"అసలు మా అపార్ట్ మెంట్స్ పైన ఒకడు ఎక్కి దూకి ఛస్తానంటున్నాడన్న విషయం మీకెలా తెలిసింది?" కోపంగా అడిగాడు విజయ్ యాదవ్.
"ఆ దూకేవాడే సెల్ ఫోన్లో చెప్పాడు-ఛానెల్ లైవ్ కవరేజ్ లేకుండా ఎవడూ దూకడు కదా- నిజం చెప్తున్నాసార్- ఇలా దూకి చచ్చేవాడి లైవ్ కవరేజ్ కోసం నెల రోజుల్నుంచీ ఎదురుచూస్తున్నాం- క్రైమ్ ఎలిమెంట్ కి ఎప్పుడూ వ్యూయర్ షిప్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్! యాడ్ రెవిన్యూ అదిరిపోద్ది"
అతనూ మాట్లాడుతుండగానే ఆ ఛానెల్ న్యూస్ రీడర్ లైన్లోకొచ్చేసింది షైనీ తెచ్చిన పోర్టబుల్ టీవీ చుట్టూ మూగాం అందరం.
"రాజూ! రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ పైన నిలబడి. తన ప్రియురాలితో పెళ్ళికొప్పుకోకపోతే దూకుతానని బెదిరిస్తున్న ఆ యువకుడి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?"
పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది వెంగమాంబా! అపార్ట్ మెంట్స్ లోని వాళ్ళు అతనెప్పుడు దూకుతాడోనని ఆందోళనగా ఉన్నారు"
రాజు చెప్తుంటే, అతడి చేతిలోని మైక్ లాక్కుని "మాకేం అందోళన లేదు వెంగమాంబా! ఇక్కడ చాలామంది అతను దూకే దృశ్యం చిత్రించాలనీ సెల్ ఫోన్ కెమెరాలు సిద్దం చేసుకున్నారు" అంది షైనీ.
న్యూస్ రీడర్ వెంగమాంబలో కన్ ఫ్యూజన్.
"హలో..... మీరెవరు?"
"కెమెరామెన్ సునీతతో అపార్ట్ మెంట్స్ సొసైటీ లేడీస్ వింగ్ సెక్రటరీ షైనీ"
రాజు ఆమె చేతిలో నుంచి బతిమాలి మైక్ తీసుకున్నాడు.
"రాజూ......ఇంతకూ ఆ యువకుడు దినేష్ ఇంతటి తెగింపుకు ఎందుకు పాల్పడ్డాడు?"
"అతను ప్రేమించిన 'సుధి'ని పెళ్ళి చేసుకోవాలని అతని కోరిక వెంగమాంబా! దానికి 'సుధి' తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే- దూకటం ఖాయమనీ, వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనీ అతనంటున్నాడు వెంగమాంబా"
"మరి ఈ విషయంలో పోలీసు లేమంటున్నారు రాజూ?"
"ఇంతకుముందు 'దూకి ఛస్తే- ఛావనీ' అని అనుకున్నారు వెంగమాంబా. కానీ ఇప్పుడు చానెల్స్ అన్నీ ఈ దృశ్యాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుండటంతో ఆ యువకుడితో చర్చలు జరపడానికి వస్తున్నారని తెలిసింది- అదిగో పోలీస్ జీప్ వచ్చేసింది వెంగమాంబా"
జీప్ లోనుంచి స్పీకర్ పట్టుకుని ఒక ఎస్సై దిగాడు అతని వెనుకే ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా దిగారు.
"ఇదిగో చూడు దినేష్..... నీకూ, నువ్ ప్రేమించిన అమ్మాయికీ పెళ్ళి జరిపించే పూచీ మా డిపార్ట్ మెంటుది! అందుకని నువ్విక దూకే ఆలోచన విరమించుకుని కిందకు దిగిరా" బతిమాలాడు సీఐ.
"మీ మాటలు నమ్మి కిందకు దిగొస్తే బొక్కలో తోస్తారు! ఛస్తే దిగను సార్. ఆ సుధి తల్లిదండ్రులు స్వయంగా ఇక్కడికొచ్చి నాకూ, సుధికీ ఇక్కడే ఈ అపార్ట్ మెంట్ లోనే పెళ్ళి జరిపిస్తామని మాటివ్వాలి. అప్పుడే దిగుతా" అన్నాడు దినేష్.
సీఐ చిరాకుపడ్డాడు. కానీ ఎక్స్ ప్రెషన్ ఛానెల్ కెమెరాకు చిక్కకుండా చిరునవ్వు నవ్వాడు.
"ఇదిగో మోహన్ రావ్. వెంటనే పెళ్ళి ఆ సుధి అనే అమ్మాయినీ, వాళ్ళ పేరెంట్స్ నీ, ఆమెనూ ఇక్కడకు తీసుకురా!" అంటూ ఎస్సైని పంపించాడు.
"ఈలోగా మళ్ళీ లైన్లో తుగ్లక్ ఛానెల్ వెంగమాంబ- "రాజూ-ఇప్పుడక్కడ పరిస్థితేంటి? ఏం జరుగుతూంది?"
"వెంగమాంబా! దినేశ్ ప్రేమించిన సుధిని ఆమె పేరంట్స్ ని పిలిపిస్తున్నారు. ఈ ప్రేమ కథను సుఖాంతం చేసేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ అన్ని చర్యలు తీసుకుంటోంది వెంగమాంబా"
"రాజూ! దినేష్, సుధి కలిసి ఒకటే కాలేజీలో చదువుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కాలేజ్ మేట్స్, కొలీగ్స్ ప్రేమించుకోవటం, పెళ్ళి చేసుకోవటం కామన్ అయిపోయింది కదా! అయినా సుధి తల్లిదండ్రులు మూర్ఖంగా వారి ప్రేమకు అభ్యంతరం చెప్పడం ఎందుకు జరుగుతోంది? వారింకా చాదస్తాన్ని వదలకుండా, మూర్ఖంగా, అనాగరికంగా, జంతువుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?"
"వెంగమాంబా! ఈ జెనరేషన్ గాప్ యుగయుగాల నుంచీ కొనసాగుతోంది. మహాభారత కాలంలో కూడా ప్రేమికులకు, వారి పెద్దలకూ మధ్య యుద్దాలు జరిగిన దాఖలాలున్నాయి వెంగమాంబా. ఏదేశమయినా ఈ రోజుల్లోనూ ఇంకా ఆ పురాతన కాలంనాటి బూజుపట్టిన అభిప్రాయాలతో దినేష్, సుధిల ప్రేమకు అడ్డు చెబుతున్న సుధి పేరెంట్స్ ని చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోంది వెంగమాంబా"
"థాంక్యూ రాజూ.....సుధి తల్లిదండ్రులలాంటి నికృష్టమైనవారిని నిలువునా నరకాలో, కాల్చాలో, పాతర వేయాలో, రాళ్ళతో కొట్టాలోనన్న దానిపై మీరంతా ఆలోచించి సమాధానం వెంటనే ఫోర్ జీరోస్ కి ఎస్సెమ్మెస్ చేయండి. ఇప్పుడో బ్రేక్".
సరిగ్గా అప్పుడే పోలీస్ జీప్ లో సుధి, ఆమె తల్లిదండ్రులు వచ్చి దిగారు.
ఒక్కసారి ఛానెల్ కెమెరాలు, జర్నలిస్టులు అందరూ వాళ్ళవేపు పరుగెత్తేసరికి తమమీద దాడికి వస్తున్నారనుకుని సుధి పేరెంట్స్ వెనక్కు తిరిగి పరుగెత్తి స్పీడ్ బ్రేకర్ తగిలి కిందపడ్డారు.
వెంటనే పోలీసులు పరుగుతో వెళ్ళి వాళ్ళను లేపి వాళ్ళంతా టీవీ ఛానెల్ వాళ్ళనీ, గూండాలు కాదనీ నచ్చజెప్పి కెమెరాల ముందుకు తీసుకొచ్చారు.
"ప్రేమించుకున్న యువతీ యువకులను కలపలనీ, వాళ్ళకు వివాహం చేయాలనీ మీరెందుకు అనుకోవటం లేదు. ఇంత రాక్షసం ఎందుకు?" అడిగాడు రాజు.
"మేము రాక్షసంగా ప్రవర్తించటమేందిరా భయ్! అసలు లవ్ మారేజెస్ కి మేము ఎగినెస్ట్ అని ఎవళ్ళు జెప్పిన్రు" వాళ్ళు రివర్స్ లో వచ్చేసరికి రాజు కంగారుపడ్డాడు.
"అంటే మీ అమ్మాయి లవ్ వ్యవహారాలన్నీ మీరు అంగీకరిస్తున్నారా?"
"అవ్ మళ్ళా!"
"అయితే మరి ఆ దినేష్ వాటర్ టాంక్ మీద నుంచి ఎందుకు దూకుతున్నాడు?"
"ఆ సంగతి వాడినడగాలే! నన్నడిగితే నాకేమెరుక? అడ్డమైనోడి సంగతులూ తెలుసుకోడానికి నేనేం ఛానలోడిలెక్క ఉన్ననా?" రాజుకు మతిపోయింది.
అంతా 'సుధి' వేపు కెమెరాలు తిప్పారు.
"సుధీ మీవాళ్ళు మీ పెళ్ళికి అంగీకారం తెలిపానంటున్నారు- నిజమేనా?"
"నిజమే-"
అందరూ మళ్ళీ షాక్.
"అయితే దినేష్ - అలా చెప్తున్నాడేంటి? సుధి తల్లిదండ్రులు ప్రేమకు అడ్డు చెప్తున్నందున దూకుతానంటున్నాడు కదా?"
"అతనిదీ నిజమే" మెల్లగా అంది సుధి!
అందరూ మళ్ళీ తలలు పట్టుకున్నారు.
మళ్ళీ లైన్లో తుగ్లక్ ఛానెల్ న్యూస్ రీడర్ వెంగమాంబ- "రాజూ! సుధి తల్లిదండ్రులేమంటున్నారు? దినేష్ తో పెళ్ళి జరిపించడానికి ఒప్పుకున్నారా లేదా?"
"అదే సరిగ్గా అర్ధం కావటం లేదు వెంగమాంబా! వాళ్ళయితే ఆ ప్రేమికులకు తామెన్నడూ అభ్యంతరం చెప్పలేదంటున్నారు. సుధి కూడా ఆ మాటను కన్ ఫర్మ్ చేస్తోంది. ఒక్క నిమిషం వెంగమాంబా- సీఐ గారు దినేష్ తో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాన్ని మన ప్రేక్షకులకు చూపించవచ్చు" అంటూ కెమేరాలన్నీ సీఐవేపు తిప్పారు.
"దినేష్! అనవసరంగా ఆవేశపడుతున్నావ్! సుధి పేరెంట్స్ సంస్కారవంతులు. వివాహానికి తాము అభ్యంతరం చెప్పలేదంటున్నారు. పెళ్ళికి ఏర్పాట్లు కూడా చేశామంటున్నారు" అన్నాడు సీఐ.
