Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 29


    ఎందుకయినా మంచిదని వర్ధనరావు మాటల మధ్యలో అడ్డు తగిలి 'మీరు ప్లాన్ వేస్తే ఫెయిల్ కావటమా! ఎంతమాత్రమూ కాదు సార్' అన్నాడు అహోబిలం.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం వికసించింది.
    'నా ప్లాన్ ఫెయిల్ కాదని నీకు తెలుసు కదా! ఇంక విషయానికి వస్తాను. ఆ దొంగనాకొడుకు రూమ్ లో బాంబులు, మత్తు పదార్థాలు, ముఠా తాలూకా రహస్యాలు వుంటే వాటిని నేను తీసుకురాను. చూసి....ఏ వస్తువుని ఆ వస్తువు స్థానంలో వుంచి ఏమీ యెరగనట్లు బయటికివచ్చి తలుపుకి తాళం మళ్ళీ వేసేస్తాను. వాడిమీద, వాడి ముఠా మీద నిఘా పెడతాను. వాడు రోజూ ఒకే సమయంలో  గుడికెళ్ళి రావడమేనా? లేక రాత్రిళ్ళు రహస్యంగా వాళ్ళ వాళ్ళను కల్సుకుంటున్నాడా! రహస్యంగా కోడ్ ద్వారా వాళ్ళవాళ్ళకి ఏదైనా సమాచారం పంపుతున్నాడా! ఇలాంటివన్నీ చూసుకుంటాను. ఇంతవరకూ నా ప్లాన్ ఎలా వుంది?'
    'ఎలా వుంటమేమిటిసార్! అదిరిపోయేటంత అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద సి.ఐ.డి.లు కూడా మీముందు బలాదూర్!'
    'ఇది పొగడ్త కాదుకదా?'
    'ఎంతమాత్రం కాదుసార్!'
    'అయితే సరే'
    'ఆ తర్వాత ఏంచేస్తారో చెప్పండి సార్!'
    'వాడి గదిలో ఏమీ దొరకలేదనుకో....!'
    'అప్పుడు వాడిని తేలికగా వదిలేస్తారా!!'
    "నో....నో....వాడిని మరింత అనుమానిస్తాను."
    'ఎందుకు సార్! గదిలో ఏమీలేక ఆధారాలు దొరక్కపోతే అనుమానించటం మంచిదికాదేమో సార్?'
    "అహోబిలం, నీవెంత పిచ్చివాడివయ్యా! వాడి గదిలో ఏమీ దొరకలేదంటే అది సామాన్యమైన విషయమా? వాడు యమజాగ్రత్తలో ఉన్నాడని అర్థం. ఎలాగంటే వాడు ఆ రాస్కెల్ గాడు రోజూ గుడికెళ్ళి పరిశోధన చేసి చిన్న నోట్ బుక్ లో ఏదో రాసుకుంటున్నాడు. దైవదర్శనం చేసుకోవటం లేదు. వీడు గుడి గోడలను పరిశోధించేది ఏమిటి? మనకి తెలియదు అంటే ఏదో ఉందని అర్థం, మొత్తానికి వాడి గదిలో ఏదన్నా దొరికినా దొరక్కపోయినా వాడు నా దృష్టిలో పెద్ద అనుమానాస్పదం కలవాడే. అందుకే వాడిని వదలను' ఇన్ స్పెక్టరు తీవ్రంగా చెప్పాడు.
    'వదలొద్దు సార్! మీకు పేరు ప్రమోషను వచ్చే కేసు ఇది కానిస్టేబుల్ అన్నాడు.
    'నా పథకం నీకు నచ్చింది కదా?'
    నచ్చింది సార్!'
    'ప్లానులో లొసుగులు లేవుకదా?'
    'లేవుసార్!'
    'సరే మరో అరగంటలో బయలుదేరదాము.'
    'పాత వేషాలేనా ఏదైనా కొత్తవేషం వేద్దామంటారా?' వినయంగా అడిగాడు కానిస్టేబుల్.
    "ఇదేమన్నా సినిమానా! అర్ధగంటకో వేషం మార్చటానికి? మనకి రామన్న లక్ష్మన్న వేషాలు చాలు"
    'మీరెలా చెపితే అలా సార్. పథకం వేశారు కాబట్టి వేషాలు కూడా మార్చాలేమో అనుకున్నాను, ఈ వేషం అయితే చాలా తేలికగా వుంది. మనల్ని ఎవరూ కూడా గుర్తుపట్టటం లేదు' అన్నాడు కానిస్టేబుల్. తలపాగా ముతక గుడ్డలు కట్టుకోటానికే మహాచిరాకుగా వుంది అహోబిలానికి. ఇన్ స్పెక్టర్ మరో వేషం మార్చమంటాడేమోనని లోలోపల భయపడుతూ తెలుసుకుందామని మాటవరసకి అడిగినట్టు అడిగాడు అంతే.
    "మనం బేవార్సునాకొడుకుల వేషాలు వేశాం కాబట్టే మన ముఖాలని ఎవరూ చూడలేదు. రాజుగారి కొడుకులా బయలుదేరామంటే మాత్రం ఎవరో ఒకరు చూచి లటుక్కున బజారులో పట్టేసి "సలాం ఇన్ స్పెక్టరు సాబ్!" అనేవాళ్ళే. మారువేషం అనేది ఎప్పుడూ ముష్టికూడాకుష్టి వెధవలా గానీ పనీపాటాలేని బేవర్సునాకొడుకులాగానో ఉండాల్సిందే తప్ప ఘనంగా ఉండకూడదు. సన్యాసి వేషం కూడా బెటరు!" గీత బోధించినట్లు చెప్పాడు ఇన్ స్పెక్టరు.
    అన్నింటికీ తల ఆడించి ఊరుకున్నాడు కానిస్టేబుల్.
    అరగంట తర్వాత
    ఇన్ స్పెక్టరు, కానిస్టేబులు మారువేషాలతో బైటికి వెళ్లారు.

                              18

    పది నిమిషాలు గడిచిపోయాయి.
    అంతవరకూ ఇన్ స్పెక్టరు, కానిస్టేబుల్ చిన్న కొట్టు ప్రక్కన ఎవరికీ అనుమానం రాకుండా గుడి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
    ఒకవేళ ఎవరైనా వారి మాటలు విన్నవాళ్లు అణుమాత్రమైనా అనుమానించటానికి వీలులేదు.
    'అదికాదురా రామన్నా! అన్యాయంగా మా దాయాదులే నన్ను కోర్టుకి ఈడ్చారు. కోర్టువాళ్ళు తిమ్మిని బమ్మిగాను, బమ్మిని తిమ్మిగానూ చేస్తారంటారు. నా ఆస్తి నాకు వస్తుందో రాదో"
    "ఒరే లచ్చన్నా! నీకిప్పటికి వందసార్లు చెప్పాను. ఆ సిరివల్లె అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కుకుంటే ఎంత పెద్ద కష్టాలయినా తీరిపోతాయి అని, అనుభవంమీద నేను చెబుతున్నాను కదా! నా భార్యాబిడ్డలు చావుబ్రతుకుల్లో ఉంటే ఈ తల్లికే మొక్కుకొన్నాను. వెంటనే బ్రతికి బయటపడ్డారా లేదా? ప్రతిదానికీ నమ్మకం ముఖ్యం నీ కష్టాలు తొలగిపోతాయి అన్నాను తొలగిపోతాయి."
    'నువ్వలా గట్టిగా చెబుతూంటే ధైర్యం వస్తున్నది. మళ్ళీ కోర్టు వ్యవహారాలూ తలచుకొంటే భయమేస్తుంది.'
    'పెళ్ళిపందిట్లో కూచుని చావు గురించి, స్మశానంలో కూర్చుని కల్యాణం గురించి ఆలోచించకూడదు, పరమపవిత్రమైన పుణ్యస్థలానికి వచ్చి పనికిమాలిన కోర్టు విషయాలు ఆలోచిస్తావు ఎందుకు? అమ్మ దర్శనం చేసుకొని అమ్మకు మొక్కుకో. నెల తెరిగేసరికి నీవు వూబిలోంచి బయటపడతావో లేదో చూద్దువుగాని.'
    'నువ్వలా ధైర్యం చెబుతూంటే నాకు నమ్మకం, ధైర్యం కలుగుతున్నాయి చూస్తాను అమ్మ దయ నామీద ఎంత ఉన్నదో!!'
    రామన్న వేషంలో ఉన్న ఇన్ స్పెక్టరు వర్ధనరావు లచ్చన్న వేషంలో ఉన్న కానిస్టేబుల్ అహోబిలం అలా పైకి చాలా సహజంగా మాట్లాడుకుంటూ వుంటే వాళ్ళ మాటలు విన్నవాళ్ళు అణుమాత్రం కూడా అనుమానించరు. అతను ఇంకా గదిలోనుంచి బయటికిరాలేదు. ఈ లోపల వీరివురి సంభాషణ ఇలా జరుగుతూనే ఉన్నది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS