Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 29


    ఆంజనేయులు బొమ్మ వొచ్చింది.
    మళ్ళీ గిర్రున త్రిప్పాడు.
    తన చిత్రం వొచ్చింది.
    వొళ్ళంతా జలదరించింది. పిచ్చి పట్టినట్లు ఆ చిత్రాన్ని అయిదారుసార్లు పైకీ క్రిందికీ వొచ్చేటట్లు గిరగిరా త్రిప్పాడు.
    మబ్బులు విడిపోతున్నాయి.
    అతన్లో కొత్త జ్ఞానం ప్రవేశిస్తోంది.
    తెలీని సత్యాలు బోధపడుతున్నాయి.
    ఆ ఉప్పెనలో, ఆ ఉద్రేకంలో, ఆ సంతోషంలో, ఆ దుఃఖంలో, ఆ ఉక్కిరిబిక్కిరిలో, ఆ గుండె నలిపెయ్యటంలో, ఆ బాధలో, ఆ విషాదంలో, ఆ మధురమైన అనుభూతుల త్రొక్కిసలాటలో.... అతనికి భయమేసింది.
    అవును. భయం వేసింది.
    ఏం జరిగింది? అనుకున్నది, ఆశించినది, జరగదని నిరాశ చేసుకున్నాడు. హఠాత్తుగా సంభవిస్తే....
    కుర్రాడు తట్టుకోలేకపోతున్నాడు.
    లేత హృదయం తల్లడిల్లిపోతున్నది.
    యువ హృదయం ఝల్లుమంటున్నది.
    తీరా దగ్గరకు వొచ్చేసరికి ఎక్కడలేని సంకోచం ఆవరిస్తున్నది.
    ఆమె ఎవరు?
    తానెవరు?
    ఒక్క సత్యం....తనకామె హృదయంలో చోటున్నదన్న యీ ఒక్క సత్యం తప్ప యింకేమీ తెలియదు.
    ఎవరో, ఎక్కడిదో, సంభవమో, అసంభవమో....ఏమీ తెలియదు.
    ఆ భావోద్వేగాన్ని అతను భరించలేకపోయాడు. ఓ మూలనున్న తబలాలమీద అతని దృష్టి పడింది. ఉపశాంతి కావాలనిపించింది. దగ్గరకు వెళ్ళి వాటిని ఇవతలకు జరుపుతూ వుండటంలో వొణికే చెయ్యి పట్టుజారి నేలమీద వాలింది. చురుక్కుమంది. పగిలిన గాజుపెంకు చేతికి గ్రుచ్చుకుని బొటబొట నెత్తురుకారింది. కాని అతనదేమీ గమనించటంలేదు. తబలాలను ఇవతలకు జరుపుకుని, వాటిముందు కూర్చుని చేతులు కదిలించాడు.
    ధా ధిన్ ధిన్ ధా
    ధా ధిన్ ధిన్ ధా
    తా తిన్ తిన్ తా
    తా ధిన్ ధిన్ ధా.
    చేతులు ఊహకందని వేగంతో కదులుతున్నాయి. అతని హృదయ క్షేత్రంలో నిర్మించుకున్న నర్తకి ఊహారూపం నిజరూపమై, భ్రాంతి నిజమై కళ్ళముందు నాట్యమాడుతుంది.
    అతని ఊహ. అతని స్వప్నం ఫలించినట్లు లీలగా, హొయలుగా, ఘల్లుఘల్లుగా, విశ్వమంతా వ్యాపిస్తున్నట్లు, సృష్టికి నిర్వచనం చెబుతున్నట్లు, ప్రకృతి రహస్యాల్ని మృదువుగా ఊదుతున్నట్లు....
    పాదాల కదలికలు.
    నయనాల ఛనుకమలు.
    భంగిమల భుగభుగలు.
    ఉద్రేకపు, మైకపు, అమాయకపు, సంఘర్షణాభరిత, రోదనాపూరిత విన్యాసాలు.
    ధిద్ ధిద్ తిరికిట ధిద్
    దెం, తరికిట తక్ తీర్గా    
    కిలుగాన, ధాధా, కిల్దీకత్త ధా
    ధా తరికిట తక్ తాకిట తక్ ధా
    వ్రేళ్ళు కదుల్తున్నాయి.
    పాదాలు నర్తిస్తున్నాయి.
    తాదాత్మ్యత హద్దులు దాటిపోయి విహరిస్తోంది.
    చేతినుండి బొటబొట రక్తపు చుక్కలు.
    పగిలిన గాజుపెంకుల మీద పాదాలు పడి, కదిలి, చిట్లి బొటబొట రక్తపు చుక్కలు.
    ఇద్దరికీ వొళ్ళు తెలియటంలేదు.
    ఇద్దరికీ బాహ్యస్మృతి లేదు.
    ప్రపంచపు అంచున, మేఘాల రధంమీద, సముద్ర కెరటాలమీద, గాలి తెరలమీద విహరిస్తున్నట్లు, తాదాత్మ్యతతో కొట్టుకుపోతున్నట్లు....
    పాదాలనుండి రక్తం ఎక్కువై పాయలుగా వ్యాపిస్తోంది.
    ఉన్నట్లుండి మహేష్ ఉలిక్కిపడ్డాడు. తనచెయ్యి చూసుకున్నాడు. రక్తం. అటుకేసి చూశాడు. రక్తపు చారికలు.
    ఎక్కడ్నుంచి?
    పాదాల నుంచి.
    ఎవరి....?
    చేతులు కదలికలు ఆగిపోయాయి. ఇది ఊహకాదు. తాను ఇంతసేపూ భ్రమిస్తున్నట్లు ఆమె ఊహారూపం కాదు.
    సాక్షాత్తు ప్రియ....
    ఎప్పుడువొచ్చి....ఎప్పుడు కదిలి, ఎప్పుడు లీనమై....
    "ప్రియా!"
    "మహేష్!"
    "ప్రియా!"
    "మహేష్"
    రక్తం కారుతున్న చేతులు జాచాడు. రక్తం కారుతున్న పాదాలు ముందుకు జరిగాయి.
    ముందుకు తూలాయి.
    ముందుకు వాలి ఆమె శరీరం, భావోద్రేకంతో విలసిల్లే ఆమె శరీరం ఆ చేతుల మధ్య సోలిపోయింది.


                                     9


    ప్రియంవద అసలు పేరు హరిణి. ప్రియంవద అన్నది మహేష్ ముందు అప్పటికప్పుడు కల్పించి చెప్పిన పేరు _ అవసరం కోసం.
    హరిణి తండ్రి రిటైర్డ్ మిలటరీ డాక్టరు కల్నల్ అర్జునరావు. ఆయనకు హరిణి ఒక్కతే సంతానం.
    హరిణి ఎనిమిదో ఏటే ఆమె తల్లి చనిపోయింది_ మేరిగ్నెన్సీతో. ఆమెను బ్రతికించుకోవటం కోసం ఆయన హోరాహోరీ ఆ వ్యాధితో నాలుగయిదేళ్ళు పోట్లాడాడు. ఆమె మరణాన్ని కొన్ని సంవత్సరాలపాటు వాయిదా వెయ్యగలిగాడుగానీ ప్రతిఘటించలేకపోయాడు.
    ఆఖరి రోజుల్లో ఆమె శరీరానికి అనేక కాంప్లికేషన్లు వచ్చి ఒక్కొక్క అవయమమూ తినివేస్తోంటే నరకబాధ అనుభవించింది.
    "ఇహ నేను ఎలాగూ బ్రతకనండీ. ఈ బాధ భరించలేకపోతున్నానండీ, ప్లీజ్ ఏదయినా ఇంజక్షనిచ్చి చంపెయ్యండి. రెండు రోజులు ముందుగా ప్రాణంపోతే ఏమయింది?" అని బ్రతిమలాడింది.
    బ్రతికున్న మనిషిని చంపెయ్యటమా ఎంత ప్రాణం పోతుందని ముందుగా తెలిసినా?
    యుద్ధంలో తమ శత్రువుల్ని కాల్చిపారేస్తున్నప్పుడు, క్షతగాత్రులయిన శత్రువుల్ని హాస్పటల్లో చేర్చాక వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి విశ్వప్రయత్నం చేసేవాడు. విధి నిర్వహణలో ఏనాడూ అలక్ష్యం చెయ్యలేదు. శత్రు సైనికుల్ని కూడా ఎంతో ప్రేమగా పలకరించేవాడు. పేషెంటును పేషెంటుగానే చూసి ప్రాణమివ్వటానికి ప్రయత్నించేవాడుగానీ, ఇతను మిత్రుడా లేక శత్రువా అన్న ఆలోచనే అసలు వొచ్చేదికాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS