Previous Page Next Page 
హృదయాంజలి పేజి 2

    ఇంకా అక్కడే నిలబడి చూస్తున్న అబ్బాయిని పిలిచింది అనంత లక్ష్మమ్మ.  "అబ్బాయ్! ఇలారా!"
    మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చాడు.

    "మాణిక్యమ్మగారి మనుమడివా?"
 
    ఒనన్నట్టుగా తలూగించాడు.

    "నీ పేరేమిటి?"
 
    "శిశిర్ మోహన్"
 
    "మీ మామయ్య పెళ్ళిటగా? పెళ్ళికి వచ్చావా?"
 
    "మాకిప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా? అందుకని వచ్చాం!"
    లోపలినుండి ఇంకొక ఆమె వచ్చింది. ఆమెకీ అపూ అన్న అమ్మాయికీ, దగ్గర పోలీకలున్నాయి.
    "ఎవరబ్బాయి, అత్తయ్యా?"
 
    "మాణిక్యమ్మగారి మనుమడట! సెలవులకి వచ్చారట."
    "ఏం చదువుతున్నావు?"
    "సిక్స్త్ చదవాలి!"
    "ఇంగ్లీష్ మీడియమా?"
    అవునన్నట్టుగా తలూగించాడు.

    "అంతా వాళ్ళమ్మ పోలికే కదత్తయ్యా? చెంపలు చూడు ఏపిల్ పళ్ళలా ఎంత బావున్నాయో? కొరికెయ్యాలనిపిస్తూంది!"

    "కలవారబ్బాయి! ఉండేది పట్నవాసం. తిరిగేది కార్లలో! చదివేది ఇంగ్లీష్ చదువులు! తలిదండ్రులిద్దరూ అందమయిన వాళ్ళు! బుగ్గలేం ఖర్మ? పిల్లాడే ఏపిల్ పండులా ఉన్నాడు!" అంటూ ఆవిడ శిశిర్ బుగ్గలు పుణికింది.
 
    "మా పిల్లలతో ఆడుకొంటావా?"
    మళ్ళీ తలూగించాడు.

    "అపూ! మీతో ఈ పిల్లవాడిని ఆడించుకోండే!" అనంతలక్ష్మమ్మ సిఫార్స్ చేస్తున్నట్టుగా చెప్పింది పిల్లల్ని పిలిచి.

    "అయితే అతడిని ముందు చోర్ కమ్మను!"

    "అదేం న్యాయమే? అప్పులు వేసి ఎవరు దొంగో నిర్ణయించుకోవాలిగాని!"
 
    "ఇందాక ప్రభుకు మా గురించి ఎందుకు చెప్పాడేం? అందుకని ఇది పనిష్మెంటన్నమాట!" రాజుగారు దోషికి దండన విధిస్తున్నట్టుగా దర్పం.
 
    "వట్టి రాక్షసిముండ! పుట్టిన ఘడియ ఏమిటోగాని!" ఆవిడ సణిగినట్టుగా అని.  "రా, అబ్బాయ్! కళ్ళుమూస్తాను! దాని మాటంటే శిలాశాసనమే!" అంది పైకి పెద్దగా.
 
    శిశిర్ వెళ్ళి ఆమె ముందు కూర్చొన్నాడు.
 
    ఆవిడ అతడి కళ్ళమీద చేతులుంచి పాఠం చదివినట్టుగా అంది "దాయిళ్ళు మూయిళ్ళు దండారి కోయిళ్ళు......."

    అంతే! ఆ క్షణం నుండి ఇక టైమే తెలియలేదు శిశిర్ కి. చీకటి పడుతుంటే వాళ్ళ మామయ్యవచ్చి తీసికెళ్లేదాకా ఆడాడు.
 
    నాలుగురోజుల క్రితమే స్కూలుకి సెలవులిచ్చారు. ఈ సెలవుల్లో ఎలా గడపాలి, ఏం చేయాలి అనుకొంటూ ఇంటికి వచ్చాడు శిశిర్.

    తల్లి సుధ సూట్ కేస్ సర్దుతోంది, ఎక్కడికో ప్రయాణం కాబోతున్నట్టుగా.
    "సూట్కేసు సర్దుతున్నావు! ఎక్కడికెళ్ళాలమ్మా?"
    "రవి మామయ్య వచ్చాడురా. రేపు మనం ఊరెళ్ళుతున్నాం!"
    "ఏ ఊరు?"

    "అమ్మమ్మ వాళ్ళ ఊరు!"
    శిశిర్ ముఖం నిరుత్సాహాన్ని పులుముకొంది "నేను రాను!"
    "ఎందుకురా?"
    "వట్టి పల్లెటూరు. ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. ఏం తోచదు"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS