Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 30

   
    దినేష్ కోపంతో జుట్టు పీక్కుంటూ స్పీకర్ తీసుకుని అరుస్తూ మాట్లాడాడు.
    "అంతా అబద్దం! దగా! ఆ ముసలాళ్ళు డ్రామా ఆడుతున్నారు. వాళ్ళు సుధిని రాజేష్ కిచ్చి పెళ్ళి చేస్తున్నారు"
    సీఐ ఖంగు తిన్నాడు.
    "మిస్ సుధీ! మీ పేరంట్స్ మీ ఇష్టానికి వ్యతిరేకంగా రాజేష్ కి మిమ్మల్నిచ్చి పెళ్ళి చేస్తున్నారని అంటున్నాడు- నిజమా?"
    సుధి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో తుగ్లక్ ఛానెల్ రాజు చెలరేగాడు.
    "వెంగమాంబా! పాపం ఈ మిస్ సుధిని చూస్తే అనాదిగా అన్యాయానికి, దౌర్జన్యానికీ గురవుతోన్న భారత మహిళకు ప్రతినిధిగా కనబడుతోంది! తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్ళి చేస్తున్నా కిక్కిరుమనకుండా మౌనంగా సహిస్తోంది గానీ ఈ అమ్మాయి పాపం తల్లిదండ్రులు దుర్మార్గాన్ని పదిమందికీ చెప్పలేక లోలోపల కుళ్ళిపోతోంది- వెంగమాంబా!"
    వెంటనే న్యూస్ లో దున్నేయటం వెంగమాంబ వంతయింది- "అమాయకురాలయిన సుధిని ఆ అమ్మాయి తల్లిదండ్రులు మానసికంగా ఎంతగా హింసిస్తోందీ- ఎంతగా నరకయాతన పెడుతోందీ- ఆ అమ్మాయి పెట్టే కన్నీరే దానికి సాక్షి! తల్లిదండ్రులు ఆగడాలకు అంతేలేదా? గృహహింస చట్టం కింద పోలీసులు వారిని ఇంతవరకూ అరెస్ట్ చేయకపోవటం చూస్తూంటే పోలీసుల నిర్లక్ష్య వైఖరి మనకు స్పష్టంగా తెలుస్తోంది. మీ తల్లిదండ్రులు కూడా ఇంత నికృష్టంగా ఉన్నారా? లేక మీరేమడిగినా నోర్మూసుకొని చేస్తున్నారా? వెంటనే ఎస్.ఎం.ఎస్. చేసి నలుగు జీరోలకు పంపండి" సుధీ దగ్గరకొచ్చాడు సర్కిల్.
    "మిస్ సుధీ! నువ్వూ దినేష్ ప్రేమించుకున్నమాట నిజమేనా?"
    "నిజమే"
    "మీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా?"
    "అవును"
    "కానీ మీ తల్లిదండ్రులు నిన్ను బలవంతపెట్టి రాజేష్ కిచ్చి పెళ్ళి చేస్తున్నారు కదా?"
    సుధి తండ్రి కోపంగా సర్కిల్ దగ్గరకు వచ్చి, "గిందులో బలవంతమేమున్నది వయ్యా మా సుధి కోరికమీదే రాజేష్ తో పెళ్ళి ఫిక్స్ చేశామని చెప్తూంటే మీకు, ఆ టీవీ చానెల్ కొడుకులకూ వినబడదా?" మండిపడ్డాడు.
    ఇన్ స్పెక్టర్ కంగారుపడ్డాడు.
    "ఏంటి? సుధి కోరికమీదే రాజేష్ తో పెళ్ళి ఫిక్స్ చేశారా?"
    "అవుననేగా చెప్పేది?"
    "అంటే మీ సుధి దినేశ్ ని ప్రేమించలేదా?"
    "ఆ ప్రశ్న మా అమ్మాయినడగాలి"
    "మిస్ సుధీ! నువ్ దినేశ్ ని ప్రేమించావ్ కదా- మరి రాజేష్ తో పెళ్ళి జరిపించమని మీ పేరెంట్స్ ని ఎందుకు కోరావ్?"
    "నేనూ రాజేష్ ప్రేమించుకున్నాం"
    అందరూ షాక్.
    "ఏంటి? నువ్వూ రాజేష్ ప్రేమించుకున్నారా?"
    "అవును-"
    "మరి దినేశ్ ని ప్రేమిస్తున్నానన్నావ్?"
    "నాదీ రాజేష్ ది శారీరక ప్రేమ. దినేష్ తో నాకున్నది మానసిక ప్రేమ."
    తుగ్లక్ ఛానెల్ రాజుకి మతిపోయింది. తనకు బుర్ర ఉందని ఋజువుచేయడానికి బుర్రగోక్కున్నాడు.
    అతని చూసి ఇన్ స్పెక్టర్ కూడా బుర్ర గోక్కున్నాడు.
    "ఏంటి? రాజేష్ తో శారీరక ప్రేమా - దినేష్ తో మానసిక ప్రేమా?"
    "అవును-"
    "నాకు నీ మాటల్లో ఒక్కముక్క అర్ధమయితే ఒట్టు. ఏమయ్యా రాజూ- మీరు కవర్ చేసే సెన్సేషనల్ న్యూస్ లన్నీ ఇలాంటివేగా? ఆ అమ్మాయి చెప్పిన ప్రేమల గురించి నీకేమయినా అర్ధమయిందా?"
    రాజు అతని మాటలు వినిపించుకోలేదు. సుధి ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఛానెల్ వ్యూయర్ షిప్ పెంచుకోడానికి పెద్ద ఎత్తున కామెంటరీ మొదలుపెట్టాడు.
    "వెంగమాంబా! సుధి, దినేష్ ల ప్రేమ వ్యవహారం మరో కొత్తకోణంలోకి ప్రవేశించింది. సుధిని దినేష్, రాజేష్ లు ఇద్దరూ ప్రేమించినట్టు తెలుస్తోంది. అంటే దీన్ని మనం ఒక లవ్ ట్రయాంగిల్ గా పేర్కొన్నవచ్చు వెంగమాంబా! ఇలాంటివి స్టూడెంట్స్ లో చాలా సాధారణ విషయాలు గనుక సుధి విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకోవచ్చు వెంగమాంబా. ప్రస్తుతం ఇది ఒక ఫ్యాషన్ గా కూడా మారిందని చాలామంది అంటున్నారు వెంగమాంబా. లవ్ ట్రయాంగిల్ లేని గాళ్స్ నీ, బాయ్స్ నీ సొసైటీలో చిన్న చూపు చూస్తున్నారనీ అందుకనే ఈ రోజుల్లో స్టూడెంట్సందరూ లవ్ ట్రయాంగిల్స్, లవ్ ఫోర్ యాంగిల్స్, లవ్ సిక్స్ యాంగిల్స్ తప్పటం లేదని, అనుకుంటున్నారు వెంగమాంబా"
    "అయితే మరి ఈ వ్యవహారంలో సుధి పాత్ర ఏమిటి రాజూ? సుధి ఆ ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తోంది?"
    "అదే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది వెంగమాంబా! తనకూ రాజేష్ కీ మధ్య ఉన్నది శారీరక ప్రేమనీ, తనకూ దినేష్ కి మధ్య ఉన్నది మానసిక ప్రేమనీ రెండు కేటగిరీలుగా విభజించింది వెంగమాంబా మరింత క్లారిటీ కోసం సుధితోనే మాట్లాడతాను వెంగమాంబా"
    "ఒకే రాజూ, ప్రొసీడ్"
    "మిస్ సుధీ! రాజేష్ తో మీకు శారీరక ప్రేమ ఉందంటున్నారు. ఇలాగే దినేశ్ ని మానసికంగా ప్రేమించానంటున్నారు. ఈ రెండు ప్రేమలకూ గల వ్యత్యాసాన్ని మీరెలా నిర్వచిస్తారు?"
    "ఈ రెండు ప్రేమలకూ వ్యత్యాసం ఉందని మీకెవరు చెప్పారు?" అంటూ సుధి ప్రశ్నించేసరికి రాజు కంగారుపడ్డాడు.
    "అంటే ఈ రెండింటికీ వ్యత్యాసం లేదని మీరంటున్నారా?"
    "ఎక్కడుంది? రెండూ బేసిక్ గా ప్రేమలే"
    "అంటే ఆ ఇద్దరిలో ఎవరితో మీ జీవితాన్ని పంచుకోడానికి ఇష్టపడుతున్నారు?" అందరూ సస్పెన్స్ తో చూస్తున్నారు.
    సుధి మాట్లాడలేదు.
    "మీరు వెంటనే జవాబు చెప్పకపోతే- కొన్ని వందలమంది మా తుగ్లక్ ప్రేక్షకులు గుండె ఆగి చచ్చే ప్రమాదముంది! అందుకని త్వరగా జవాబు చెప్పండి.
    "నాకు ఇద్దరితోనూ జీవితాన్ని పంచుకోవాలని ఉంది" అంతా కలకలం! దభేల్ మని టెర్రస్ వాటర్ టాంక్ దగ్గర చప్పుడయింది. టాంక్ మీద నుంచి కిందపడిన దినేష్ మళ్ళీ లేచి నిలబడ్డాడు. తుగ్లక్ రాజూ కూడా తూలిపడబోయి నిలదొక్కుకున్నాడు.
    "వాట్? ఇద్దరితోనూ జీవితాన్ని పంచుకుంటారా? అదెలా సాధ్యమవుతుంది. మిస్ సుధీ! పెళ్లి అనేది ఒక్కరితోనే అవుతుంది కదా!"
    "అయినా బాయ్స్ చాలామంది ఇద్దరమ్మాయిలతో సంసారం చేస్తున్నారు కదా"
    "మగాళ్ళ సంగతివేరు సుధీ" ఆ తరువాత రాజు మాట్లాడలేకపోయాడు.
    "ఇంతకూ ఇప్పుడేమంటావ్ మిన్ సుధీ రాజేష్, దినేష్ లిద్దరినీ పెళ్ళి చేసుకుంటానంటారా?"
    "అవును"    
    లేడీస్ లో హాహాకారాలు. "ఇటీజ్ ఇంటరెస్టింగ్" అంది షైనీ.
    "కానీ అందుకు చట్టం ఒప్పుకోదు కదా?" అడిగాడు రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS