Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 29


    దొర నోరు తెరిచి వింటున్నాడు.
    "అన్నా! నేనూ నీలాగే హిందువుల రక్తంలోంచి పుట్టాను. నన్ను మా తల్లిదండ్రులు యీ షేర్ ఖాన్ కు నజరానా యిచ్చారు. యీ శరీరాన్ని ఒక వస్తువుగా మార్చి వాళ్ళు ధనంకూడా పెట్టుకున్నారు. ఆ డబ్బుతో నా వెనుక పుట్టినవాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారన్న తృప్తితో నేను బ్రతుకుతున్నాను కన్నా! నీ పాదాలమీద చేయివేసి చెప్తున్నాను హైందవ రక్తం నిద్రపోతోంది జాతి నిర్వీర్యమైనప్పుడు ఆడవాళ్ళు అవమానించ బడటంలో ఆశ్చర్యంలేదు. నేను అమ్ముడుపోయిన దానినే కాని అమ్ముకున్నదానిని కాదు. జనానాలోకి రాగానే నాకు ఆటా పాటా నేర్పించారు.
    అన్నా! నీవంటి మగధీరులు యెందరో నాకు అన్నలున్నారు హిందువుల రాజ్యంలో. కాని వాళ్ళు నన్ను యీ నరకంనించి కాపాడగలరా? నాకు విముక్తిని ప్రసాదించి నన్ను మనిషిని చెయ్యగలరా?
    నేనిక్కడ చేసే వుద్యోగం యేమిటో తెలుసా? ఆడటం, సారాయి అందించటం అంతే! యిప్పుడు మాకు ఆశ్చర్యంగా వుంది. మగవాడివైపు కన్నెత్తి చూచామని తెలిస్తే కొజ్జాలచేత కొరడాలతో కొట్టించేవాడు ఖాన్. యిప్పుడు నీదగ్గర విడిచిపోయినాడు. యిది ఆశ్చర్యంకాదూ!" అన్నదామె.
    "నీకు అసలు విషయం తెలియదు కనుక ఆశ్చర్యమే! అతడు హిందూ ధర్మానికి ఒక సవాలుగా యిదంతా చేస్తున్నాడు. ధర్మం జయిస్తుంది" అంటూ వివరించాడు దొర రవ్వ మీసం దువ్వుతూ ఆలోచించాడు.
    "చెల్లీ, నిన్ను యీ చెరనించి కాపాడుతాను. నరసింహదేవరమీద ఆనచేసి చెప్తున్నాడు. చెల్లీ నిన్ను యీ చెరనించి కాపాడుతాను. హిందువుల రాజ్యంలో మగధీరులు లేకకాదు. ప్రకృతి పురుషులు ఆడుకునే చదరంగంలో యీ జాతి ఒక పావు అయింది అంతే!" అంటూ మరొక ప్రక్కకు వత్తిగిల్లి పడుకున్నాడు దొర.
    రహస్యంగా పై కండువాతో కన్నీరు ఒత్తుకున్నాడు. ఆమె వెక్కి వెక్కి యేడ్చింది దొర పాదాలమీద చెయ్యివేసి ఒత్తుతోంది.
    "నీ పేరేమిటి?" దొర అడిగాడు.
    "శకుంతల" అలా ప్రారంభమయిన వాళ్ళ సంభాషణ తెల్లగా తెల్లవారేవరకూ ముగింపుకి రాలేదు.
    తెల్లవారుతూనే గడియలు తీశారు. లోపల వున్న ఆడవాళ్ళను కొజ్జాలు వచ్చి లాక్కుపోయారు. ఆ వెనుక షేర్ ఖాను వచ్చాడు.
    "ముఖం చూస్తుంటే రాత్రంతా నిద్రపోయిన గుర్తులేదు యిప్పుడు తెలిసిందా మజా అంటే యేమిటో?" అని అడిగాడు ఖాను.
    "నేను వెళ్ళిపోవాలి" అన్నాడు దొర. హిందూ ధర్మాన్ని ఆట పట్టించి ఓడించేనన్న గర్వంతో వున్నాడు ఖాను.
    "కోరికలు యేమీ లేవా?" అని అడిగాడు.
    "ఉన్నాయి" దొర సమాధానం.
    "భళీ! తెల్లారేసరికి మార్పు వచ్చేసింది అన్నమాట యేమిటో అది అడుగు కళ్ళు మూసుకుని యిచ్చేస్తాను" అన్నాడు.
    "మాట తప్పవుకదూ!" దొర హెచ్చరించాడు.
    "నా పేరు షేర్ ఖాను అడుగు నీకేం కావాలో-యిచ్చేస్తాను."
    "శకుంతల" దొర కోరుకున్న వరం ఖానుకు నవ్వు తెప్పించింది.
    "ఒక బానిసను కోరుకుంటున్నావా? యెంత చిన్నకోరికా?"
    "ఇచ్చినట్లేగా?" అడిగాడు దొర.
    సమాధానంగా ఖాను గంటకొట్టాడు. నౌకరు హాజరయ్యాడు. క్షణాల మీద శకుంతల దొరకు అప్పగించబడింది. ఆమె ముఖ్నలో ఆనందమే పండుగ చేసుకుంది.
    "మీ హిందువులు చాల తెలివితక్కువవాళ్ళు అడిగి యిప్పించుకోవటంకూడా తెలియదు. నీకేమి యివ్వాలో ఇహ నిన్ను అడిగి ప్రయోజనం లేదు. అది నేనే నిర్ణయిస్తాను. నువ్వు దర్బారుకు రా" అంటూ వెళ్ళిపోయాడు ఖాను.
    దొర శకుంతలను వెంటపెట్టుకుని దర్బారులో హాజరయ్యాడు. యీ లోపు జరుపవలసిన మంత్రాంగమంతా జరిపాడు ఖాను. అది రాజకీయ పరమైన ఆలోచన.
    సవరలు దొర చెప్పినట్లు వింటారు. సవరగ్రామాలమీద యిహ తన ఆధిపత్యం నశింపుకి వచ్చింది. వాళ్ళకి యిష్టుడయిన యీ లింగప్పదొరకి ఆ గ్రామాలు యిచ్చేస్తే స్వాతంత్ర్యం యిచ్చినట్లూ వుంటుంది. గ్రామాల మీదికి దండయాత్ర చెయ్యకుండా తన ఆదాయం తనకి దొరద్వారా అందుతుంది.  యిది సులువు అయిన దారి అని అతని వజీర్లు సలహా యిచ్చారు. అతనికి వూహించని బహుమానం యిస్తూనే తన సమస్యకు పరిష్కారం వెతుక్కున్నాడు ఖాను.
    యిహనించి తనకు పితూరీల బాధ లేదు అని హాయిగా వూపిరి పీల్చాడు. సభలోకి రాగానే లింగప్పదొరను ఆశ్చర్యపరిచాడు.
    "లింగప్ప రంగారావుదొరకు స్వాగతం" అన్నాడు. లింగప్ప దొరకు సామంతరాజుల వరుసలో స్థలం ప్రత్యేకించారు. అక్కడ కూర్చోవలసిందని అడిగారు. లింగప్పది రాజరక్తం. రాజఠీవి వచ్చింది.
    "ఏమిటిది?" అని అడిగాడు దొర.
    "ఇహనించీ నీవు రంగవాత పరిసరాల్లో వున్న పన్నెండు గ్రామాలకు రాజువు. నీ రాజ్యం వైశాల్యం యిరవై చదరపుమైళ్ళు. నీకు రంగా రావు అనే బిరుదు యిస్తున్నాను. యీ బిరుదు నీకేకాక నీ వంశం వారందరికీ వుండేలా గుర్తిస్తూ ఆజ్ఞలు జారీచేశాను" అంటూ ఆజ్ఞాపత్రాల్ని అందించాడు ఖాను.
    దాని వెనుకవున్న రాజకీయం లింగప్ప రంగారావుదొరకు అర్ధమయింది. కాని ఆ సవరగ్రామాలు తనక్రిందికి వస్తే తనకి తెలియకుండా ఖాన్ వాళ్ళమీదికి రాలేడు. వాళ్ళని హింసించలేడు. కూచిపోతి ఆత్మ బలిదానం యీ వ్ధంగా వాళ్ళకి తోడ్పడింది కాబోలు. త్యాగానికి మూల్యం కూచిపోతి ప్రాణం అయితే ఫలితం స్వేచ్చ అయింది. యిది సంతోషించదగిన పరిణామమే అని ఆలోచించి ఆ ఫర్మానా స్వీకరించాడు లింగప్ప రంగా రావు దొర. ఘనమైన సన్మానాలతో సామంతరాజులకు యిచ్చే గౌరవ పురస్కారాలతో ఆయనకు వీడ్కోలు యివ్వబడింది.
    శకుంతల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి.
    
                        *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS