Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 3


    "ఆ పదిమందయినా వచ్చినందుకు సంతోషించు. ఇప్పటికే నాలుగున్నర కావస్తోంది. మీటింగ్ మొదలుపెట్టేద్దాం" శర్మ హడావుడి చేస్తూ లోపలికి లాక్కెళ్ళాడు.
    
    మీటింగ్ ప్రారంభమైంది. మొదటి వక్త ఉపన్యాసం మొదలుపెట్టాడు. అదిగో అప్పుడు ప్రారంభమైంది అబ్బాయిల వెల్లువ. గుంపులు గుంపులుగా అబ్బాయిలు వస్తూనే వున్నారు. మరో పావుగంటకు ఆడిటోరియం నిండిపోయింది.
    
    వక్తలంతా పూనకం వచ్చినట్లు మాట్లాడారు. సూపర్ ప్లాన్ అవుతుందనుకున్న మీటింగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.
    
    జనం అంతా వెళ్ళిపోతున్నారు.
    
    ఇంతకీ సుజన ప్లే చేసిన ట్రిక్ ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో వంశీ గేటు దగ్గర నిలబడ్డాడు.
    
    ఆమె రాగానే థాంక్స్ చెప్పి "ఇంతకీ ఏం మాయ చేశారు?" అని అడిగాడు.
    
    "వెరీ సింపుల్ - తెప్పోత్సవాలకీ, జాతర్లకీ స్టూడెంట్స్ ఎందుకెళతారు? మీ పరిభాషలో చెప్పాలంటే 'కలర్స్' కోసం ఆ కలర్స్ ఆ మీటింగ్ లోనూ వున్నాయని చెప్పడానికి అమ్మాయిల్ని వెంటేసుకుని అలా మెన్స్ హాస్టళ్ళ గుండా నడిచి ఇక్కడికి చేరుకున్నాం. మేం ఎక్కడికి వెళుతున్నామో అబ్బాయిలకు తెలిసేటట్లు గట్టిగా మాట్లాడుకున్నాం. దట్సాల్" అని నవ్వి అక్కడి నుంచి కదిలింది.
    
    పౌర్ణమి రోజున పండువెన్నెల్లో బిర్లామందిర్ కొసన నిలబడి నక్షత్రాలను కోసుకొన్నట్లు ఫీలయ్యాడు అతను ఆమె నవ్వును చూసి.
    
    ఇది జరిగిన నెల రోజులకు జూనియర్లు సీనియర్లకు ఇచ్చే వేలిడిక్టరీ ఫంక్షన్ జరిగింది. లాటరీలో ఐదు లక్షల రూపాయలు వస్తే ఏం చేస్తారో చెప్పాలని అమ్మాయిలకు సరదాగా ఓ పరీక్ష పెట్టారు.
    
    ప్రీవియస్ అమ్మాయిలు ఒక్కొక్కరే డయాస్ మీదకు వచ్చి చెబుతున్నారు.
    
    కొందరు భర్తను కొనుక్కుంటామన్నారు. ఆ జవాబుకి హాలంతా చప్పట్లతో మార్మోగింది. ఓ అమ్మాయి అయితే తనకు ఇష్టమయిన కుక్కల్ని కొని పెంచుకుంటానంది. ఈసారీ చప్పట్లు మ్రోగాయి.
    
    చివరికి సుజన వంతు వచ్చింది.
    
    వంశీ అటెన్షన్ లోకి వచ్చాడు. ఆమె ఏం చెబుతుందో వినడానికి కాస్తంత ముందుకు వంగాడు.
    
    సుజన మైక్ ముందు నిలబడి "ఆ డబ్బుతో ప్యాకెట్ సైజు భగవద్గీతలా శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని ముద్రించి ప్రతి వీధి మూలానా నిలబడి బైబిల్ లా అందరికీ పంచి పెడతాను" అంది.
    
    ఎవరూ చప్పట్లు చరచలేదు - ఒక్క వంశీ తప్ప. నిశ్శబ్దంలోంచి దూసుకొస్తున్న అభినందల్లా అనిపిస్తున్న ఆ శభ్దాలను వింటూ డయాస్ దిగింది. ఆమె తిరిగి తన సీట్లో కూర్చొనేంత వరకు అతను అలా చప్పట్లు చరుస్తూనే వున్నాడు.
    
    అదిగో ఆ క్షణంలో అతను ఆమె ప్రేమలో పడిపోయాడు. అయితె అతను అందరి అబ్బాయిల్లా ఆమె వెంటపడి విసిగించలేదు. కుళ్ళు జోకులు వేస్తూ ఆకర్షించాలని ప్రయత్నించలేదు.
    
    ఆరోజు నుంచి ప్రతీ రాత్రీ ఆమె పట్ల కలుగుతున్న భావనలనీ, అల్లుకుంటున్న వెర్రి ఊహల్నీ, రాత్రిని రంగులమయం చేస్తున్న కలల్నీ - అన్నిటినీ రాయటం మొదలుపెట్టాడు.
    
    ప్రిపరేషన్ హాలిడేస్ అయిపోయి రేపటినుంచి పరీక్షలు మొదలవుతాయనగా ఆ రోజు సాయంకాలం ఆమె దగగ్రికి వెళ్ళాడు. కాఫీ తాగుదామని క్యాంటీన్ కి ఆహ్వానించాడు.
    
    క్యాంటీన్ లో కాఫీ తాగాక తను తీసుకొచ్చిన రెండువందల పేజీల చొప్పున వున్న పధ్నాలుగు నోటు బుక్కులను ఆమె ముందుంచాడు.
    
    "వేలిడిక్టరీ ఫంక్షన్ రోజు నుంచి మీమీద నాకున్న ప్రేమనంతా ఇదిగోండి ఈ సుదీర్ఘ లేఖలో మొరపెట్టుకున్నాను. మొత్తం రెండువేల ఎనిమిది వందల పేజీలయ్యాయి. చదువుకోండి - పరీక్షలైపోయిన రోజున వస్తాను. నామీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి" అని కాసేపాగి - "ఇన్ని పుస్తకాలు మోయలేరనుకుంటాను. హాస్టల్ వరకు తెచ్చిస్తాను" అన్నాడు.
    
    ఆమె వద్దన్నట్లు తల ఆడించి "మోసుకుపోగలను" అంది. ఇక మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేశాడు.
    
    ఖచ్చితంగా పరీక్షలై పోయిన చివరి రోజున హాస్టల్ కి వెళ్ళాడు. ఇతని కోసమే వెయిట్ చేస్తున్న ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలయిందనుకున్నాడు. జీవితంలో మొదటిసారి అతను టెన్షన్ అనుభవిస్తున్నాడు.
    
    ఇద్దరూ క్యాంటీన్ చేరుకున్నారు.
    
    సీట్లో కూర్చున్నాక అతన్ని తదేకంగా చూస్తున్న ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది. కన్నీళ్ళు వరదలా తన్నుకొచ్చాయి. చుట్టూ వున్న వాళ్ళు తమను గమనిస్తున్నారనయినా చూడకుండా ఏడ్చేసింది.
    
    అతను కంగారుపడ్డాడు. ఎందుకు ఏడుస్తోందో తెలియని అతనికి ఎలా సముదాయించాలో కూడా తెలియడం లేదు.
    
    తనను తహను కంట్రోల్ చేసుకోవడానికి విఫలయత్నం చేస్తూ చెప్పింది. "ఇంత ప్రేమని, ఇంతటి అభిమానాన్ని తట్టుకోవడం సాధ్యమేనా? ఈ చిన్న గుండె ఎన్నిసార్లు రెపరెపలాడిందో ఎలా చెప్పగలను?
    
    మీ ఉత్తరం చదువుతూ ఎన్నిసార్లు ఏడ్చానో, ఎన్నిసార్లు నవ్వానో, ఎన్నిసార్లు నన్ను నేను స్వప్నాల్లోకి విసిరేసుకున్నానో, ఎన్నిసార్లు తన్మయత్వంతో ముడుచుకుపోయానో ఎలా చెప్పగలను?
    
    మిమ్మల్ని చూడాలన్న బలమైన కోర్కెని అణుచుకోడానికి ఎంతగా ఏడ్చానో మీకెలా వివరించగలను? అక్షరాల అభిషేకం అంటే ఇదే కాబోలు. మనసావాచా కర్మణా నేను మీదాన్ని అని చెప్పడం కన్నా నేను మీకేం ఇవ్వగలను?"
    
    అప్పుడు వంశీ ఎలా ఫీలయ్యాడో అతనే చెప్పలేడు. భావోద్వేగాల మధ్య వాళ్ళిద్దరూ భాష మరిచిపోయారు ఆ క్షణాల్లో.
    
    ఆ తరువాత వంశీ ఊరికి వచ్చి, అంతవరకు కౌలుదారులు చేస్తున్న తమ భూమిని తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు. ఆమె ఫైనలియర్ కి వచ్చింది. అప్పుడప్పుడూ ఇద్దరూ యూనివర్శిటీలో కలుసుకునే వాళ్ళు. ఆమె పరీక్షలు రాశాక, ఇక రెండు మూడు రోజుల్లో ఊరికి వస్తుందనగా అతను వెళ్ళి హాస్టల్ లో కలిశాడు.
    
    "నాకెంత ఆనందంగా వుందో చెప్పలేను. ఇక నుంచీ ఇద్దరం ఒకే ఊర్లో వుంటాం. మొన్న సండే ఊరికి వచ్చినప్పుడు మా వరండాలోంచి చూస్తే మీ ఇంటి ముందుండే కొబ్బరి చెట్టు కనిపించింది. అచ్చు నిన్ను చూసినంత ఆనందం కలిగిందనుకో చెట్టునీ, పుట్టనీ భగవంతుడని ఎందుకు మొక్కుతారో ఈ జనం అనుకునేదాన్ని ఇన్ని రోజులూ కానీ మనం ఆరాధించే వ్యక్తికి సంబంధించింది ఏదయినా అతని ఉనికినే తెలియజేయడంతో వాటిపట్ల కూడా మనసులో ఆరాధన మొదలౌతుందని ఆ క్షణంలో అనిపించింది. లేకుంటే మీ ఇంటి కొబ్బరి చెట్టు చూసి అంత ఆనందపడడమేమిటి?" అంది.
    
    అతను నవ్వుతూ వుండిపోవడంతో తిరిగి ఆమె ప్రారంభించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS