ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ఆరాధనా అనే పాదాలకు అర్థం తెలుసుకాబోయే ముందు క్షణం పోగొట్టుకున్న తోడు.....
మరొక్కసారి ఉలిక్కిపడింది.
అంటే తన ఆలోచనలు తనని ఎక్కడికి తరుముతున్నాయి? తోడువేపా? నీడవేపా? ఏ వైపు?
విసిగిస్తున్న మనస్సును నిద్రపుచ్చే నిద్రమాత్రలు రెండు ఆమె గొంతులోకి జారాయి నిశ్శబ్దంగా.
ఐదు నిమిషాలకి ఆదమరచి నిద్రలోకి ఒరిగింది ఎక్కువ సమయం సబలగా యోచించే సాహితి ఈ సారి మాత్రం అబలగా.
* * *
అదే నిశీథి రాత్రి భాగ్యరాజ్ గెస్ట్ హౌస్ లో వాతావరణం చాలా వేడిగా వుంది. సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు మీటింగ్అని తెలియ వచ్చినా అతని జాడలేదు. పదకొండున్నర కావస్తున్నా.
సత్యరాజ్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.
ఎదురుగా బిర్క్, ఖాన్ తలలు వంచేసుకున్నారు. అదే తొలిసారి సత్యరాజ్ ముందు వాళ్ళు అవమానంతో తలలు దించుకున్నది. అప్పటి వరకూ కోపంగా పచార్లు చేస్తున్నా సత్యరాజ్ ఓ చోట ఆగిపోయి రెండు ప్రయత్నాల్లోను ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడేమని భాగ్యరాజ్ కి సమాధానం చెపాల్సి? ఆఫ్ట్రాల్ ఓ ఆడది...." ఆవేశంతో సత్యరాజ్ నోటివెంట బూతులుకూడా వస్తున్నాయ్.
కేవలం ఓ ఆడదాన్ని బెదిరించటం మూలంగా రావాల్సివ ఐదు లక్షలు కళ్ళముందు చేజారటమే కాకుండా, భాగ్యరాజ్ ముందుఅసమర్థుడిగా తలవంచుకొక తప్పదు. అదే సత్యరాజ్ బాధంతా.
ఖాన్, బిర్క్ లు ఈసారి తలెత్తి సత్యరాజ్ వైపు చూసారు ఆఖరిగా మరొక్క ఛాన్స్ ఇప్పించమన్నట్లు.
సత్యరాజ్ ఓసారి వాచీ చూసుకున్నాడు.
అర్థరాత్రి అప్పుడే దాటినట్లు తెలియచేస్తూ డే, డేట్, మారుతున్నాయి వాచీలో.
"ఈ తుఫాన్ వాతావరణంలో భాగ్యరాజ్ ఇక్కడికి రాడు. ప్రోగ్రామ్ కేన్సిల్ చేసుకొని బెడ్ ఎక్కేసి ఉంటాడు. పదండివెళదాం" అంటూ బయటకు నడిచాడు సత్యరాజ్. ఒళ్ళు జలదరింపజేసే ఆ వాతావరణంలోనే సత్యరాజ్ జీప్ ముందుకు దూకింది.
* * *
యూనివర్శిటీ అంతా కదిలి వచ్చినట్లుంది నాగ్ ని చేర్చబడిన హాస్పిటల్ ఆవరణ చూస్తుంటే.....అంతటా విద్యార్థులే గుంపులు గుంపులుగా చేరి నాగ్ గురించే చర్చించుకుంటున్నారు.
నేషనల్ ఇండస్ట్రీస్ సదరన్ రీజన్ డీలరు అప్పటికే నాలుగు ఫోన్ కాల్స్ అందుకున్నాడు భూపతిరావు సెక్రటరీనుంచి అతనితో క్షణ క్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది.
నాగ్ ని తీసికెళ్ళేందుకు చార్జేర్డ్ ఫ్లయిట్ (అత్యవసరమైన సొంత పనులకు ప్రయివేటు వ్యక్తులకు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎక్కువ ఛార్జీతో ఏర్పాటుచేసే విమానం) ఒకటి అప్పటికే రడీగా ఉంది.
పెదబాబుని ప్లయిట్ ఎప్పుడు ఎక్కుస్తున్నావంటూ చిన్నబాబు ఓ పక్క ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నారు-ఎలా?
భూపతిరావు స్టేటస్ తెలియజెప్పినా మేడమ్ అనుమతిలేందే ఎట్టి పరిస్థితుల్లోనూ డిశ్చార్జీ చేయమని హాస్పిటల్ చీఫ్ మొరాయించుక్కూచున్నాడు.
ఎలా___? ఏమని సమాధానం చెప్పుకోవాలి___! ఈ ఆలోచనలతో ఆ డీలర్ ఒణికిపోతున్నాడు.
దినేష్ ఎంత ఆవేశపరుడో డీలర్ కి తెలుసు, అనుకున్నది తక్షణం జరక్కపోతే తన డీలర్ షిప్ ని పీకేసినా పీకేయగలడు! కడుపులో చల్లకదలకుండా లక్షలు ఆర్జించి పెట్టె కామధేనువు లాంటిది నేషనల్ ఇండస్ట్రీస్ డీలర్ షిప్.
చీఫ్ మేడమ్ అని ఎవర్ని ఉద్దేశించి అంటున్నాడో డీలర్ కి తెలుసు.
ప్రీమియర్ ఇండస్ట్రీస్ పనిమీద వచ్చిన సాహితి ఓ హొటల్ లో దిగినట్లు-ఆ తరువాత అదంతా జరిగినట్లు-తనకు ప్రాణదానం చేసిన వ్యక్తి కోలుకునే వరకు ఆమె ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకొని హొటల్ గదిలో మకాం చేసి ఉన్నట్లు డీలర్ కి తెలుసు.
తనను రక్షించిన వ్యక్తి ఎవరనేది ఆమెకు తెలిసి ఉంటే హాస్పిటల్ చీఫ్ ని డిశ్చార్జి చేసేందుకు అనుమతించేదేమో?!
సాహితిని అప్రోచ్ అయ్యేందుకు డీలల్ ప్రిపేర్ అవుతుండగా లోన గదిలో నాగ్ కి మెలుకువ వచ్చింది.
అది తెలిసీ తెలియగానే హాస్పిటల్ స్టాఫ్ హడావుడి ఎక్కువయింది. అందరూ నాగ్ ఆరోగ్యం పట్ల ఆదుర్దా చెందుతున్న వారిలాగే కనిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉంది.
నాగ్ రక్షించింది పారిశ్రామిక ప్రపంచంలో సరికొత్త సంచలణం తీసుకు వచ్చిన దిమోస్ట్ పవర్ ఫుల్ లేడీ సాహితిని అని తెచ్చిన దగ్గర్నుంచి స్టాఫ్ శ్రద్ధ మరీ ఎక్కువయింది.
