ లో" వివరాలు అడగలేదు. తాను దిండు క్రింద దాచిన ఉత్తరము అరుణ చదివి ఉంటుంది. ఆనంద్ మౌనంగా కార్లో కూర్చున్నాడు. అతని మానసము ఆనందావేదనలతో ఊగిసలాడుతుంది. అరుణ ఎప్పటిలా నిర్వికారంగా అత్యంత ప్రేమతో నందుకు కబుర్లు చెబుతుంది. అందరూ ఇల్లు చేరినారు. నందు చేయి పట్టుకుని వచ్చే కోడల్ని, తాళము చేవులూపుతూ వచ్చే కొడుకునూ, గుమ్మము దగ్గరే ఆపి, ఎర్రనీళ్ళు తిప్పి పోసి, హారతిచ్చి ఇంట్లోకి రానిచ్చింది. ఇంటికేదో క్రొత్త కళ వచ్చినట్లు అనుభూతి పొందారు. అందరి విచారము మరిపించి నవ్విస్తున్నాడు నందు.

                                  (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS